Menu

బి.ఆర్ చోప్రా-ఒక నివాళి

భారత సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రముఖులలో ఒకరైన బి.ఆర్ చోప్రా(94) ఈ ఉదయం 8.15 నిముషాలకు ముంబయి, జుహు లోని తన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అస్వస్ధతకుతో బెడ్ రెస్ట్ లో ఉన్న ఈ సిని కురు వృధ్ధుడు మరణానికి బాలీవుడ్ మొత్తం నీరాజనాలు అర్పిస్తోంది. ఆయన తన బి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై కెరీర్ లో క్లాసిక్ లుగా పరిగణించతగ్గ నయా దౌర్,ఏక్ హి రిస్తా,కానూన్,ధూల్ క ఫూల్,గుమ్రాహ్ వంటి చిత్రాలును రూపొందించారు.

కుటుంబ విలువలు,సామాజిక అంశాలుతో సినిమాలు నిర్మించటమన్నా,దర్శకత్వం వహించమన్నా ఆసక్తి చూపేవారు.అలాగే 1985 లో తన బ్యానర్ పై మహాభారత్ టీవీ సీరియల్ నిర్మించి సంచలనం సృష్టించారు. ఇక ఈయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ 1998లో భారత ప్రభుత్వం దాదా ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సాయింత్రం జుహు స్మసానవాటికలో 4.30 కు దహన సంస్కారాలు ఏర్పాటు చేస్తున్నారు.

బి.ఆర్ చోప్రా గురించి….

పంజాబ్ లూధియానా లో 1914లో జన్నించిన బలదేవ్ రాజ్ చోప్రా (బి.ఆర్.చోప్రా) కెరీర్ ప్రారంభంలో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేసారు. తర్వాత లాహోర్ యూనవర్శిటీ నుండి ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత లాహోర్ బేసెడ్ సినీ హెరాల్డ్ పత్రికలో రివ్యూ రైటర్ గా సేవలందించారు. అతి తక్కువ కాలంలోనే నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు రాసే రివ్యూ రైటర్ గా పేరుపొందారు. అయితే ఈ జర్నలిజం కెరీర్ ఎంతో కాలం కొనసాగలేదు. భారత్ విభజన సమయంలో తమ ఇల్లు సైతం కాలిపోవటం,మత ఘర్షణలు,ఆయన హిందూ ఫ్యామిలీకి సంభందించిన వారు కావటంతో న్యూడిల్లీ చేర్చాయి.

అయితే ఆయన లాహోర్ లో ఉండగానే తండ్రి స్నేహితుడు చేసిన ఆర్దిక సాయింతో చాందనీ చౌక్ అనే సినిమా నిర్మించాడు.కానీ విభజన సమయంలో లాహోర్ విడిచిరావటం,ఆర్దిక సమస్యలుతో ఆ చిత్రాన్ని పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ 1948 లో ఆయన కర్వాత్ అనే సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమా ఫ్లాఫ్ అయి నిరాశలో ముంచింది. అప్పుడు ఆయన శ్రేయాభిలాషి గోవర్ధన్ దాస్ అగర్వాల్ అనే ఫైనాన్సియర్ సినిమా నిర్మాణం కన్నా దర్శకత్వం వహించడం సేఫ్ అని సజెషన్ చేసారు.

దాంతో అశోక్ కుమార్ హీరోగా ఆఫ్సానా చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్టయి సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపుకుంది. అక్కడనుండి చోప్రా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత 1955 లో బి.ఆర్ ఫిల్మ్ అనే నిర్మాణ సంస్ధని స్ధాపించి విధవా పునర్వివాహం చుట్టూ తిరిగే ఈ కథతో ఏక్ హి రాస్తా చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా బాగానే వర్కవుట్ అవటంతో అక్కడనుండి ఆయన ఆలోచింప చేసే చిత్రాలవైపు దృష్టి నిలిపారు.

