Menu

మనసు ముంగిట్లో వెలిగిన ప్రేమ దీపం-‘చిత్ చోర్’

అతడు కళ్ళూ, మనసూ చెదిరే అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూ కాదు. ఆరుపెట్టెల దేహముదురూ కాదు! ఆమె తళుకుబెళుకుల మెరుపు తీగా కాదు. అందం కుప్ప బోసిన సౌందర్య రాశీ కాదు. అతడు మృదుస్వభావి, సంగీత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు! ఆమె పల్లెటూరి ముగ్ధ! అయినా సిగ్గుపడి తలుపు చాటుకి తప్పుకునే సిగ్గరి కాదు. అతడు మన పక్కింటబ్బాయి! ఆమె మన ఎదురింటమ్మాయి.

వారిద్దరి నిర్మలమైన ప్రేమ కథే “చిత్ చోర్ ”

బాసు చటర్జీ చేతిలోంచి మన కళ్ళముందుకు జారిన అందమైన ప్రేమ చిత్తరువు! ఎక్కడో పోగొట్టుకుని ఎన్నాళ్ళకో దొరికాక, ఎంత సేపు చూసినా తనివి తీరని అపురూపమైన పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటో లాగా ఈ సినిమా మీకు అనిపించకపోతే…మీలో ప్రేమించే తత్వం లేదన్నమాట.

రాజశ్రీ బానర్లో వచ్చిన ఒక లో బడ్జెట్ సినిమా ఇది. మొత్తమంతా కలిపి గంటన్నర! గంటల కొద్దీ వెంటాడే మధురమైన ప్రేమ కావ్యం!

కథ చాలా చిన్నది, ట్విస్టులేమీ లేనిది. మధుపూర్ అనే చిన్న పల్లేటూర్లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న హంగల్ కు బొంబాయిలోని పెద్ద కూతురు ఉత్తరం రాస్తుంది. చిన్న చెల్లెలికి పెద్ద ఇంజనీరు సంబంధం చూశాననీ, అతడు పని మీద మధుపూర్ వస్తున్నాడు కాబట్టి, రిసీవ్ చేసుకుని మాట్లాడమనీ! అయితే ఇంజనీర్ కంటే ముందు అతడి అసిస్టెంట్ వినోద్ (అమోల్ పాలేకర్) ప్రాజెక్ట్ పనులు చూడ్డానికి మధుపూర్ చేరుకుంటాడు. అతడినే ఇంజనీర్ గా భావించిన హెడ్ మాస్టర్, ఆయన భార్య దీనా పాథక్ మర్యాదలు చేసి కూతురు గీత తో (జరీనా వహాబ్) తో చనువుగా మెసలడానికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ చనువంటే కేవలం మాట్లాడుకోవడమే! తనని వరుడిగా భావిస్తున్నారని తెలియని వినోద్ స్వతహాగా సంగీత ప్రియుడు కూడా కావడంతో గీత కు సంగీతం నేర్పిస్తాడు. వారి పరిచయం పెరిగి మనసులో ప్రేమ చిగురిస్తుంది. ఇదెంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే చూస్తున్న మనక్కూడా “వాళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదా?” అని సందేహం వస్తుంది.మరి కొన్నాళ్ళకు అసలు వరుడు, ఇంజనీరు విజయేంద్ర ఘాట్లే దిగటంతో వినోద్ అతడి అసిస్టంట్ మాత్రమే అని తెలుస్తుంది. ఆ తర్వాత పాత్రల మనసుల్లో జరిగే సంఘర్షణ, ముగింపు..వెరసి ఈ చిత్రం!

ఈ చిత్రంలో మొదటిగా, చెప్పుకోవలసింది అమోల్ పాలేకర్ గురించే! ఫుల్ హాండ్స్ చొక్కాతో, పక్కా గర్నమెంట్ ఉద్యోగిగా, మధ్య తరగతి జీవిత సౌందర్యాన్ని ప్రతిబింబించే అభిరుచులతో సాదా సీదాగా, పెదాల మీద చెరగని చిరునవ్వుతో ప్రేక్షకుల మన్సు దోచి పారేస్తాడు.సినిమా అంతా నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నా ఎక్కడా ‘వాగుడు కాయ ‘ లాగా వినోద్ పాత్ర కనిపించదు.

