Menu

నేను cinema of the year ను చూశాను!

నిజం! నేను సినిమా ఆఫ్ ది యియర్ ను చూశాను. ఒక టీవీ చానెల్ వాళ్ళు వారం రోజులు వరుసగా ఈ ప్రకటనతో ఊదరగొట్టేసారు. ఆ సినిమా కూడా భయంకరంగా హిట్ అయి బోలెడన్ని అవార్డులు కొట్టేసి, అందరి పొగడ్తలూ, ప్రశంసలూ పొందటంతో నేను కూడా ఆ అద్భుతమయిన సినీరాజాన్ని చూడాలని కడలిదాటిన మహోత్సాహంతో అన్ని పనులూ మానుకుని టీవీ ముందు కూచున్నాను. సినిమా మధ్య వచ్చే ప్రకటనల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఒక పుస్తకం ప్రూఫులు చూసేందుకు దగ్గర పెట్టుకుని మరీ కూచున్నాను.

ఇంతకీ నేను అంతగా ఎదురుచూస్తూ చూడాలని సిద్ధమయిన సినిమా పేరు హాపీ డేస్!

ఫ్రాంకోయిస్ మారియాక్ అని ఒక ఫ్రెంచ్ రచయిత వున్నాడు. ఆయన ఒక రచన చేయాలంటే ఎంతో ఆలోచించేవాడు. ఎందుకంటే, రచన పదిమందీ చదువుతారు. అనేక తరాలు చదువుతాయి. రక రకాల మనస్తత్వాలున్నవారు చదువుతారు. కాబట్టి తన నవలలో హీరో విలన్ పయిన విజయం సాధించినట్టు చూపిన ఎవరో ఒకరికి విలన్ పాత్ర నచ్చవచ్చు. వాడివల్ల సమాజనికి అన్యాయం జరగవచ్చు. అని ఆలోచించేవాడు. కాబట్టి తన రచనలో ఏమాత్రం చెడును ఎంత అనాకర్షణీయంగా ప్రదర్శించినా ఎక్కడో ఎవరికో అది ఆకర్షణీయం కావచ్చు. సమాజానికి చెడు జరగవచ్చు. అందుకని ఎంతో జాగ్రత్తగా ఏచనలు చేసేవాడు. ఏ కోణంలోంచి చూసినా చెడు అర్ధంకానట్టు రచన చేసేవాడు. the knot of vipers ఆయన రచనే.

తన సామాజిక బాధ్యత తెలిసిన కళాకారులలా ఆలోచిస్తారు.

మానవ మనస్తత్వ వైచిత్రి ఎలాంటిదంటే, రామాయణంలో రాముడికన్నా రావణుడు నచ్చుతాడు. సీత కన్న శూర్పణఖ నచ్చుతుంది.

హాపీడేస్ చూస్తూంటే మన కళాకారులకసలు సామాజిక బాధ్యత అంటే ఏమిటో తెలుసా? అన్న సందేహం కలిగింది.

ఒక కళా ప్రజాదరణ పొందిందంటే అర్ధం, సమాజంలో అధిక సంఖ్యాకుల మానసికస్థితిని ఆ కళ ప్రదర్శిస్తుంది. అనేకులు ఆ కళాప్రదర్శన ద్వారా సంతృప్తి పొందుతున్నారు అని అర్ధం. వారి మనస్సులలో ఏదో అంశాన్ని ఆ కళ స్పందింపచేస్తోందని అర్ధం. అంటే కళాకారుడు ప్రజల అసంతృప్తులను, ఆశ నిరాశలను తన కళలో ప్రదర్శించటం ద్వారా సమాజ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నాట్టు.

సమాజం ఒక పరిణతి పొందిన కళను ఆదరించిందంటే అర్ధం, సమాజంలో మానసిక పరిణతి ఉందని. అలాకాక నీచతాపరిపూర్ణమయిన కళ్ను ఆదరిస్తే సామాజిక మనస్తత్వం నైచ్యాన్ని ఆదరిస్తోందని.

అయాన్ రాండ్ నవల ఫౌంటైన్ హెడ్ లో ఒక దృశ్యంలో నాయికా నాయకులు ఒక చెత్త నాటకాన్ని చూస్తారు. కుళ్ళు జోకులకు పడీ పడీ నవ్వుతున్న ప్రజలను చూస్తారు. ఏ ప్రజలు వారి స్థాయికి తగిన కళను పొందుతారని నవ్వుకుంటారు. ఈ సినిమా చూస్తే నాకు అలాగే అనిపించింది.

