Menu

Drona (2008)

ద్రోణ గురించిన టాక్ సినిమా వచ్చాక కంటే వచ్చే ముందే ఎక్కువ ఉండింది అనిపిస్తోంది ఇప్పుడు. నిన్ననే ఈ సినిమా చూశాను. చిన్నపాటి పరిచయ వ్యాసం ఇది.

సినిమా కథ విషయానికొస్తే, ఇదో సూపర్ హీరో కథ. ఆది అనబడు హీరో అభిషేక్ బచ్చన్ ఒక కుటుంబం పెంపకంలో పెరిగి పెద్దవాడౌతాడు. ఆ కుటుంబం మరి అతన్ని ఎందుకు పెంచుతోందో అర్థం కాలేదు కానీ, హ్యారీపాటర్ లాగా ఇందులో కూడా ఆ కుటుంబసభ్యులకి అతనంటే పడదు. అతనికి చిన్నప్పట్నుంచి ఏవో కలలు వస్తూ ఉంటాయి. వాటి మూలం అతనికి అంతు పట్టదు. పెద్దవాడయ్యాక ఒకసారి రిజ్ రిజాదా అన్న మాంత్రికుడి ప్రదర్శనకి వెళతాడు. అక్కడే మాంత్రికుడికి తనకి అమృతం తెచ్చిపెట్టగల “ద్రోణ” ఆదినే అన్నది అతని చేతికున్న కంకణం చూడగానే అర్థమౌతుంది. అక్కడ్నుంచి ఆదిని రిజాదా మనుష్యులు వెంటాడుతూ ఉంటే, సోనియా (ప్రియాంకా చోప్రా), ఇతర సభ్యులు అతన్ని రక్షిస్తారు. ఈ రక్షించిన వారు – “ఈ ప్రపంచాన్ని వినాశనం నుండి రక్షించగలిగేవాడు ద్రోణ ఒక్కడే” అనే కల్ట్ అనుయాయులు. ఆది కే తెలియకుండా అతన్ని కనిపెడుతూ ఉంటారు. ఇక ఆది ద్రోణ అయ్యే సమయం ఆసన్నమైందని సోనియా అతన్ని అతని తల్లి (జయాబచ్చన్) అయిన ప్రతాపఘడ్ మహారాణి జయంతి దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ్నుంచి కథ ఇక ద్రోణ రిజాదా కుతంత్రాలను ఎలా ఎదుర్కొని గెలిచాడు అని.

సినిమా విజువల్స్ పరంగా చూస్తే బాగుంది. చాలా ఖర్చుపెట్టి తీశారని తెలుస్తూనే ఉంది. చాలా కష్టపడ్డారు కూడా ఆ సెట్లకోసం అని అర్థమౌతోంది. కానీ, కథనం సరిగా లేదేమో అనిపించింది. చూసేవారిని కుర్చీల్లోంచి కదలకుండా రెండున్నరగంటలు కూర్చోబెట్టేంత పట్టు ఈ కథనంలో లేదు. హాలీవుడ్ సినిమాలంత బిల్డప్ ఇచ్చినప్పుడు, ఆ మాత్రం శ్రద్ధ తీసుకోకుంటే ఎలా? కే.కే.మీనన్ మాంత్రికుడి పాత్రలో బాగా చేశాడు. ఆ గెటప్ కాస్త నవ్వు తెప్పించేలా ఉంది కానీ, నటనపరంగా బాగా చేశాడు. అభిషేక్, ప్రియాంకాలు ఇద్దర్లో ఎవరు చెక్కమొహం ఎక్కువసేపు పెట్టుకున్నారో? అన్న సందేహం వచ్చేంత పోటీ పడ్డారు ఇద్దరూ. సంగీతం బానే ఉంది. కొన్ని కొన్ని చోట్ల నేపథ్య సంగీతం బాగా అమరింది. విజువల్ అప్పీల్ ఉంది కానీ, గోల్డీ బెల్ దర్శకత్వం అంత గొప్పగా అనిపించలేదు నాకు.

మొత్తానికైతే మీకింకేం పనిలేదని ఫిక్సయితే చూసేయండి వెళ్ళి ద్రోణ ని. కానీ, దీనికంటే బెటర్ సినిమాలు ఉండే ఉంటాయి పక్క థియేటర్లలో. ఓ సారి చెక్ చేసుకోండి.

6 Comments
  1. రత్నాకర్ సదస్యుల October 14, 2008 /
  2. శోభ October 14, 2008 /
  3. chaitanya October 14, 2008 /