Menu

జగదేకవీరుని కథ

అనగనగా ఒక రాజు. .. ఇలా సాగిపోయే జానపద కథలు సినిమాలు నచ్చని తెలుగువారెందరు? ఈ జానపద కథలలోని మలుపులు, కథానాయకుడి వీరవిహారం, అందమైన నాయిక, దుష్టుడైన మాంత్రికుడు. ఇలా చూస్తుంటే ఎంత పెద్దవాళ్లైన మైమరచిపోతారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలనాటి ఆ మధురమైన, మరపురాని జానపద చిత్రాలు ఇప్పటికీ అందరిని అలరిస్తాయి. అందునా విజయావారు తెలుగులో తీసిన జానపద చిత్రాలు ఒక దాని మించిన మరొక ఆణిముత్యాలు అని చెప్పవచ్చును. అందులో ముఖ్యమైనవి “జగదేకవీరుని కథ, పాతాళభైరవి, చందరహారం” . కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, పెండ్యాల నాగేశ్వరరావుగారు సంగీత దర్శకునిగా పని చేసిన మొదటి చిత్రం “జగదేకవీరునికథ”.

ఇది ఒక మామూలు సినిమా కాదు. ఒక వీరుని జీవితంలోని ఆనందం, విషాదం,సాహసకృత్యాలు మొదలైనవెన్నో కలబోసి నిర్మించిన చిత్రం. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా ఆ కథలో అలా లీనమైపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. పింగళి, పెండ్యాల, మార్కస్ బార్ట్లే, గోఖలే, కళాధర్, పసుమర్తి కృష్ణమూర్తి వంటి సాంకేతిక నిపుణులందరు కలిసి పని చేసి ఈ విజయవంతమైన సినిమాని అందించారు. తెలుగులో నిర్మించబడిన ఈ చిత్రం ఐదు అన్య భాషల్లోకి అనువదించబడి విజయవంతంగా ప్రదర్శించబడింది ఆ కాలంలోనే.నలభై ఏడేళ్ల నాటి ఈ అపురూపమైన చిత్రం గురించి తెలుసుకుందాం.

ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్. చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్‌కున్న ఒకే కల. చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టు చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వెళ్లిన ప్రతాప్ దేవకన్యలకోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతుండగా కలిసిన దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకి వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కాని అతని తల్లి ప్రార్ధనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకు పోయినవాడితో ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి , తన వలువలు దోచిన ప్రతాప్‌ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెడతారు. కామాంధుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్లి చేసిని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా. ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరెను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమె శాపవిమోచనమవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్లిపోతుంది. కాని ఆ దేవకన్యలందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.

తమిళంలో వచ్చిన ‘జగతల ప్రతాబన్ ‘ అనే తమిళ చిత్ర కథను తీసుకుని దానికి మరిన్ని మెరుగులు దిద్ది పాత్రలన్నింటికీ తమాషా ఐన పేర్లతో కథకు నవరసాలు జోడించి ఈ మనోహరమైన దృశ్య కావ్యంగా మలిచారు. ఈ చిత్రాన్ని ఒక సాదా సీదా జానపద చిత్రంగా కాకుండా “భ్రమ కాదు.. వాస్తవమే ‘ అన్నట్టుగా తీర్చిదిద్దారు. భాషా పరిణామ శాస్త్రం ప్రకారం తెలుగు భాషను పెంచి పోషించి, ఎన్నో కొత్త మాటలు పుట్టించిన మహానుభావుడు పింగళి. ఆయన ప్రతిభ ఈ సినిమాలోని ప్రతి అంశంలో కనిపిస్తుంది. చిత్రకథానాయకుడు మహానటుడు ఎన్.టి.ఆర్. నాయిక అందాల బి.సరోజాదేవి. ఈ చిత్రంలో సరోజాదేవి అందాలు, ఆమె ముద్దు ముద్దు మాటలు అందరిని మురిపించాయి. ఇప్పటికి జగదేకవీరుడి కథ. సరోజాదేవి అనగానే “ఏ హలా ” అన్న మాట గుర్తుచేయని తెలుగువాడు ఉండడేమో.

