Menu

రాజకీయ చిత్రాలు

రాజకీయం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కాని ఆ భాగమే మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది. నియంత్రిస్తున్నది. అంతటి ప్రధానమైన రాజకీయాంశాల్ని, అత్యంత ప్రభావవంతమైన సినిమా రంగం ఏ మేరకు ప్రతిబింబించిందని ప్రశ్నించుకుంటే సమాధానం నిరాశాజనకంగా వుంటుంది. సజీవ రాజకీయ సమస్యలపైన గానీ, రాజకీయ తాత్వికతలపైన గానీ దృష్టి సారించి నిర్మితమైన భారతీయ చలనచిత్రాలు అతి స్వల్పమే.

వాస్తవానికి సర్వవ్యాపితమైన రాజకీయమూ, సర్వజనావళికి చేరగలిగిన సినిమా అందరికీ సంబంధించిన అంశాలు. కానీ నాటి నుంచి నేటి దాకా భారతీయ సినిమా మౌళికమైన రాజకీయాంశాల్ని తడమకుండా పై పై విషయాలపైనా లేదా కేవలం వినోద ప్రధానమైన అంశాలపైనా తన దృష్టిని కేంద్రీకరించి ముందుకు సాగుతున్నది. సినిమాల్లో రాజకీయం అంటే అది కేవలం రూప ప్రధానమైనదిగా ఉండకూడదు.అది నిర్ధిష్టంగా కళాత్మకమైన అర్థ వివరణతో దృశ్యరూపం సంతరించుకోవాల్సి ఉంటుంది. కేవలం బహిరంగ చర్చలా కాకుండా సారాంశాన్ని గ్రహించిన స్ఫూర్తితో చలన చిత్రావిష్కారం జరగాల్సి ఉంటుంది. భారతీయ సినిమాలు ప్రధానంగా ఇద్దరు మనుషుల మధ్య , రెండు కుటుంబాల మధ్య జరిగే సంఘటనలపైనా, సంఘర్షణలపైనా ఆధారపడి నిర్మితమైనవే. కానీ రెండు భిన్న సమూహాల మధ్య సంబంధ, సందర్భాల్ని, రెండు వర్గాల మధ్య సంఘర్షణనీ ఇతివృత్తాలుగా తీసుకుని కళాత్మకంగా నిర్మితమైన చిత్రాలు కొన్ని మాత్రమే వచ్చాయి. అంతర్జాతీయ సినిమాను పరిశీలిస్తే, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన యుద్ధాలు, పెల్లుబికిన విప్లవాలు, రాజకీయ ఆర్థిక తాత్విక సిద్ధాంతాలు తదితరమైన అనేక విషయాల్ని తీసుకుని నిర్మించబడ్ద సినిమాలు మనకు కనిపిస్తాయి. ఆయా సంఘటనల ప్రభావంలో అనేకానేక రాజకీయ చిత్రాలు వచ్చాయి. చలనచిత్ర చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. లెనిన్ మహాశయుడు బూర్జువా సినిమా గురించి మాట్లాడుతూ ఎంటర్‍టైన్‍మెంట్ కావవి, డైవర్‍టైన్‍మెంట్ చిత్రాలు అన్నారు. అంటే ఆ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ప్రధాన సమస్యల్నించి పక్కదోవ పట్టిస్తాయని వివరించారు. ఆయనే మరోచోట సామాజిక మార్పు గమనంలో సినిమా అత్యంత ప్రతిభావంతమైన సాధనమని కూడా విశ్లేషించారు.

ప్రపంచ వ్యాప్తంగా మహోన్నత చలన చిత్రకారుడిగా పేరున్న ఐజెన్‍స్టీన్ నిర్మించిన ’బ్యాటిల్ షిప్ పొటెమ్‍కిన్’ అక్టోబర్ విప్లవానికి అవతారిక లాగా వచ్చింది. ఇక గొదార్డ్ చిత్రాలు బహిరంగ సిద్ధాంతపర చర్చలతో తెరమీదకి వచ్చాయి. పోలాండ్ లో వాజ్దా గొప్పవైన రాజకీయ చిత్రాల్ని నిర్మించారు. హంగేరిలో జోల్టన్ ఫాబ్రి ద్వితీయ ప్రపంచ సంగ్రామాన్ని నేపథ్యంగా తీసుకును సినిమాల పరంపరను సృష్టించారు. వీరందరి మధ్య ఐజెన్ స్టీన్ రెవల్యూషనరీ చలన చిత్రాలు నిర్మించడంలో నాటినుంచి నేటి దాలా దీపధారుడే. ఒక కోస్టాగావ్రిస్ లాంటి దర్శకులు ’జడ్’, ’మిస్సింగ్’ లాంటి క్రైం చిత్రాల్లో కూడా రాజకీయ విమర్శను ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

