Menu

Paul Newman – ఒక నివాళి

1974 లో ’ది టవరింగ్ ఇన్ఫెర్నో’  సినిమా ద్వారా మొదటి సారిగా నాకు పాల్ న్యూమన్ పరిచయం కలిగింది. ఈ  సినిమా రొటీన్ హాలీవుడ్ యాక్షన్ అండ్వంచర్, అయినప్పటికీ బాగానే వుంటుంది. ఈ సినిమాలో పాల్ న్యూమన్ ఒక ఆర్కిటెక్ట్ గా ముఖ్య భూమిక పోషిస్తాడు. నిర్మాణంలో జరిగిన లోపంవల్ల ఒక బహుళ అంతస్థు భవంతికి నిప్పంటుకుంటుంది. ఆ మంటలనార్పే ప్రయత్నంలో  Doug Roberts పాత్రలో పాల్ న్యూమన్ ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాలో ఒక సీనుంటుంది. Doug Roberts  ట్వీడ్ జాకెట్ వేసుకుని ఒక కాక్ టైల్ పార్టీలోకి వెళ్తాడు. ఆ పార్టీ కి అతిధ్యం వహిస్తున్న బిల్డర్ James Duncan (William Holden) అది చూసి షాక్ అయ్యి సరైన దుస్తులు ధరించి మాత్రమే పార్టీకి రావాలని, అక్కడ్నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తాడు. విపత్తు పరిస్థుతుల్లో తనకిలాంటి విషయాలు ముఖ్యం కాదని అంటాడు Doug Roberts. ఆ సీన్లో వారి సంభాషణలు:

James Duncan: What I wanted to tell us is that Senator Parker is flying in for the dedication tonight. And he’s almost guaranteed to sign the Urban Renewal Contract. Now do you know what that means? Skyscrapers like this all over the country! You design ‘em, I’ll build ‘em.

Doug Roberts: Don’t you think you’re suffering from an edifice complex?

James Duncan: You’ll never leave.

Doug Roberts: Right after the party – come on downstairs and watch me burn my black tie.

ఒక విధంగా ఈ సినిమాలో Doug Roberts పాత్రను నిజ జీవితంలోని Paul Newman తో పోల్చవచ్చు. రాజీలేని విప్లవ ధోరణితో, తన నమ్మకాలపై నిలబడి, జీవితాన్ని మధించిన వ్యక్తి Paul Newman.

పాల్ న్యూమన్ : 1925-2008

పాల్ న్యూమన్ : 1925-2008

సంప్రదాయానికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చిన విధంగా పనులు చేయడమే పాల్ స్టైల్. హ్యాండ్సమ్ లుక్స్ తో, మంచి పర్సనాలిటీ కలిగిన పాల్ న్యూమన్  కావాలనుకుంటే బోల్డన్ని హలీవుడ్ రొమాంటిక్ సినిమాలలో హీరోగా నటించివుండొచ్చు. కానీ ఆయన పోషించిన చాలా పాత్రలు తిరుగుబాటు ధోరణిలోనో లేదా కరుకైన బాటలోనో నడుస్తాయి. Hud సినిమాలో విలువలకు ప్రాణమిచ్చే తండ్రి పై ఎదురుతిరిగే క్రూరమైన కొడుకు పాత్రలో, Cool Hand Luke లో అవినీతికి ఆలవాలమైన కారాగార వ్యవస్థ పై తిరగబడే నేరస్థుని పాత్ర, Cat on Hot Tin Roof సినిమాలో తన స్నేహితుని ఆత్మహత్యతో కృంగిపోయి తాగుడుకి బానిసై, భార్యను నిర్లక్ష్యం చేసే భర్త పాత్ర, ఇలా దాదాపు అన్ని సినిమాల్లోనూ ఒక వ్యతిరేక భావాలు కల పాత్రలు పోషిస్తూ కూడా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానం కల్పించుకున్నాడు Paul Newman. ఈ సినిమాల్లోనే కాదు The Verdict సినిమాలో లాయర్ పాత్రలోనైనా, The Hustler సినిమాలో ఎలాగైనా తను గొప్ప పూల్ ఆటగాడని నిరూపించుకోవాలనుకునే మొండి పట్టుదలగల పాత్రలోనైనా Paul తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు.

