Menu

దృశ్య కావ్యాలైన సాహితీ సుమాలు

తన లోపల అంతర్లీనంగా వున్న ఆలోచనల్నీ, తను అనుభవిస్తూ వచ్చిన అనుభవ సారాన్ని వ్యక్తం చేసే క్రమంలో మనిషి అనాదిగా అనేక కళల్ని కళారూపాల్ని సృష్టిస్తూ వచ్చాడు. తన భావ పరంపరకి కళాత్మక రూపాన్నిచ్చి దానికి కొన్ని లక్షణాల్ని నిర్దిష్టమైన లక్ష్యాల్ని నిర్దేశిస్తూ వచ్చాడు. అలా భిన్నమైన వ్యక్తీకరణ రూపాల్లో సాహిత్యం వేలాది సంవత్సరాల నాటిది. ఆ సాహిత్యంలో కథాకథన రీతులు భిన్నమైనవిగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు వినూత్నతను సంతరించుకుంటూ ఎదుగుతూ వచ్చింది. అలా సాహిత్యంతోపాటు కాలక్రమంలో లలిత కళలు, దృశ్యకళలు, ప్రదర్శనా కళలు అనేకమైన రూపాల్లో ఆవిష్కృతమవుతూ వచ్చాయి.

గత శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పర్యవసానంగా రూపొందించిన సినిమా వినూత్నమైన కళ. అది అనేక కళా రూపాల్ని తనలో సమ్మిళిం చేసుకుని తనదైన ఒక దృశ్యాత్మక రూపాన్ని ఏర్పరుచుకుంది. మొదట మాటలు రాని మూకీ చిత్రంగా ప్రారంభమైన సినిమా క్రమంగా ధ్వనిని, మాటని అందిపుచ్చుకుని ప్రతిభావంతమైన దృశ్య శ్రవణ మాధ్యమంగానూ, చలనచిత్ర కళగానూ ఎదిగింది. ఆ సినిమా ప్రారంభ దినాల్లో వేదికపైన జరిగే ప్రదర్శనల్ని సాదృశ్యం చేసే ఛాయాచిత్ర కళగా మాత్రమే పరిగణించబడింది. కానీ కాలక్రమంలో ప్రతిభావంతమై నిర్దేశకుల సృజనాత్మకతతో సినిమా నదైన కవితాత్మక దృశ్యరూపాన్ని పొందింది. సంగీతమూ, నృత్యమూ తదితర విభిన్నకళల్ని అందిపుచ్చుకున్నప్పటికీ, అవన్నీ సినిమాలలో కలగలసి పోయాయి. సినిమా ఒక ప్రత్యేక కళగా రూపాంతరం చెందింది. కానీ కథాకథన రీతిని అలవర్చుకునే దిశలో సినిమా సాహిత్యాన్ని అనుసరిస్తూనో లేదా సాహిత్య రచనకు రూపాంతరంగా నిర్మితమవుతూనో వచ్చింది. సినిమా ఆవిష్కృమైన తొలి దశాబ్దం నుంచే సాహిత్య రూపాంతరీకరణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇలా సాహిత్య రచనలు సినిమాలుగా రూపాంతరం చెందడం ఏదో ఒక భాషకో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనూ ఈ ఒరవడి కొనసాగింది.

నిజానికి సినిమా, సాహిత్యం రెండూ భిన్నమైన మాధ్యమాలు. వాటిల్లో భావ ప్రసార రీతి లక్షణాలు వేర్వేరు. వాటిని నిర్వహించే పద్ధతులూ భిన్నమైనవిగానే ఉన్నాయి. సాహిత్యం వ్యక్తిగతమైన సృష్టి అయితే సినిమా వ్యక్తిగా మేధోమధనం లోంచి ఉత్పన్నమైనదే అయినప్పటికీ సామూహికంగా పలువురు కళాకారులు సాంకేతిక నిపుణులు కలిసి రూపొందించాల్సి ఉంటుంది. అందుకే సామూహిక కళగా పిలువబడుతుంది. ఈ రెంటి మధ్య భిన్నత్వం ఉన్నప్పటికీ సామాజిక లక్షణాల్ని ఆవిష్కరించడంలో వాటిపైన వ్యాఖ్యానించడంలో సినిమా సాహిత్యాలు రెండూ ప్రదర్శించే స్వేచ్ఛ విశాలమైంది. ఆ రెండూ సామాజిక దర్పణాలుగా ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అంటే రెంటి మధ్యా సాధారణంగా కనిపించే భిన్నత్వమూ అసాధరణంగా కనిపించే ఏకత్వమూ ఉన్నాయి. అయితే ఒక కళారూపానికి చెందిన విమర్శానాత్మక పద్ధతిని మరో కళారూపానికి అన్వయించడం సమంజసం కాకపోవచ్చును. కానీ సినిమా అనేక సందర్భాల్లో సాహిత్య రూపాంతరంగా విలసిల్లింది. అందుకే వీటి మధ్య అనుబంధమూ అవినాావ సంబంమూ ఉన్నాయి.