మన భారతీయ సినిమా రంగానికి సంబంధించి రాజకీయ చిత్రాల ఒరవడిని పరిశీలిస్తే మొత్తంగా ఒక శూన్యమైన దృశ్యమే గోచరిస్తుంది. మన దేశ చరిత్రలో అత్యంత ప్రధానమైన స్వాతంత్ర్య పోరాటాన్ని, దాని పూర్వాపరాల్ని, పోరాటానంతర పరిస్థుతుల్ని సెల్యులాయి పై చిత్రించడంలోనే మనవాళ్లింకా విజయం సాధించలేదు. స్వాతంత్ర్య పోరాట క్రమాల్ని సినిమాలుగా మలిచేందుకు చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రయత్నాలు జరగలేదు. అయితే ఎం.ఎస్. సత్యు నిర్మించిన ’గరం హవా’ అందుకు మినహాయింపు. దేశ విభజన కాలం నాటి వాస్తవ స్థితిని గొప్ప దృశ్యకావ్యంలా మనముందుంచారు సత్యు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాట ఇతివృత్తాలతో ట్రైన్ టు పాకిస్తాన్, హేరామ్ తదితర చిత్రాలు మంచి ప్రయత్నాలుగా వెలుగు చూశాయి.

మొత్తం మీద ఆ నాటి నుంచి ఈ నాటి దాకా భారతీయ ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) సినిమా ఎపుడూ రాజకీయాల్ని గానీ, చరిత్రను గానీ అంత సీరియస్ గా పట్టించుకోలేదు. సమాంతర సినిమా రంగంలో కొన్ని మంచి ప్రయత్నాలు జరిగాయి. కాని ఈ రెంటినీ మించి భారతీయ డాక్యుమెంటరీలు అత్యంత ప్రతిభతో కళాత్మకంగా నిర్మితమయ్యాయి. ముఖ్యంగా తపన్ సిన్హా, సుహాసినీ మూలే, ఆనంద్ పట్వర్థన్ లు వర్తమాన రాజకీయాలపైన ప్రభావవంతమైన డాక్యుమెంటరీలు నిర్మించారు.

ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా రూపుదిద్దుకున్న నవ్య సినిమా భారతీయ సమాజాన్ని, దాన్ని నడిపించే రాజకీయాల్ని పట్టించుకుని అనేక మంచి సినిమాల్ని అందించింది. తొలిరోజుల్లో బెంగాల్ లో రిత్విక్ ఘటక్ తన చిత్రాల్లో దేశ విభజన, దాని పర్యవసనాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని గొప్ప సినిమాలు నిర్మించారు. ఆయన ’కోమల్ గాంధార్’ దేశ విభజన పర్యవసానంగా ప్రజల సామాజిక మానసిక స్థితుల్లో ఏర్పడ్డ మార్పులపై నిర్మించబడింది. ఇక ’మేఘదాక తార’ బెంగాల్ విభజన ఓ మధ్యతరగత్ కుటుంబంపైన ఏ రకమైన ప్రభావం చూపించిందో వివరిస్తుంది. వీటిలో రాజకీయాల చర్చ నేరుగా వుండదు. కానీ రాజకీయ నిర్ణయాల పర్యవసానాలు అత్యంత నిజాయితీతో ఆవిష్కృతమవుతాయి. ఆ తర్వాత మృణాల్ సేన్ తన చిత్రాల్లో రాజకీయ అంశాల్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. ఆయన తనదైన విలక్షణ కోణం నుంచి రాజకీయాల్ని చర్చించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా మధ్య తరగతి జీవుల ఆలోచన, ఆచరణ, వాటి మధ్య అంతరాల్ని వివరిస్తూ రాజకీయ స్థితిని చర్చకు తెస్తారు. ’కలకత్తా-71′ , ’ఇంటర్వ్యూ’, ’పదాతిక్’ చిత్రాల్లో మృణాల్ సేన్ ఆనాటి బెంగాలీల రాజకీయ దృక్పథాన్ని సామాజిక వాస్తవికతల్ని చూపించారు. ట్రైలాజీగా నిర్మితమైన ఆ చిత్రాలు విలక్షణతను సంతరించుకున్నాయి. తర్వాత సేన్ ’ఏక్ దిన్ ప్రతి దిన్’ చిత్రంలో మధ్య తరగతి జన జీవితాల్లో వేళ్ళూనికుని ఉన్న పితృస్వామ్య భావజాలాన్ని ఆవిష్కరిస్తారు. ఉద్యోగం చేసే ఒక అమ్మాయి సాయంత్రం ఇల్లు చేరాల్సిన వేళకి చేరకపోవడంతో ఆ కుటుంబంలోనూ, వారి చుట్టుపక్కల ఉన్న సమాజంలోనూ వచ్చిన స్పందనలూ, వాటి వెనుక దాగిన రాజకీయాలూ, ’ఏక్ దిన్ ప్రతి దిన్’ లో ముందుకు వస్తాయి. అలాగే ’ఏక్ దిన్ అచానక్’ లాంటి పలు ఇతర చిత్రాల్లో ఆయన రాజకీయ దృక్పథం గల ఇతివృత్తాల్ని డీల్ చేసారు. ఇక బెంగాల్ లోనే బుద్ధదేవ్ దాస్ గుప్తా (గృహయుద్ధ, నీమ్ అన్న పూర్ణ, అంధగలీ), గౌతంఘోష్ (దఖల్, పార్), ఉత్పలేందు చక్రవర్తి (చోక్) లాంటి పలువురు దర్శకులు రాజకీయ దృక్పథంతో చిత్రాలు నిర్మించారు.

