Menu

ఎనిమీ ఎట్ ది గేట్స్

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944’ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941’ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941’ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్ ఎర్ర సైన్యాన్ని కదనరంగంలోకి ఉరికించాల్సిన అవసరం కల్పించిన రోజది. జెర్మనీకి వ్యతిరేకంగా సోవియెట్ యూనియన్ రంగంలోకి దిగకపోయుంటే రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు మరోలా ఉండేవనే విషయంలో చరిత్రకారులెవరికీ రెండో అభిప్రాయం లేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్-సోవియెట్ సైన్యాల మధ్య చెదురు మదురు సంఘటనలు, చిన్నా పెద్దా సైనిక చర్యలు, పోరాటాలు అనేక చోట్ల జరిగినా, వాటన్నిటిలోకీ తలమానికమైనది జెర్మన్ల చేత కీలక సోవియెట్ పారిశ్రామిక నగరం స్టాలిన్‌గ్రాడ్ ముట్టడి. ఓల్గా నది ఒడ్డునున్న ఈ నగరంపై పట్టు ఇరువర్గాలకూ వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. జెర్మన్ల బారినుండి స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోటానికి నగరవాసులు, రెడ్ఆర్మీ కలసికట్టుగా జరిపిన పోరాటం నభూతో.

జెర్మనీ-సోవియెట్ దళాల మధ్య జులై 1942 నుండి ఫిబ్రవరి 1943 వరకూ స్టాలిన్‌గ్రాడ్ వద్ద జరిగిన పోరాటం రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మిత్రరాజ్యాలకు అనుకూలంగా తిప్పింది. స్టాలిన్‌గ్రాడ్‌పై పట్టు కోసం ఇరు దేశాల మధ్య ఏడు నెలలపాటు జరిగిన హోరాహోరీ పోరులో అసువులుబాసిన వారి సంఖ్య అక్షరాలా పదిహేను లక్షల పైమాట! ప్రపంచ చరిత్రలో ఇంతకన్నా రక్తపాతం జరిగిన పోరాటం మరోటి లేదు. జెర్మనీ ఈ నగరాన్ని వశపరచుకోవటం అంటే సోవియెట్ సైన్యానికి ప్రాణాధారమైన ఇంధన నిల్వలున్న కాకస్ ప్రాంతం మీద పట్టు సాధించటమే. స్టాలిన్ పేరుతో ఉన్న ఈ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటం హిట్లర్‌కు ప్రతిష్టాత్మకం కూడా. ఇవే కారణాలవల్ల స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోవటం సోవియెట్లకు మరింత ముఖ్యం.

స్టాలిన్‌గ్రాడ్‌పై ఏడు నెలలపాటు ఏకబిగిన జరిపిన ముట్టడి విఫలమవటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్ల తిరోగమనం మొదలయింది. స్టాలిన్‌గ్రాడ్ విజయానంతరం రెడ్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో జెర్మనీలోకి చొచ్చుకుపోయి అంతిమంగా బెర్లిన్‌ని ఆక్రమించుకోవటం, హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటంతో ఒక మహా మారణహోమానికి తెరపడింది. ఆ విధంగా, స్టాలిన్‌గ్రాడ్ పోరాట ఫలితం ప్రపంచ భవిష్యత్తునే మార్చేసిందనటం అతిశయోక్తి కాదు. అయితే ఈ పోరాటంలో మొదట సోవియెట్లు భీకరమైన ఎదురుదెబ్బలు తిన్నారు. ఒకానొక దశలో నగరం అంతా జెర్మన్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ఎందరు సైనికులని కోల్పోయినా సరే, నగరాన్ని తిరిగి స్వాధీన పరచుకోవాలన్న స్టాలిన్ హుకుం కారణంగా రెడ్ ఆర్మీ మొండిగా పోరాటం కొనసాగించింది. ఇరు దళాల విచక్షణారహిత బాంబుదాడుల్లో స్టాలిన్‌గ్రాడ్ పూర్తిగా శిధిలమైపోయింది. ఫ్యాక్టరీలన్నీ నేలమట్టమైపోయాయి. జెర్మన్ల ప్రత్యక్ష దాడులు తట్టుకోలేని రెడ్ ఆర్మీ ఓ దశలో గెరిల్లా తరహా యుద్ధ తంత్రాలు అమలు చేసింది. ఆ తరుణంలో, వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో అడుగంటిన సోవియెట్ ఆత్మవిశ్వాసం తిరిగి ఆకాశాన్ని తాకేలా చేసిన పేరు ‘వస్సిలి జైత్సెవ్’.