అలాగే నాగకన్యగా ఎ.విజయలక్ష్మి, కమలకుమారి వరుణకుమారిగా నటించింది. ఆమే ఆ తర్వాత జయంతిగా మారింది. మహారాజుగా ముక్కామల, ఆయన భార్యగా ఋష్యేంద్రమణి , రెండుచింతలుగా రేలంగి, ఏకాశగా గిరిజ నటించారు. మహారజు పుష్కరుడిగా నటించిన పుష్కలమైన హాస్యాన్ని పంచారు రాజనాల. ఇంద్రునిగా మిక్కిలినేని, నాగరాజుగా జగ్గయ్య నటించారు. నాడైనా , నేడైనా “జగదేకవీరుని కథ” అనగానే అందరికీ గుర్తోచ్చేది అందమైన దేవకన్యలు కాసింత ఎక్కువ ఎక్స్‌పోజిన్ చేసిన జలకా లాటలలో పాట. ఆ పాట కోసం వెర్రిగా సినిమా హాళ్లకు పరుగులు తీసారు మగవాళ్లు అనడంలో ఏమాత్రమూ అనుమానం లేదు. మరో మరపురాని అద్భుతమైన పాట “శివశంకరి.. శివానందలహరి..” ఇందులో ఘంటసాల గాత్రం, నందమూరి అభినయం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడింది అని అందరూ ఒప్పుకుంటారు. శిలారూపంలో ఉన్న గంధర్వుడికి శాపవిమోచన చేయాలి. అదీ సంగీతంతో. ముందుగా పదమూడు నిమిషాలు తీసిన ఈ పాటను కుదించి ఆరున్నర నిమిషాలు చేశారు. ఘంటసాలగారు కూడా ఈ పాటను ఒక సవాలుగా తీసుకుని శ్రద్ధగా సాధన చేసి రికార్డింగ్ చేసారు. ఆ పాటను విన్న నందమూరిగారు కూడా ఘంటసాలతో కూర్చుని పట్టుదలగా లిప్ మూమెంటును కూడా తప్పులేకుండా ప్రాక్టీస్ చేసారు. అలాగే వీసమెత్తు లోపం కూడా లేకుండా అద్భుతంగా లిప్ మూమెంట్ ఇచ్చి, అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. అలా అందరు మహానుభావులు కలిసి చేసిన ప్రయాస వలననే మంకు ఇంత అత్యద్భుతమైన , మరపురాని పాట లభించింది. ఇప్పటికీ సంగీతాభిమానుల గుండెల్లో కొలువైంది.

1961 ఆగస్టు తొమ్మిదో తేదీన ‘జగదేకవీరుని కథ ‘ విడుదలయ్యింది. మాయలు -మంత్రాలు, మోసాలు -ద్వేషాలు, పాటలు -పద్యాలు, హాస్యం -లాస్యం ఇలా అన్నీ కూడా తగిన మోతాదులో చేర్చి తయారు చేసిన ఒక అద్భుత కావ్యం ఈ చిత్రం. ఈ సినిమాలో ప్రధాన బలం పింగళి వారి మాటలు. పాటలు, రాజనాల, సి.ఎస్.ఆర్ ,రేలంగి, గిరిజల హాస్యం అందరిని మెప్పించింది. “వరించి వచ్చిన మానవవీరుడు, ఓ చెలి ఓహో సఖి, అయినదేమో అయినది, ఆదిలక్ష్మివంటి అత్తగారివమ్మా,రారా కనరారా కరుణమనినా, ఇలా ప్రతీ పాట ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే అందాల బి.సరోజాదేవి ముద్దు ముద్దు ముద్దుగా “ఏ హలా.. ఓ మానవా …” అనే మాటలు ప్రతి ప్రేక్షకుడి నోట వినిపించేవి. ఈ సినిమా 18 కేంద్రాలలో వంద రోజులు ఆడి అప్పటివరకు విడుదలైన అన్ని చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాత కూడా మరికొన్ని కేంద్రాలలో విడుదలై మొత్తం మీద 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగుదేశంలో రజతోత్సవం మాత్రమే జరుపుకోలేదు, మహారాష్ట్రలలోని షోలాపూర్లో వంద రోజులు నడిచిన ఏకైక తెలుగు చిత్రం ఇదే. గుంటూరులో ఒక ప్రేక్షకుడు వరుసగా వందరోజులు ఈ చిత్రాన్ని చూడడానికి రావడం గమనించిన థియేటర్ యజమాని అతనిని సన్మానించగా. ఆ వేడుకలకు హాజరైన ప్రేక్షకుల్లో మరికొందరు లేచి తాము అంతకన్నా ఎక్కువసార్లు చూసామని చెపపారట. ఆ తర్వాత ఈ విజయవంతమైన చిత్రాన్ని తమిళం, కన్నడం, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించి విడుదల చేశారు. అన్ని భాషల్లో కూడా అఖండ విజయం సాధించి ఒక అపురూప చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో పరసారం చేస్తే అభిమానులు కుర్చీకి అంటుకుపోరా?. తెలుగు సినిమా రంగంలో వచ్చిన ఒక మరపురాని మధురమైన ఆణిముత్యం. “జగదేకవీరుని కథ”

–జ్యోతి వలబోజు

11 Comments
  1. Venkat November 4, 2008 /
  2. Venkat November 4, 2008 /
  3. shree November 4, 2008 /
  4. మురళి November 4, 2008 /
  5. Fazlur Rahaman Naik November 5, 2008 /
  6. pappu November 10, 2008 /
  7. ravikumar November 29, 2008 /
  8. kumar December 27, 2008 /
  9. vinay April 14, 2009 /