Menu

సితార

అందరికి నమస్కారం. నవతరంగం చదవడం ఈ మధ్యనే మొదలు పెట్టాను. పాత సంచికలతో సహా చదువుతున్నాను. ఎనభయ్యో దశకంలో విడుదలై ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు గెలుచుకున్న ‘సితార’ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ ప్రయత్నం.

‘మంచు పల్లకి’ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తానె రాసుకున్న ‘మహల్ లో కోకిల’ అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన ‘సితార’ సినిమా  1984 లో విడుదలై ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా కేంద్ర ప్రభుత్వ అవార్డు ను అందుకుంది. ‘వెన్నెల్లో గోదారి అందం’ పాటకు గాను గాయని ఎస్ జానకి కి జాతీయ అవార్డు లభించింది.

సితార సినిమా షూటింగ్ స్టిల్-Picture Courtesy:Vamsy.Net

సితార సినిమా షూటింగ్ స్టిల్-Picture Courtesy:Vamsy.Net

కథ విషయానికి వస్తే, ఫ్రీలాన్స్ photographer తిలక్ (శుభలేఖ సుధాకర్) రైలు లో ప్రయాణం చేస్తూ, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నఓ అమ్మాయి (భానుప్రియ) కి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్ కి ఆమెని తన భార్య సితార గా పరిచయం చేస్తాడు. ఆమెకి ఎవరు లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆమె  మోడలింగ్ అవకాశాలు ఇస్తాడు. తన గతాన్ని గురించి అడగరడనే కండిషన్ పై అతనితో కలిసి పని చేస్తుంటుంది సితార. ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారుతుంది. డబ్బు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, తన గతాన్ని తల్చుకుని బాధపడే సితార కి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు తిలక్.

గోదావరి తీరంలోని ఓ పల్లెటూళ్ళో ‘రాజుగారు’ గా పిలవబడే చందర్ (శరత్ బాబు) చెల్లెలు కోకిల. పాడుబడ్డ భవంతిలో ఆ అన్నచెల్లెల్లు మాత్రమే ఉంటూ ఉంటారు. ఆస్తులు పాయినా, పరువు కి ప్రాణం ఇచ్చే చందర్, ఓ కోర్ట్ కేసు గెలవడం ద్వార ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రాణివాసం లో ఉండే కోకిలకి బయటి ప్రపంచం తెలీదు. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం, నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కోర్ట్ కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు. అదే సమయంలో ఊళ్లోకి వచ్చిన పగటి వేషగాళ్ళ నృత్యాలను కోటలోంచి రహస్యమ్గా చూస్తూ ఉంటుంది కోకిల. ఆ బృందం లో రాజు (సుమన్) ని ఇష్టపడుతుంది. రాజుతో ఆమె పరిచయం ఊరి జాతరకి రహస్యం గా అతనితో కలిసి వెళ్ళడం వరకు వస్తుంది. కోర్ట్ కేసు ఓడిపోవడం తో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు.

తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్. తిలక్ కి సితార తన గతాన్ని చెప్పడం విన్న తిలక్ స్నేహితుడైన ఓ జర్నలిస్టు (ఏడిద శ్రీరామ్) ఆమె కథని ఓ పుస్తకం గా ప్రచురిస్తాడు. తన గతం అందరికి తెలియడానికి తిలక్ కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది. ఐతే ఆ పుస్తకం కారణంగా రాజు బ్రతికే ఉన్నదని తిలక్ కి తెలుస్తుంది. జర్నలిస్టు సహాయం తో ఆటను రాజు ని వెతికి, ఆత్మహత్య చేసుకోబోతున్న సితార తో కలిపి ఆమెని రక్షించడం తో సినిమా ముగుస్తుంది.

వంశీ దర్శకత్వ ప్రతిభతో పటు, ఇళయరాజా సంగీతం, భానుప్రియ నటన ఈ సినిమా ని ఓ మాస్టర్ పీస్ గా మలచాయి. సితార/కోకిల గా భానుప్రియ అసమాన నటనని ప్రదర్శించింది. పాడుబడిన కోటలో ఒంటరితనంతో బాధపడే కోకిలగా, తన గతం అందరికి తెలిసాక ఆమె ప్రదర్శించే నటన ఎన్న దగినది. ఇళయరాజా సంగీతంలో పాటలన్నీ ఈనాటికీ వినబడుతూనే ఉంటాయి.

