Menu

The Bridge on River Kwai

The Bridge on river Kwaiఈ సినిమా సంగతేంటి?

వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక పాత్రల చుట్టూ తిరిగే అతి కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. ఈ కథ 1943లో రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో సాగుతుంది. రెండవ ప్రపంచ యుద్ద దుష్టత్రయంలో ఒకటైన జపాన్ దేశం కొంత మంది బ్రిటీష్ సైనికులను బంధీలుగా పట్టుకొంటుంది. అ యుద్దఖైదీల చేత, కూలీల చేత బర్మాకు 415కి.మి రైల్వే లైను నిర్మించ తలపెడుతుంది. ఈ రైలు రవాణా మార్గం కనక పూర్తైతే, బర్మాను ఆక్రమించడం జపాన్ దేశానికి తేలిక అవుతుంది. కానీ నిర్మాణ మార్గ మధ్యలో క్యాయ్ (Kwai లేదా Khwae Yai) అనే నది అడ్డం వస్తుంది. ఈ నది పైన వంతెన నిర్మాణం చుట్టే కథ కథలోని పాత్రలు అల్లుకొని ఉంటాయ్.

దర్శకుని గురించి రెండు మాటలు

సాధరణంగా అనిపించే ఇలాంటి కథను అసాధారణంగా చిత్రీకరించి శభాష్ అనిపించుకోవడంలోనే ఉంది దర్శకుని ప్రతిభ.  ఒక్కసారి ఆస్కార్ బహుమతి పొందితేనే జీవితం సాఫల్యమైనట్లు భావిస్తారు చిత్రరంగంలో ఉన్న కళాకారులు, అలాంటిది David Lean తొమ్మిది సార్లు అస్కార్ బహుమతికి నామినేషన్ పొంది, రెండు సార్లు ఉత్తమ దర్శకునిగా బహుమతి గెలిచాడు. తన సినిమల ద్వారా Steven Spielberg , Martin ScorseseGeorge Lucas లాంటి దర్శక దిగ్గజాలకే స్పూర్తిగా నిలచిన గొప్ప ప్రతిభాశాలి. 1942 నుండి 1982 వరకు చిత్రరంగంలో ఉండి కేవలం పదహారు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. అందులో Lawrence of Arabia, The Bridge on the River Kwai, Doctor Zhivago, Ryan’s Daughter మరియు A Passage to India లాంటి సినిమాలు వివిధ “శతాబ్దపు100 అతి గొప్ప సినిమాల జాబితా”లలో చోటు సంపాదించుకున్నాయి.  British Film Institute వారి ప్రపంచంలోని పది అతిగొప్ప దర్శకుల జాబితాలో David Leanది తొమ్మిదవ స్థానం. ఒక మనిషి ప్రతిభకు ఇంతకన్నా ఉదాహరణలు ఏమి కావాలి?

