Menu

“వెల్కం టు సజ్జన్ పూర్” – ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, శంకర్ నాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా లేక కొన్ని సంవత్సరాల క్రితం నాగేష్ కుక్కునూర్ తీసిన “ఇక్బాల్” తీసుకున్నా, ఆవి చూసిన అనుభూతుల్ని మిగులుస్తాయిగానీ ఖచ్చితంగా ఇదీ అని చెప్పగలిగే విశ్లేషణకు దూరం చేస్తాయి.

సాంకేతికంగా లేక కథా,కథనాల పరంగా ఈ చిత్రం అత్యుత్తమమైనది కాకపోయినా, చిత్రంలోని నిజాయితీ,’సాధారణత్వం’ ముందు, ఆలోపాలు దాదాపు కనుమరుగై, కేవలం కొన్ని అనుభూతులు మిగిల్చి, విశ్లేషకులని ఇబ్బందికి గురిచేసే గుణం ఉంది అని చెప్పొచ్చు. ప్రముఖ ‘బ్లాగుకవి’ బొల్లోజుబాబా గారు “టక్కు టక్కు మంటూ శబ్ధాలు, శరీరం తరువాత ఏ వైపుకు వూగుతాదో తెలీని వూపులు, మద్యమద్యలో గుర్రం సకిలింపు, జట్కావాడు ఆ బండి చక్రానికి చర్నాకోలు అడ్డంపెట్టి పలికించే ట్ట,ట్ట,ట్ట,ట్ట మనే హారను. ఇలాంటి గుర్రంబ్బండి ప్రయాణం ఎప్పుడైనా చేసారా?” అని అడుగుతుంటారు. తేలిగ్గా చెప్పాలంటే “వెల్ కం టు సజ్జన్ పూర్” సినిమా అలాంటి గుర్రంబ్బండి ప్రయాణమే అని చెప్పుకోవాలి. మాములు సినిమాలలో ఉండే వేగాలూ, శబ్దాలూ, అతిశయోక్తులూ, ఆర్భాటాలూ లేకుండా, కేవలం ఒక చిన్న కుగ్రామంలోని, సాధారణ మనుషుల గురించి తీసిన ఒక సిన్సియర్ చిత్రం.

wellcome to sajjanpur poster

wellcome to sajjanpur poster

సజ్జన్పూర్ అనే గ్రామంలోని ఏకైక గ్రాడ్యుయేట్ ‘మహాదేవ్ కుశ్వాహ’ (శ్రేయాస్ తల్పడే) ఆ గ్రామ చరిత్ర చెప్పడంతో సినిమా ప్రారంభమవుతుంది. గ్రామంలో బాగా రాయగలిగేవాడు తనొక్కడే కాబట్టి, రచయిత కావాలనుకున్నా, ఆ ఉర్లో లేఖ రాతగాడు (letter writer) గా మిగిలిపోయిన ఇతగాడి కోణంలోంచీ పాత్రల పరిచయాలూ, కథా పురోగమనం జరిగుతుంది. నాలుగు సంవత్సరాలుగా బొంబాయిలో వున్న భర్తకు మహాదేవ్ ద్వారా ఉత్తరాలు రాయించుకునే, చిన్ననాటి స్నేహితురాలు/ప్రేమికురాలు కమల (అమృతా రావ్), అబ్బాయిలాంటి అమ్మాయి (దివ్యాదత్తా)కి  మూఢనమ్మకాల తల్లి (ఇలా అరుణ్), ఒక విధవరాలి (రాజేస్వరీ సచ్దేవా)తో ప్రేమలోపడే ఆస్పత్రి కాంపౌండర్ (రవికిశన్), ఎలెక్షన్లో పాల్గొనే కొజ్జా –eunuch ( రవి ఝంకాల్), ఊర్లో బలవంతుడైన పొలిటీషియన్ (యష్ పాల్ శర్మ) వీరి ఉప కథలతో సినిమా తీర్చిదిద్దబడింది.  ఈ ఉపకథల్ని జోడించి ఒక నవలగా రాసి మహదేవ్ చివరికి ఒక నవలా రచయితగా ఎదుగుతాడు.అందుకే బహుశా సినిమాకి ముందువేసే సెన్సార్ ర్టిప్జికెట్లో సినిమా పేరు “మహాదేవ్ కీ సజ్జన్పూర్” అని ఉంటుంది. కొసమెరుపుగా, నవలకూ నిజానికీ మధ్య ఉన్న కొన్ని తేడాలను పబ్లిషర్ తో మహాదేవ్ పంచుకోవడం కొంత సరదాగానూ, మరికొంత హృద్యంగానూ ఉంటుంది. కథకూ జీవితానికీ మధ్య ఉన్న  వైవిద్యం, వైరుధ్యం ఆలోచనాత్మకంగా ఉంటుంది.