శ్యాం బెనగల్ తన తొలి చిత్రాల్లో భారతీయ సమాజంలోను కుల, వర్గ రాజకీయాల్ని చర్చకు పెట్టారు. ముఖ్యంగా అంకుర్, నిశాంత్ లాంటి చిత్రాల్లో గ్రామీణ ఫ్యూడల్ రాజకీయాల్ని విశ్లేషించారు. తర్వాత ’ఆరోహణ్’ లాంటి చిత్రాలు కార్మికవర్గ జనజీవితాల్ని పట్టించుకున్నాయి. అలాగే ఆయన నిర్మించిన ’మమ్మో’, ’సూరజ్ కా సాత్వా ఘోడా’ లాంటి చిత్రాల్లో నిశితమైన రాజకీయ చర్చను లేవదీశారు. కానీ ఆయన రూపొందించిన ’సమర్’ చిత్రం మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేసే పథకాల ప్రచార చిత్రంలా ఉండి తీవ్రమైన నిరాశను మిగులుస్తుంది. కానీ ఇటీవల ఆయన నిర్మించిన ’మహదేవ్ కా సజ్జన్ పూర్’ సమకాలీన పరిస్థుతులకి అద్దం పట్టారు. శ్యాం బెనగల్ తన చిత్రాల్లో రాజకీయ సమస్యల్ని చర్చకు పెడతారే కాని వాటి పరిష్కారాల వైపు మాత్రం ప్రయాణం చేయరు. అది ఆయన అనుసరించే విలక్షణ శైలి. అలాగే గోవింద్ నిహలానీ తన మొట్ట మొదటి చిత్రం ’ఆక్రోశ్’ నుంచి ఇటివల ’దేహం’ వరకూ తన చిత్రాల్లో రాజకీయాల్నే చర్చిస్తూ వచ్చారు. ఆయన నిర్మించిన ’ద్రోహ్ కాల్’ లాంటి చిత్రాలు వివాదాస్పదమైన అంశాల్ని చర్చకు తెచ్చాయి. ఇంకా షాజీ కరుణ్ (పిరవి), జబ్బార్ పటేల్ (సింహాసన్), జాన్ అబ్రహం (అమ్మ అరియన్) లాంటి దర్శకులు తమ చిత్రాల్లో రాజకీయాల్ని చర్చించే ప్రయత్నం చేశారు.

ఇలా భారతీయ చలన చిత్ర రంగంలో రాజకీయ అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకునో లేక రాజకీయ ప్రతిస్పందనలైన అంశాల్ని తీసుకునో కొన్ని చిత్రాలు మాత్రమే వచ్చాయి. నిజానికి రాజకీయ చిత్రాలు నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన దృష్టికోణమూ, విలక్షణమైన కళాత్మకతా ఉండి తీరాలి. మనుషుల మధ్య, మనిషికీ సమాజానికీ మధ్య ఉండే ప్రేమ, సంఘర్షణల్ని సరైన కోణంలోంచి అర్థం చేసుకుని సెల్యులాయిడ్ పై ఆవిష్కరించే ప్రతిభ కావాలి. వాటిని ప్రతీకాత్మకంగానూ, సూటిగానూ దృశ్యమానం చేయగలగాలి. వీటన్నింటిని మించి సమాజాన్ని సరిగా అర్థం చేసుకుని సినిమాని నిర్మించగలగాలి. మన చిత్ర దర్శకులు తూర్పు యూరప్ దేశాల్లోనూ, లాటిన్ అమెరికన్ దేశాల్లోనూ ఉన్న అండర్ గ్రౌండ్ సినిమా ఒరవడిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికి తోడు మన చలనచిత్రకారుల్లో భావనాపరంగానూ, సాంకేతికపరంగానూ, దార్శనికంానూ అమితమైన పురోగతి వస్తే తప్ప మన చిత్రసీమలో విస్తృతమైన మార్పును ఆశించలేం. వర్తమాన వాస్తవ రాజకీయ అంశాల్ని స్పృశిస్తూ నిర్మితమయ్యే ప్రగతిశీలమైన చలన చిత్రాల్ని మనం చూడలేం. ఆ క్రమంలో మన చలన చిత్రకారులు పురోగమించాలని కోరుకుందాం.

One Response
  1. ravi October 11, 2008 /