కథ

ఈ కథ నేను పైన చెప్పినట్లుగా 1943 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ద కాలంలో జపనీయులు పట్టుకున్న యుద్ద ఖైదీల క్యాంపులోమొదలు అవుతుంది. ఇద్దరు యుద్ద ఖైదీలు శవాలను పూడుస్తూంటారు. ఈ ఇద్దర్లో ఒక్కడు అమెరికా నావీ కమాండర్ Shears. ఇంతలో అక్కడికి వచ్చిన జపాన్ సైనికుడుకి Shears సిగరెట్ లైటర్ లంచంగా ఇచ్చి తమ ఇద్దరి పేర్లు రోగుల జాబితాలో ఉండేటట్లు చూసుకుంటాడు. రోగుల చేత కఠినమైన పన్లు చేయించక, గమ్మునా గుడిశలో ఉంచి తిండి పెడుతూంటారన్న మాట. బ్రిటీష్ యుద్దఖైదీలకు నాయకుడు Colonel Nicholson ఐతే, ఆ బ్రిటీష్ యుద్దఖైదీల క్యాంపుకు కమాండర్ Colonel Saito. ఒక రోజు ఉదయం బ్రిటీష్ యుద్ద ఖైదీలు అందరినీ పిలిపించి Colonel Saito తాము Bangkok, Thailand మరియు Rangoon, Burma కలుపుతూ నిర్మించే రైలు మర్గంలో భాగంగా క్వాయ్ నదిపైన వంతెన నిర్మించ తలపెట్టామని, ఆ పనికి ఆ క్యాంపులో ఉన్న యుద్దఖైదీలందరినీ నియోగిస్తున్నట్లు, పని మరుసటి రోజే మొదలవుతున్నట్లు తెలుపుతాడు. కానీ ఖైదీలకు నాయకత్వం వహిస్తున్న Colonel Nicholson ఖైదీలుగా ఉన్న కొందరు ఆఫీసర్లు కూలి పని చెయ్యరని, Geneva Conventions అందుకు అనుమతిని ఇస్తుందని Colonel Saitoకు చెబుతాడు. కావాలంటే చూసుకోమని పుస్తకం కూడ చేతిలో పెడతాడు. Nicholson సమాధానానికి మండిన Saito ఆ పుస్తకాన్ని నలిపి ముఖాన కొడతాడు. ఐనా మన హీరోలో(అదేనండీ Nicholson)  ఏ విధమైన రియాక్షనూ ఉండదు. మూడు లెక్క పెట్టే లోపు పనిలోని వెళ్ళకపోతే నిన్నూ, నీ ఆఫీసర్లను కాల్చిపారేస్తానంటాడు Saito. అనా మనోడిలో అదురు, బెదురు, కుదుపు గట్రా ఏమీ ఉండవు. మూడు అని లెక్క పెట్టి కల్పులు జరిపేలోపే, ఆ క్యాంపులోని బంధీలకు వైద్యం చేసే బ్రిటీష్ ఆర్మీ వైద్యుడు Major Clipton, Saitoకు అడ్డుపడతాడు. తను కాల్పులు జరిపి తప్పిచ్చుకోలేడని, విచారణలో సాక్ష్యం చెప్పడానికి ఆ పక్కనే గుడిశలో ఉన్న రోగులు ఉన్నారని చెబుతాడు. దాంతో Saito బ్రిటీష్ ఆఫీసర్ల పైన కాల్పులు జరుపక, వారి మెడలు వంచి వంతెన నిర్మాణంలో కూలి పని చేయించటానికి మరో ఎత్తు వేస్తాడు. Colonel Nicholsonను “The Oven” లేదా “Punishment Cage” అనబడే కుక్కల బోనులాంటి అతి చిన్న బోనులో వేస్తారు. మిగిలిన ఆఫీసర్లను కూడా ఇంకొక Ovenలో కుక్కుతారు. తాము కూలిపనికి ఒప్పుకునేంత వరకు ఈ బోనులో పడి ఉండాల్సిందే అని Saito తెగేసి చెబుతాడు. మన హీరో Colonel Nicholson మాత్రం తక్కువ తిన్నాడా, బోనులో రోజులు గడుస్తూ తిండిలేక  డొక్క మాడిపోతున్నా కూడా రూలు రూలేనని తను మరియు తమ ఆఫీసర్లు కూలి పనికి ఒప్పుకునేది లేదని చెబుతాడు. వైద్యుడు Major Clipton మన హీరోగారికి “ఆ తొక్కలో రూల్సు లెద్దు…అవి ప్రాణం కన్నా ఎక్కువేమిషి” అని నచ్చజెప్పాలని చూసినా Nicholson మాత్రం తను Saito బెదిరింపులకు తలొగ్గేది లేదని, నియమాలను ఎట్టి పరిస్థితుల్లో మీరనని మొండిగా చెబుతాడు. మరో పక్క బ్రిడ్జి పనులు చాలా చాలా ఆలస్యంగా నడుస్తుంటాయ్. చెప్పిన తేదీ లోపల పనిపూర్తి కాకపోతే, Saito ఆత్మహత్య (seppuku) చేసుకోవలసిన పరిస్థుతులు ఉంటాయి. ఆఫీసర్లను దారిలో తెచ్చుకొని వారి చేత పని చేయించి, అనుకున్న రోజు లోపే బ్రిడ్జిని పూర్తి చెయ్యాలని Saito వత్తిడికి గురౌతూంటాడు. బ్రిటీష్ ఆఫీసర్లని బలవంతంగా తన దారిలోకి తెచ్చుకోలేనని గ్రహించి, ఆఖరికి క్షమాభిక్ష పేరుతో అందరినీ వదిలిస్తాడు సైటో. తరుణోపాయాన్ని చెప్పమని వారిని అడుగుతాడు. ఆఫీసర్లు కూలి పని చెయ్యకుండా తమ పంతం నెగ్గించుకున్న Colonel Nicholson, అసాధ్యంగా మారిన ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి, బ్రిటీషర్ల సత్తా జపనీయులకు చూపాలని భావిస్తాడు. బ్రిడ్జి నిర్మాణం పట్ల  Nicholson చూపిస్తున్న అత్యంత శ్రద్ద చూసి మిగతా ఖైదీలకు మతిపోతుంది. “ఏంటి…నిజంగా వంతెన మంచిగా..గట్టిగా..బలంగా కట్టేదామనే. శత్రువుకు ఇంత సాయం చేద్దామన్న దూల ఎందుకో” అని సందేహ పడుతూంటారు. వైద్యుడు Major Clipton ఐతే నేరుగా Nicholsonనే అడిగేస్తాడు ఈ విషయాన్ని. ఏ పనిలేక పరాయి వాళ్ళ క్రింద బానిసలుగా బ్రతకడం కంటే, చేతిలో ఏదో ఒక పనితో వేళకు ఇంత తిండి తింటూ గౌరవంగా బ్రతకడం మేలని సెలవిస్తాడు Nicholson.

