Menu

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -2

మొదటి భాగం ఇక్కడ చదవండి.

గమనిక:నేను చూసిన వరుసక్రమంలో ఈ సినిమాల గురించి రాయటం లేదు.అసలు ఏది ముందు ఏది తర్వాత చూసానో గుర్తుంటే కదా! అన్ని సినిమాలూ చూసేసాక ఒక సినిమా కథను మరో సినిమా కథలో పెట్టేసి కలగాపులగం చేస్తానేమోనని వీలున్నప్పుడు గుర్తుకొచ్చిన సినిమా గురించి రాస్తున్నాను.

6)రాం చంద్ పాకిస్తానీ

ఇది నేను చూసిన రెండో పాకిస్తానీ సినిమా. చాలా బావుంది. వేషంలో నందితా దాస్ పాత్ర కమలి సినిమాలానే వుంది. కథ కూడా కొంచెం అలాంటిదే. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కొరకు సూర్య ప్రకాశ్ గారి సమీక్ష చదవండి.

7)Tricks

పోలిష్ సినిమా. నాకు పోలిష్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అవన్నీ 80-90 లలలో వచ్చిన కిస్లోస్కీ, వైదా, అగ్నెష్కా లాంటి పేరు మోసిన దర్శకుల చిత్రాలు.ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి పోలిష్ సినిమా ఏదీ చూసినట్టు గుర్తు లేదు.

ఈ సంవత్సరం ఇక్కడ చలన చిత్రోత్సవంలో చాలా సినిమాలు చిన్న పిల్లలు ప్రధాన పాత్రలో నటించినవి ఉన్నాయి. అందులో ఈ సినిమా ఒకటి.

కథ చాలా చిన్నది. ఒక కుర్రాడు.  ఆ కుర్రాడు అతని తండ్రిని చూసి వుండడు. తన తల్లిని వదిలేసి వేరే ఆమెతో ఎక్కడో వుంటున్నాడని మాత్రం వినివుంటాడు. ఈ అబ్బాయికి రైళ్ళు, రైలు పట్టాలంటే పిచ్చి. రోజంతా రైల్వే స్టేషన్లో గడుపుతుంటాడు. అలా రోజూ రైల్వే స్టేషన్ కి వెళ్తూ అక్కడ చూసిన ఒక పెద్ద మనిషిని ‘ఇతనే నా నాన్న ‘ అని నిర్ణయించేసుకుంటాడు. అతనితో చిన్నగా పరిచయం పెంచుకుంటాడు. ఇంతకీ అతనే వాళ్ళ నాన్నా కాదా అని తెలుసుకోడానికి ఆ అబ్బాయి చేసే ప్రయత్నాలే ముఖ్య కథ.

8 Summer of Suspense

మరే సినిమాకీ టికెట్లు దొరక్క ఈ సినిమా చూశాను.నార్వే సినిమా. మళ్ళీ చిన్నపిల్లల సినిమానే. కాకపోతే ట్రిక్స్ లోలాగా కామెడీ కాకుండా ఇది థ్రిల్లర్. రొటీన్ కైం థ్రిల్లర్ లానే ఉన్నా, సినిమా జరిగే నేపథ్యం (నార్వే లోని ఒక దీవి), చిన్నపిల్లల నటన అన్నీ కలిపి బాగనే వుంది. నాన్సీ డ్రూ గుర్తుందా. ఆ పుస్తకాల్లా వుంది ఈ సినిమా కూడా.

9) The Desrt Within

గత సంవత్సరం ఇదే చలనచిత్రోత్సవంలో తన సినిమా La Zona ని ప్రదర్శించిన దర్శకుడు Rodrigo Pla ఈ సినిమాకి కూడా దర్శకుడు. ఈ రెండు సినిమాలూ కూడా చాలా కాంప్లికేటడ్ సినిమాలు. కానీ La Zona అంత గొప్పగా ఈ సినిమా లేదనే చెప్పాలి.

కథంటూ చెప్పాలంటే చాలా వుంది. మెక్సికో లో 1920 లలో జరిగిన వుద్యమంలో నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఆ వుద్యమ సమయంలో అన్ని చర్చిలు మూసెయ్యాలని, అందులో పని చేసే ఫాథర్స్ ని అక్కడ్నుంచి వెళ్ళిపోమ్మని ప్రభుత్వం ప్రకటిస్తుంది. తన స్వంత అవసరం కోసం Elias ఫాథర్ ను వెనక్కి తీసుకొస్తాడు. ఈ విషయం తెలిసి ఆర్మీ ఆ వూరిపై దాడి చేస్తుంది.ఫాథర్ తో సహా చాలా మంది చనిఫోతారు. Elias తన వల్లే ఇదంతా జరిగిందని కుమిలి పోతాడు. తన ఎనిమిది మంది సంతానంతో ఆ ఊరినుంచి ఒక ఎడారిలోకి పారిపోతాడు. తను చేసిన పాపానికి ప్రాయశింత్తంగా ఒక చర్చి నిర్మించాలని తలపెడతాడు. ఏళ్ళు గడుస్తాయి. అక్కడ ఉద్యమం కూడా ముగుస్తుంది. కానీ ఈ విషయం వారికి తెలియదు. ఇది కథ మొదలు మాత్రమే. ఆ తర్వాత ఆ కుటుంబంలో జరిగిన సంఘటనలు, చర్చి నిర్మాణం, పాప పరిహారం, భక్తి లాంటి ఎన్నో అంశాలు మిగిలిన కథను నడిపిస్తాయి.  సినిమా కొంచెం నిడివి పెద్దది గా అనిపించింది.

సినిమాలో సినిమాటోగ్రఫీ అద్భుతం. యానిమేషన్ సీక్వెన్స్ లు చాలా బాగా ఉపయోగించారు.

10)Possibility of an Island

ఫ్రెంచ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు Michel Houellebecq. వివాదాస్పదమైన అంశాల మీద నవలలు రాసే ఈయన సంచలనానికి మరో పేరట.ఈయన రచనలు చాలానే గతంలో సినిమాలు గా వచ్చాయి. ఈయన కలం వదిలి కెమెరా పట్టడం ఈ సినిమాతోనే.

ఈ చలనచిత్రోత్సవంలో మొదటి సారిగా నేను చప్పట్లు కొట్టిన సినిమా ఇది. కాకపోతే మూడొందలకి పైగా ఉన్న హాల్లో నాలా చప్పట్లు కొట్టిన వాళ్ళు పాతిక మంది కూడా లేరు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సమీక్షలు చెత్త సినిమా అని తేల్చేసాయి. నాకైతే సినిమాలోని చివరి 45 నిమిషాలు అద్భుతం అనిపించింది.

కథ చెప్పలేను. సైన్స్ ఫిక్షన్ సినిమా. “కొంచెం టార్కోవ్స్కీ, కొంచెం కూబ్రిక్” అనిపించింది ఈ సినిమా. నాకైతే మొత్తానికి సినిమా చాలా నచ్చింది. కానీ చాలాచోట్ల విమర్శకులు నవ్వులే నవ్వులట ఈ సినిమా చూసి.

నేనైతే మళ్ళీ ఇంకోసారి తప్పక చూస్తాను. ఇప్పటికే ఈయన పుస్తాకాలు మా లైబ్రరీలో రిజర్వ్ కూడా చేసేసుకున్నాను.

One Response
  1. శంకర్ October 20, 2008 /