Katyn-by Andrzej Wajda

katyn

’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా  ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని బయటపెట్టే ధైర్యం ఈరోజుకీ కూడా చాలామందికి లేదు. కానీ మొదటి నుండీ సినిమాని ఆయుధంగా వాడడంలో ఆరితేరిపోయిన ఆండ్రే వైదాకి మాత్రం ఆ సమస్య లేదు. 1940 katyn అడవిలో ఊచకోతకు గురైన ఇరవై వేలమంది పోలిష్ సైనికుల ఆత్మఘోషను కళ్ళముందు ఉంచడంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. గత సంవత్సరం ఆస్కార్‍కి నామినేట్ అయిన ఈ పోలీష్ సినిమా Katyn మిగతా యుద్ధనేపధ్య సినిమాల కంటే భిన్నంగా ఉండడానికి ప్రధాణ కారణం ఈ సినిమాకి ఆండ్రే వైద్యా దర్శకుడు కావడమే(ఈయన గురించి నవతరంగంలో ఇప్పటికే ఒక పరిచయ వ్యాసం వచ్చింది).

కధ అనే కంటే చరిత్ర అనడం సబబు. చూస్తున్నంతసేపు ఎక్కడా నాటకీయత లేకుండా రెండవ ప్రపంచ యుద్ధపు రోజుల్లో పోలండ్ ప్రజల అంతరంగాలని తడిమి చూసినట్టు ఉంటుంది. ఈ చిత్రం అర్ధం అవ్వాలంటే కొంత చరిత్రా పరిజ్నానం అవసరం.అందుకే అసలు చరిత్రలో ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం. 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ ఆజ్నానుసారం నాజీలు పోలండ్‍ను పశ్చిమ వైపు నుండి ఆక్రమించుకోవడం మొదలుపెడతారు. అదే నెల 17వ తేదీ నుండి స్టాలిన్ ఆదేశానుసారం రష్యన్లు తూర్పు నుండి ఆక్రమించుకోవడం మొదలుపెడతారు. ఈ క్రమంలో రష్యన్ రెడ్ ఆర్మీ 20,000 మంది పోలిష్ అధికారుల్ని బంధీలుగా తీసుకుంటుంది. మూడు సంవత్సరాలపాటు ఈ అధికారుల జాడ ఎవ్వరికీ తెలియదు. కొందరు కుటుంబ సభ్యులకు రష్యన్ సైనికులచే సెన్సార్ చేయబడ్డ ఉత్తరాలు అయితే మాత్రం అందుతుంటాయి. అది కూడా 1940 ఏప్రిల్‍లో ఆగిపోతాయి.  ఈ మూడేళ్ళలో జర్మన్లు పోలెండ్‍ని పూర్తిగా ఆక్రమించేసుకుంటారు. 1943 ఏప్రిల్ 13న నాజీలు Katyn అడవిలో 4,443 మృతకళేబరాలను కనుగొని అవి రెడ్ ఆర్మీ బంధించిన అధికారులవని గుర్తిస్తారు. ఈ సంఘటనని రష్యాకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వాడుకోవాలని చూస్తారు నాజీలు. కానీ 1945 నాటికి యుద్ధంలో లెక్కలు తల్లక్రిందలయ్యి నాజీలు ఘోరపరాజయం పాలవ్వడం, రెడ్ ఆర్మీ మొత్తం పోలెండ్‍ను ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. రష్యన్లు ఈ ఘాతుకాన్ని కూడా నాజీల పాపాల లెక్కల్లో చేర్చేసి తమ తప్పు లేనట్టుగా చరిత్ర సృష్టించేస్తారు. అయితే ఆ హత్యాఖాండలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ఇది రష్యన్ల పనేనన్న విషయం తెలిసినప్పటికీ యుద్ధభయంతో అందరూ రెడ్ ఆర్మీ చెప్పిందే నమ్మడం మొదలుపెడతారు. పోలండ్ బయట కూడా చరిత్రకారులు ఎక్కడ ఈ విషయం గురించి రాస్తే ’forces of evil’ ని బలబరుస్తున్నట్టు ముద్రవేస్తారనే భయంతో నిమ్మకున్నారు. 1990లో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు రష్యన్లు అధికారికంగా ఇది స్టాలిన్ ఆదేశానుసారం జరిగిన హత్యాఖాండని ప్రకటించారు. కానీ ఇప్పటికీ రష్యాలో ఈ నిజాన్ని మరుగునపరచడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