మిగతా పాత్రల కంటే ఈ సినిమా లో కథా నాయకుడి తర్వాత మాట్లాడుకోవలసింది సంగీతం గురించి! ఇందులో మధుపూర్ (ఈ సినిమాని తీసింది మహాబలేశ్వర్ ని ఆనుకుని ఉన్న పంచ్ గనిలో)ప్రకృతిని వర్ణిస్తూ కథా నాయకుడు పాడే ‘గొరి తెరా గావ్ బడా ప్యారా” పాటని (బాల్యంలోనే రవీంద్ర జైన్ కు అంధత్వం ప్రాప్తించిందని చదివాను) అంధుడైన రవీంద్ర జైన్ రాశాడంటే నమ్మలేం! అంతే కాదు, సంజ చీకట్లలో ముంగిట్లో వెలిగే దీపానికి కవిత్వాన్ని అద్ది, “జబ్ దీప్ జలే ఆనా” పాటని సృజించాడు రవీంద్ర జైన్. మిగతా సంగీత దర్శకులెంత గొప్ప పాటలకు బాణీలు కట్టినా,శ్రోతల మనసు పొరల్లోని జ్ఞాపకాలను తడిమే ఒక ‘లైఫ్ ‘ రవీంద్ర జైన్ సంగీతంలో ఉంటుందని ఈ సినిమాలోని పాటలు రుజువు చేస్తాయి.ఉన్నవి నాలుగే పాటలైనా చిత్ చోర్ విజయంలో సింహ భాగం ఆక్రమించిన పాటలవి! ఈ నాటికీ ప్రతి సంగీత ప్రియుల ఇంట్లోనూ, కార్లోనూ అడపా దడపా వినిపించే ఆల్ టైం ఫేవరెట్లు! అంతే కాదు, హిందీ చిత్ర రంగానికి జేసుదాస్ ని పరిచయం చేసిన విజయగీతాలు కూడా! ఆ తర్వాత జేసుదాస్ పాడిన హిందీ పాటలన్నీ దాదాపు సూపర్ హిట్లే!

ఇక దర్శకుడు బాసు చటర్జీ గురించి ఎంతమంది ఎన్ని రకాలు గా చెప్పినా మళ్ళీ చెపితే గొప్పగానే ఉంటుంది. పెళ్ళి చూపుల కొచ్చిన విజయేంద్ర ముందు, అమోల్ కళ్ళలో కళ్ళు కలిపి పరవశంతో ‘తుఝొ మేరే సుర్ మీ” పాటను హీరోయిన్ ఆలాపిస్తుంటే ఎంత మాత్రమూ అసభ్యమనిపించదు.(ఒక్క సారి “కేక” సినిమాలో హీరోయిన్ ని గుర్తు తెచ్చుకోండి).హీరోయిన్ తల్లి దండ్రులు అసలు పెళ్ళి కొడుకు వినోద్ కాదని తెలిసినా అతడితో కఠినంగా ప్రవర్తించలేకపోతారు. ఆ పాత్రలకు అటువంటి సంస్కారం అద్దాడు దర్శకుడు.

మడమల వరకు చీర కట్టి, నవ్వుతూ, తుళ్ళుతూ,అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ అమాయకంగా కనిపించే కథానాయిక చివర్లో తన పెళ్ళి విజయేంద్ర తో తప్పదని తెలిశాక, నిశ్చితార్థం రోజే “హెడ్ మాస్టర్ గారి చిన్నకూతురి పెళ్ళి వినోద్ తోనే జరుగుతుంది” అని చెప్పి వినోద్ ని కలుసుకోడానికి రైల్వే స్టేషన్ కి ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఆ ధైర్యం వినోద్ చేయలేకపోతాడు. శుభం కార్డు పడే వరకూ , పడ్డాక కూడా హీరో హీరోయిన్లు ఒకరి నొకరు తాకరు.కనీసం చేయి కూడా పట్టుకోరు. ఇద్దరికీ డ్యూయెట్లు కూడా ఉండవు. అయినా వారి ప్రేమ తాలూకు రసానుభూతి మన మనసుల్ని తాకుతుంది. ఇంతకంటే బాసుదా గురించి ఏం చెప్పాలి మరి!

చిత్ చోర్ సినిమాలో అందరూ మంచి వాళ్ళే! సినిమా పూర్తయ్యాక,”ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎంత బాగుంటుందో” అనిపించక మానదు. సినిమా చూసాక, అమోల్ పాలేకర్ అమాయకమైన చిరునవ్వు మిమ్మల్ని చాలా రోజులు వెంటాడక పొతే మీరు ఈ సినిమాతో ప్రేమలో పడనట్టే లెక్క!

తెలుగులో చంద్ర మోహన్, జయసుధ, శరత్ బాబులతో ఈ సినిమాని “అమ్మాయి మనసు” పేరుతో నిర్మించారు గానీ చిత్ చోర్ చూసిన కళ్ళతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంగీకరించలేదు.ఫ్లాపై పోయింది.

–సుజాత (మనసులో మాట)

12 Comments
  1. మురళి November 19, 2008 /
  2. శ్రీ November 19, 2008 /
  3. గీతాచార్య November 19, 2008 /
  4. కొత్తపాళీ November 19, 2008 /
  5. Sowmya November 22, 2008 /
  6. subhadra March 15, 2011 /
  7. Ramesh Peddaraju April 7, 2011 /
  8. rajendra kumar devarapalli April 9, 2011 /