సినిమాలో ఇలాంటి చెళుకులెన్నో ఉన్నాయి. ప్రస్తుత భారతదేశంలోని రాజకీయ,ఆర్థిక, సామాజిక ప్రాశ్వాలని అంటీఅంటనట్లు కథాగమనంలో జోడించి అంతర్లీనంగా ఒక సెటైర్ లాగా సినిమాని మలిచారనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ఈ సినిమాను కామెడీ అనో, సెటైర్ అనో, రొమాంటిక్ అనో ఇలా బ్రాండ్లు తగిలించడం కష్టతరంగా అనిపిస్తుంది. నిజ జీవితంలో ఎన్ని అంశాలుంటాయో అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేమలు, మోసాలు,హత్యలు, హాస్యాలూ, అపహాస్యాలూ,కోపాలూతాపాలూ, ఆదర్శాలూ, మూఢనమ్మకాలూ అన్నీ..అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ తరహా చిత్రానికి ఒక రకంగా మంచిచేస్తే మరొరకంగా చెరుపుచేసే అవకాశమూ ఉంది.

నటీనటుల్లో ప్రముఖపాత్రధారిగా శ్రేయాస్ తల్పడే నటన అభినందనీయం. ఒకవైపు అమాయకత్వం, మరోవైపు అతితెలివి, ఇంకో కోణంలో పెళ్ళైన పిల్లను ప్రేమిస్తూ, తన భర్త తిరిగిరాకూడదని కోరుకునే దురాశ, భయంతో తప్పుని తప్పనిసరి పరిస్థితుల్లో చేసే చేతకానితనం. మనసుకు మంచి అనిపిస్తే తెగించి చేసే సాహసం. ఇలా చాలా పార్శ్వాల్ని అలవోకగా చెసాడు. ముఖ్యంగా తను చేసిన తప్పుని తెలుసుకున్న క్షణంలో శేయాస్ చూపిన నటన గొప్పగొప్ప నటులకు తీసిపోనట్లుంది. ఇక్బాల్ సినిమాతో తెరమీదికొచ్చిన ఈ నటుడు సినీరంగంలో మరిన్ని ఎత్తులకు చెరగలడనిపించకమానదు. కమలగా అమృతా రావు చాలా restrained గా నటించింది. తన సహజ నటన చూస్తే, బాగా కష్టపడి పాత్ర తీరుల్ని అర్థం చేసుకున్న పరిణితి కనిపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎలక్షన్లో నిలబడే కొజ్జా పాత్రలో రవి ఝంకాల్ నటన. సాధారణంగా చిన్నాచితకా పాత్రల్లొ కనిపించే ఈ నటుడు ఈ చిత్రంలో తన విశ్వరూపం చూపించాడని చెప్పుకోవచ్చు. తనపై దాడిజరిగిన తరువాత, “మేము మాత్రం ఈ భగవంతుని సృష్టికామా?” అని ప్రశ్నించే దృశ్యంలో కళ్ళనీళ్ళు తెప్పించాడు.

యశ్ పాల్ శర్మకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండైతే, ఇలాఅరుణ్, దివ్యాదత్తా పాత్రలు సరదగా ఉన్నాయి.సుబేదార్ పాత్ర చేసిన నటుడి పేరుతెలీదుగానీ, చక్కగా ఇమిడిపొయాడు. అచలా సచ్దేవా, రవికిశన్ ప్రేమకథ అక్కడక్కడా కొంచెం అనవసరం అనిపించినా, నటన ఫరవాలేదు. బాగా ఇంకా చిన్నచిన్న పాత్రల్లో చేసిన అందరు నటులూ తమతమ పాత్రలకు అనుగుణంగా నటనని ప్రదర్శించారు.