ఈ తిరుగుబాటు ధోరణి ఒక సినిమాల్లోనే కాదు. పాల్ నిజజీవితంలోనూ అంతే. ’హాలీవుడ్ కంపు’ కి దూరంగా Connecticut లోని Westport లో ఒక చిన్న టౌన్లో తన నివాసం ఎర్పరుచుకున్నాడు. మిగిలిన హాలీవుడ్ స్టార్స్ లా జిలుగు వెలుగుల జీవితం గడపకుండా, కుటుంబానికి అంకితమైన జీవితం గడిపేవాడు. The Long, Hot Summer  సినిమా షూటింగ్ లో పరిచయమైన Joanne Woodward ని పెళ్ళాడి (రెండవ వివాహం) ఆఖరి వరకూ ఆమెతోనే కలిసి జీవించాడు. సినీ ప్రపంచంలో సాధారణమైన వివాహేతర సంబంధాల గురించి అడిగినప్పుడు, “ఇంట్లో విందు భోజనం ఉండగా బయటకెళ్ళి ఫలహారాలు తినడమెందుకని” అభిప్రాయపడేవాడు పాల్.

వ్యక్తిగతంగానే కాకుండా సాంఘిక, రాజకీయ పరంగా కూడా తను నమ్మిన విలువల మీదే చివరిదాకా నిలబడ్డాడు పాల్ న్యూమన్. స్వలింగ వివాహాలు, స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో ఆయన తన వంతు కృషి చేశారు. అలాగే వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 1968 ఎన్నికల సమయంలో Richard Nixon కి వ్యతిరేకంగా Eugene Mc Carthy కి ప్రచారం చేసి Nixon’s Enemies List లో ఒకడిగా చేర్చబడ్డాడు. అలా జరగడం గొప్ప గౌరవంగా భావించేవాడు పాల్ న్యూమన్.

1952 లో తన నటనా జీవితాన్ని మొదుపెట్టిన పాల్ న్యూమన్, 1956 లో వచ్చిన ’Somebody Up There Likes Me’ అనే సినిమా ద్వారా తన ’రెబెల్’ పాత్రలకు శ్రీకారం చుట్టారు.  Rocky Graziano అనే బాక్సర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాకీ పాత్రలో నటించాడు పాల్. మొదట్లో ఈ పాత్ర కోసం James Dean ని అనుకొన్నప్పటికీ ఒక కార్ యాక్సిడెంట్ లో ఆయన అకాల మరణం చెందడంతో ఆ పాత్ర పాల్ న్యూమన్ కి లభించింది. అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఒక స్ట్రీట్ గ్యాంగ్ లో చేరి అక్కడ నుంచి జైల్లో పడి, జైలు అధికారులపై తిరగబడి, ఆ తర్వాత సైన్యంలో చేరి అక్కడ్నుంచి పారిపోయి చివరికి ఒక బాక్సర్ గా విజయం సాధించి జీవితాన్ని సార్థకం చేసుకున్న రాకీ పాత్రను అద్భుతంగా పోషించాడు పాల్. ఈ సినిమా తర్వాత రెండేళ్ళకు వచ్చిన ’The Cat on a Hot Tin Roof’ సినిమాలో Brick Pollitt గా మరో rebellious పాత్ర పోషించి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యారు.

1950 లలో వచ్చిన పై రెండు సినిమాలు 1960 లలో పాల్ న్యూమన్ కి మరిన్ని వైవిధ్యమైన పాత్రలను తెచ్చిపెట్టాయి. 1960 లలో సాధారణంగానే అమెరికాలో నెలకొన్న పరిస్థుతుల కారణంగా సామాన్య ప్రజానికం సైతం తిరుగుబాటు ధోరణి అనుసరించారు. ఈ పరిస్థితుల్లో పాల్ న్యూమన్ పోషించిన ’I don’t care a damn’ శైలి పాత్రలతో సులభంగానే ప్రేక్షకులు identify చేసుకోవడంతో 1960-1970 లలో, పాల్ న్యూమన్ ఒక icon గా గుర్తింపబడ్డాడు.

ఈ రోజుల్లోనే (1961) వచ్చిన The Hustler సినిమాలో పాల్ పోషించిన ‘Fast Eddie’ పాత్ర, మరియు ఆ సినిమా క్లైమాక్స్ లో పాల్ ప్రదర్శించిన అద్భుత నటన ఆయన్ని చిరకాలం గుర్తుంచుకునేలా చేసాయి. అలాగే ‘Hud’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర కూడా.మెథడ్ యాక్టర్ గా ప్రసిధ్ధి చెందిన పాల్ న్యూమన్ 1966 లో ’Torn Curtain’ అనే సినిమాలో మొదటిసారిగా ప్రఖ్యాత దర్శకుడు Alfred Hitchcock దర్శకత్వంలో నటించారు. ఈ సినిమాలో హిచ్ కాక్ తో చాలా సందర్భాల్లో తన పాత్ర గురించీ, స్క్ర్రిప్టు గురించి ఏర్పడ్డ వివాదాల కారణంగా హిచ్ కాక్ మరియు న్యూమన్ కలయికలో వచ్చిన మొదటి సినిమానే చివరి సినిమా కూడా అయింది. అయినప్పటికీ ఈ సినిమాలోనూ పాల్ న్యూమన్ చాలా మంచి నటన ప్రదర్శించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే 1969 లో వచ్చిన ’Cool Hand Luke’ మరో ఎత్తు. ఈ సినిమాలో అవినీతిమయమైన జైలు అధికారులపై తిరగబడుతూ, ఎన్నో సార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రతి సారీ విఫలమవుతూనే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే Luke గా ఆయన ప్రదర్శించిన నటన అపూర్వం, అమోఘం.