ఒక సాహిత్య రచన సినిమాగా రూపాంతరం చెందడం 1902 లో మొదలైందని చెప్పుకోవచ్చు.ఎమిలాజోలా రచించిన ’ఆసోమోర్’ ను ఐదు నిమిషాల చలనచిత్రంగా ఓ ఫ్రెంచి చలనచిత్రకారుడు నిర్మించాడు. దాంతో ఈ ఫిల్మిక్ ఎడాప్టేషన్ ప్రారంభమైంది. 30వదశకం వచ్చేసరికి ప్పంచవ్యాప్తంగా ఎన్నో క్లాసిక్స్ సినిమా రూపంలోకి వచ్చేశాయి. ఇలా రూపాంతరీకరణ చేసినప్పుడు మూల రచయితకి పారితోషకం చెల్లించడం 1907 లోనే మొదలైంది. అప్పుడు కాలమ్ స్టూడియూ వారు”బెనహర్’ ని రచయిత అనుమతి లేకుండా సినిమాగా నిర్మించారు. అది గమనించిన ల్యూవాల్లెస్ స్టూడియో వారిపైన కోర్టులో దావా వేశారు. కోర్టు 25 వేల డాలర్లు పరిహారంగా రచయితకిప్పించింది. అప్పటినుంచి రచనల రూపాంతరీకరణలు జరిపినపుడు పారితోషకం చెల్లించే ఆనవాయితీ మొదలైంది. అయితే ఈ రూపాంతరీకరణ సినిమాకే కాకుండా సినిమా వచ్చింతర్వాత నవలలు కూడా వచ్చి విజయవంతమైన సందర్భాలున్నాయి. అలా విజయవంతమైన రచనగా ’రెయిన్ మాన్’ సినిమా నవలను పేర్కొనవచ్చు. రెయిన్ మాన్ సినిమా విజయవంతమైన తర్వాత వెలువడ్డ సినిమా నవల 12 భాషల్లో 15 ముద్రణలకు నోచుకుంది.మనదేశంలో కూడా పథేర్ పాంచాలి లాంటి చిత్రాల స్క్రిప్ట్ గ్రంధాలు విరివిగా అమ్ముడయ్యాయి. తెలుగులో కూడా ముళ్ళపూడి వెంకటరమణ, రావి కోండలావు లాంటి పలువురు రాసిన సినిమా నవలలు విరివిగానే వచ్చాయి.

ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ సాహిత్యరచన చదవడం, సినిమా చూడడం రెండూ భిన్నమైన అనుభవాలు, సాహిత్య పఠనం వ్యక్తిగతమైన అనుభవమైతే సినిమా సామూహిక అనుభవం, పాఠకుడికి ప్రేక్షకుడికి ఆయా సందర్భాల్లో కలిగే అనుభూతీ, మిగిలే అనుభవమూ భిన్నమైంది. గొప్ప నవల చదివినప్పుడు కలిగే అనుభూతి సినిమా వల్ల కలగకపోవచ్చు. అదే ఒక గొప్ప క్లాసిక్ లాంటి సినిమా చూసినపుడు కలిగే అనుభూతి నవలా పఠనం వల్ల రాకపోవచ్చు. రచనల్లో జీవిత దృశ్యాలు పదాలుగా నిర్మితమైతే సినిమాల్లో దృశ్యాలుగా రూపొందుతాయి. అక్కడ దృశ్యానికి ధ్వని, సంగీతము, సంభాషణ, అదనపుబలాన్ని అందించాయి. అంటే రచనలో పదాలే సంకేతాలై పాఠకుడిపై ప్రభావం కలిగిస్తే సినిమా తనలోని విభిన్న మాధ్యమాల ద్వారా ప్రేక్షకుడిపై ప్రభావాన్ని చూపిస్తుంది. సాహిత్య రచన మొదట పాఠకుడి ఆలోచనా సహజాతంపై ముద్రవేసి అక్కడినుండి క్రమంగా భావోద్వేగాన్ని కలిగింపజేస్తుంది. కానీ సినిమా మొదటే భావోద్వేగాల్ని ప్రభావితం చేసి ఆ తర్వాత ఆ సినిమా స్థాయిని బట్టి ఆలోచనపైన ప్రభావం కలిగిస్తుంది.

