Menu

అవమానపరిచే సినిమాలు

ఆర్టు సినిమాలు,హార్టు సినిమాలు, సమాంతర సినిమాలు,బూతుసినిమాలు, బాగుండే సినిమాలు, బాగలేని సినిమాలు, మంచి సినిమాలు, చెడ్డసినిమాలు అని మనం చాలా సినిమాల పేర్లువిన్నాం. చూసాం. చర్చించాం. విశ్లేషించాం. విస్తృతంగా సమాచారాల్ని పంచుకున్నాం. కానీ, గత రెండు వారాలలో నేను ఒక విభిన్నతరహా సినిమాల బారినపడి, ధియేటర్ల నుంచీ నిర్ధ్వందంగా “వాకౌట్లు” చేసాను. అవే…అవమానపరిచే సినిమాలు.

ఈ తరహా కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలం హాలీవుడ్డూ,బాలీవుడ్డూ,కోలీవుడ్డూ, హైదరాబాదుడ్డూ…… గాడిదగుడ్డూ ఆన్నీ నిర్లజ్జగా మనమీదకి వొదులుతున్న వందలాది చిత్రాలు ఈ కోవకే చెందడం మాత్రం విచారకరం. పేర్లతో మొదలు శుభంకార్డువరకూ ఈ సినిమాల ముఖ్యఉద్దేశం ప్రేక్షకుడికి అనుభూతినో,ఆహ్లాదాన్నో కనీసం మైండ్లెస్ ఎంటర్టెయిన్మెంటో కల్పించడం కాకుండా, కేవలం అవమానించే ఉద్దేశంతో తీసినట్లుగా అనిపిస్తున్నాయి.

ప్రేక్షకుడి మేధని అవమానించే సినిమాలు మనకు అలవాటే. ఎక్కడా తర్ఫీదు పొందకుండానే సంగీత,సాహిత్య,యుద్ధ కళలు వీలైతే 64 కళల్లో ఆరితేరిన హీరొ మన సినిమాల సొంతం. పవిత్ర ప్రేమికురాలూ,త్యాగమయీ, అనురాగమయి నుంచీ ఐటం సాంగుల్లో తళతళలాడే వరకూ ప్రయాణించిన తెలుగు నాయిక మన సినిమాలలో భాగం. అర్థం లేని కథలూ అలవికాని కథనాలు, తికమక గొలిపే పాత్రచిత్రణలూ మన చలనచిత్రాల ఆదర్శం. ఇంతచేసినా, ఈ సినిమాలెప్పుడూ పైసలిచ్చివచ్చిన ప్రేక్షకులను పచ్చిబూతులు తిట్టి, అవమానించి, ధియేటర్ బయటకు నెట్టలేదు. కానీ ఇప్పుడు…

సినిమా పేరుమాత్రం ‘గుండె ఝల్లుమన్నది’ కానీ,అరగంటలో నా గుండే “గుభేల్” అనిపించడంలోమాత్రం ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అయ్యింది. ఆరంభంలో హీరోయిన్ పాత్ర పరిచయంతో “బాగుందే!” అనిపించి, ఆమరుక్షణంలో డిగ్రీచదివితేగానీ సర్పంచ్ అవ్వడనిచెప్పి, పల్లెటూరి నాయకుడ్ని BA చదవడానికి ఇంజనీరింగ్ కాలేజికి పంపించి దర్శకుడు, నా ముఖం మీద ఉమ్మేసిమరీ అవమానించాడు.  అది తక్కువా అనుకుంటుండగా హిస్టరీ, పొలిటికల్ సైన్సూ, ఎకనామిక్సుల సబ్జెక్టుల గొప్పతనాన్ని స్టేజిమీదెక్కించి మరీ హీరోచేత రెండుపేజీల ప్రాంప్టింగ్ డైలాగ్ చెప్పించి, ఈ సారి కిళ్ళీకలిపిన గౌరవం లభించింది. యాక్టింగ్ మరిచిన హీరో, టైంపాస్ కు చేసిన దర్శకత్వం, టెలివిజన్లోకూడా అంతఛంఢాలంగా తియ్యరేమో అన్నంత ఏబ్రాసి సినెమాటోగ్రఫీ. కాస్తోకూస్తో ఆ అరగంటా నేను కొత్తకథానాయిక చూడ్డానికి బాగుందికదా అని చూసేసి..ఇంకా ఎక్కడ భరించలేని అవమానాలు అందుకోవలసి వస్తుందో అని పారిపోయి వచ్చేసాను.

ప్రమోషన్ విపరీతంగా చేసేసరికీ ‘ద్రోణ’, ‘కిడ్నాప్’ అనే రెండు హిందీసినిమాలు ఓకేరొజు చూసి తీవ్రావమానానికీ మనస్థాపానికీ గురయ్యాను.

