Menu

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

ఫ్రాంక్ మిల్లర్ వ్రాసిన గ్రాఫిక్కు నవల ‘డార్క్ నైటు రిటన్స్’ వల్ల బాట్మాన్ పాత్రకి తిరిగి ప్రాణం వచ్చిందనే చెప్పువచ్చు. అంతకు మునుపు, మరిం కెవరూ పెద్దగా పట్టించుకోక కుంటు పడుతున్న పాత్రయి కూర్చున్న బాట్మానుని పట్టుకుని వాడి ఉనికినే మార్చేసి, ఓ డార్క ఫోర్స్ గా తీర్చి దిద్దిన ఫ్రాంక్ మిల్లర్ కి డీసీ కామిక్సు వాళ్ళు ఎంతో ఋణపడి ఉండాలి.

ఒకానొక సమయంలో వెండి తెర మీద కూడా బాట్మాన్ కి తిలోదకాలందాయి. జోయెల్ షూమాకర్ తీసిన బాట్మాన్ & రాబిన్ చిత్రం దెబ్బ పుణ్యా మాని పెద్ద సినీ నిర్మాణ సంస్థలన్నీ బాట్మాన్ దరిదాపుల్లోకి కూడా రావడానికి భయపడ్డాయి. చనుమొనలున్న బాట్కవచం తొడుగిన జార్జి క్లూనీ ఓ సారి నిర్మొహమాటంగా తామే బాట్మాన్ని తెరనుండి శాశ్వతంగా గెంటేసామేమో నని వాపోయాడు కూడా. అప్పట్లో, ప్రస్తుతపు సూపర్మాన్ కన్నా దైన్యస్థితికి బాట్మాను చేరుకున్నాడనే అనుకోవచ్చు.Enter Christopher Nolan!

బాట్మాన్ బిగిన్స్ ఆ పాత్రకి వెండి తెరమీద ఖచ్చితంగా ఓ గొప్ప మలుపు. అసలు తరువాత రాబోయే డార్కనైట్ చిత్రం అందుకోబోయే అనూహ్యమైన ప్రజాదరణకి నాందీ వచనం అప్పటిదే. నోలన్ తీసిన మొదటి విడత బాట్మాన్ పాత్రకి కొత్త మలుపైతే, రెండోది సూపర్ హీరోల చిత్రాలన్నిటికీ ఓ కొత్త మలుపునిచ్చింది. ఎంతంటే, బ్రాండన్ రౌత్ ని సూపర్మాన్ నుంచి గెంటేసి, డార్క్ సూపర్మాన్ని మన ముందుంచే ప్రయత్నంలో ఉంది వార్నర్ సోదరుల సంస్థ. నిజానికి, డార్కనైట్ ఢంకామ్రోతకి ముందు సూపర్ హీరోలని స్పైడర్ మాన్ లా తీర్చిదిద్దాలనేదే అందరి తపన – అలాంటి పోకడల వల్లే అన్ని వైపులనుండీ నలిగిపోయే సున్నిత మనస్కుడైన సూపర్ మాన్ని మనం చూడగలిగాం, చివరకి ప్రతినాయకుడి కన్నా బేలగా అనిపించిన వాణ్ణి తిరగ తన్నగలిగాం కూడా.

డార్కనై టంతటి విజయం సాధించడానికి కారణాలేమిటి?

సినిమా విడుదలకు ఆరు నెలలుండగా హీత్ లెజర్ చనిపోవడం, జోకర్ లా అతడు బెదరగొట్టి అదరగొట్టడాని తెలియడం – ఈ రెండు కారణాల వలన ప్రేక్షకులలో విపరీతమైన ఉత్కంఠ పెరిగింది. ఏం చూపెట్టినా నిజానికి దగ్గరగా ఉండాలనే నోలన్ ఆజ్ఞానుసారంగా మొదటి భాగంలో తీర్చిదిద్దబడిన సన్నివేశాలను, సెట్లను చూసి జోకర్ని ఎలా చూపించాడో అన్న కుతూహలం ప్రేక్షకులలో పెరగడం సహజం. మొదటి విడత వల్ల అతడి ప్రతిభ మీద జనానికి నమ్మకం ఉండనే ఉంది.