వస్సిలి జైత్సెవ్ – పశ్చిమ రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతాలనుండి వచ్చి రెడ్ ఆర్మీలో చేరిన ఒక నిరక్షరాస్యుడు, గొర్రెలకాపరుల కుటుంబానికి చెందినవాడు. రెడ్ ఆర్మీలో అతి తక్కువ స్థాయిలో పనిచేసే ఈ సైనికుడి గురించి ఎవరికీ తెలియకపోయేదే – స్నైపర్‌గా అతని అద్భుత ప్రతిభని ఒకానొక సైన్యాధికారి స్వయంగా గమనించకపోయుంటే. కేవలం ఐదు గుండ్లు మిగిలున్న రైఫిల్‌తో ఐదుగురు జెర్మన్ సైన్యాధికారుల్ని మాటువేసి క్షణాల్లో మట్టుబెట్టిన అతని గురికి అబ్బురపోయిన ఆ సోవియెట్ అధికారి ఇతని గురించి సైనిక అధికారిక పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలతో జైత్సెవ్ రాత్రికి రాత్రే సోవియెట్ యూనియన్‌లో హీరో అయిపోయాడు. అప్పటినుండీ స్టాలిన్‌గ్రాడ్‌లో తిష్టవేసి ఉన్న జెర్మన్ అధికారులను మట్టుపెట్టే బాధ్యత ఇతని చేతిలో పెట్టబడింది. 1942 నవంబర్ 10 నుండి డిసెంబర్ 17 మధ్యకాలంలో ఇతను 225మంది జెర్మన్ సైనికులను మాటువేసి అంతుచూశాడు. జైత్సెవ్ వద్ద శిక్షణ పొందిన సోవియెట్ స్నైపర్లు సుమారు మూడువేల మంది ప్రత్యర్ధులను మట్టుబెట్టినట్లు అంచనా. యుద్ధానంతరం జైత్సెవ్‌కి సోవియెట్ సైన్యంలోని అత్యున్నత మెడల్ ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ లభించింది. అతని రైఫిల్ ఇప్పటికీ స్టాలిన్‌గ్రాడ్ (ఇప్పుడు వోల్వోగ్రాడ్) మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

* * * * * * * *

నలుపు-తెలుపు చిత్రాల జమానా నుండీ యుద్ధగాధలను తెరకెక్కించటమంటే హాలీవుడ్‌కి తగని మక్కువ. ‘కాసాబ్లాంకా’ (1942) నుండి నిన్నామొన్నటి ‘300’ దాకా ఎన్నెన్నో అద్భుత చిత్రాలు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో వచ్చిన చిత్రాలయితే కోకొల్లలు. అయితే, డి-డే ఆధారంగా ‘వేర్ ఈగిల్స్ డేర్’, ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’, ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’ వంటి సినిమాలు, పెర్ల్ హార్బర్ దాడి నేపధ్యంలో ‘ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ’, ‘టొరా-టొరా-టొరా’, ‘పెర్ల్ హార్బర్’ వంటి చిత్రాలు రూపొందాయి కానీ వాటిని మించిన ప్రాముఖ్యత ఉన్న స్టాలిన్‌గ్రాడ్ ముట్టడిపై ఈ మధ్యకాలందాకా హాలీవుడ్ దృష్టి సారించకపోవటం విశేషం. ప్రధానంగా అమెరికన్ ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడిన హాలీవుడ్ చిత్రాల్లో నాటి శత్రువు సోవియెట్ యూనియన్ విజయాలను ప్రస్తుతించేలా తీసే సినిమాలకు ఆదరణ ఉండదన్న అనుమానం దానికో కారణం కావచ్చు.

