Menu

W.

దర్శకత్వం : ఆలివర్ స్టోన్.
రచన: స్టాన్లీ వైసర్
నిర్మాతలు: మోర్టిజ్ బోర్మన్, జోన్ కిలిక్, బిల్ బ్లక్, ఆలివర్ స్టోన్
నటన : జాష్ బ్రోలిన్, ఎలిజబెత్ బాంక్స్, జేమ్స క్రామ్ వెల్, ఎల్లన్ బర్ స్టన్ తదితరులు.
విడుదల: 17 అక్టొబరు 2008

ప్రపంచంలో చాలా మంది బుద్ధిమంతులకి జార్జ్ బుష్ అంటే మంట. అందులో నేనూ ఒకణ్ణి. బుష్ ద్వేషుల్లో ముందు వరసలో వుండే వాళ్ళల్లో ముందుండేవాడు ఆలివర్ స్టోన్. ఆయన గురించి తెలియని వాళ్ళకి, ఆలివర్ స్టోన్ లిబరల్ / వామపక్ష రాజకీయ వాది. అమెరికా రాజకీయ పరిభాషలో దానర్ధం డెమెక్రటిక్ పార్టీ సానుభూతిపరుడు / కార్యకర్త అని. ప్రతి ఎన్నికలలోనూ డెమెక్రటిక్ అభర్ధులకి భారీగా విరాళాలు యిచ్చిన వాడు. యుద్ధ వ్యతిరేకి. అలాంటి వాడు బుష్ మీద సినిమా తీస్తున్నాడంటే, అదీ ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్ చేసి తీస్తున్నాడంటే క్రిందటి ఎన్నికల ముందు రిలీజ్ అయిన మైకల్ మోర్ సినిమాలాగా బుష్ మీద సెటైర్ లు వుంటాయనీ వాటిని చూసి ఆనందిద్దామని వెళ్ళాను. కానీ యిది మైకల్ మోర్ సినిమాలాంటిది కాదు. గొప్ప తెలివి తేటలో, చదువో, ఉద్యమ నేపథ్యమో, వ్యాపారంలో నౌపుణ్యమో ఏమీ లేని ఒక మనిషి, మప్ఫై సంవత్సరాలు పైగా రికామీగా తాగుతూ తిరిగి, ఎందులోను విజయవంతం అవని ఒక గొప్పింటి అబ్బాయి, ప్రెసిడెంట్ కొడుకూ, ఎలా యింత పెద్ద స్థాయికి ఎదిగి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడిగా అయ్యాడో, అతన్ని నడిపించిన శక్తులు ఎలాంటివో పరిశీలించడం స్టోన్ లక్ష్యంగా కనపిస్తుంది. ఆ పని ఆయన బుష్ పట్ల సానుభూతిపూర్వకంగానే చేసాడనే అనిపించింది.

జాష్ బ్రోలిన్ జార్జ్ బుష్ గా నటించిన ఈ సినిమాలో ప్రధానంగా మూడు అంకాలు వున్నాయి, ఎందులోను విజయవంతం కానీ బుష్ యవ్వన జీవితం, తండ్రి చాటునుంచి ఎదిగి ఆయనకన్న పెద్దవాడవ్వలన్న ఆయన తీవ్ర ఆకాంక్ష, అంతవాడై, ఇరాక్ ని ఆక్రమించడం. ఈ కథంతా ఆలివర్ స్టోన్ తన అద్భుతమైన కథన శిల్ప నైపుణ్యంతో, ఎడిటింగ్ ప్రజ్ఞతో రెండు గంటల ఐదునిమిషాల నిడివిలో ఆసక్తికరంగా 30 మిలియన్ల బడ్జట్ తో నిర్మించి చూపించాడు. లార్ బుష్ పాత్ర ధరించిన ఎలిజబెత్ బాంక్స్ ఆ పాత్రకి సరిగ్గా నప్పారు. తెలివితేటలు, ‘క్లాస్’ వున్న లారా ప్రేమ బుష్ జీవితంలో ఒక మలుపు. ఆమె అంతకుముందు బుష్ తిరిగిన స్త్రీల వంటి స్త్రీ కారు.