హేపీడేస్ ఒక మామూలు ఫార్మూలా సినిమా. కాలేజీలో కొందరు యువతీ యువకులు అల్లరిచేయటాలు, ప్రమలో పడటాల్లాంటి అనేక సినిమాలలో ఒకటి ఈ సినిమా. మిగతా వాటికన్నా కాస్త సెన్సిటివ్గా, కొంత శుభ్రంగా వుంది. అక్కడక్కడా సున్నితమయిన నవ్వునూ కలిగిస్తుంది. తెలుగు ప్రేక్షకులు అల్ప సంతోశులు. ఏదో కొంత బాగున్నా, కాస్త నవ్యత్వం ఉన్నా బ్రహ్మ రథం పడతారు. ఎందుకంటే వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన కళా ప్రదర్శన అలవాటులేదు కాబట్టి ఉన్న దానిలో ఉత్తమమయినదాన్ని ఆదరిస్తారు. వృక్షాలు లేనిచోట లాంటిదన్నమాట ఇది.

ఈ సినిమాలో నాకు దిల్ చాహ్తాహై కనిపించింది. కుచ్ కుచ్ హోతాహై కనిపించింది. ఇంకా అనేక హాలీవుడ్, బాలీవుడ్, తెలుగువూడ్ ల కాలేజీ సినిమాల కట్టింగులు కనిపించాయి. వాటన్నిటినీ కాస్త సున్నిత హృదయం ఒక మంచి ఆకర్శణీయమయిన బాణీ పాటలతో ముడివేశాడీ సినిమాలో.

మనకు అలవాటయిన కాలేజీ గూండాలు, ప్రేమలు, వ్యక్తిత్వంలేని టీచర్లు, చదువుపయిన శ్రద్ధ లేని పిల్లాలు, తాగటం, తిరగటం అమ్మాయిల గురించి చులకనగా మాత్లాడటమే కాలేజీ జీవితం అన్న అభిప్రాయాన్ని కలిగించటం ఈ సినిమాలోనూ వున్నాయి.

ఏదో ఒక సమయంలో టీచర్ పైన లైంగిక భావాన్ని ప్రదర్శించని విద్యార్థి వుండడు. కానీ మై హూనా లో లాగా టీచర్ శరీరాన్ని ప్రదర్శించి రెచ్చగొట్టనవసరంలేదు. ఆ టీచర్ వొంగితే ఎక్కడెక్కడ చూడాలో చూపాల్సిన అవసరంలేదు. ఇప్పటికే ఇంటి బయట అడుగుపెట్టిన మహిళలను వయసుతో, సామాజిక స్థాయితో సంబంధం లేకుండా బట్టలను చీల్చుకుని చూడటం, ఊహించి చులగనగా వ్యాఖ్యానించటం అలవాటయిపోయింది. అమ్మాయి కనబడగానే ప్రేమలంటూ వెంటపడటం ఏడ్పించటం మమూలయింది. ఇంకా అలాంటి భావననే బ్రెయిన్ వాష్ చేసేవిధంగా మన సినిమాలు చూపటం, దాన్ని చూస్తూ కుర్రాళ్ళు వెర్రెక్కి పోవటం, ఇలాగే వుండాలేమో అనుకుని యువతులు భ్రమపడటం , ప్రేమ అనే బ్రహ్మ పదార్ధం వెంటపడి జీవితాలు నాషనం కావటం చూస్తూనే వున్నాం. అయినా ఒక్కరుకూడా నిజా నిజాలు చెప్పే ప్రయత్నం చేయటమేలేదు. ఇంకా అలవాటయిన రీతిలో తమ ప్రతిభతో మరింత దిగజారుస్తున్నారు తప్ప పరిస్థిని మెరుగు పరిచే బాధ్యత చూపటంలేదు.