సాహిత్య రచనలో సంఘటనల్ని సమాజపు భిన్న రీతుల్ని మనిషి అంతర్ బహిర్ స్థితిగతుల్ని పదాల రూపంలో విశ్లేషించి వివరించడం జరిగితే, సినిమాలో ప్రకృతిలో కనిపించే వాటిని దృశ్యమానం చేస్తూనే కొంతకాలాన్ని, కొంత స్పేస్ ని సంలీనం చేసి పరిశీలనాత్మకంగా చూపిస్తుంది. రచనలో ప్రతిపదమూ ఒక స్పష్టమైన భావాన్ని ఆవిష్కరింపచేస్తే సినిమాల్లో ప్రతి ఫ్రేమూ దానికదే భావాన్ని చెప్పలేదు. సినిమా మొత్తంగానే ఒక వాస్తవికతగా భాసిల్లుతుంది. ఫ్రేములు ఫ్రేములుగా ఒక క్రమబద్ధమైన చలనంతో సినిమా ప్రేక్షకునిపై తన ప్రభావాన్ని నమోదుచేస్తుంది. స్థిరపరుస్తుంది. అయితే సినిమా దృశ్యం మనిషి అంతరంగాల్లో కలిగే ఆలోచనల్ని, కలల్ని వ్యక్తిగత జ్ఞాపకాల్ని ప్రకటించలేకపోవచ్చు, కానీ సినిమా నిర్మాణ రంగంలో నిష్ణాతులైన చలనచిత్రకారులు కనిపెట్టిన మాంటేజ్ లాంటి టెక్నిక్ ల వల్ల సినిమాల్లోని భావప్రకటనల్లో విస్తృతీ సాంద్రత పెరిగాయి.

మాధ్యమాలుగా సినిమా సాహిత్యాల ప్రసారతీరు ప్రభావ సాంద్రత భిన్నంగానే ఉన్నప్పటికీ రెంటికీ మధ్య పోలికలూ ఉన్నాయి.రెండూ ప్రసార మాధ్యమాలుగా అనుభూతింపచేస్తాయి. రెంటి శక్తి సామర్థ్యాల నడుమ తేడాలున్నప్పటికీ రెంటిలోనూ ’కథ చెప్పేవిధం’ అంటూ ఒకటుంది. రెంటిలోనూ కథను విశ్లేషిస్తారు. కథానుగుణంగా కాలాన్ని విశదీకించడంలో సినిమా సాహిత్యాలు రెండూ ప్రతిభ కనబరుస్తాయి.

ఫ్లాష్బ్యాక్ విధానంలో కథాకాలాన్ని ముందుకు వెనక్కు జరపడం రెండు మాధ్యమాల్లో మనం గమనించవచ్చు. అట్లాగే కాలాన్ని నిలిపివుంచే శక్తి సామర్థ్యాలు రెంతిలోనూ వున్నాయి. నవలల్లో తాత్విక చర్చల్లో, సినిమాల్లో ఫ్రీజింగ్ షాట్స్ తో కాలాన్ని నిలిపివుంచే క్రమం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా సినిమా సాహిత్యాలు రెండూ కాలానుగుణమైన కళాత్మక రూపాలే.

స్థలకాలాల కోణంనుంచి పరిశీలిస్తే రెంటిలో ఒక మౌళికమైన తేడా గోచరిస్తుంది. ణవల యొక్క ఫార్మేటివ్ ప్రిన్సిపుల్ కాలమే. అదే సినిమా యొక్క సూత్రం స్పేస్. ణవల స్పేస్ ని ఆమోదితంగా తీసుకుని కాలవిలువల ఆధారంగా తన కథనాన్ని తీసుకువెడుతుంది. ఈక సినిమా కాలాన్ని ఆమోదితంగా తీసుకుని స్పేస్ని ఆధారం చేసుకొని తన కథన రీతిని రూపొందిస్తుంది. నవల కాలానుగుణంగా కదుల్తూ స్థలానికి సంబంధించి తన కథన రీతిని రూపొందిస్తుంది. అదే సినిమా స్థలానుగుణంగా కదుల్తూ కాలాన్ని భ్రమింపజేస్తుంది. ఆలా సినిమాకి స్పేస్, నవలకి టైం అత్యంత ప్రాధానయత గల అంశాలని విదితమవుతుంది.