ప్రెసిడెంట్ గా బుష్ పాత్ర ఈ సినిమాలో ఇరాక్ ఆక్రమణ వరకే పరిమితం. ఆక్రమణ కోసమూ, తరువాతా జరిగే చర్చల్లో బుష్, ఆయన చుట్టు వున్న డిక్ చైనీ, రమ్స్ ఫీల్డ్, కొండలీసా రైస్, కొలిన్ పావెల్ మొదలైన పాత్రల మధ్య జరిగే డ్రామాలో ఆ ఆక్రమణకి బుష్ ని నడించిన శక్తులు వాటి అవసరాలు చూపిస్తాడు. ఆ సీన్ లలో కొంత డాక్టర్ స్ట్రేంజ్ లవ్ ప్రభావం కనబడుతుంది. డిక్ చైనీ, కార్ల రోస్ ని మేకప్ వల్లో, లైటింగ్ తోనో వాళ్ళ మొహాల్లో కొంత దెయ్యం కళ చూపిస్తాడు. అలాగే కాండలిసా రైస్, ఆమె పాత్ర పట్ల ఏమాత్రం సానుభూతి కలగదు. ఈ చర్చల్లో, ఆ తరవాత కొంత మానవీయంగా, లాజికల్ గా ప్రవర్తించిన ఒకే ఒక పాత్రగా మనకి పావెల్ ని చూపిస్తాడు. యుద్ధం అయిపోయిన తరువాత జరిగిన మీటింగ్ లో – అందరూ ‘పై’ తింటున్న సీన్ లో – సైనికులకు మద్దతుగా వ్యక్తిగతమైన త్యాగంగా తీపి తినడం మానేసిన బుష్, పెద్ద ముక్కలు తింటున్న రమ్స్ ఫీల్డ్, చైనీ, నోట్లో ముక్క మింగలేకపోతున్న పావెల్ తో ఈ యుద్ధం ఫలితాలు ఎవరికో సూచిస్తాడు ఆలివర్ స్టోన్.

సినిమా చివరలో ఒక కల సీన్ తో ఆలివర్ స్టోన్ బుష్ మీద తన వ్యాఖ్యని చాలా జీనియస్ గా చొప్పిస్తాడు. ఆ కలలో బుష్ తండ్రి బుష్, కొడుకు బుష్ ని ద్వంద యుద్ధానికి పిలుస్తాడు – ఒకప్పుడు కొడుకు తాగి తండ్రని యుద్ధానికి పిలిచినట్టు. అప్పడు ‘ఇంత ఎదిగినా, నేను నీ కొడుకైనందుకు నువ్వ గర్వపడవా’ అని చిన్న బుష్ పెద్ద బుష్ ని అడిగినప్పుడు, ఆయన, బుష్ మొదటి సారి ఎన్నిక అవడానికి ఫ్లోరిడా ఓట్ల లెక్కింపులో తను, తనవాళ్ళూ చేసిన సహాయం గురించి చెప్తూ ‘రెండు వందల ఏళ్ళగా బుష్ కుటుంబం కష్టపడి సంపాదించిన పేరంతా మంటగలిపావు,’ అంటాడు.

నాకనిపించింది, ఒక మాటలో, ఈ సినిమా, ఆయన అభిప్రాయాలతో ఏ మాత్రం ఏకీభవించని, నిజాయితీపరుడైన ఒక కళాకారుడు తీసిన జార్జ్ బుష్ పోట్రైట్ – బుష్ బట్టలు విప్పి, ‘హార్డ్ లైటింగ్’తో తీసిన పోట్రైట్. చాలా మటుకు షాడోస్ అన్ని బుష్ పక్కల నిలబడ్డ డిక్ చైనీ, కాండలీసా రైస్, కార్ల్ రోస్ మీద పడ్డాయి. సీరియస్ సినిమా మీద ఆసక్తి వున్నవాళ్ళు చూడాల్సిన సినిమా, నాలాంటి ఆలివర్ స్టోన్ అభిమానులు ఈపాటికి చూసేసే వుంటారు.

–రమణ
8 Comments
  1. అబ్రకదబ్ర October 28, 2008 /
  2. ఉమాశంకర్ October 28, 2008 /
  3. రమణ October 29, 2008 /