Menu

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ ఒకటి. ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల గురించి కొంత చెప్పాలి. వీధి నాటకాలకి ఆదరణ తగ్గి, పల్లెల్లో ఉత్సవాలకి 16mm తెరపై సినిమాలు ప్రదర్శించే పధ్ధతి ప్రారంభం కాడానికి ముందు, అంటే డెబ్బై, ఎనభై దశకాలలో ఈ ట్రూప్ లు పల్లె ప్రజలకు వినోదాన్ని అందించాయి. ప్రారంభంలో వీరి నృత్యాలు అశ్లీలానికి దూరంగా ఉన్నా, ట్రూప్ ల మధ్య పెరిగిన పోటీ కారణంగా తరువాతి కాలంలో అసభ్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వంశీ ‘మా పసలపూడి కథలు’ లో ‘పాముల నాగేశ్వర రావు’ ‘కుమారి మా ఊరొచ్చింది’ కథల్లో ఈ ట్రూప్ ల ఒకనాటి వైభవాన్ని తెలుసుకోవచ్చు. (అంబాసిడర్ కార్లలో వచ్చే ట్రూప్ సభ్యులకు సిని తారలకు ఉన్నంత ఆదరణా ఉండేది.) ఈ ట్రూప్ లు ఉచ్ఛదశలో ఉన్నకాలంనాటి కథ ఇది.

తనికెళ్ళ భరణి, వేమూరి సత్యనారాయణ లతో కలిసి వంశీ తయారుచేసిన ఈ కథ రికార్డింగ్ డాన్సర్ల తెర వెనుక జీవితాన్ని చూపిస్తుంది. తెర వెనుక వాళ్ళూ మామూలు మనుషులే అని చెబుతుంది. మేనల్లుడి ఆస్తిని అనుభవించే ట్రూప్ యజమాని యాళ్ళ పాపారావు (కోట శ్రీనివాస రావు), భర్త వదిలేస్తే పిల్లల్ని పెంచడం కోసం డాన్సులు చేయడం మొదలుపెట్టిన ఆకుల అనంతలక్ష్మి(వై. విజయ), మామ చాటు మేనల్లుడు దొరబాబు (భరణి), తన బావ సిలోన్ సుబ్బారావు(రాళ్ళపల్లి) కోసం కలలు కంటూ కొత్త కొత్త డాన్సులు చేసే పట్టు పద్మిని(సంధ్య), తల్లి, తండ్రి చిన్నప్పుడే చనిపోతే తన మేనమామ (భీమరాజు) దగ్గరే ఉంటూ అతనంటే భయపడుతూ ఉండే గోపాలం(నరేష్), ట్రూప్ వ్యాన్ నడిపే డ్రైవర్ మస్తాన్, పెళ్ళయిన బ్రహ్మచారి వ్యాన్ క్లీనర్ పెనుగొండ అబ్బులు (మల్లికార్జున రావు), వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టిఆర్, జూనియర్ ఏయన్నార్, జూనియర్ చిరంజీవి ఈ ట్రూప్ సభ్యులు. గోపాలం హీరో కృష్ణ డాన్సులు చేస్తూ ఉంటాడు ట్రూప్ ప్రోగ్రామ్స్ లో. రాజమండ్రి దేవి చౌక్ కి చెందిన ఈ ట్రూప్ ఊళ్ళు తిరిగి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది. గోపాలం హోటల్ కి పాలు సప్లయ్ చేసే పాడి సుందరమ్మ (నిర్మలమ్మ) మనవరాలు సీత (హిరోయిన్ మాధురి) పిరికి వాడైన గోపాలంని ప్రేమించి, అతని కోసం ట్రూప్ లో చేరి అతన్ని పెళ్లి చేసుకోడమే ఈ సినిమా కథ. దొరబాబు సీత ని ప్రేమించడం, తన స్వార్ధం కోసం పాపారావు కూడా వాళ్ల పెళ్ళికి అంగీకరించడం కథలో మలుపులు.