ద్రోణ: చందమామలో కూడా అంతకన్నా మంచి కథలు మనమెన్నో చదివాం. కానీ ద్రోణ సినిమా కథకుడు పాపం చిన్నప్పుడు చందమామ అందనివాడై/చదవనివాడై ఉంటాడని ఆలోచించి మాత్రం నాకు చాలా జాలేసింది. అయినా, తెలీనివాడు తెలియనట్టుండాలేగానీ డబ్బున్న నిర్మాతాదర్శకుడ్ని ఈ ముగ్గులోకి లాగి, నన్నవమానించే సాహసం చేసినందుకు క్షమించలేకపోయాను. మొదటి సినిమాతో కనీసం బోణీకూడా చెయ్యలేకపోయిన దర్శకనిర్మాత ‘గోల్డీ బెహల్’ , ఇంత చెత్త అంశాన్ని స్పీల్బర్గ్ స్థాయిలో తీసిపారెయ్యగలనని ఎలా అనుకున్నాడో అస్సలర్థంకాని విషయం. బహుశా స్పెషల్ ఎఫెక్టులమీద ఆశలు పెట్టుకున్నాడేమో! బాపుగారు చెప్పినట్లు, కథనం బాగుంటే సాంకేతిక నిపుణుల సహాయంతో   చాక్ పీస్ పొడిని దివినుండీ భువికి దిగే గంగాదేవిలా భ్రమింపజెయ్యొచ్చుగానీ, ఇక్కడ హాలీవుడ్ గ్రాఫిక్స్ కూడా చిన్నపిల్లాడి పిచ్చిగీతల్లా, అర్థం లేని ఆలోచనల్లా కనిపిస్తాయేగానీ కథను కాపాడే అంశాలుగా కనీసం దూరతీరాలనుంచీకూడా అనిపించలేదు.

ఇక “నాకు యాక్టింగ్ రాదు మీ ఖర్మ” అని ముఖానరాసినట్టు భావాలు ప్రకటించే అభిషేక్ బచ్చన్ నటన. “నా జీవితం ఇంతే” అన్న నిరాశని ప్రతిఫలించే ఒక సూపర్ హీరోగా పాత్ర ఒకవైపు నగుబాటుని కలిగించేవైతే మరో స్థాయిలో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేవిగా తయారయ్యాయి. కాస్తోకూస్తో ‘ఈ మధ్యకాలంలో అందం నటనా(?) వచ్చిన నాయిక ప్రియాంకా చొప్రా’  అనే అపోహనాలో ఏ ములన్నా ఉండుంటే, ఈ సినిమాతో అవి పటాపంచలయ్యాయి. ఈ సినిమాలో తన పాత్రలాగానే, ‘ఎత్తి ఎడంకాలితో తన్ని’ మరీ నన్ను అవమానించిందని చెప్పొచ్చు. మంచినటుడు కె.కె.మీనన్ ను జోకర్ చేసిన ఘనత ఈ సినిమాది. జయాబచ్చన్ లాంటి పరిణితి చెందిన నటి చేత “ఈ విడకి నటనొచ్చా?” అనిపించిన చిత్రం ద్రోణ. భరించలేక ఇంట్రవెల్ తర్వాత పదినిమిషాలు చుసి నేను పరారయిన చిత్రమిది. ఎవరైనా ఫ్రీగా DVD ఇచ్చినా ఈ సినిమాను చూసి అవమానంపాలు కాకండి.

కిడ్నాప్: ప్రమోషన్లలోనే ఇదొక ‘పాప్కార్న్ సినిమా’ అని తెలిసిపోయింది. అందుకే, సినిమా మొదలవకముందే ఒక బుట్టెడు పాప్కార్న్ కొని, కోక్ తాగనుకాబట్టి మాజా ఒకటి తీసుకుని సీట్లో కూలబడ్డాను. ఏదో ‘ధూమ్’ సినిమా దర్శకుడుకదా కనీసం పోరాటదృశ్యాలైనా మంచిగా తీసుంటాడనుకున్న నాకు, ఇతగాడు మాజా తాగినా మింగుడుపడని పాప్కార్న్ చిత్రాన్ని చూపించాడు. నాఖర్మ వాడి ప్రాప్తం అలాంటిది. ఎప్పుడూ బికినీని పోలిన కురచదుస్తుల్లో అందాల్ని ఆరబోసే నాయిక. అసలెందుకలా తయారయ్యాడో తెలీని తండ్రిపాత్రలో సంజయ్ దత్. తల్లా..చెల్లా..అక్కా!! అని డౌట్ వచ్చేలా తల్లిపాత్రలో ‘చెక్ దే’ సినిమాలో నటించిన విద్య. కిడ్నాప్ కు సరైన మోటివేషన్ ఉన్నా, కమింట్మెంటూ, కన్విక్షనూ అంతకుమించి చెయ్యాల్సిన యాక్షనూ (నటన) తెలీని పాత్రలో మొన్నమొన్ననే వచ్చిన చాక్లెట్ బాయ్ ‘ఇమ్రాన్ ఖాన్’.

