Menu

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 5

21)Still Walking

జపనీస్ సినిమా. ఓజు సినిమా ’The Tokyo Story’ కి ఈ సినిమాకీ కథా కథనంలోనే కాకుండా చాలా విధాలుగా పోలికలున్నాయి. తమ సోదరుని 15 వ వర్ధంతి సందర్భంగా Ryoto మరియు Chinami లు తమ కుటుంబాలతో తన తల్లి దండ్రుల ఇంటికి వస్తారు. ఆ సందర్భంగా ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్ర మూల కథ. టొరంటో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది ఈ సినిమా. తప్పక చూడాల్సిన సినిమా.

22)Wonderful Town

థాయ్ లాండ్ సినిమా. అదిత్య అసారత్ ఈ సినిమాకి దర్శకుడు. ఉద్యోగరీత్యా సముద్రపుటొడ్డున ఉన్న ఒక చిన్న పట్టణానికి వస్తాడు Ton అనే ఒక ఇంజనీర్. అక్కడే ఒక హోటల్ వుంటూ అందులో పని చేసే యువతితో ప్రేమలో పడతాడు. కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. సినిమా సగం వరకూ ఏందుకింత స్లోగా వుందనిపించింది. కానీ ఒక్క సారి ఆ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం (Aftermath of Tsunami) తెలిసాక సినిమాని కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టాను.సునామీ కారణంగా ఏర్పడ్డ పరిస్థుతులు మరో explicit గా చెప్పకుండా చాలా నైపుణ్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. కానీ కథనం చాలా నిదానంగా సాగుతుంది.

23)Hooked

గత సంవత్సరం రెండు మంచి రొమానియా సినిమాలు చూసాక ఈ సారి కూడా రొమానియా సినిమాలేవీ మిస్సవ్వకూడదని నిర్ణయించుకున్నాను. నా అంచనాలకు తగ్గట్టే ఉంది ఈ సినిమా. కేవలం ముగ్గురు ప్రధాన పాత్రధారులీ సినిమాలో. ఒక పెళ్ళయిన అమ్మాయి. ఆమె ప్రేమించే మరో వ్యక్తి. వీరిద్దరూ కలిసి ఒక వారాంతం పిక్ నిక్ కి వెళ్తుంటారు. మార్గమధ్యంలో ఒక వేశ్యను వీరి కారు కిందపడి గాయపడుతుంది. స్పృహలో లేని ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా కార్లో తమతో పాటే తీసుకెళ్తారు. మధ్యలో ఆ అమ్మాయికి స్పృహ వస్తుంది. వారి ముగ్గురి మధ్య నడిచే డ్రామా ఈ సినిమా ముఖ్య కథాంశం. నాకైతే రోమన్ పొలాన్స్కీ మొదటి సినిమా “Knife in the water” గుర్తొచ్చింది. చూడదగ్గ సినిమా.

24)Firaaq

నందితా దాస్ దర్శకత్వంలో గుజరాత్ మతకల్లోలాల నేపథ్యంలో రూపొందిన సినిమా. ఫర్వేలేదు కానీ కొంచెం subtle గా ఉంటే బావుండుననిపించింది.అభినందించదగ్గ ప్రయత్నం.

25)Under the tree

ఇండోనేసియా సినిమా. నిడివి ఎక్కువ. కొద్దిగా బోరు కొట్టించింది కానీ సినిమాటోగ్రఫీ చాలా బావుంది.

26)Hunger

‘Stunning’, ‘Breathtakingly beautiful’, ‘maginificient…a work of cinematic art’ ,’fearless and uncompromising, bolder than any film to come out of UK in long time’, ‘the most shocing and important film of the year’ ….ఇలా రకరకాలుగా ఈ సినిమా గురించి విమర్శకులూ, ప్రేక్షకులూ అంటుండగా ఇక చెప్పడానికేముంది. ’A Must Watch’.

27)The Last Thakur

బంగ్లాదేశీ సినిమా. వెస్ట్రన్ సినిమా లాగా ఉంటుంది. బంగ్లాదేశ్ లోని ఒక పల్లెటూరు. ఆ ఊర్లో ఒక ఠాకూర్. అతనొక్కడే అక్కడ హిందూ. అందరికీ డబ్బులప్పిచ్చి వారి పొలాలు లాక్కుంటూ వుంటాడు ఠాకూర్. అతని ఆరోగ్యం అంతా బావుండదు. తను పోయే లోపల ఆ ఊర్లో ఒక గుడి నిర్మించాలని ఆయన తాపత్రయం. అతనంటే పడని అహ్మద్ అనే అతను ఆ ఊరికి ఛైర్మన్. వీలు చూసుకుని ఠాగూర్ ని లేపెయ్యాలని అతని ప్లాను. ఇలాంటి సమయంలో తుపాకీ ఒకటి పట్టుకుని ఆ ఊరికి వస్తాడొక యువకుడు. అతని దగ్గర తుపాకీ ఉంది కాబట్టి అతన్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తారు ఠాకూర్ మరియు ఛైర్మన్. వారి మధ్య నడిచే డ్రామా నే ఈ Last Thaakur.

సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. నటన్, సినిమాటోగ్రఫీ చాలా బావున్నాయి. ఒక చిన్నపిల్లాడిని కథకుడిగా ఉయోగించుకోవడం కూడా చాలా బావుంది. ఏటొచ్చీ సినిమాలో పెద్ద లోపమేంటంటే space సరిగ్గా establish చెయ్యలేకపోయాడు దర్శకుడు. అన్ని పాత్రలూ అక్కడక్కడే తిరుతుతుంటాయి. దాంతో సినిమాకంటే కూడా డ్రామాలాగా ఉంటుంది సినిమా.

28)Touki Bouki

ఇక ఈ చలనచిత్రోత్సవానికి హైలైట్ ఈ సినిమా. ఇది కొత్త సినిమా కాదు. పాతికేళ్ళ క్రితం వచ్చింది ఈ సినిమా. సెనగల్ అనే ఆఫ్రికన్ దేశానికి చెందిన Djibril Diop Mambéty ఈ సినిమాకి దర్శకుడు. ఆయన మరణానంతరం మార్టిన్ స్కోర్సెజీ నేతృత్వంలో ఏర్పడిన World Cinema Fund అనే సంస్థ ఈ సినిమాని డిజిటల్ గా రెస్టోర్ చేసి ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఏ విధంగా చూసినా ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఫ్లాష బ్యాక్/ఫ్లాష్ ఫార్వర్డ్స్ తో పాటు, రియల్-సర్రియల్, fact-fiction లాంటి సరిహద్దులు చెరిపేస్తూ రూపొందించిన వినోదాత్మకమైన, ఆలోచనాత్మకమైన సినిమా. హాలీవుడ్ సినిమా Easy Raider తో పోల్చవచ్చు. అవకాశం దొరికితే తప్పక చూడండి.

29)Away Days

1970-80 లలో ఇంగ్లండ్ లో ఫుట్ బాల క్లబ్స్ అభిమానుల మధ్య బాగా గొడవలు జరుగుతుండేవట. ఈ గొడవలే ఈ సినిమాకి నేపథ్యం. మనకా బ్యాక్ గ్రౌండ్ తెలియకపోతే మాత్రం అసలు వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారా అనిపిస్తుంది. దాదాపు ఇదే కథాంశంతో The raise of the Footsoldier అని 2007 లో ఒక సినిమా చూశాను. దానికంటే ఈ సినిమా బావుంది. సినిమాలో ఉపయోగించిన సంగీతం కూడా బావుంది. మరీ మిస్సవ్వకుండా చూడాల్సిన సినిమా ఏమీ కాదు.

30) 57000 Kms Between Us

ఫ్రెంచ్ సినిమా. ఇంటర్నెట్, వెబ్ కామ్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన వ్యక్తిగత జీచితాలను ఎలా ఆక్రమిస్తుందో తెలియచెప్పే సినిమా. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల్లోని విపరీత పోకడలకు అద్దం పట్టే సినిమా. ఉదాహరణకు: ఒకమ్మాయి ఎవర్నో చూసి డాడీ అంటుంది. కట్ చేస్తే అక్కడొక మధ్య వయస్కురాలుంటుంది. రామ్మా అని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తుంది. స్త్రీ ని డాడీ అనడం ఏమిటా అనేలోపలే ఆవిడ సెక్స్ మార్పిడి చేసుకున్న ఒక మగాడని తెలుస్తుంది. మరొకటి: భార్య స్నానం చేస్తుంటుంది. ఆమెకు తెలిసేలాగే ఆమెను వీడియో తీస్తుంటాడు భర్త. ఇంతకీ ఈ వీడియో తీసేది తాము నడిపే వెబ్ సైట్లో పెట్టి మరింత మంది విజిటర్స్ ని ఆకట్టుకోడానికి. ఇలాంటి వివిధ రకాల వ్యక్తుల గురించి ఈ సినిమాలో కలుసుకుంటాం. మన మధ్య దూరాలు చెరిపేయాల్సిన ఈ సాంకేతిక పరిజ్ఞానం మరింత దూరం ఎక్కువచేస్తుందని చూపెట్టడమే దర్శకురాలు Delphine Kreuter లక్ష్యం అనుకుంటా!