అయితే నవలని సినిమాగా రూపాంతరీకించే తీరులో దర్శకుడి ప్రతిభ ప్రధాన భూమిక పోషిస్తుంది. పేజీని స్క్రీన్ గానూ, పదాన్ని దృశ్యంగానూ మలచడానికి దర్శకుఇకి గొప్ప సృజనాత్మక కాల్పనికత అవసరమవుతుంది. సాహిత్య రచనలోని కథనో, కథనమో, భాష నిర్మాణ రీతో నచ్చినప్పుడు దాన్ని సినిమాగా రూపాంతరీకరించేందుకు చలనచిత్రకారుడు యత్నిస్తాడు. అయితే అన్ని రచనలు దృశ్యీకరణకు లొంగవు. ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంద్ దాస్ గుప్త మాటల్లో చెప్పాలంటే “సాహిత్యరనలోని కథ సినీ దర్శకుడి ఆలోచనలతో సంయోగం చెందుతుంది. సినిమాగా రూపాంతరం చెందినపుడు అందులోని ఆలోచనలతో అణువులు, పరమాణువులు నిర్మాణ రీతి, రూపురేఖలు మారిపోతాయి.”

సాహిత్య రూపాంతరీకరణలు సాధారణంగా రెండు రకాలుగా జరుగుతున్నాయి. మొదటి తరహా చలనచిత్రకారుడు మూలరచనకు రచయితకూ నిబద్ధుడై సాహిత్య రచనను ఉన్నది ఉన్నట్లుగా దృశ్యబద్దం చేస్తాడు. రెండవ రీతిలో దర్శకుడు మూల రచనలోని మౌళిక విషయానికి నిబద్ధుడై వుంటూనే దృశ్యలయని కళాత్మకరూపాన్ని సాధించేందుకు తనదైన ఆలోచనని ఊహాత్మకతని జోడించి చిత్రం చిర్మిస్తాడు. ఈ రెండు రకాల రూపాంతరీకరణలు విజయాల్ని సాధించాయి. చలనచిత్ర చరిత్రలో మనకు రెండూ కనిపిస్తాయి. కానీ మూల రచనకి దూరంగా జరిగి వికృతార్థంలో చలనచిత్రం రూపొందించినపుడు రూపాంతరీకరణ అపహాస్యం పాలవుతుంది.మన తెలుగుజాతి గర్వించే కన్యాశుల్కం నాటకాన్ని చలనచిత్రంగా మలచినపుడు సృష్టంగా ఇదే జరిగింది. సినిమా చివరన గిరీశంకు, బుచ్చమ్మకు పెళ్ళి జరిపించి గురజాడ మౌళిక ఆలోచననే అపహాస్యం చేసారు. చిత్రం మొత్తం మీద ఇంకా అనేక రీతుల్లో నాటకం స్వరూపాన్ని డిస్టర్బ్ చేసారు. అదే రీతిలో ప్రముఖ రచయిత ఆర్కే నారాయణ్ రచించిన విలక్షణమైన నవల ’గైడ్’ ను హిందీలో చలనచిత్రంగా మలిచారు. చిత్రంలో హీరో పాత్ర ధరించిన దేవానంద్ కు ఆనాడున్న స్టార్ డమ్ ను గమనిస్తూ ఆ పాత్రకి ప్రత్యేకమైన హీరో లక్షణాల్ని అపాదించడంతో చిత్ర మౌళిక స్వరూపమే దెబ్బతినిపోయింది. నిజానికి భారతీయ సాహిత్య రంగంలో బెంగాలీ రచయిత శరత్ చంద్ర నవలలు అధికంగా చిత్రరూపాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా సుప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ శరత్ రచించిన పలు నవలల్ని చలనచిత్రాలుగా మలిచాడు. మూల రచనకి అత్యంత నిబద్దుడై చిత్రాలు నిర్మించాడు. ఆయన నిర్మించిన ’దోభీగా జమీన్’ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి రచించిన చిన్న కథ ఆధారంగా నిర్మించాడు. ఆ కథను సలీల్ చౌదరి ఠాగోర్ రాసిన ఓ కవితను ప్రేరణగా తీసుకొని రాసాడు. ప్రముఖ రచయిత జరాసంధ రచించిన నవల ఆధారంగా ’బంధిని’, సుబోధ్ ఘోష్ నవలను ’సుజాత’ చిత్రంగా బిమల్ రాయ్ నిర్మించాడు.