1990వరకు ఈ ఘటనగురించి సినిమా తీయడం అటుంచితే అసలు మాట్లాడాడానికి కూడా వీలు లేకుండా ఉండేది. సోవియట్ యూనియన్ అంతరించి పదిహేడేల్లయ్యాక కూడా ఈ విషయం గురించి చర్చించడానికి సంకోచిస్తున్న మేధావుల నిశ్శబ్దాన్ని చేధిస్తూ వైదా ఒక కళాకారునిగా నిజాల్ని బయటి ప్రపంచానికి తెలియజేసే భాధ్యతను నిర్వర్తించాడు. ఈ సినిమా మొదట్లో ఈ ఘాతుకానికి బలైన అధికారుల కుటుంబ సభ్యుల వైపు నుండి కధ నడిపించి , తర్వాత ఆ అధికారుల వైపునుండి చూపిస్తాడు. చివర్లో ఈ అమానవీయ సంఘటన ఎలా జరిగిందో చూపిస్తూ సినిమా ముగుస్తుంది. పాత్రలన్నీ కూడా చాలా ధృడమైన వైఖరి కలిగి ఉండడం మెచ్చుకోతగ్గది. నాజీలు మొదటసారి వెలికి తీసినప్పుడు చనిపోయినవాళ్ళ వివరాలు వీధుల్లో ప్రకటిస్తూంటే వాళ్ళ తరపువాళ్ళు పడే ఆవేధన, అందులో తమవాళ్ళ పేరు లేదని తెలిసినప్పుడు తొణికిసలాడే చిరు ఆశ చూపించడంలో దర్శకునికి పాత్రధారులందరూ అద్భుతంగా సహకరించారు. ఒక జనరల్ భార్య తన భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకొని బాధపడుతుంటే ఆమెను జర్మన్లు తీసుకువెళ్ళి రష్యన్లకి వ్యతిరేకంగా నినదించమన్నప్పుడు ’ నాకు హిట్లర్, స్టాలిన్ ఇద్దరూ శత్రువులే. అలాంటప్పుడు నేను హిట్లర్‍కి ఎందుకు సహాయం చెయ్యాలంటుంది’. మరో మహిళ చనిపోయిన తన సోదరుడి జ్నాపకార్ధం తన అందమైన జుట్టు అమ్మి చేయించిన శిలాఫలకం మీద మరణం 1940(రష్యన్‍ల కధనం ప్రకారం అది 1943 అని ఉండాలి.) అనే ఉండాలని పట్టుబట్టి USSR అధికారులతో గొడవకు దిగుతోంది. ఒక యువకుడు తన CVలో తండ్రి Katynలో రష్యన్‍ల చేతిలో చంపబడ్డాడని వ్రాస్తాడు. అది చూసి కళాశాలలో ప్రవేశం దొరకాలంటే దానిని నాజీల వల్ల జరిగిందిగా మార్చమంటారు అధికారులు. ’ఒక మనిషికి ఒకే CV ఉంటుంది’ అని చెప్పి కాలేజి సీట్ వదులుకుంటాడు. మరో అధికారి ఈ నిజాన్ని దాచలేక, ప్రాణాలు కోల్పోయిన స్నేహితులకి ఆత్మవంచన చేయలేక ఆత్మ హత్య చేసుకుంటాడు. భర్తను నాజీలు, కొడుకుని రష్యన్లు బలితీసుకొన్నా కోడల్నీ, మనవరాల్ని ఓదార్చగలిగే గుండెధైర్యం గల మరో పాత్ర. ఇలా చెప్పుకుంటే ప్రతి పాత్రా వెంటాడుతూనే ఉంటుంది.

ఇక ఈ చిత్రంలో చాలా సింబాలిక్ దృశ్యాలు ఉంటాయి.వాటిలో కొన్ని అద్భుతమైన వాటిని తీసుకుంటే

1.ఒకప్రక్క పశ్చిమాన నాజీలు, మరోప్రక్క తూర్పున సోవియట్ సైనికులూ దాడి చేస్తుంటే ఎటుపోయి ప్రాణాలు కాపాడుకోవాలో తెలియని పరిస్ధితుల్లో ఉన్నఒక సమూహం రైల్వే ట్రాక్ మీద పడే ఆవేదనను చూపిస్తూ మొదలవుతుందీ చిత్రం. రెండు వైపుల నుండి దాడులు జరుగుతుంటే ఎటూ కాని పరిస్ధితుల్లో చిక్కుకున్న ప్రజల మనోభావాన్ని ప్రతిబింభించేలా ఈ సన్నివేశం రైల్వే బ్రిడ్జి మీద ఉంటుంది.

