Menu

సాలూరు రాజేశ్వర రావు- ర’సాలూరు’ రాజే’స్వర’ రావు

“మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన ఆయన శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను అసంఖ్యాకంగా మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది చాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత ధోరణులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్ర లేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.

ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాల సరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలిత గీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల”…”చల్ల గాలిలో యమునా తటిలో..” “ఓ యాత్రికుడా..” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్థి కిందే లెక్క! స్త్రీ స్వరపు పోలికలు కలిగిన సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.

సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్త పుంతలు తొక్కి, మెలొడీకి పెద్ద పీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లు గా నిలబెట్టింది.తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.

సినిమా పాటలకు బాణుల్ని సమకూర్చే విషయంలో రాగాలతో ఆయన అలవోకగా ఆడుకున్నారు. రాగ లక్షణాన్ని కూడా మార్చేసి దుఃఖాన్ని స్ఫురింపజేసే రాగంలో నృత్య గీతాలకు కూడా బాణీలను కట్టారు. అలాంటి అచంచల ప్రయోగాల్లో మచ్చుకు కొన్ని….

నిజానికి మోహన రాగానికి శాస్త్రీయ సంగీతపరంగా విస్తృతమైన పరిథి లేదనే చెప్పాలి. అది ఆయన అభిమాన రాగం! మధుర మధుర
మోహన లో ఆయన కూర్చిన కొన్ని పాటలు…
మీ తీయని రేయి(విప్రనారాయణ)
తెలుసుకొనవె యువతి,(మిస్సమ్మ)
ధీర సమీరే(జయదేవ)
మదిలో వీణలు మోగే(ఆత్మీయులు)
వినిపించని రాగాలే(చదువుకున్న అమ్మాయిలు) అన్నీ వైవిధ్యమైన పాటలే!

హిందోళం లో రాజేశ్వర రావు గారు చేసిన పగలే వెన్నెల (పూజాఫలం), ఆల్ టైం హిట్ గా నిలిచిన భావగీతం. ఇదే రాగంలో కూర్చిన శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం)పాటేమో భక్తి రసంతో పాటు వీర రసం కూడా ఉట్టిపడే గీతం.

రాగమాలిక(వివిధ రాగాలను వివిధ చరణాల్లో ఒకే పాటలో కూర్చడం) లో స్వర రచన చేయడం క్లిష్టమైన పని! మల్లీశ్వరి లోని ‘ఆకాశవీధిలో ‘ ఎవరు మర్చిపోగలరు?

జయదేవ చిత్రంలోని దశావతారాలను వర్ణించే అష్టపది “జయ జగదీశ హరే “, “పాడెద నీ నామమే”(సినిమా పేరు తెలీదు) ,
రాధాకృష్ణ సినిమాలోని “నా పలుకే కీర్తనా” పాటలు ఆయన రాగమాలికలకు కొన్ని ఉదాహరణలు!

ఇక వీణ రాజేశ్వర్రావు గారి వీణ పాటలంటే ప్రాణం ఇవ్వని అభిమానులెవరు?
పాడవేల రాధికా
పాడమని నన్నడగవలెనా
మదిలో వీణలు మ్రోగే,
పాడెద నీ నామమే…ఇవన్నీ ఆయన వీణా నాదాలే!

యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వర రావు గారు ఇచ్చిన హిట్లు అసంఖ్యాకం!
ప్రతి తెలుగు గొంతులో ఎప్పుడో ఒకప్పుడు పలికే పాట “మనసున మల్లెల మాలలూగెనే” సావిరహే తవదీనా,రారా నా సామి రారా (విప్రనారాయణ)
చెలికాడు నిన్నే(కులగోత్రాలు)
జగమే మారినది(దేశద్రోహులు)
చిగురులు వేసిన కలలన్నీ(పూలరంగడు)
కళ్లలో పెళ్ళి పందిరి(ఆత్మీయులు)

ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలే!
అలాగే పాశ్చాత్య సంగీత ప్రేరణతో వాటిని మక్కీకి మక్కీ దించకుండా “ఎక్కడో విన్నట్టుంది” అన్నట్టుగా వాటిని “తెలుగైజ్” చేసి కూర్చిన పాటల్లో కొన్ని..
హలో హలో ఓ అమ్మాయి(ఇద్దరు మిత్రులు)
స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు(ఆత్మీయులు)
ఈ రేయి తీయనిది (చిట్టి చెల్లెలు)

రాజేశ్వర రావు గారు ఈ పాటలు కూర్చారనో, ఆయన ఇంతటి ప్రతిభాశాలి అనో,ఆయన పాటల్లో ఇవి మంచివి అనో చెప్పడం పెద్ద సాహసమే ! అక్టోబర్ 25 న ఆయన వర్థంతి సందర్భంగా ఒక్క సారి ఆ పాటల మాధుర్యాన్ని తల్చుకునే చిన్ని ప్రయత్నమే ఇది.
అందుకే ఆయన్ని ర ‘సాలూరు ‘ రాజేశ్వర రావు అన్నా, రాజే”స్వర” రావు అన్నా, అది ఆయనకే చెల్లు!

-సుజాత (మనసులో మాట)

13 Comments
  1. pappu October 25, 2008 / Reply
  2. మాలతి October 26, 2008 / Reply
  3. పరుచూరి శ్రీనివాస్ October 26, 2008 / Reply
  4. Priya Iyengar October 27, 2008 / Reply
  5. Priya Iyengar October 27, 2008 / Reply
  6. పరుచూరి శ్రీనివాస్ October 27, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *