Menu

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 3

రెండో భాగం ఇక్కడ చదవండి.

లండన్ చిత్రోత్సవంలో నేను చూసిన మొదటి పది సినిమాల గురించి ఇది వరకే రిపోర్టు(లు) ప్రచురించాను. ఇక మిగిలిన సినిమాల గురించి చూద్దాం.

మొదట చూసిన పది సినిమాల్లో కేవలం ఒకటో రెండో మాత్రమే నాలోని సినీ పిపాసిని తృప్తి పరచగలిగాయి. ఈ సారి చలనచిత్రోత్సవం ఏంటి డల్ గా ఉంది అనుకుంటుండగా నేను చూసిన ఒక సినిమా నా అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. యాదృచ్ఛికం అయ్యుండోచ్చేమో కానీ ఆ తర్వాత నేను చూసిన చాలా సినిమాలు నాకు బాగా నచ్చాయి.

11) Waltz with Bashir

నేను పైన చెప్పిన సినిమా ఇదే. ఈ చలనచిత్రోత్సవంలో ఇప్పటివరకూ నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి. ఇది డాక్యుమెంటరీ సినిమా. కాకపోతే చాలా డాక్యుమెంటరీ సినిమాల్లాగా కాకుండా ఇది యానిమేటెడ్ డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీని యానిమేట్ చేయడేమేంటా అని చాలా మందికి అనిపించవచ్చు. మొదట్లో నేనూ అలానే అనుకున్నాను. కానీ సినిమా చూసాక ఇది యానిమేషన్ కాకుండా వుండుంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకునేది కాదు అనిపించింది.

ఇక సినిమా సంగతి కొస్తే…

1982 లో లెబనాన్ లో జరిగిన యుద్ధం ఈ సినిమాకి నేపథ్యం. దర్శకుడు Ari Folman ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఒక రోజు ఒక స్నేహితుడు తన వద్దకొచ్చి ప్రతి రాత్రి 26 కుక్కలు తనను వెంటాడుతున్నట్టు కల వస్తుందనీ, ఆ కలకీ తాము 1982 లో పాల్గొన్న లెబనాన్ యద్ధానికి దగ్గరి సంబంధం ఉండొచ్చని అంటాడు. Ari Folman కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ పాతికేళ్ళ తర్వాత ఆ జ్ఞాపకాలేవి తనకి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక విధంగా మనస్తాపానికీ గురిచేస్తుంది. అసలా యుద్ధంలో తన పాత్ర ఏంటి అని తెలుసుకోడానికి Ari Folman ఆ రోజుల్లో తన యూనిట్లో ఉండి యుద్ధంలో పాల్గొన్న మిగిలిన మాజీసైనికులను కలుసుకుని వారి జ్ఞాపకాల ద్వారా తన గతాన్ని reconstruct చేసుకోడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.

ఈ సినిమా గురించి త్వరలోనే వివరంగా ఒక సమీక్ష వ్రాస్తాను. ఈ సంవత్సరంలో వచ్చిన అత్యుత్తమ సినిమా ఇది. గుర్తుంచుకోండి. వీలయితే చూడండి.

12) Laila’s Birthday

పాలస్తీనా సినిమా. Rashid Masharawi దర్శకుడు. నేను చూసిన మొదటి పాలస్తీన్ సినిమా అనుకుంటా. ఇరానియన్ సినిమా ల ప్రభావం చాలా కనిపిస్తుందీ సినిమాలో.

కథ విషయానికొస్తే….

ఆ రోజు టాక్సీడ్రైవర్ అబు కూతురు లైలా పుట్టినరోజు. సాయంత్రం ఎనిమిదింటికల్లా  ఎలాగైనా ఇంటికి తిరిగిరావాలని చెప్తుంది భార్య. సరే అని చెప్పి బయల్దేరుతాడు. ఇక కథ అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు అబు ఎదుర్కొన్న వివిధ సంఘటనలతో ఈ సినిమా నడుస్తుంది. గొప్ప సినిమానా అంటే ఏమో చెప్పలేము. కానీ పాలస్తీనా లో జీవితం ఎంత గందరగోళంగా వుంటుందో తెలిసొస్తుంది. Wlatz with Bashir లాగే ఈ సినిమా కూడా యుద్ధం యొక్క పాయింట్‍లెస్‍నెస్ ని బయటపెడ్తుంది. నిజానికి ఈ చలనచిత్రోత్సవంలో చాలా సినిమాలు ఈ పాయింట్నే మరీ మరీ లేవనెత్తాయి.