2.శవాల గుట్టలమధ్య భర్తకోసం వెతుకుతుంటే యూనిఫాం క్రింద జీసస్ విగ్రహం ఉంటుంది. దేవుడిచ్చిన ప్రాణాలకు విలువలేకుండా చేయడం ద్వారా ఆ దేవుడి ప్రాణాలు కూడా తీసారు అనిపించేలా.

3.యుద్ధానంతరం జనరల్ భార్య భర్త చనిపోయి భవిష్యత్తు భయంకరమై బాధపడుతుంటే అంతకు ముందు తమవద్ద పనిచేసిన ఆమె భర్తకు యుద్ధానంతరం మంచి ఉన్నత పదవి వరిస్తుంది. వాళ్ళ జీవితా ఎలా తారుమారయ్యాయో  అర్ధమౌతుంది.

4.రష్యన్ సైనికులు పోలెండ్ జండాలను(సగం తెలుపు, సగం ఎరుపు కలిగి ఉంటాయి) రెండుగా చీల్చి, ఎర్రభాగాన్ని రెడ్ ఆర్మీకి ప్రతీకగా ప్రతిష్టించి తెల్ల భాగంతో బూట్లు తుడుచుకుంటారు.

5.చివరి దృశ్యంలో శవాలను పూడుస్తున్నప్పుడు ఒక అధికారి చేతిలో ఉన్న జపమాల పైకి ఉంటుంది. పాతిపెట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయనే అర్ధం వచ్చేలా.

చిత్రం చివర్లో వచ్చే 15 నిమిషాలు చాలా క్రూరంగా ఉండి, మాన్వత్వాన్ని ప్రశ్నించేలా ఉంటాయి. వాటి గురించి వ్రాయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వైదా తండ్రి కూడా ఆ Katynలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇది తన తల్లిదండ్రులకు, పోలీష్ దేశభక్తి పరులకు నివాళిగా చెప్పుకుంటారు. ఎనభైళ్ళ వయస్సులో కూడా సినిమా పట్ల తన అంకితభావాన్ని చెక్కుచెదరనీయని మహానుభావుడు వైదా.

గమనిక: ఈ సినిమా DVDలు మార్కెట్‍లోకి వచ్చాయి. దొరికితే తప్పక చూడండి. చూసి తీరాల్సిన చిత్రం. ముందుగా చరిత్ర తెలుసుకోవడం మర్చిపోవద్దు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

శంకర్

రచయిత:

4 Comments to “Katyn-by Andrzej Wajda”

  • శంకర్ గారు, బాగా వ్రాసారు. వీలయితే ఈ రోజే చూస్తాను. Thanks- విజయ్

  • very good article Mr. Sankar

  • ఆసక్తికరమైన చిత్రాన్ని పరిచయం చేసారు. ఎక్కడైనా దొరుకుతుందేమో చూడ్డానికి ప్రయత్నిస్తాను. అభినందనలు.

  • వైదా మాటల్లో Katyn గురించీ మరియు ఆ హత్యాఖాండలో మరణించిన అతని తండ్రి గురించి:

    And suddenly, in 1939, everything collapsed. My father was lost; he went to war and never came back. My mother could not stay at home, she had to go to work, we became workers. Our intelligentsia family found itself in completely different surroundings. I was 13 when the war broke out, so the only things I retained were the things that my home, school and the church had given me until that age.

    My father, Jakub Wajda, lived only to the age of 40. He was captain in the 72nd Infantry Regiment and died at Katyn. But until 1989 we were not allowed to make an inscription on the family tomb, saying where he was killed. The censorship was so strict and the ban on all information on this subject so rigorous that when I recently tried to find a copy of the newspaper, published by Germans during the war, with the list of Katyn victims, my father’s name among them, it turned out that the paper simply did not exist. Some mysterious hand removed the relevant copies from the library collection, so the experience of living through perhaps the most shocking moment of my life, when I could find out from a German paper that my father had been murdered, was denied to me.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories