Menu

తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా-బీ ఆర్ చోప్రా కు శ్రద్ధాంజలి!

అది హీరోలను తప్ప నిర్మాతలను గమనించే వయసు కాదు. అలాంటి వయసులో కూడా బీ ఆర్ చోప్రా నా దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆయన పట్ల నాకు ఆకర్షణ కలగటానికి ప్రధాన కారణం సాహిర్ లూధియానవీ అంటే నాకున్న అభిమానం.

సాహిర్ లూధియానవీ ఎంత గొప్ప గేయ రచయితనో అంతకన్న గొప్ప కవి. ఇంకా గొప్ప అహంకారి. ఆయన అహంకారం గురించిన కథలు చదువుతూ, ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించే సగటు మనుషులను చూసి నవ్వుకుంటూండేవాడిని. నేను అభిమానించే విశ్వనాథ సత్యనారాయణను కూడా అహంకారే అని ముద్ర వేశారు.

సాహిర్ పాటలు విని, అనేక భావాల ఆకాశాలలో తేలుతున్న నేను ఒక పత్రికలో ఒక సంఘటన చదివాను. సాధన అనే సినిమాలో ఔరత్ నే జనం దియా మర్దోంకో, మర్దోనే ఉసె బాజార్ దియా, జబ్ జీ చాహా మచ్లా కుస్లా, జబ్ జీ చాహా ధుత్కార్ దియా, అనే అద్భుతమయిన పాట వుంది. దాన్ని పాడింది లతా. రాసింది సాహిర్. ఆ పాట అద్భుతంగా పాడినందుకు ఆ సినిమా నిర్మాత లతాకు పూల గుత్తులుచ్చాడట అబినందనగా. ఆరోజు అర్ధరాత్రి సాహిర్, ఆ నిర్మాతకు ఫోను చేసి, గానే వాలీకో గుల్దస్తా పేష్ కర్తేహో, వో గానేకా లవ్జ్ కిస్కిథీ? అని నిలదీసి ప్రశ్నించాడట. పాట పాడినామేకు పూలగుత్తులిస్తావు, ఆ పాటలో ఆమె పాడిన పదాలు రాసిందెవరు? అని నిర్మాతను నిలదీసిన రచయితను మన్నించటమేకాకుండా మరుసటి రోజు సన్మానించాడట ఆ నిర్మాత. అంతేకాదు, లతా కన్న ఒక్క రూపాయి ఎక్కువిస్తేనే పాటలు రాస్తానని సాహిర్ పట్టుపడితే, రచయితకు పెద్ద పీటవేసి సత్కరినిచినవాడూ ఆ నిర్మాతే. సాహిర్ కు సంగీత దర్శకుడు నచ్చకపోతే సంగీత దర్శకుడిని మార్చేసేంతగా మన్నననిచ్చినవాడా నిర్మాత. నయా దౌర్ లాంటి సూపర్ హిట్ పాటల తరువాత ఓ పీ నయ్యర్ కూ సాహిర్ కూ మధ్య భేదాభిప్రాయం వచ్చింది. దాంతో తరువాత సినిమాలకు సంగీత దర్శకుడిని మార్చేశాడా నిరామాత. సాహిర్ కు అవితో కుదిరిందని రవిని పర్మనెంట్ సంగీత దర్శకుడిని చేసుకున్నాడు ఆ నిర్మాత. ఒక రచైతకు ఇంతగా మన్నననిచ్చి, గౌరవించి ఆదరించిన ఆ నిర్మాత నన్ను ఎంతగానో ఆకర్షించాడు. అప్పుదు అతగాడి సినిమాలను గమనించటం మొదలుపెట్టాను. అందువల్ల నాకు ఒక సత్యం బోధపడింది. ఒక సినిమా నాణ్యత అందులోని కళాకారులపైన ఆధారపడివుండదు. ఆ సినిమాను నిర్మించే నిర్మాత అభిరుచిపైన ఆధారపడి వుంటుంది. నాకీ సత్యం అర్ధమయ్యేట్టు చేసిన ఆ నిర్మాత బీ ఆర్ చోప్రా!

బీ ఆర్ చోప్రా సినిమాలలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది సమాజానికి ఉత్తమమయిన రీతిలో ఉన్నతమయిన సందేశం ఇవ్వాలన్న తపన కనిపిస్తుంది.

నయాదౌర్ సినిమా కథను ఎవ్వరూ సినిమాకు సరిపోయే కథగా భావించరు. టాంగా వాడు, మోటారుతో పోటీ పడటాన్ని ఒప్పుకోరు. కానీ ఏ కథను ఆధునికానికి, ప్రాచీనానికి నడుమ పోటీలా మార్చి, ఆధునిక యాంత్రిక అభివృద్ధి ఆహ్వానించ దగ్గదే అయినా దాని వల్ల సామాన్యుల జీవితాలకు కష్టం కలగకూడదన్న ఆలోచనను అత్యంత హృద్యంగా ప్రదర్శించటం ఈ సినిమాలో చూడవచ్చు. ముఖ్యంగా సాథీ హాథ బఢానా పాటలో సాహిర్ నిర్మాత సందేశాన్ని స్పష్టంగా ప్రకటిస్తాడు. బహుషా అందుకేనేమో చోప్రా ఎవరినయినా వదులుకున్నాడుకానీ సాహిర్ను వదలుకోలేదు. ఇదే సినిమాలో మరో పాట ఆనా హైతొ ఆ రాహమె కుచ్ ఫేర్ నహీ హై తాత్వికంగా పరమాద్భుతమయినది. సాహిర్ లోని రచయితకు రెక్కలనివ్వటం ద్వారా ఉత్తమ సినిమాకు పెద్దపీట వేయటం, తద్వారా నిర్మాతగా, పౌరుడిగా లాభ పడటం కనిపిస్తుంది.

సాధారణంగా అన్ని రంగాలలో రచయితంటే అంద్రరికీ చిన్న చూపు. రచయిత పెన్ను పేపరు మీద పెట్టందే పనిగడవదు కానీ రచయితకు ఇచ్చేందుకు డబ్బులుండవెవరిదగ్గరా. రచయితకు స్వేచ్చ నివ్వరు. ఏమీ తెలియనివారు కూడా నిర్మాతలయిపోగానే రచయితలకు సలహాలు సూచనలు ఇస్తూంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒక రచయితకింత స్వేచ్చ గౌరవం మన్ననలిచ్చిన నిర్మాత సంస్కారానికి జోహార్లర్పించక తప్పదు. ఈ ఉత్తమ సంస్కారం బీ ఆర్ చోప్రా ప్రతి సినిమాలో కనిపిస్తుంది.

ధర్తీపుత్ర లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం వుండాలి. యే కిస్క లహూ హై కౌన్ మరా అని ప్రస్నించాలంటే ఎంతో తెగువ వుండాలి. ఇదే సినిమాలో మై జబ్ భి అకెలీ హోతీహూ పాట అత్యుత్తమమయినది. ఇదే సూటిగా ప్రశ్నించే తత్వం ధూల్ క ఫూల్ లో కూడా కనిపిస్తుంది. తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా అన్న సాహిర్ పాట, దేశ విభజన సమయంలో లాహోర్ లో అన్నీ వదలిన బీ ఆర్ చోప్రా మనసులో మాటనే కాదు, పాకిస్తాను వెళ్ళి అక్కడ వుండలేక తిరిగివచ్చిన సాహిర్ హృదయ వేదనకు ప్రతిబింబం కూడా. తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తాహూ సాహిర్ ప్రేమ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

గూమ్రాహ సినిమాలో వైవాహిక జీవితం లోని లక్ష్మణ రేఖను సమాజానికి గుర్తు చేయాలన్న తపన కనిపిస్తుంది.అన్ని బంధనాలనూ తెంచుకోవాలని ఆత్ర పడుతున్న సమాజాన్ని ఒక్క నిమిషం ఆగి ఆలోచించమని హెచ్చరించటం కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సాహిర్ కలం విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇన్ ణవావోమె, యే హవా, చలో ఇక్ బార్, ఆప్ ఆయి ఒకో పాటా ఆణిముత్యం.

ఆత్మ విశ్వాసానికీ అంధ విశ్వాసానికీ మధ్య సంఘర్షణ వక్త్ సినిమా. ఏ సినిమాలో కూడా సాహిర్ కలం చిలకరించిన గేయాలు పరమాధ్భుతమయినవి, వక్త్ సే దిన్ ఔర్ రాత్, కౌన్ ఆయా, దిన్ హై బహార్ కే, ఒకటేమిటి ప్రతి పాటా ఒకఓ అద్భుతం. సాహిర్ జీవిత తత్వానికి దర్పణం ఆగే భీ జానే న తుం పాట.

ఇక్కడే చోప్రా మనస్తత్వంలో మరో కోణాన్ని మనం చూడవచ్చు. తూ హిందు బనేగా పాట రికార్డింగ్ కు రఫీ ఆలస్యంగా వాచ్చాడు. దాంతో రఫీని తొలగించి మహేంద్రకపూర్ కు అవకాశమిచ్చాడు చోప్రా. వారి అనుబంధం చివరి వరకూ కోనసాగింది.

ధుంద్ సినిమా చోప్రా సినిమాలకు భిన్నమయినది. ఇక్కడా సాహిర్, రవి, మహేంద్ర కపూర్ ల మాజిక్ కనిపిస్తుంది. అయితే ఇన్సాఫ్ కా తరాజూ సినిమాతో చోప్రా సినిమాలలో ఆత్మ లోపించింది. సాహిర్ మరణ ప్రభావం చోప్రా సినిమాలపైన వాటి నాణ్యత పైన పడింది. అందుకే చొపరా అత్యుత్తమ చిత్రాలన్నీ సాహిర్ జీవిత కాలంలోనే నిర్మించినవి. నికాహ్ హిట్ అయినా చోప్రా స్థాయిలో లేని సినిమా అది.

నిర్మాతకు ఉత్తమ అభిరుచి వుంటే, తన సామాజిక బాధ్యత పైన గ్రహింపు వుంటే అతని సినిమాలెలావుంటాయంటే చోప్రా సినిమాలలావుంటాయనవచ్చు.

మన చలన చిత్ర రంగంలో మరో బీ ఆర్ చోప్రా లాంటి నిర్మాత వస్తాడన్న ఆశ లేదు. ఎందుకంటే, మరో సాహిర్ కూడా మళ్ళీ మళ్ళీ రాడు కదా! సాహిర్ రహిత చోప్రా సినిమాలు ఆత్మ రహిత శరీరంవంటివి.

3 Comments
  1. nietzsche niche November 14, 2008 /
  2. ceenu November 14, 2008 /
  3. j.suryaprakash November 14, 2008 /