ఈ చిత్రంలోని రెండు యుగళగీతాలు ఖచ్చితంగా అనవసరం. బహుశా, చిత్రం నిడివి పెంచడానికో లేక కొంచెమైనా కమర్షియల్ హంగులా ఇలా అద్దాలనో చేసిన ప్రయత్నం వల్ల అవి సినిమాలోకి వచ్చిపడినట్లున్నాయి. నేపధ్యసంగీతం, రెండు నేపధ్యగీతాలు బహుచక్కగా అమరి కథను రక్తికట్టించడంలో సఫలమయ్యాయి. శాంతనూ మొయిత్ర సంగీతం మెలోడీ ప్రధానంగా ఉండి, ఇంపుగా ఉంది. అనవసరం అనుకున్న పాటలు కూడా వనడానికి బానే ఉన్నాయి.

సాంకేతికపరంగా చిత్రానికి హైలైట్ మాటలు. రచయిత అశోక్ మిశ్రా తనకలం బలం చూపించాడని చెప్పుకోవచ్చు. మానవసంబంధాలనుంచీ, రాజకీయ కామెంటరీ వరకూ అన్నీ చక్కగా తన మాటల్లో కూర్చాడు. మొన్నమొన్నటి వరకూ నేను మధ్యప్రదేశ్ లో ఉన్నాను కాబట్టి కథాప్రదేశం మధ్యప్రదేశ్ అనేది వారి మాటల్లో దొర్లే మైహర్, సత్నా, రీవా,బాందోఘడ్ వంటి ప్రదేశాల refrences విని, అర్థమైపోయి, కొంచెం ఎక్కువగా ఆనందించాను. ఈ ప్రదేశాల గురించి ఎవరికీ అర్థం కాకపోయినా పెద్దగా వచ్చేనష్టం లేదుగనక, అందరూ సరిసమానంగా ఈ సినిమాని చూసి ఆనందించొచ్చు.

దర్శకుడిగా ఒక story teller గా శ్యాంబెనగల్ ని భారతదేశంలోని అత్యుత్తముల్లో ఒకడిగా మనం గుర్తిస్తాము. కానీ, ఈ సినిమా చూసిన తరువాత, ఒక కొత్త దర్శకుడు నిజాయితీగా తీసిన చిత్రంగా అనిపించిందేతప్ప ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ చిత్రంలాగా అనిపించలేదు. అదినా ఎక్పెక్టేషన్ లోపమా లేక సినిమా కథాకథనంలోని సింప్లిసిటీవలన నాకు అలా అనిపించిందా అనేది ఇప్పటికీ తెలిసిరాలేదు.

ఏదిఏమైనా, ఇది ఒక చూడదగ్గ మంచి చిత్రం. వారాంతరంలో మన ధియేటర్లలో జొరబడే చెత్తకన్నా, ఈ గుర్రంబ్బండి ప్రయాణానికి తయారవ్వడం అన్నివిధాలా శ్రేయస్కరం. కాబట్టి, వెనువెంఠనే అడ్వాంస్ బుకింగ్ నంబరుకు ఫోన్ చేసి మీ టికెట్టు కన్ఫర్మ్ చేసుకోండి.

23 Comments
 1. సుజాత October 1, 2008 /
 2. Anil October 1, 2008 /
 3. sujata October 2, 2008 /
 4. నిషిగంధ October 2, 2008 /
 5. Chetana October 2, 2008 /
 6. RAMESH October 4, 2008 /
 7. సౌమ్య October 11, 2008 /
 8. pranava October 12, 2008 /
 9. j.surya prakash October 18, 2008 /
 10. j.surya prakash October 18, 2008 /
 11. శంకర్ October 18, 2008 /
 12. srikanth October 18, 2008 /
 13. కొత్తపాళీ October 20, 2008 /
 14. కొత్తపాళీ September 1, 2010 /
 15. శారద September 2, 2010 /