హిందీ చలనచిత్ర రంగంలో భావయుక్తమైన కవితాత్మను ఆవష్కరించే దర్శకుడిగా పేరుగాంచిన గుల్జార్ కూడా పలు నవలల్ని సినిమాలుగా మలిచాడు. సుబోద్ ఘోష్ రచించిన జోద్ గృహ నవల ఆధారంగా ’ఇజాజత్’, సమరేశ్ బోస్ నవలల ఆధారంగా ’కితాబ్’, ’నమ్ కీన్’, శరత్ నవల ఆధారంగా ’ఖుష్‍బూ’ చిత్రాన్ని గుల్జార్ నిర్మించాడు. ఇలా బిమల్ మిత్ర రచన అధారంగా గురుదత్ నిర్మించిన ’సాహెబ్ బీబీ గులామ్’ ప్రధాన స్రవంతి చలనచిత్ర రంగంలో మైలురాయిగా మిగిలిపోయింది. చరిత్రాత్మమకమైన క్లాసిక్ నిర్మాణాన్ని కథనాత్మక పద్ధతిని ప్రతిభావంతంగా అనుసరించి గురుదత్ విజయం సాధించాడు. ఇక కె.ఎ. అబ్బాస్ తన రచనను సినిమాలుగా తీయడంతో పాటు ’ఆవారా’ లాంటి రాజ్ కపూర్ చిత్రాలకు రచనలను అందించి సినిమాకు సాహిత్యానికీ నడుమ వారథిలా నిలుచున్నాడు. రిత్విక్ ఘటక్ లాంటి చలనచిత్రకారుడు ’అజాంత్రిక్’, భారీ టేకే పాలియే’ తితాస్ ఏక్ తీనాదిర్ నామ్’ లాంటి విలక్షణమైన చిత్రాల్ని సాహిత్య రచనల నుండే రూపాంతరీకరించారు. బెంగాలీలో ప్రముఖ దర్శకుడు గౌతం ఘోష్ కిషన్ చందర్ నవల ’జబ్ ఖేతీ జాగే’ నవలను ఆధారంగా చేసుకొని తెలుగులో ’మా భూమి’ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం తెలుగులో నవ్య వాస్తవికతను ఆవిష్కరించింది. గౌతమ్ ఘోష్ మానిక్ బందోపాధ్యాయ నవల ఆధారంగా ’పద్మనదీర్ మంజి’ నిర్మించాడు. ఇంకా బెంగాల్లో అనేక రచనలు సినిమాలుగా నిర్మితమయ్యాయి. 1980 దశకంలో అత్యంత విజయవంతమైన నవ్య సినిమాగా వాసికెక్కిన ’అర్థ సత్య’ ను గోవింద్ నిహలానీ విజయ్ టెండూల్కర్ రాసిన ఒక చిన్న కథను ఆధారం చేసుకుని నిర్మించాడు. దిలీప్ చిత్రే రాసిన ఒక చిన్న కవిత ప్రేరణతో టెండూల్కర్ ఆ కథ రాసాడు. ఆ తర్వాత గోవింద్ నిహలానీ నిర్మించిన తమస్ దేశవ్యాప్తంగా ప్రకంపల్ని సృష్టించింది. టీవిలో సీరియల్ గా ప్రసారమైన ఈ చిత్రం భారతీయ ఉపఖండ విజనను అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించింది. అది భీష్మ సహానీ రచించిన ’తమస్’ నవల ఆధారంగా నిర్మితమైంది. ఇక నిహలానీయే ఇటీవల మహాశ్వేతాదేవి రచన ఆధారంగా ’హజార్ చౌరాసీకీ మా’ నిర్మించాడు. మహాశ్వేతాదేవి మరో రచన ’రుదాలి’ ని కల్పనాలాజ్మీ అత్యంత ప్రతిభావంతమైన చిత్రంగా మలిచారు.