నిజానికి ఇలాంటి కథతో సినిమా తీయడం సాహసం. ఐతే ‘లేడీస్ టైలర్’ తో కామెడి బాట పట్టిన వంశీ ఈ సినిమా ను హాస్యరస భరితంగా తెరకెక్కించాడు. చివరి ఇరవయ్ నిమిషాలు మినహాయిస్తే, నవ్వకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం. పూర్తిగా dialogue comedy. ప్రతి మాటా తూటాలా పేలుతుంది. పాపారావు పాత్ర లో కోట శ్రీనివాస రావు జీవించాడు. మిగిలిన వాళ్ళూ అతనితో పోటీ పడ్డారు. ముఖ్యంగా సీత కాలికి గాయం అయినపుడు పరామర్శించడానికి తన ట్రూప్ అంతటినీ పాపారావు సుందరమ్మ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని కూచిపూడి భాగవతార్ లు గా పరిచయం చేయడం, సుందరమ్మ కోరికపై ‘రామాయణం’ ప్రదర్శించే సీన్ సినిమా మొత్తానికే హైలెట్. అలాగే దొరబాబు కోడి తో సీతకి లవ్ లెటర్ పంపే సీన్, రాంబాబు కి పోటీగా జూనియర్ ఎన్టిఆర్ ని ప్రోత్సహించే సీన్స్ గుర్తుండిపోతాయి. సినిమా హీరోల మధ్య ఉండే జెలసీలను సింబాలిక్ గా చుపించారనిపిస్తుంది. ఎక్కడా నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ సినిమా లో ఊతపదాలకీ కొదవ లేదు. ‘ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెబుతున్నాను’ అంటూ పెనుగొండ అబ్బులు, ‘అదంతా వీజీ కాదు’ అంటూ దొరబాబు, ‘దొరబాబూ ఉక్కెట్టవా’ అంటూ పట్టు పద్మిని..ఈ డైలాగులు ఇప్పటికి మనకి ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఇక సిలోన్ సుబ్బారావు సినిమా మొదటి సగం లో తెరపై కనిపించకుండా, రెండో సగం లో తెరపై కనిపించీ ప్రేక్షకులకు వినోదం పంచుతాడు. పట్టు పద్మినిని సిలోన్ సుబ్బారావు సినిమా హీరోయిన్ లా ట్రీట్ చేయడం, అది చూసి పాపారావు కడుపు మండడం, దొరబాబు కి పెనుగొండ అబ్బులు ‘ఫ్రెండ్షిప్ కొద్దీ’ ఇచ్చే సలహాలూ, పట్టు పద్మిని ‘భరతపూడి’ ప్రదర్శన, పాపారావు కి సుందరమ్మ చేసే అవమానాలూ… ప్రేక్షకులకి కావల్సినంత వినోదాన్ని పంచుతాయి.

ఇళయరాజా సంగీతం లో పాత పాటల remix లను వినొచ్చు. రెండు straight పాటలు ‘వెన్నెలై పాడనా’ ‘ఏనాడు విడిపోని’ ఆకట్టుకుంటాయి. ‘వెన్నెలై’ పాటలో వంశీ మార్కు చిత్రీకరణ కనిపిస్తుంది. నైట్ అఫెక్ట్ లో రికార్డింగ్ డాన్స్ లను చాలా సహజంగా చిత్రీకరించారు. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో మిగిలిన నటులంతా చాలా సహజంగా చేసినా, జూనియర్ కృష్ణ గా నరేష్ సూట్ కాలేదని నాకు అనిపిస్తుంది. కృష్ణ అభిమానులు అతనికి కరెన్సీ నోట్ల తో దండ వేసి దానిని ఊరు దాటేవరకూ తీయొద్దనడం ఓ ప్రహసనం. ప్రతి విషయం లోను ఆచితూచి వ్యవహరించే సుందరమ్మ తన మనవరాలి పెళ్లి విషయంలో ఎందుకు తొందర పడుతుంతో, తను ఏమాత్రం నమ్మని పాపారావుని గుడ్డిగా నమ్ముతుందో అర్ధంకాదు. ఇక క్లైమాక్స్ ఐతే ‘ఏదో సినిమాని ముగించాలి కాబట్టి’ అన్నట్టుగా ఉంటుందే తప్ప కన్విన్సింగ్ గా ఉండదు.

సినిమా ప్రారంభంలో వచ్చే కాఫీ హోటల్ సీన్ లో టిఫిన్ తిని బిల్ ఎగ్గొట్టి పప్పు రుబ్బే దొంగ సన్యాసి పాత్రలో వంశీ కనిపిస్తాడు. వంశీ నటించిన ఒకే ఒక సినిమా ఇది. ఈ సినిమా లో సీత గా కనిపించిన మాధురి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. ఈ సినిమా కి మొదట అనుకున్న టైటిల్ ‘శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ రాజమండ్రి.’ పేరు బాగా పెద్దదైందని ‘రాజమండ్రి’ తీసేసారు. ఐతే సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి లోను, కోనసీమ గ్రామాల్లోనూ చేసారు. (ఈ మధ్యనే ‘కొత్త బంగారు లోకం’ చూసాక, మళ్ళీ ఈ సినిమా చూస్తే గడిచిన రెండు దశాబ్దాల కాలంలో రాజమండ్రి ఎంతగా మారిపోయిందో అర్ధమైంది.) వంశీ మార్కు గోదావరిని చాలా షాట్స్ లో చూడొచ్చు. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ లో-బడ్జెట్ సినిమా అంతగా విజయవంతం కాలేదు. రికార్డింగ్ డాన్స్ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవడం కూడా ఒక కారణమని చెబుతారు. కామెడీలని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా విసుగు కలగదు.

–మురళి

12 Comments
  1. VENKAT November 21, 2008 /
  2. shree November 21, 2008 /
  3. pappu November 21, 2008 /
  4. మురళి November 21, 2008 /
  5. Madhu November 21, 2008 /
  6. KRISHNA RAO JALLIPALLI November 21, 2008 /
  7. శంకర్ November 21, 2008 /
  8. మురళి November 22, 2008 /
    • రాఘవేంద్రరావు కర్నటక June 24, 2009 /