బ్రిడ్జి నిర్మాణం జోరుగా సాగుతూండగా కమాండర్ Shears అక్కడి నుండి తప్పించుకొని బయటపడతాడు. (ఈ Shears ఎవరు అని అడక్కండి, కథ మొదలెట్టేటప్పుడు మొదట ఈ శాల్తీనే పరిచయం చేశా మీకు) గాయాలతో ఉన్న అతన్నిశ్రీలంకలోని కొలంబో ఆస్పత్రిలో వైద్యం చేసి, అతను కోలుకోంగానే British Special Forcesకు చెందిన Major Warden, Shearsను కలిసి తను మరో ముగ్గరితో కలిసి మళ్ళీ వెనక్కు వెళ్ళి Kwai బ్రిడ్జి మీద జరుగుతున్న నిర్మాణాన్ని కూల్చివేయాలని చెబుతాడు. సరే అని నలుగురు బృందంగా బయలుదేరి, సరిగ్గా బ్రిడ్జి మీద మొదటి రైలు దాటుతున్నప్పుడే వంతెన పేల్చివేయాలని నిర్ణయిస్తారు.

ఒక పక్క శత్రువుల కోసం నిర్మిస్తున్న వంతెన నిర్మాణాన్ని ప్రాతిష్టాత్మకంగా తీసుకున్న Nicholson, మరో పక్క దాని కూల్చివెయ్యాలని పట్టుదలతో వస్తున్న Shears, ఇంకో పక్క బ్రిడ్జి నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తైతే ప్రాణం దక్కించుకోవచ్చన్న Saito, వీళ్ళందరూ కాక వీరు చేసే పిచ్చి పనులకు సాక్ష్యంగా ఉన్న వైద్యుడు Clipton. సినిమా ముగింపులో వీళ్ళలో ఎవరు నెగ్గారు, వంతెన పూర్తి అయ్యిందా, ఐతే వంతెనకు చివర ఏమి జరిగింది, ఏ ఏ పాత్రలు ఎందుకోసం చచ్చాయి, ఏ పాత్రలు బ్రతికాయి, అసలు ముగింపు ఏమిటి అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే. ఎందుకంటే అంత మంచి క్లైమాక్సుని మీకు విడమరిచి చెప్పి పాపం ప్యాక్ చేసుకోలేను.

సినిమాలోని పాత్రల గురించి

ఈ సినిమాలోని పాత్రల గురించి టూకీగా చెప్పాలంటే, వైద్యుని పాత్ర సినిమా చిట్ట చివరిలో పలికే “Madness…Madness..Madness” సరైనది.  తన దేశం మీద యుద్దం చేస్తున్న జపాన్ దేశానికి వంతెన నిర్మించి ఇస్తున్న Nicholsonది పిచ్చి, అత్యంత కీలకమైన వంతెన నిర్మాణాన్ని శత్రువుకు అప్పగించడం Saitoది పిచ్చి, ఒక సారి నరకం లాంటి క్యాంపు నుంచి బయటపడ్డ తరువాత కూడా మళ్ళీ తిరిగి అక్కడికే రావటం Shearsది పిచ్చి. మొత్తానికి ఆసక్తికరమైన పాత్రలు.

టెక్నీషియన్ల ప్రతిభ

 • సంగీతం సందర్భోచితంగా బాగుంది. ముఖ్యంగా బ్రిటీష్ సైనికులందరూ మార్చి ఫాస్ట్ చేస్తూ ఈల వేస్తూ పాడే Colonel Bogey March బాగుంది
 • సినిమా నిడివి దాదాపు 3గంటలు ఉండి, ఎన్నో పాత్రలు వచ్చి పోతూ, రెండు వేర్వేరు కథలు ఒకే సారి నడుస్తూ ఉన్నా ఎక్కడ కూడా అనవసర దృశ్యాలు రాకుండా సినిమా అంతా బాగా నడిచిందంటే, ఎడిటర్ Peter Taylorను మెచ్చుకొని తీరవలసిందే. అందుకే దీనికి అస్కార్ ఇచ్చారు.
 • ఈ సినిమాకు అసలు సిసలు హైలైట్ మరియు హీరో సినిమాటోగ్రఫి. Jack Hildyard సినిమాటోగ్రఫి చాలా చాలా బాగుంది.