అయితే ప్రఛ్చన్న యుద్ధానంతరం సగటు అమెరికన్లలో రష్యన్ల పట్ల తగ్గుతున్న విరోధభావానికి సూచికగా హాలీవుడ్‌లోనూ మార్పు మొదలైంది. దానికి ఉదాహరణే స్టాలిన్‌గ్రాడ్ పోరులో వస్సిలి జైత్సెవ్ సాధింఛిన రోమాంఛిత విజయాల ఆధారంగా 2001లో పారామౌంట్ పిక్చర్స్ వారు మరో రెండు బ్రిటిష్ చిత్ర నిర్మాణ సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’. జూడ్ లా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోల్డ్ మౌంటెన్, రోడ్ టు పెర్డిషన్), జోసెఫ్ ఫియెన్నెస్ (ఎలిజబెత్, షేక్‌స్పియర్ ఇన్ లవ్, లూధర్), రేఛల్ వైజ్ (ది మమ్మీ, రనవే జ్యూరీ, ది కాన్స్‌స్టంట్ గార్డెనర్), ఎడ్ హ్యారిస్ (అపోలో-13, రేడియో, నేషనల్ ట్రెజర్:బుక్ ఆఫ్ సీక్రెట్స్) వంటి ప్రతిభావంతులైన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో గత దశాబ్ద కాలంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలలో ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఇది. ఈ చిత్ర కధ ప్రధానంగా వస్సిలి (జూడ్ లా), అతని జెర్మన్ ప్రత్యర్ధి మేజర్ ఎర్విన్ కానిగ్ (ఎడ్ హ్యారిస్) ల మధ్య నడిచే దాగుడుమూతలాట. నిజ సంఘటనలకు కొంత కల్పన జోడించి దర్శకుడు జీన్-జాక్వెస్ అనౌడ్ (సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్) తీసిన ఈ సినిమా యుద్ధ నేపధ్యంలో రూపొందిన ఆణిముత్యాల్లో ఒకటి.

భీకరమైన బ్రిటిష్ యాసతో మాట్లాడే జూడ్ లా, రేచల్ వైజ్ లను రష్యన్లుగా చూపటం, అచ్చమైన అమెరికన్ యాసలో సంభాషణలు పలికే ఎడ్ హ్యారిస్ ను జెర్మన్ సైన్యాధికారి పాత్రలో నటింపజేయటం మీద విమర్శలున్నా నిజజీవిత పాత్రలను నూటికి నూరుపాళ్లు అనుకరించే ప్రయత్నం చేయకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త అది. ఈ సినిమాలోని చారిత్రక సత్యాల వక్రీకరణపై కూడా విమర్శలొచ్చాయి. అయితే ఎంత చరిత్ర ఆధారంగా తీసినదైనా ఇది ఓ వ్యాపార విలువలున్న సినిమా మాత్రమే, డాక్యుమెంటరీ కాదు. కధాగమనాన్ని ఆసక్తికరంగా మలచటానికి ఆ మాత్రం వెసులుబాటు దర్శకుడు తీసుకోవటంలో తప్పులేదు.

యుద్దం అనగానే ట్యాంకులు, పేలుళ్లు, విమానాల దాడులు, వేలాది మంది సైనికుల గుంపులు అనే మూస ఒరవడికి భిన్నం ఈ చిత్రం. అక్కడక్కడా అవన్నీ ఉన్నా, చిత్ర కధ మాత్రం ప్రధానంగా ఒకరినొకరు తుదముట్టించటానికి ఇద్దరు ప్రత్యర్ధి స్నైపర్ల మధ్య ఎత్తులు, పైఎత్తులతో సాగే చదరంగం. మధ్యలో వచ్చిపోయే అనేక సహాయ పాత్రలు, వాటిలో గుర్తుంచుకోదగ్గది బాబ్ హాస్కిన్స్ పోషించిన నికితా కృశ్చేవ్ పాత్ర. ఇతర యుద్ధ చిత్రాలకు భిన్నమైన క్లైమాక్స్ ఈ చిత్రంలో ప్రత్యేకత. క్లైమాక్స్‌లో కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే పేలుతాయిక్కడ.  యుద్ధవాతావరణాన్ని కళ్లకు కట్టే భారీ సెట్టింగులు, అద్భుతమైన కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర హంగులతో రూపొందిన ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ సాంకేతికంగా ‘బ్లాక్‌హాక్ డౌన్’, ‘వియ్ వర్ సోల్జర్స్’ వంటి యుద్ధ కావ్యాలతో పోల్చదగ్గది.

యుద్ధగాధలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడవలసిన సినిమా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’.

–అబ్రకదబ్ర

7 Comments
  1. srikanth October 24, 2008 /
  2. నవీన్ గార్ల October 24, 2008 /
  3. శంకర్ October 24, 2008 /
  4. ravi October 24, 2008 /
  5. Arvind Rishi October 27, 2008 /
  6. srivasuki January 23, 2010 /