కన్నడంలో సినిమాకీ సాహిత్యానికీ నాటకానికీ మధ్య మరింత దగ్గరి సంబంధం వుంది. పుట్టన కనగళ లాంటి వారు అనేక నవలల్నీ సినిమాలుగా నిర్మించినప్పటికీ కన్నడంలో నవ్య సినిమా ఉద్యమానికి పాదులు వేసిన ’సంస్కార’, ’వంశవృక్ష’ చిత్రాలు యుఆర్ అనంతమూర్తి, భైరప్పలు రచించిన నవలలు ఆధారంగానే నిర్మితమయ్యాయి. గిరీషి కర్నాడ్ ’మృచ్ఛకటికం’ ఆధారంగా ఉత్సవ్ చిత్రం నిర్మించారు. ఇక మలయాళ చిత్రాల విషయానిక వస్తే రామూ కరియత్ నిర్మించిన ’చెమీన్’, ఎం.టి.వాసుదేవన్ నాయర్ నిర్మించిన ’నిర్మాల్యం’ లు నవలలు ఆధారంగా నిర్మించినవే. అదూర్ గోపాల కృష్ణన్ నిర్మించిన ’మతిలుకల్’ మహమ్మద్ బషీర్ ఆత్మకథ ఆధారంగాను ’విధేయన్’ పాల్ జకారియా రచన ఆధారంగానూ నిర్మించారు. ఇంకా అనేక రచనలు మళయాలంలో సినిమాలుగా వచ్చాయి.

ఇలా అనేకమంది ఉత్తమ దర్శకులు భారతీయ భాషల్లోని అనేక సాహిత్య రచనలన్ని రూపాంతరీకరించి సినిమాలుగా మలిచారు. తెలుగు విషయానికి వస్తే విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర, కాళీపట్నం రామారావు ’యజ్ఞం’, కిషన్ చందర్ ’జబ్ ఖేతీ జాగే’ (మా భూమి), ప్రేమ్ చందర్ కఫన్ (ఒక వూరి కథ), సి.ఎస్.రావు ’ఊరుమ్మడి బతుకులు’, ఓల్గా ’తోడు’ లాంటివి చిత్రాలుగా వచ్చాయి. ఇంకా ప్రధాన  స్రవంతిలో యద్దనపూడి, మాదిరెడ్డి, రంగనాయకమ్మ లాంటి ఎందరో రచయిత్రుల నవలలు సినిమాలుగా రూపాంతరం చెందాయి. 80వ దశకం తర్వాత వ్యాపార నవలలు విస్తృత ప్రచారంలో ఉన్న తరుణంలో యండమూరి, కొమ్మనాపల్లి లాంటి రచయితల నవలలు కూడా వ్యాపార సినిమాలుగా రూపాంతరం చెందాయి. అయితే సాహిత్య నవలలు విషయానికి వచ్చినపుడు రావి శాస్త్రి ’అల్పజీవి’, శ్రీదేవి ’కాలాతీత వ్యక్తులు’, బుచ్చిబాబు ’చివరికి మిగిలేది’, గోపిచంద్ ’అసమర్ధుని జీవితయాత్ర’, విశ్వనాథ ’వేయిపడగలు’ లాంటి రచనలు సినిమాలుగా రాలేదు. అల్లం రాజయ్య లాంటి ప్రగతిశీల రచయితలు రాసిన నవలలు కూడా చలనచిత్రాలుగా రూపాంతరం చెందలేదు.

నవ్య సినిమారంగంలో వెనుకబడి ఉన్నట్టే మన తెలుగు సినిమా రంగం సాహిత్య రూపాంతరీకరణలో సైతం కళాత్మక విలువల్ని అందిపుచ్చుకోలేకపోయింది.

నిజానికి గత శతాబ్దంలో నవల ప్రధానంగా అద్భుతమైన నవ్యతనీ, ప్రయోగ శీలతనీ అందిపుచ్చుకుంది. విస్ఫోటనం లాంటి పదసృష్టితో, భావ పరంపరలతో నవల అభివృద్ధి చెందింది. అదే స్థాయిలో సినిమా కూడా మాంటేజ్ మొదలు అనేకానేక సాంకేతిక నిర్మాణపర ప్రయోగాలతో అంతే అభివృద్ధిని ప్రగతిని సాధించింది. అందుకే సినిమా సాహిత్యాల మధ్య సమన్వయం అడాప్టబిలిటి విలక్షణ ప్రక్రియగా మారింది. గొప్ప రచనల్ని గొప్పగా మలచినపుడు ఖచ్చితంగా గొప్ప చిత్రాలే వస్తాయి. రెండూ వేటికి అవిగానే కళాత్మక జగత్తులో చిరస్థాయిగా నిలుచుండిఫొతాయి, మిగిలిపోతాయి.

9 Comments
  1. కొత్తపాళీ October 8, 2008 /
  2. chandramouli October 8, 2008 /
  3. Sri October 16, 2008 /