అక్కడ నుండీ వరసగా నయాదౌర్(1957),సద్మా(1958),ధూల్ కా ఫూల్(1959),కానూన్(1960),గుమ్రాహ్(1963),వక్త్(1965),హమ్ రాజ్(1967)వంచి అనేక అధ్బుత చిత్రాలను ఆయన వెండి తెరపై ఆవిష్కరించారు. అదే దిశలో పద్దెనిమిది చిత్రాలను దర్శకత్వం చేసి, ఇరవై ఎనిమిది చిత్రాలను నిర్మించారు.

ఇక నయాదౌర్ ఎంత పేరు తెచ్చుకుందంటే అప్పటి ప్రధాని నెహ్రూ సినిమా చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.ఆ సినిమానే లగాన్ కి స్ఫూర్తి అని కూడా అంటూంటారు. ఇక ధూల్ కా ఫూల్ సినిమాతో బి.ఆర్.చోప్రా తన సోదురుడు యాష్ చోప్రాని దర్శకుడుగా పరిచయం చేసి మరో అధ్భుతమైన క్రియేటివిటిని బాలీవుడ్ కి అందించాడు. యాష్ చోప్రా వక్త్ సినిమాని బి.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందించి పెద్ద హిట్ చేసారు. ఆ తర్వాత ఆయన డెబ్భైల్లో యష్ రాజ్ ఫిల్మ్స్ అంటూ సొంత బ్యానర్ పెట్టుకోవటం అందరికీ తెలిసిందే. అలాగే బి.ఆర్ మరో సోదరుడు ధరమ్ చోప్రా మంచి ఛాయాగ్రాహకుడుగా పరిశ్రమలో పేరు సంపాదించారు.

ఇక బి.ఆర్ చోప్రా చివరగా దర్శకత్వం వహించిన చిత్రం కల్ కి ఆవాజ్(1992).అక ఆ తర్వాత ఆయన కుమారుడు రవిచోప్రా సంస్ధ పగ్గాలు పట్టి భాగ్ బన్,బాబుల్ వంటి చిత్రాలు అందించారు. అయితే ఆ సినిమాలంటే ఎంత అభిలాష అంటే చివర రోజుల్లో అనారోగ్యంతో కూడా వీల్ ఛెయిలో ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తన బి.ఆర్ ఫిలిమ్స్ ఆఫీస్( సాంట్రా కజ్) కి వెళ్ళేవారు.అక్కడ స్టాఫ్ తోనే లంచ్ తీసుకునేవారు.

ఓ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ గా కమర్షియల్ బంధనాలును ఛేదించి సామాజిక అంశాలను తెరకెక్కించిన వ్యక్తిగా ఆయన్ని బాలీవుడ్ మేధావులు విశ్లేషిస్తూంటారు. చివర రోజుల్లో బాలీవుడ్ లో డబ్బే మాట్లాడుతోంది. తెరపై డబ్బునే చూస్తున్నాం అంటూ చాలా భాధపడేవారు.

జీవితకాలంలో దాదాసాహెబ్ అవార్డ్ తో సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినీ మేధావి మన మధ్య లేకపోవటం లోటే గానీ ఆయన సినిమాలు ఇప్పటి తరానికి దారి చూపే దిక్సూచులు వంటివి అన్నది నిజం. అది మన తరం అదృష్టం. ఈ సమయంలో ఆ మహనీయుడు శ్రధ్ధాంజలి ఘటిస్తూ…ఆయన క్లాసిక్స్ లో ఒక్కటయినా ఈ రాత్రి చూడండి. మనం మిస్సవుతున్న ప్రపంచాన్ని స్వయంగా ఆవిష్కరించుకోండి.

-సూర్య ప్రకాష్ జోశ్యుల

3 Comments
  1. someone November 7, 2008 /
  2. Sowmya November 7, 2008 /
  3. j.suryaprakash November 7, 2008 /