ఇక 1969 లో వచ్చిన Butch Cassidy and the Sundance Kid సినిమా గురించైతే చెప్పక్కర్లేదు.ఈ సినిమాలో Robert redford తో కలిసి పోటాపోటీగా నటించాడు Paul Newman. ఈ సినిమాలో Katherice Ross తో కలిసి సైకిల్ పై ‘Raindrops keep fallin on my head’ అనే ట్యూన్ తో సాగే సీన్ చలనచిత్ర చరిత్రలో గొప్ప రొమాంటిక్ సీన్లలో ఒకటిగా నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా. 1973 లో మరో సారి ’The Sting’ అనే చిత్రంలో Robert Redford తో కలిసి నటించారు పాల్ న్యూమన్. నేటికీ అత్యుత్తమ Con Movies లో ఒకటిగా భావించబడే ఈ సినిమాలో మరో సారి Redford-Newman లు ఉత్తమ నటన ప్రదర్శించారు. ’12 Angrey Men’ సినిమా రూపొందించిన Sidney Lumet దర్శకత్వంలో వచ్చిన మరో లీగల్ డ్రామా ’The Verdict’ లో Paul Newman పోషించిన న్యాయవాది పాత్రకూడా ఆయన నటనా కౌశల్యం మరువలేనిది.

అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎన్నో సినిమాల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించిన పాల్ న్యూమన్ ఏడు సార్లు ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేట్ అయితే అయ్యాడు కానీ అవార్డు గెలిచించి మాత్రం మార్టిన్ స్కోర్సెజీ దర్శకత్వంలో వచ్చిన ’The Color of Money’ కి మాత్రమే. నిజానికి ఈ సినిమాలో కంటే ఇంకా చాలా సినిమాల్లోఆయన మెరుగైన నటనను ప్రదర్శించారు.

న్యూమన్ ఒక మంచి నటుడే మాత్రమే కాదు, గొప్ప మానవతావాది మరియు ఉదాత్త హృదయుడు. 1982 లో ఈయన స్థాపించిన ‘Newman’s Own’ అనే సంస్థ ద్వారా పలు రకాల వస్తువులను అమ్మగా వచ్చిన లాభాలను ధార్మిక సంస్థలకు అందచేశాడు. ఇప్పటికి ఈ సంస్థ 250 మిలియన్ల డాలర్లకి పైగానే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకి అందచేసింది. ఇది మాత్రమే కాకుండా డ్రగ్స్ కి బానిసలయిన వారికి చికిత్స చేసి సేవలందించే  ’Scott Newman Center’ ను, వ్యాధిగ్రస్తులైన బాలలకు సేవలందించే ’Hole in the Wall Gang Camp’ ను స్థాపించడం ద్వారా ఒక నటుడిగానే కాకుండా మానవతావాదిగా కూడా చరిత్రలో నిలిచిపోతాడు పాల్ న్యూమన్. ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్గ్ క్లూనీ అన్నట్టు “he set the bar very high for actors like us”.

ప్రపంచం యావత్తునీ మంత్రముగ్థుల్ని చేసినా ఆ నీలి నేత్రాలు సెప్టెంబరు 26, 2008 న శాశ్వతంగా మూతబడ్డాయి. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా ఆయన పోషించిన పాత్రల ద్వారా చిరకాలం జీవించే వుంటాడు.

Good bye Mr. Newman, as they say, they don’t make guys like you nowadays.

గమనిక:ఈ వ్యాసం మొదట ఆంగ్లంలో ప్యాశన్ ఫర్ సినమా సైట్లో ప్రచురింపబడింది.  ఆ వ్యాసం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

–రత్నాకర్ సదాస్యుల

తెలుగు అనువాదం: శిద్దారెడ్డి వెంకట్

6 Comments
  1. ravi October 15, 2008 /
  2. shree October 16, 2008 /
  3. ravi October 16, 2008 /