13)Three Monkeys

Nuri Bilge Ceylan ఈ సినిమాకి దర్శకుడు. 2006 లో వచ్చిన Climates అనే సినిమా ద్వారా ఈయన పరిచయం అయ్యింది. సమకాలీన ప్రపంచ దర్శకుల్లో ఉత్తమమైన వారిలో ఈయన ఒకడని చాలా మంది అభిప్రాయం. Climates చూసాక నాకూ అలానే అనిపించింది. అలాంటి దర్శకుడి సినిమా కాబట్టి కొంచెం ఎక్కువే అంచనాలు పెట్టుకున్నానేమో కొంచెం నిరాశ చెందాను.

కథ విషయానికొస్తే….

ఒక రాజకీయ నాయకుడు కార్లో ప్రయాణిస్తూ అనుకోకుండా ఒక వ్యక్తి మరణానికి కారణం అవుతాడు. అసలే త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా వుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు తన మెడకి చుట్టుకుంటే కష్టమని ఆ కేసులో ఇరుక్కోమని తన డ్రైవర్ ని అడుగుతాడు. పెద్ద మొత్తం సొమ్ము ఆశ చూపెడతాడు. అతను సరే అంటాడు. జైలు కెళ్తాడు. అతను మొదటి మంకీ. ఇక మిగిలిన ఇద్దరు మంకీలు ఆ డ్రైవర్ భార్య మరియు కొడుకు. తండ్రి జైల్లో ఉండడంతో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు కొడుకు. తల్లి మందలిస్తుంది. తనకో కారు కొనిపెడితే హాయిగా టాక్సీ నడుపుకుంటానంటాడు కొడుకు. భర్త కి చెప్పకుండా ఆ రాజకీయ నాయకుడిని సంప్రదించి అతనిస్తానన్న డబ్బుల్లో కొంచెం ముందుగానే ఇవ్వమంటుంది. ఈ తతంగం జరుగుతుండగా వారిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడుతుంది. కొడుక్కి ఈ విషయం తెలుస్తుంది. ఈలోగా భర్త జైలు నుంచి తిరిగివస్తాడు. ఇలా ఒక చిన్న సంఘటన ముగ్గురి జీవితాలని ఎలా కొత్త దారులు తొక్కించిందో అనేది సినిమా మూల కథ. అంతా బాగానే ఉంది కానీ సినిమా మొత్తం చూసాక ఏదో వెలితిగా అనిపించింది. అది నా అంచనాల వల్ల అయ్యుండొచ్చు. చూడదగ్గ సినిమా.

14)Yah Chayka!

ఎక్స్పెరిమెంట్ల జోలికి పోకూడదనుకుంటూనే ఈ ప్రయోగాత్మక జపనీస్ సినిమా చూశాను. అంటే పూర్తిగా కాదు. మధ్యలోనే వచ్చేశాను. ఇంతకీ ఈ సినిమా లోని నూతన ప్రయోగం ఏంటంటే ఈ సినిమా కథ మొత్తం నిశ్చల చిత్రాల ద్వారా నడుస్తుంది. స్టిల్ ఇమేజెస్ ద్వారా కథ చెప్పే ప్రయత్నం ఫర్వాలేదు కానీ చాలా నెమ్మదిగా సాగుతుంది.గంట సేపు స్టిల్ ఇమేజెస్ అంటే కొంచెం కష్టమే అనిపించింది.

15)Lets Talk about Rain

ఫ్రెంచ్ సినిమా. సున్నితమైన హాస్యం ఈ సినిమా ప్రత్యేకత. ఫర్వాలేదనిపించే సినిమా.

ఫ్రాన్స్ లోని ఒక చిన్న పట్టణం. ఆ ఊరికి ఒక ప్రముఖ ఫెమినిస్ట్ రచయిత్రి వస్తుంది. ఆమె త్వరలో రాజకీయాల్లోకీ వెళ్ళాలనుకుంటుంటుంది. ఆమె గురించి ఒక డాక్యుమెంటరీ సినిమా రూపొందించాలనుకుంటారు ఆ ఊరిలోని ఇద్దరు wannabe filmmakers. స్థూలంగా అదీ కథ.

…..మరికొన్ని సినిమాల గురించి త్వరలోనే మరో రిపోర్టు.