ఇకచూస్కో నా సామిరంగా …గంటసినిమాలో కనీసం వందసార్లు నన్ను, “వెధవా ఈ సినిమాకొస్తావా!” అని కాలరుపట్టుకుని మరీ తెరమీదనుంచీ చెప్పులవర్షం కురిసింది. ప్రతిషాటూ, ప్రతిసీనూ, ప్రతి డయలాగూ, ప్రతి రియాక్షనూ ఒక బూతే…ఈ అవమానం భరించలేక ఇంటర్వెల్ కాకుండానే సగం తినిన పాప్కార్న్ సీట్లోనే పడేసి వాకౌట్ చేసాను.

బాబిలోన్ AD: ఇక చివరిదీ ఆఖరిదీ అంతర్జాతీయ అవమానకరసినిమా ‘విన్డీసిల్’ నటించిన ‘బాలిలోన్ AD’. ఈ సినిమా కథేమిటో నటించిన నటీనటులకీ, సినిమా తీసిన దర్శకనిర్మాతలకీ ఖచ్చితంగా తెలీదని నేను ఘంటాపధంగా చెప్పగలను. ఉన్నదల్లా, అన్ని హాలీవుడ్ సినిమాలల్లో కనిపించే కొన్ని default production values. అవికూడా కల్తీ చెయ్యలేనివిగాబట్టి, by mistake వచ్చేసుంటాయేగానీ దర్శకుడు ఉద్దేశ్యపూర్వకంగా అవమానం తగ్గించాలనుకున్నాడుకాబట్టి మాత్రం కాదనుకుంటాను.

ఈ సినిమాకు కొందరు స్నేహితులతో వెళ్ళడం వలన వాళ్ళముఖాలు నేనూ, నా ముఖాన్నివాళ్ళూ చూసుకుని జరిగిన అవమానం ఎక్కడా చెప్పుకోకూడదని ఒట్టేసి మొత్తం సినిమాచూసి బయటపడ్డాం. సినిమా అయిపోగానే మాకొచ్చిన ఆలోచన ఈ సినిమాలో ‘విన్డీసల్’ పాత్రలో బాలకృష్ణని, ‘మిచెల్ యూ’ స్థానంలో సిమ్రాన్ నీ, ‘మెలనీ ధిర్రే’గా అసిన్ నూ పెట్టి ఒక బ్రహ్మాండమైన వందరొజుల తెలుగు సినిమా తీసి, విజయవంతంగా ఆంద్రప్రేక్షకులని అవమానించొచ్చనే నిర్ణయానికొచ్చేసాము.

ఎవరైనా ఖర్మగాలి ఈ సినిమాచే అవమానింపబడాలనే నిర్ణయానికొస్తే, పైన నేను చెప్పిన క్యాస్టింగుని ఊహించుకుంటూ ఈ సినిమా చూసేస్తే ఆ అవమానంపాలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఏదిఏమైనా ఈ సినిమా చూసింతర్వాత, ఇలాంటి అవమానకరమైన సినిమాలకు వ్యతిరేకంగా కంజ్యూమర్ కోర్టులోనో, మానసిక క్షోభకలిగించి, అవమానించాయని మామూలు కోర్టులోనో డిఫమేషన్ కేసు వేసే అవకాశం కల్పించాలనే తీవ్రమైన కోరిక నాలో కలుగుతోంది. ఈ సినిమాలు మీరు భరించగలిగితే మీకూ ఖచ్చితంగా ఈ ఆలోచనవస్తుందని నా  మనవి.

21 Comments
 1. Fazlur Rahaman Naik October 17, 2008 /
 2. Motorolan October 17, 2008 /
 3. తేజ October 17, 2008 /
 4. chavakiran October 17, 2008 /
 5. Sree October 17, 2008 /
 6. Kiran October 17, 2008 /
 7. raji October 17, 2008 /
 8. కొత్తపాళీ October 17, 2008 /
 9. Kiran October 17, 2008 /
 10. Kiran October 17, 2008 /
 11. Kiran October 17, 2008 /
 12. su July 25, 2009 /
 13. Norman Bates July 25, 2009 /