Menu

బెల్లా

సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ తిరుగుతుంది: ప్రేమ, దయ, కుటుంబం. హింస, అశ్లీలత, గ్రాపిక్స్ మాయాజాలం, భారీ సెట్టింగుల మూస ఒరివడిలో కొట్టుకు పోతున్న హాలీవుడ్ చిత్రాల మధ్యలో బెల్లా ఓ పిల్లగాలి తెమ్మెర.

హోసె న్యూయార్క్ నగరంలో తన అన్న మానీ నడిపే రెస్టారెంట్‌లో ప్రధాన వంటవాడు. ఇతనిది అమెరికాలో స్థిరపడిన మెక్సికన్ కుటుంబం. అదే రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసే నినా ఒక రోజు ఆలస్యంగా రావటంతో మానీ ఆగ్రహోదగ్రుడై ఆమెని ఉద్యోగం నుండి తొలగిస్తాడు. ఒకే చోట పని చేస్తున్నా హోసె, నినాలకు పెద్దగా పరిచయం ఉండదు. అయితే స్వతహాగా మంచివాడైన హోసె, నినా తొలగించబడిందని తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. దారిలో ఆమెని కలిసి ఆలస్యంగా వచ్చిన కారణమడుగుతాడు. తాను గర్భంతో ఉండటం వల్ల రావటం ఆలస్యమయిందని నినా చెబుతుంది. ఆమెకంటూ ఓ కుటుంబం ఉండదు. ఆమె కధ విని జాలిపడ్డ హోసె నినాకి సహాయ పడటానికి ప్రయత్నిస్తాడు. పేదరికంలో ఉన్న నినా బిడ్డని కనే ధైర్యం చేయలేక గర్భస్రావం చేయించుకునే ఆలోచనలో ఉంటుంది. అది తెలుసుకున్న హోసె ఆమెని ఎలాగైనా ఆ పని చేయకుండా ఆపటానికి ఆరాటపడతాడు. పెద్దగా పరిచయం లేని ఓ స్త్రీ అబార్షన్ చేయించుకోబోతే ఇతను అంతగా బాధ పడటానికో కారణముంది. ఆ కారణం ఏమిటి, ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాడయిన హోసె క్రీడాప్రపంచానికి దూరంగా ఒక సాధారణ రెస్టారెంట్‌లో వంటవాడిగా ఎందుకు పనిచేస్తున్నాడు, నినా అబార్షన్ చేయించుకుందా లేదా, చివరికి ఏమయింది, అసలింతకీ ‘బెల్లా’ ఎవరు – లాంటి వివరాలు సినిమా చూడాలనుకునేవారి కోసం నేను వెల్లడించట్లేదు.

ఈ సినిమాలో తారాబలం లేదు. ఉందంతా కధా బలమే. ఉన్నంతలో పెద్ద స్టార్ ప్రముఖ మెక్సికన్ నటుడు ఎడ్వార్డో వెరాస్తెగీ (మెక్సికన్ బ్రాడ్ పిట్ గా ఇతనికి పేరు. ఆంతోనియో బందెరాస్ తర్వాత హాలీవుడ్‌లో అంత పేరున్న మెక్సికన్ నటుడితను). పుట్టుకతో కేథలిక్ అయిన ఎడ్వర్డో అబార్షన్‌లకు వ్యతిరేకి. కొన్నేళ్ల పాటు అందరు నటుల్లాగానే మసాలా చిత్రాల్లో నటించాక ఎడ్వార్డో తనా నమ్మకాలకు విరుద్ధమైన చిత్రాల్లో నటించకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. ‘బెల్లా’ దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ ఈ కధతో ఎడ్వార్డోని కలిసినప్పుడు కధలోని గాఢతకి కదిలిపోయి, దాన్లో నటించటమే కాకుండా నిర్మాణంలో కూడా భాగం పంచుకోటానికి ముందుకొచ్చాడతడు.

అలెజాండ్రో గోమెజ్ రూపొందించిన ఈ సినిమా దర్శకుడిగా అతనికి మొదటిది. ఈ చిత్రంతో అతను ప్రముఖ దర్శకుడిగా మారిపోయాడు. 2007లో విడుదలైన ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. అంతర్జాతీయ చిత్రోత్సవాలు అన్నింటిలోనూ పెద్దదిగా పేరొందిన టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వాటిలో ఒకటి. యాహూ పాఠకుల ఆల్ టైమ్ ఫేవరిట్ చిత్రాల జాబితాలో ఇరవై రెండో స్థానం పొందిందీ చిత్రం (ఈ జాబితా స్థిరంగా ఉండదు). గుబురు గెడ్డంతో ఏప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా ఉండే హోసె పాత్రలో నటించిన ఎడ్వార్డో కళ్లలో పలికించిన కరుణ ఈ సినిమా చూసినవారిని కొన్నాళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. నీనా పాత్రలో నటించిన ట్యామీ బ్లాంచర్డ్, మానీగా నటించిన మానీ పెరెజ్, హోసె తండ్రి పాత్రలో జైమీ టిరెల్లి, తల్లి పాత్రలో ఏంజెలికా అరగాన్ కూడా ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ‘ఫీల్ గుడ్’ తరహా చిత్రాలు చూడాలనుకునే వారి జాబితాలో తప్పక ఉండవలసిన సినిమా ‘బెల్లా’.

–అబ్రకదబ్ర

5 Comments
  1. srikanth.M October 21, 2008 /
  2. కొత్తపాళీ October 21, 2008 /
  3. Venkat October 24, 2008 /
  4. విజయ్ నామోజు January 20, 2009 /