Menu

ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి?

ఒక సినిమా ఒప్పుకునే ముందు — ఆ సినిమా నిర్మాతతో అందులో పనిచేసే ముఖ్యనటవర్గం,సాంకేతిక నిపుణులు ఒక ఒప్పందాన్ని రాసుకుంటారు.ఇది సినిమా నిర్మాణం తొలిరోజుల్నుంచీ వస్తున్న ఆనవాయితీయే.1945లో తనతొలొ చిత్రం ’వరూధిని’లో నటించడానికి
కీ.శే.యస్.వి.రంగారావు ఆ చిత్ర నిర్మాత-దర్శకుడు బి.వి.రామానందంతో చేసుకున్న అగ్రిమెంట్ ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందని ఇక్కడ ప్రచురిస్తున్నాము.
ది.21-10-1945 సంii తేదీని రాజమండ్రి తాలూకు ధవిళేశ్వరము గ్రామము సామర్ల బిల్డింగ్సులో
నివశించుచున్న తెలగా కులస్తులు సామర్ల కోటేశ్వరరావుగారి కుమారుడు వెంకటరంగారావు,ఫిల్ముప్రొడ్యూసర్ డైరెక్టరు అగు బి.వి.రామానందం గార్కి రాయించి ఇచ్చిన అగ్రిమెంటు.
1.మోడరన్ థియేటర్స్,సేలంలో తీయబోయే తెలుగు ఫిల్ములోమీరు నాకు నిర్ణయించిన రెండు పాత్రలు (కృష్ణదేవరాయ,ప్రవరాఖ్యుడు)నేను యాక్టు చేయుటకుగాను,అందులకుగాను,తొంబదిరోజులకు రూ.750-అక్షరాలా ఏడువందల యేబదిరూపాయలు మీరు నాకు ఇచ్చుటకున్ను,
2.నాపార్టులు పూర్తి అయ్యేవరకు మీవద్ద వుండి నేను పని పూర్తి చేయుటకును,ఒకవేళ తొంబదిరోజులలోపలనే నా పార్టులు పూర్తి అయిపోయిన యెడల నిర్ణయించిన మొత్తము యావత్తు నాకు మీరు ఇచ్చుటకును,ఒకవేళ నాకు నిర్ణయించిన పాత్రలు పూర్తిగాక పోయిన యెడల తొంబదిరోజులకు పైన నేను యింకనూ ఉండవలసివచ్చిన   పైన నిర్ణయించిన మొత్తము నేను పైన నిర్ణయించిన రోజులకే పైగా పనిచేసిన దానికి ప్రోరేటా చొప్పున మీరు నాకు ఇచ్చుటకును,
3.మీరు నన్ను రమ్మన్నచోటికి 1945 ఫిబ్రవరి.15వ తారీఖులోపుగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వచ్చుటకును రానుపోను 3వక్లాసు రైలు ఖర్చులు భోజనము వసతి నేను ఉన్నంతకాలము మీరు నాకు యిచ్చుటకును,
4.అచ్చట మీరు నాకు యిచ్చు భోజనము అనగా(వుదయమున కాఫీ12 గంటలకు కాయగూరలతో భోజనము సాయంకాలము’టీ’రాత్రి 8గంటలకు కాయగూరలతో భోజనము)వసతికి అంగీకరించి నేను మీవద్ద పనిచేయునంతకాలము అచ్చటనేవుండెదను.
5.మీరు ఈ రోజున ఈ ’ఎగ్రిమెంటు కాలమందు యిచ్చిన రూ.150/అక్షరాలా నూట యాభైరూపాయలు ఎడ్వాన్సుగా ఇచ్చినారు గాన ముట్టినది.ఈరోజు పుచ్చుకున్న ఎడ్వాన్సు  మొత్తము సొమ్ములో నుంచి పోను మిగతా రూ.600 అక్షరాలా అరువందల రూపాయలు మాత్రమే పుచ్చుకొనుటకున్నూ  మీరు ఎడ్వాన్సుగా ఇచ్చిన సొమ్ము మొత్తము  అచటికి చేరిన రొజుమొదలు 30రోజుల అనంతరం నాకు నా సొమ్ములో నుండి  నెలకి 1కి వచ్చు డివిడెండు సొమ్ములోనుండి మొదటి నెలలోనేమినహాయించుకోగా మిగతాసొమ్ము మాత్రమే మీరు నాకు ఇచ్చుటకునూ-
6.  ఈ ఎగ్రిమెంటు మీరు ఫిల్ము తీయబోయే వూరికి మీరు తెలియపరచిన వెంటనే  అచటికి చేరినరోజునుండి అమలులోకి వచ్చును.
7.మీరు నిర్ణయించిన టైముకు రాత్రిగాని,పగలు గాని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రిహార్సులకు పాత్ర ధరించుటకు,ఫిల్ము షూటింగుకు  హాజరు కాగలవాడను.
8.మీరు నిర్ణయించిన డైరెక్టరు,మ్యూజికల్ డైరెక్తరు,ప్రొడక్షనుమేనేజరుగార్ల  అనుమతిని అనుసరించి నేను నాపాత్రను ఎట్టి విధములైన ఆటంకములు చెప్పక యాక్తు చేయుటకును–
9.ఫిల్మ్ షుటింగులను అనుసరించి  మీకునేను అవసరమని తోచిన ఎడల ఎట్టి ప్రదేశమునకు గాని  మీసొంతఖర్చుపై వచ్చి  మీపని పూర్తి చేయగలవాడను.
10.వ్రాతపూర్వకమైన మీఅనుమతి లేనిదే నేను  మీ వద్దవుండునంత కాలము మరియొక ఫిల్ములో యాక్టుచేయుటకు గాని ,నాటకములు మొదలైన వాటిలో పాల్గొనుటగాని, వగైరాలు చేయు వాడను గాను,మరియు మీ ఆర్డరు లేనిదే మీరు నాకిచ్చిన వసతి గృహము విడిచివెళ్ళువాడను గాను.
11.నాపాత్రలు అయిన తర్వాత మీవద్ద రిలీజు ఉత్తరము పొందినగాని,నా వూరుగాని,మరియే యితరప్రదేశమునకు గాని వెళ్ళువాడనుగాను.