ఈ సినిమాలో కూడా అంతా ప్రేమలే. కాలేజీకి వెళ్ళేది చదవటానికా? ప్రేమించటానికా? వుద్యోగం సద్యగం లేకుండా ఈ ప్రేమలేమిటి? జీవిత ప్రయాణం ఇంకా ఆరంభం కాకముందే తొలి మజిలీలో కలసిన వ్యక్తితోనే జీవితం గడపాలని నిశ్చయించుకునే పరిణతిలేనివారి నిర్ణయాలే గొప్ప అన్నట్టు చూపి తప్పుదారి పట్టించే సినిమాలలో ఇదొకటి . ఈ సినిమాలో చదువుపయిన శ్రద్ధ వున్నవాడొక్కడూ లేడు. బాగా చదివేవాడూ అదేదో సులభంగా చదివేసినట్టు కనిపిస్తాడు తప్ప కష్టపడ్డట్టేవుండడు. ఇది కూడా తప్పుదారి పట్టిస్తుంది. ఈ సినిమాలో తెలుగుమీడియమ్నుంచి వచ్చిన విద్యార్థి వుంటాడు. మొదట్లో కనిపిస్తాడు. చివరలో ఆంగ్ల పండితుడయిపోతాడు. అతని మానసిక వేదన, శ్రమలు మన కళాకారులకవసరంలేదు. ప్రేమలు కావాలి. పిచ్చి పిచ్చి ప్రవర్తనలు కావాలి. ఇదే హీరోయిజం.

విద్యార్థి అన్నవాడికి మన సినిమాల ప్రకారం వుండాల్సిన లక్షణాలేమిటంటే, పోరాడగలగాలి, అమ్మాయిల్ని ఏడిపించి ప్రేమించగలగాలి తాగుళ్ళు తిరుగుళ్ళు వుండాలి. వెకిలి పోకిరీలే కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. అదే ఎంజాయ్మెంట్ అంటే. బుద్ధిగా చదువుకునేవారు పనికిరానివారు. ఈ సినిమాలో అందరూ డబ్బున్నవాళ్ళే.పేదవారు, చదువంటే శ్రద్ధ వున్నవారు మన కళాకారులకు పనికిరారు. కాబట్టి పోకిరీ జులాయీ హీర్రోలే మన సమాజానికి మార్గదర్శకులయ్యారు. దాన్ని చూపే సినిమాలే సినిమా ఆఫ్ ది ఇయర్లూ!

బొమ్మరిల్లు అనే ఒక హిట్ సినిమా వుంది. దాన్లో కూడా హీరో జీవితంలో రెండు పనులు చేయాలనుకుంటాడు. ఒకటి తన కాళ్ళమీద తాను నిలబడటం, రెండు, ప్రేమించి పెళ్ళి చేసుకోవటం. సినిమా అంతా, ప్రేమించి పెళ్ళిచేసుకోవటమే, తన కాళ్ళ మీద తాను నిలబడటం లేదు. ఇవీ మన సినిమాలు. ఇదీ మన కళాకారుల సామాజిక బాధ్యత. ఈ సినిమాలు హిట్ అవుతున్నాయంటే సామాజిక మనస్థితిని అంచనా వేయవచ్చు. భవిష్యత్తును ఊహించవచ్చు. జై హింద్.

ఇలాంటప్పుడే నాకు సాహిర్ పాట గుర్తుకు వస్తుంది బాగా

కహాహై ముహాఫిజ్ ఖుదీకా
జిణే నాజ్ హై హింద్ పర్ వో కహా హై?

(భారతీయ సమాజం గర్వించే ఆ ఆత్మవిశ్వాసమూ, ఆత్మ గౌరవమూ ఏవి?)

19 Comments
 1. shree October 17, 2008 /
 2. Sandhya Reddy October 17, 2008 /
 3. sasank October 17, 2008 /
 4. raji October 17, 2008 /
 5. Sasikanth October 17, 2008 /
 6. raji October 17, 2008 /
 7. siri October 17, 2008 /
 8. నవీన్ గార్ల October 17, 2008 /
 9. కొత్తపాళీ October 17, 2008 /
 10. Rajiv October 18, 2008 /
 11. నిషీ నిష్ October 20, 2008 /
 12. j.suryaprakash October 21, 2008 /
 13. Jamesbond_007 October 24, 2008 /
 14. kkraju October 25, 2008 /
 15. bhanu prakash October 28, 2008 /
 16. mss June 27, 2009 /
 17. Munna April 6, 2015 /