‘కిన్నెరసాని వచిందమ్మవెన్నెల పైటేసి’ పాటను మొదట ‘సాగర సంగమం’ సినిమా కోసం రికార్డు చేసారు. ఆ సినిమా లో ఉపయోగించలేక పాదంతో అదే సంస్థ నిర్మించిన ‘సితార’ లో ఆ పాటను ఉపయోగించారు. ఈ సినిమా లో నాకు ఇష్టమైన పాట ‘కు కు కు.’ ఈ పాట చిత్రీకరణ లో చివరి నిమిషం లో మార్పులు చేసారట వంశీ. ఇందుకు కారణం పాటలో నర్తించే జూనియర్ ఆర్టిస్ట్ లు కొంచం వయసు మళ్ళిన వాళ్ళు కావడమే. షూటింగ్ ఆపటం ఇష్టం లేక, వారి ముఖాలు చూపకుండా కేవలం చేతులు మాత్రం చూపుతూ పాటని చిత్రీకరించారు. ఈ పాటలో వచ్చే ‘నువ్వేలే రాజ్యం ఉంది ఈ నలుగు దిక్కులలో’ అనే బిట్ నాకు చాలా నచ్చుతుంది.ఇక ‘వెన్నెల్లో గోదారి అందం’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.

అంతవరకు సాఫీ గా సాగిన కథ, క్లైమాక్స్ కి వచేసరికి బాగా వేగం అందుకుంటుంది. క్లైమాక్స్ కొంచం సాగదీసినట్టు ఉంటుంది. ఐతే, వంశీ ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా abrupt ending అనిపించదు. నవలలను సినిమాలుగా తీసినప్పుడు, ఎన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ నవల పాఠకులకి సినిమా పట్ల అసంతృప్తి కలగడం సహజం. ‘సితార’ ను ఇందుకు మినహింపుగా చెప్పొచు. నవల రచయితే సినిమా దర్శకుడు కావడం ఇక్కడి సౌలభ్యం. ‘మహల్ లో కోకిల’ (ఇటీవలే పునర్ ముద్రణ పొందింది) ని ‘సితార’ గా మార్చడం లో వంశీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని పాత్రలను తగ్గించడం తో మెలోడ్రామా ను కూడా కొంతవరకు తగ్గించాడు. కథనం, ముగింపులో ఉన్నా వ్యత్యాసాల కారణంగా నవల, సినిమా వేటికవే భిన్నంగా కనబడతాయి. ఈ సినిమా తీసేనాటికి దర్శకుడి వయసు పాతికేళ్ళ లోపే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

గోదావరి పట్ల వంశీ కి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణ లో వంశీ మార్కు ను చూడవచ్చు.  ‘కోకిల’ ని పంజరంలో చిలుక లా చూపే symbolic షాట్స్, చందర్ అసహాయతను చూపే సన్నివేసాలు, సిని తార గతం పట్ల జనానికి ఉండే ఆసక్తిని చూపించే షాట్స్.. ఇలా ఎన్నో. గడిచిన పాతికేళ్ళలో కేవలం 22 సినిమాలు (కొన్ని మంచివి, మరి కొన్ని చెత్తవి) మాత్రమే తీసిన వంశీకి, తనకంటూ చాలమంది అభిమానులు ఉన్నారు.

– మురళి

21 Comments
 1. shree October 31, 2008 /
 2. murali October 31, 2008 /
 3. Falling Angel October 31, 2008 /
 4. శంకర్ October 31, 2008 /
 5. murali October 31, 2008 /
 6. రిషి October 31, 2008 /
 7. Sree October 31, 2008 /
 8. మంజుల November 1, 2008 /
 9. మురళి November 1, 2008 /
 10. అబ్రకదబ్ర November 1, 2008 /
 11. sharma November 4, 2008 /
 12. Bhaskar Ramaraju December 11, 2008 /
 13. మురళి December 12, 2008 /
 14. sreenivas May 3, 2013 /
 15. Krishna March 10, 2014 /