Menu

అ .. ఇ .. మీ .. మూడు తెలుగు సినిమాలు!

అనసూయ

ఇదీ మంత్రా ఇంచుమించు ఒకేసారి విడుదలయ్యాయి అనుకుంటా. మంత్రా గురించి నా అభిప్రాయం ఇక్కడ చదివే ఉంటారు. మొదటి అరగంట చూసి, వార్నీ, అనసూయ దానికంటే చాలా బెటరు అనుకున్నా. తొందర్లోనే తెలిసింది ఇదీ తలకాయ నొప్పేనని. కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా చాలా బాగా తీసి ఉండొచ్చు. భూమిక ఉన్నంతలో బానే చేసింది కానీ, ఆఖరి అరగంట ఏక్షను దృశ్యాల్లో ఆమె అస్సలు నప్పలేదు. హంతకుడి నేపథ్య కథ, తద్వారా అతను ఇప్పుడు హత్యలు చేస్తుండడం కథ అల్లిక మంచి పకడ్బందీగా వచ్చింది. హంతకుడిగా దర్శకుడు రవిబాబు చాలా బాగా చేశాడు. డయలాగ్ డెలివరీ కూడా బావుంది. అబ్బాసు పూర్తిగా వేస్టు. అసలు వోలుమొత్తం పోలీస్ డిపార్ట్మెంటే వేస్టు. హాస్యం కోసం పోలీసుల్ని వెర్రివెంగళాయలుగా చాలా సినిమాల్లో చూపించారు. హీరో ఒక పోలీసాఫీసరయి ఉండి, అందునా చాలా ఉన్నత శిక్షణ పొందిన కమేండో టాస్క్ ఫోర్సుపోలీసుల్ని పిచ్చి వెధవల్లాగా చూపించడం అస్సలు అర్ధం కాలేదు. సినిమా మధ్యలో సుమారు ఒక గంట, సాగతీత మరియూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్ప, కథకీ కథనానికీ ఉపయోగ పడింది లేదు. ఒక సస్పెన్సు సినిమాని క్రిస్ప్ గా తియ్యడం మనవాళ్ళు ఎప్పటికి నేర్చుకుంటారో? అన్నట్టు భూమిక పెంచుకునే చిన్న పాప భలే క్యూట్ గా ఉంది.

ఇదీసంగతి

టైటిల్సులో దర్శకుడు చంద్ర సిద్ధార్థ అని చదివి ఈ పేరెక్కడో విన్నట్టుందే అని బుర్ర గోక్కుంటున్నా. గూగులమ్మ చెప్పింది. ఆనలుగురు సృష్టికర్త మనోడేనని. కనిపెట్టి ఉండాల్సిన మనిషే. ఇతనిదే మధుమాసం కూడా చూశాను ఈ మధ్య .. అంత బాగా గుర్తు లేదు కానీ ఏదో బానే ఉన్నట్టు గుర్తు. పాత్రికేయుడు, వ్యంగ్య రచయిత కేయెన్వై పతంజలి నవలిక ఆధారంగా తీసిన సినిమా ఇది. నవలిక చదివేప్పుడే ఇవేవీ నమ్మశక్యం కాని సంఘటనలు అనిపిస్తూ ఉంటుంది కానీ, ఒక్కఒక్క పాత్రనీ రచయిత మలిచే తీరు .. నిజమేనేమో అనిపిస్తుంది. కానీ సినిమాలో ఆ వెసులుబాటు లేక (పాత్రలు ఎక్కువ అవడం వల్ల కూడానూ) ఏ ఒక్క పాత్రా నమ్మదగినట్టు ఉండదు. కథంతా అతుకుల బొంతగా, పొంతన లేకుండా ఉంటుంది. అదీ కాక, సినిమాకి ఏదో సస్పెన్సు లాంటిది కావాలని నవల్లో లెని అనవసరపు ట్విస్టులు పెట్టారు. అదసలు మరీ ఘోరం. రాజకీయులు, పోలీసులు, పాత్రికేయులు – అందరూ దొంగలే అన్నది బేసిక్ కాన్‌సెప్టు. ఈ లిస్టుకి వ్యాపారస్తుల్ని కూడా కలిపి అప్పుడెప్పుడోనే జానేభీదో యారో మహా గొప్పగా తీశారు. ఈ సినిమా చాలా బోరు కొట్టేసింది. ఐనా కొన్ని కొన్ని దృశ్యాలు బాగా తీశాడని ఒప్పుకోవాలి. వయసు మీరుతున్న టాబు అంగ ప్రదర్శన ఘోరంగా ఉన్నా, మొదటి పాటలో బాగా చేసింది. తన సోలో సీన్లలో కూడా బాగా చేసింది. కొన్ని సర్రియల్ ఎలిమెంట్స్ ని బాగా క్రియేటివ్ గా ఉపయోగించాడు, కానీ అసలు కథ, పాత్రలు, స్క్రీన్‌ప్లే లో పస లేక తుస్సుమంది. ప్రధాని, ఆఫీసరాన్‌ స్పెషల్డ్యూటీ ద్వయంగా కోట, యెమ్మెస్ ద్వయం మంచి టైమింగ్ తో నటించారు కానీ మొత్తమ్మీద అదీ పెద్దగా రాణించలేదు.

మీ శ్రేయోభిలాషి

ఈ సినిమా కూడా బహూశా బాగానే పాతబడి పోయిందనుకుంటా. ఆ నలుగురు లాగా జీవితం సందేశం టైపు సినిమా. ఎటొచ్చీ సబ్జక్టూ, ట్రీట్మెంటూ అంత నమ్మేట్టుగా లేకపోవడంతో ఆనలుగురు లో ఉన్న పస దీనిలో పూర్తిగా లోపించింది. నా ఉద్దేశంలో ఫెయిలైన సినిమా నిర్మాతగా నరేష్ చాలా బాగా చేశాడు (అరగంట సినిమా గడిచేదాకా అతను నరేషని పోల్చుకోలేక పోయాను!) రాజేంద్ర ప్రసాద్ గెటప్ అదీ బావుంది గానీ మూస నటనే ప్రదర్శించాడు. ఇక ఏదో ఒక కారణం వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయానికొచ్చి అతనితో ఈ బస్సు యాత్రకి బయల్దేరే జనాభా అంతా (నా శ్లేషని మన్నించండి) అస్సలు జీవం లేకుండా ఉన్నారు. కాదు కాదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు బానే చేశారు. ఆ పాత్రలే అలా జీవం లేకుండా పడికట్టు ముక్కల్లా ఉన్నై. మరీ అన్ని పాత్రలు అయ్యేప్పటికి ఆ పాత్రల నేపథ్యాలు పటిష్టంగా ఎస్టాబ్లిష్ చేసే వీలు లేక, మరీ అంటకత్తెరేసినట్టుగా ఉన్నై ఆ పాత్రలు. ఆత్మహత్యకి ప్రేరేపించే కారణం ఏదైనా, దానికి దారితీసే పరిణామంలో మనిషి తీవ్రమైన మానసిక వేదనకి గురవుతాడు. ఇదొక మానసిక జబ్బు. మేనిక్ డిప్రెషన్‌ అంటారు. దీన్ని సరైన ట్రీట్మెంటుతో నయం చెయ్యొచ్చు. మరీ టెంపరు మనుషులైతే తప్ప, మామూలు మనుషు లెవరూ, ఏం కష్టం ఎదురైనా, ఉన్నపళంగా చచ్చిపోవాలని ప్రయత్నం చెయ్యరు. ఈ నేపథ్యాన్ని పూర్తిగా విస్మరించి, మీ కష్టాలు నిజంగా చచ్చిపోవాల్సినంత కష్టాలు కావూ, అని నీతుల్చెప్పి, జనాలకి బతుకు మీద తీపి పుట్టించేట్టుగా చూపించడం చాలా పేలవంగా ఉంది.

ఐతే ఈ అనుకోలుని మనం అంగీకరించే పక్షంలో సినిమా చాలా మట్టుకు బానే తీశాడని చెప్పొచ్చు. కొన్ని కొన్ని దృశ్యాలైతే గొంతు చిక్కబట్టేంత కదిలించేలా ఉన్నై .. ఉదా. సరిహద్దులో మరణించిన సైనికుడి శవాన్ని కుటుంబానికి అప్పగించడం, తుంటిదాకా కాళ్ళు తెగిపోయిన యువకుడు కొడితే కొట్టాలిరా కి డాన్సు చెయ్యడం, ఇత్యాది. బ్రహ్మానందం కాషాయ కామెడీ, నాజర్ ఆలీల పోలీసు కామెడీ, చివర్లో బ్రేకులు ఫేలయిన బస్సులాంటి సస్పెన్సు బొత్తిగా అనవసరం. వీళ్ళ సామూహిక ఆత్మహత్య గురించి టీవీ కథనాలు ఈ రోజుల్లో టీవీ మీడియా విపరీతపు పోకడలకి కొంచెం అద్దం పడుతోంది, కథ నడవడానికి కూడా అక్కడక్కడా సహకరించింది.

ఒక సన్నివేశం మాత్రం నన్ను చాలా ఆకట్టుకుంది. రావికొండల్రావు, రాధాబాయి వృద్ధ దంపతులు. మొగుడు ఒదిలేసిన స్త్రీకి వాంతులవుతుంటే, ఆమెని గమనించుకోమని రావికొండలావు రాధాబాయికి సైగ చేస్తాడు. ఆ ఒక్క క్షణంలో వాళ్ళిద్దరి మధ్య, ఒక్క మాట లేకుండా, ఒక జీవిత సారమైన సంభాషణ నడుస్తుంది. అదీ నటన అంటే!

17 Comments
 1. Sowmya October 8, 2008 /
 2. కొత్తపాళీ October 8, 2008 /
 3. Sowmya October 8, 2008 /
 4. chandramouli October 8, 2008 /
 5. కొత్తపాళీ October 8, 2008 /
 6. Sree October 8, 2008 /
 7. శంకర్ October 8, 2008 /
 8. కొత్తపాళీ October 9, 2008 /
 9. Sowmya October 9, 2008 /
 10. శంకర్ October 9, 2008 /
 11. chandramouli October 9, 2008 /
 12. కొత్తపాళీ October 10, 2008 /