కొన్ని విశేషాలు

 • ఈ సినిమా రచయిత Pierre Boulle ఇదే పేరుతో వ్రాసిన నవల ఆధారంగా తీసినది
 • ఈ నవల కూడా నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా వ్రాసినదే
 • అసలు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వ్రాసింది Carl Foreman మరియు Michael Wilson. కానీ పేర్లలో మాత్రం Pierre Boulle అని వేసుకున్నారు. Foreman మీద అప్పటికే హాలీవుడ్డు రచయితల నిషేదం ఉండటంతో అలా చేయవలసి వచ్చింది. విషాదం ఏమిటంటే, ఇంగ్లీషు అక్షరం ముక్క వ్రాయలేని Pierre Boulle ఈ సినిమాకు ఉత్తమ స్క్రీన్ రచయితగా ఆస్కార్ గెలుచుకున్నాడు.
 • అప్పటి వరకు బ్రిటన్‌లో మాత్రమే సినిమాలు తీసిన David Leanకు ఇది మొదటి హాలీవుడ్డు సినిమా. మొదటి హాలీవుడ్డు సినిమాకే ఏడు ఆస్కార్లు తెచ్చిపెట్టాడన్నమాట
 • ఐదు మంది ప్రముఖ హాలీవుడ్డు దర్శకులు ఈ సినిమాను తిరస్కరించిన తరువాత, David Lean కు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పంగించారట
 • కీలకమైన Colonel Nicholson పాత్రను Alec Guinness కామెడీగా నటించాలని చూస్తే, David Lean మాత్రం ఆ పాత్రను సీరియస్‌గా మలిచాడు. ఏదైతేనేం ఈ పాత్రలో నటించినందుకు Alec Guinnessను ఉత్తమ నటుడిగా ఆస్కార్ దక్కింది.
 • Alec Guinness తను నటించిన సన్నివేశాల్లో, “the Oven” నుంచి Saito కార్యాలయానికి నడిచే సన్నివేశం అత్యుత్తమమైనదిగా పేర్కొంటాడు. అలా నడిచేటప్పుడు, తన కొడుకు మాథ్యూస్ పోలియో వ్యాధి నుండి కోలుకొనేటప్పుడు నడిచిన నడక ప్రభావం ఉందని చెప్పాడు.
 • Alec Guinnessకు తనకు అవార్డు వస్తుందని నమ్మకం లేక అసలు అస్కార్ ఫంక్షన్‌కే హాజరు కాలేదంట.
 • ఈ సినిమా చిత్ర దర్శకుడు David Lean నదిలో మునిగి, తరువాత ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు
 • ఈ సినిమా చాలా భాగం శ్రీలంకా (అప్పుడు సిలోన్)లో చిత్రీకరించారు.
 • ఈ సినిమాకు ఐన ఖర్చు $2,800,000
 • ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన సొమ్ము దాదాపు $22,000,000
 • 68 యేళ్ళ వయసులో కఠినమైన Colonel Saitoగా నటించిన జపాన్ నటుడు Sessue Hayakawa, హాలీవుడ్డు చిత్రంలో నటించిన మొట్టమొదటి ఆసియా కళాకారుడు. 1914 నుంచే ఇతను హాలీవుడ్డు చిత్రాల్లో నటించడం ప్రారంభించాడు.
 • సినిమాకే తలమానికంగా ఉన్న వంతెనను పేల్చే దృశ్యాలను మార్చి 11, 1957 తేదీన చిత్రీకరించారు
 • ఆ వంతెన నుండి నదిలోకి పడిపొయ్యే రైలు, ఒకప్పుడు మన భారతదేశంలోని ఒక మహారాజుకు చెందినదంట.
 • పేలుడు దృశ్యాలను ఐదు కెమెరాల సహాయంతో చిత్రీకరించారు. ఒకటి పాడైనా, బాగా రాకపోయినా ఇంకోటి ఉంటుంది కదా.
 • ప్రఖ్యాత దర్శకుడు Steven Spielberg తన సినిమా Indiana Jones and the Temple of Doomను, David Leanకు నివాళిగా అతను శ్రీలంకలో Kwai సినిమా చిత్రీకరణ జరిపిన చోటే జరిపాడు.

–నవీన్ గార్ల

10 Comments
 1. sujata October 13, 2008 /
 2. narasimha rao mallina October 13, 2008 /
 3. ravi October 14, 2008 /
 4. నవీన్ గార్ల October 14, 2008 /
 5. Kiran October 15, 2008 /