Menu

Black & White (2008)

ఇది కాస్త లో ప్రొఫైల్గా వచ్చి వెళ్ళిన తెలుగు సినిమా అనుకుంటా. టీవీలో యాడ్స్ చూసి సినిమా ఏదో ఆసక్తికరంగా ఉండేలాగుందే అనుకున్నాను. అయితే, ఇంకా రిలీజ్ కాలేదేమో అనుకున్నాను. ఆగస్టులోనే రిలీజైందని తెలుగుసినిమా.కామ్ సైటులో ఈ సినిమా గురించి రాసిన వ్యాసంతో అర్థమైంది. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

కథ: భరత్ (రాజీవ్ కనకాల) ఓ సాఫ్ట్‍వేర్ ఇంజినీరు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో నక్సల్స్ లాండ్‍మైన్ అటాక్ నుండి కొంతమంది పోలీసులను కాపాడి రాష్ట్రపతి ఇచ్చే సిటిజెన్ అవార్డుకి ఎన్నికౌతాడు. అతను అనాథగా పెరిగి స్వశక్తితో పైకొచ్చినవాడు. అతని ప్రాణస్నేహితుడు శీను, ఆఫీసు, ఇంటి దగ్గరుండే పిల్లలు – ఇదే అతని ప్రపంచం. ఇక్కడ మొదలౌతుంది మన కథ. తర్వాత ఓ అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. ఈ సమయంలోనే అతనిపై ఎవరో దాడులు చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ అతను తప్పించుకుంటూ ఉంటాడు. ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇలా ఉండగా ఒకానొక పరిస్థితిలో భార్యని ఆశ్చర్యపరచడానికి ఇంట్లోకి దొంగలా దూరి ఇతన్ని దొంగగా భావించిన ఆమె చేతిలో గాయపడి ఆస్పత్రి పాలౌతాడు. అతను అక్కడ ఉన్న సమయంలోనే ఊరు శివార్లలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అక్కడకి ఎలా వచ్చిందో తెలీకపోయినా భరత్ కారు ఉంటుంది. ఇతన్ని అనుమానం మీద పోలీసులు అరెస్టు చేస్తారు. ఇక్కడ్నుంచి కథ – భరత్ అమాయకుడా? అమాయకంగా కనిపించే విలనా? పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నలకి జవాబుగా సాగుతుంది కథ.

నాకైతే సినిమా నచ్చింది. అంత అరివీరభయంకరమైన సస్పెన్స్ గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే, పాత్రలు తక్కువ కనుక మన అనుమానం సహజంగా ఒక పాత్రపైకే వెళుతుంది. కానీ, ఆ పాత్రకి ఉన్న మోటివ్ ఏమిటి? అన్నది ఆసక్తికరం. ఒక విధంగా చూస్తే ఇది కూడా ఓ సామాజిక సినిమా కిందే లెక్క. సమాజంలో వ్యక్తి బాధ్యత, సూసైడ్ బాంబర్లు, మతతత్వ తీవ్రవాదం వంటి అంశాలని చర్చిస్తుంది. కానీ, దీన్ని ఒక సీరియస్ సినిమాగా తీయకుండా సస్పెన్స్ థ్రిల్లర్ గా తీయడం బాగుంది. సినిమాలో అందరూ వాళ్ళ పరిధి లో బానే చేసారు. రాజీవ్ కనకాల క్లోజప్ దృశ్యాల్లో తప్ప మిగితా అన్నింటిలో బానే ఉన్నాను. హీరోయిన్ సింధూ థులానీ తనే డబ్బింగ్ చెప్పుకుంది ఈ సినిమాలో! ఆమె తెలుగు కాస్త తేడాగా ఉండడానికి సినిమాలోనే ఓ చోట వివరణ కూడా ఇచ్చారు. మనిషి కొన్ని దృశ్యాల్లో ఏదో అసహజంగా అనిపించినా కూడా, చాలావరకు బానే కుదిరింది. ఆ ఆలీ ఎపిసోడ్ వల్ల సినిమాకి ఒరిగిందేమీ లేదేమో పెద్దగా అనిపించింది. హీరో స్నేహితుడి పాత్రలో ఉత్తేజ్ ని ఆ హెయిర్ స్టైల్ లో చూడటం కొత్తగా ఉండింది. అక్కడక్కడా హాస్యం ఎంజాయబుల్ గా ఉంది. సంగీతం కూడా బాగుంది.

ఇదో కళాఖండమని కాదు కానీ, its a decent movie to watch. తెలుగు సినిమాల్లో కూడా ఈమధ్య అపుడపుడూ కాస్త రొటీన్ కి భిన్నమైన సినిమాలు రావడం ఎక్కువవడం నాకైతే మంచిదే అనిపిస్తోంది. అలాంటి ప్రయత్నాల్లో అన్నీ బాగున్నాయని కాదు కానీ, బాగుండేవి కూడా ఉన్నాయి అని ఇలాంటి సినిమాలు చూస్తేనే తెలుస్తోంది. A film by aravind వంటివాటి కోవకి చెందిన చిత్రం. రాజీవ్ కనకాల ఎంచుకునే సినిమాలు కాస్త రొటీన్ కి భిన్నంగా ఉన్నాయనే చెప్పుకోవాలి మరి – ఈ మధ్య వచ్చే అతని సినిమాలు చూస్తూ ఉంటే.

2 Comments
  1. శంకర్ November 23, 2008 /
  2. sanjeev December 2, 2009 /