12.మీ రిలీజు ఉత్తరము పొందిన తర్వాత యేకారణము చొప్పుననైననూ నాపార్టు చెడిపోయిననా యడ్రసుకు మీరు తెలియపరచిన తక్షణము మీ ఖర్చులపైన మీరు రమ్మను ప్రదేశమునకు వెంటనే బయలుదేరివచ్చి నాపార్టు యాక్టు చేయగలవాడను.అందులకు గాను పైన నిర్ణయించిన
మొత్తమునుండి   నేనుమరలా యాక్టు చేసిన నెలలకు గాని,రోజులకు గాని  యీ ఎగ్రిమెంటు 2వ క్లాజుననుసరించి ప్రోరేటా ప్రకారము పుచ్చుకోగలవాడను.

13.ఏకారణము వల్లనైననూనన్ను గురించి ఫిల్ము షూటింగు ఆగిపోయినయెడల అట్టి రోజునకు,నాకు వచ్చు రెమ్యూనరేషన్ నామొత్తము సొమ్ములోనుండి తగ్గించిపుచ్చుకొనుటయేగాక మీకు వచ్చే నష్టపరిహారము మొత్తము నావద్దనుండి మీరు రాబట్టుకొనుటకు మీకు అన్ని హక్కులు కలిగియున్నవి.

14.పైన వుదహరించిన షరతులుగాని,యేఒక్క షరతుకు గాని నేను యెంత మాత్రము  భిన్నముగా నడచువాడనుగాను.అటుల నడచిన మీరు చేయు యావత్తు చర్యలకు బాధ్యుడను.

15.ఈ ఎగ్రిమెంటు పూర్తిగా చదువుకుని,అర్ధము చేసుకుని సమ్మతించి క్రింద సాక్షి సంతకములు చేసిన మధ్యవర్తుల సమీపమున సంతకము చేయటమైనది.

సం.ఎస్.వి.రంగారావు,
(21-10-45)
సేకరణ:అరిపాక సూరిబాబు,విశాఖపట్నం,

ఇంతటి విలువైన సమాచారాన్ని నవతరంగం పాఠకులతో పంచుకున్న పరుచూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

12 Comments
  1. nietzsche niche October 28, 2008 /
  2. pappu October 28, 2008 /
  3. pappu October 28, 2008 /
  4. Sowmya November 6, 2008 /
  5. చందు January 28, 2009 /