Menu

సుబ్రమణ్యపురం (2008)

ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ.

కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు, వీళ్ళలో ఒకరికి ఎదిరింట్లోని అమ్మాయితో మూగ ప్రేమ, ఈ యువకులని ఊళ్ళోని పెద్దలు వాళ్ళ అవసరానికి ఉపయోగించుకున్న వైనం, స్నేహాలూ, మోసాలూ – వెరసి సుబ్రమణ్యపురం సినిమా. ఆ ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు సినిమాలో హీరోలు. ఒకరు నూతన నటుడు జై, మరొకరు ఈ సినిమా దర్శకుడు శశికుమార్. మూడోవాడు కమెడియన్ కంజ కురుప్పు. ఆ ఎదిరింటి అమ్మాయి మన “కలర్స్” స్వాతి. 1980 తో మొదలై, 2008 వద్ద అంతమౌతుంది కథ. కథలోనూ, కథనంలోనూ కూడా ఈ చిత్రం బాగుందనిపించింది. కథనంలో మంచి పట్టు ఉండింది. ఉత్కంఠభరితంగా సాగింది.

నటీనటులందరూ బాగా చేసారు. నాకు శశికుమార్ నటన అందరికంటే నచ్చింది. కంజ కురుప్పు ని చూడగానే నవ్వొస్తుంది అతని ముఖ కవళికలకి. ఈ సినిమాలో కథా గమనంతో పాత్ర స్వభావం మారినా కూడా అతను బాగా చేశాడు. స్వాతికి ఎక్కువ డైలాగులు లేకపోయినా కళ్ళలోనూ, నవ్వులలోనూ వీలైనంత మాట్లాడింది. వీళ్ళే కాక సినిమాలో కనబడ్డ ప్రతిపాత్రా చాలా సహజంగా ఉన్నట్లనిపించింది. 1980 కాలం నాటి సెట్లు – ఉదాహరణకి ఆ తలుపులుండే టీవీసెట్లు, హీరోల హెయిర్ స్టయిళ్ళూ, సైకిళ్ళు, పాత తరం స్కూటర్ వంటివి చూస్తూ ఉంటే, అంతా ఎనభైలనే తలపించడం ద్వారా వాస్తవికంగా అనిపించాయి కథకి. జై మరణించే సన్నివేశం, దాని ముందు నడిచిన డ్రామా చాలా బాగా తీశారు. అలాగే, శశికుమార్ ను కంజ కురుప్పు మోసం చేసాడని తెలిపే సన్నివేశం కూడా. ప్రతీదీ వివరంగా చెప్పరు కానీ, మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఈ సినిమాలో 🙂 నేపథ్య సంగీతం చాలా నచ్చింది నాకు. ముఖ్యంగా పైన చెప్పిన రెండు సన్నివేశాలూ వస్తున్నప్పుడు వచ్చే సంగీతం. “కంగళ్ ఇరండాళ్” పాట కూడా బాగుంది.

మొత్తానికి, చూడదగ్గ సినిమా. షరామామూలుగా, ఒక సంవత్సరంలో తమిళంలో ఇన్ని భిన్నాంశాలతో కథలొస్తున్నప్పుడు మన సినిమాలకెందుకు ఒకటో రెండో తప్ప వెరైటి ఉండవు అనిపించేసింది మళ్ళీ. ఆ గోల పక్కన పెడితే, ఆసక్తికరమైన సినిమా. నాకు ఐతే కాస్త మొదటి పావుగంటా అర్థం అయీ అవనట్లు అనిపించింది కానీ, తర్వాత నుండి సినిమా బాగా నచ్చింది. అయితే, తమిళ నేటివిటీ ఉంది పూర్తిగా. కనుక, మరి యూనివర్సల్ అపీల్ ఉండదేమో. 🙂 నేనైతే “పరుత్తివీరన్” లాగానే ఇది కూడా పక్కా “తమిళ” సినిమా అనే అంటాను.

17 Comments
 1. teja October 12, 2008 /
 2. Sowmya October 13, 2008 /
 3. Venkat October 13, 2008 /
 4. Chetana October 14, 2008 /
 5. Chetana October 15, 2008 /
 6. Sowmya October 15, 2008 /
 7. veebee October 19, 2008 /
 8. Venkat November 14, 2008 /
 9. Sowmya April 28, 2009 /
 10. Venkat Uppaluri April 29, 2009 /
 11. కొత్తపాళీ April 29, 2009 /