అది మొదలుకొని, సినిమా విడుదలకు రెండు మూడు వారాల ముందు నుండి చిరుజల్లుల్లా కురిసిన సమీక్షలు. అవన్నీ ముక్తకంఠంతో ఒప్పుకున్న విషయ మేమిటంటే – మొదటి దానికన్నా రెండవ విడత మెరుగ్గా ఉన్నదని. బాట్మాన్ పిచ్చి పెచ్చిన ప్రేక్షకులకి పూనకం తెప్పించడాని కది చాలు. పైగా, కొందరు సమీక్షకులు చిత్రాన్ని ఆకాశాని కెత్తేసి ‘జాన్రా-రీడీఫైన్డ్’ అని పొగిడేయడం తో, చొంగ కారుస్తూ ఎదురుతెన్నులు చూస్తున్న వారి అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.

అంతటి భారీ అంచనాలని భుజాల మీద మోస్తూ విడుదలై కూడా అధిక శాతం జనాన్ని సంతృప్తి పరిచిందీ చిత్రం – అది నిజంగా విచిత్రమే. బాట్మాన్ చిత్రాలలో సాధారణంగా ప్రతినాయకులదై పైచేయిలా ఉంటూ వచ్చింది – నోలన్ మొదటి విడతలో దాన్ని మార్చి బ్రూస్ వేన్ని ముందు నిలబెట్టాడు, హీత్ లెజర్ వల్ల రెండో దాంట్లో అది జరిగే ఆవకాశం లేకపోయింది. కానీ, అదేమీ పెద్ద లోటుగా అనిపించదు.

నేనైతే, ఆగకుండా ఒకదాని తరువాత ఒకటై వస్తున్న మలుపులని ఊపిరిబిగపట్టి చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ – హైదరాబాదు గల్లీల్లో నోట్లో పట్టనంత పానీపూరి మింగిన తరువాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అదిరిందిరో యని ఎలా అనుకునే వాణ్ణో అలాగే – హాలు నుంచి బైట పడ్డాను. సినిమా రాటన్ టమాటోస్ లో తొంభై ఐదు శాతం తాజాతనాన్ని ఎలా సాధించిందో అర్థం చేసుకున్నాను.

మున్ముందు రాబోతున్న వాచ్మెన్ చిత్రము, అటుపైన రానున్న మిగతా సూపర్ హీరో చిత్రాలూ ఈ పంథాలోనే నడవడానికి (ఎగరడానికి) ప్రయత్నిస్తాయని నా నమ్మకం.

సారాంశాన్ని ఓ సీసంలో చెప్పాలంటే,

సీ. పంచ భక్ష్యంబు లందించు కలగలపు నొక్కటే ముద్దలో నోలనదిమె*

చక్కటి కథనెంచె చకచకా నడిపించె పట్టుసడలనీక కట్టుజేసె

చక్కటి పాత్రల చక్కటి సన్నివేశముల ధీటుగ చెక్కి చక్కదిద్దె

కామిక్కులా కాక గ్రాఫిక్కు నవలలా డార్కుథీమున కూర్చె డార్కునైటు

ఆ.వె. మ్రింగిరందరిట్టి మృష్టాన్న విందుల

నెంత తిన్నకాని కొంతవడెను

మ్రింగె డార్కునైటు మెండు రికార్డుల

నోడ** యొకటె తుదకు నోడలేదు

* Nolan + అదిమె

** టైటానిక్

–గిరి లంక

4 Comments
  1. F1 October 14, 2008 /
  2. కొత్తపాళీ October 27, 2008 /
  3. గిరి December 13, 2008 /