15 పార్క్ ఎవెన్యూ

15-park-avenue-lead

15 పార్క్ ఎవెన్యూ – భూటాన్ లో తీసారు….(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)… నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక ఓమాటు బైటికొచ్చి, ఆవనూనె లో వేయించిన పెసలు తింటూ, హాయి హాయి గా గడిపి, 7 / 8 గంటల షో (సినిమా నిడివి బట్టీ) కి తయారయ్యేవాళ్ళం.

అలాంటి రోజుల్లో అపర్ణా సేన్ సినిమా కాబట్టి బోల్డంత ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళి చూసిన సినిమా ఈ ’15 పార్క్ ఎవెన్యూ’. కధ – గురించి ముందే తెలుసుకునుండకపోయుంటే, కొంచెం కష్టం అయేది. కానీ స్కీజో ఫ్రీనియా అనే ఒక రకమైన మానసిక రోగం తో బాధపడే ఒక అమ్మాయి కధ అని విని ఉన్నాం కనుక – ఈ మేధోపరమైన సినిమాకి మానసికంగా తయారయి ఉన్నాం. ఈ అమ్మాయి పేరు మీఠీ (కొంకణా సేన్ శర్మ). ఈమె, తన అక్కయ్య షబానా ఆజ్మీ తో కలిసి 15 పార్క్ ఎవెన్యూ అనే ఎడ్రెస్ వెతుకుతూండడంతో సినిమా మొదలవుతుంది.

మీఠీ కి తనకి జయొదీప్ తో పెళ్ళయిందనీ, తనకు 5గురు పిల్లలున్నారనీ, తామంతా పార్క్ ఎవెన్యూ లో 15 వ నెంబరు ఇంట్లో ఉన్నామనీ ఒక భ్రమ. అది భ్రమ మాత్రమే కాదు.. అదే ఆమెకు సంబంధించిన జీవితం, ఆమె అస్థిత్వం. ఇలాంటి భ్రమనే నమ్ముకుని జీవిస్తున్న మీఠీ ని కంటికి రెప్ప లా కాపాడుకుంటూ వస్తున్నారు తన అక్కయ్య (షబాన) మరియూ తల్లి (వహీదా రెహ్మాన్). వీరందరి జీవితాల్తోనూ ఒక నిజమైన జయొదీప్ (రాహుల్ బోస్) తరవాత వచ్చి కలిస్తే, కొన్ని అత్భుతమైన పెర్ఫార్మెన్సులూ, కొన్ని విషాద సంఘటనలూ, అత్యత్భుతమైన స్క్రీన్ ప్లే..ఇవన్నీ కలిసి, గుండె తరుక్కుపోయేలా చేసే జీవిత క్రమాలూ.. కలిస్తే 15 పార్క్ ఎవెన్యూ అవుతుంది.

అందరూ బెంగాలీ లూ (బహుశా వహీదా, kanwaljit తప్ప) కలిసి, ఈ సినిమాని చాలా మంచి హైట్స్ కి తీస్కెళ్ళి వొదిలేసారు. సినిమా ముగిసాకా, పట్టేసిన గుండె సర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మీఠీ చిన్నప్పట్నించీ హాలూసినేషన్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మానశిక చికిత్సాలయం లో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. కొన్నేళ్ళకు పరిస్తితి మెరుగు పడినట్టనిపించి సగం, అక్కడ కన్నా, ఇంట్లో అయితే ఆడపిల్లకు సేఫ్ అనీ ఆలోచించీ సగం, పిల్లను ఇంటికి తీసుకొచి కాలేజీ లో చేర్చి మంచి మానసిక ఆలంబన అందిస్తుంది ఆ కుటుంబం. కాలేజీ లో జర్నలిజం లో కోర్స్ చేస్తుంది మీఠీ. అక్కడే జొయొదీప్ (రాహుల్ బోస్) పరిచయం అవుతాడు. రాహుల్ బోస్ అంటే నాకు ‘ఇంగ్లీష్ ఆగస్ట్ ‘ సినిమా నుంచీ కొంచెం ఇష్టం.

జొయొదీప్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది మీఠీ. ఒక మంచి ప్రేమికుడిగా, స్నేహితుడిగా, మీఠీ లో ముడుచుకుపోయే తత్వాన్ని పోగొట్టడానికి, ఆమె లో ఆత్మ విశ్వాసం నింపడానికీ జొయొదీప్ ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి సంగతీ, పెద్దలకు తెలిసి, వారికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ లోగా జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న ఈ పిల్లను యాజమాన్యం ఒక చోట అల్లరి మూకలు (ప్రస్తుతం కాంధమాల్ లో జరుగుతున్నట్టు) చేస్తున్న అల్లర్లను కవర్ చేయడానికి పంపబోతుంది. అయితే మొదట బెదిరినా ఆ అమ్మాయి, జొయొదీప్ ముందు తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఎసైన్మెంట్ కు ఒప్పుకుని, కుటుంబ సభ్యులకు సరిగ్గా వివరాలు చెప్పకుండానే ఆ భయంకర ప్రదేశాల్లోకి ఒంటరి గా వెళ్తుంది. అక్కడ దారుణంగా గేంగ్ రేప్ కు గురవుతుంది. ఈ షాక్ కి ఆమె ఈ సారి నిజంగానే మానసికంగా బలహీనురాలయిపోతుంది.

ఎలాగో ఈ వార్త తెలిసి, మీఠీని ఇంటికి తీసుకొచ్చాకా, మీఠీ ని కలవడానికి వెళ్ళిన జొయొదీప్ – తన పరిస్థితి చూసి జాలి తో నిండిపోతాడు. తనను తాకిన వెంటనే మీఠీ జొయొదీప్ ను గుర్తించక, కరెంట్ షాక్ కొట్టినట్టు, వెనక్కి తప్పుకుంటుంది. ఆమెకు స్పర్శ అంటేనే ఏదో ఏవగింపు.. భయం. తను చేసుకోబోయే అమ్మాయి మీద ప్రేమతో తప్ప, ఇలా జాలితో పెళ్ళి చేసుకోలేనని చెప్పి, జొయొదీప్ వారి జీవితాల్నుంచీ నిష్క్రమిస్తాడు. తండ్రి ఈ విషాదానికి తట్టుకోలేక, గుండెపోటు తో మరణిస్తాడు.

ఇన్ని విషాదాల తరవాత మీఠీ ని ఆక్రమించుకున్న స్కీజోఫీర్నియా.. ఆమె ను ఆమె గతంలో జొయొదీప్ తో కన్న కలలే నిజం అనేంత గా భ్రమల్లో ముంచుతుంది. జొయొదీప్ తో తనకు నిజంగానే పెళ్ళయినట్టూ, వారికి 5 గురు పిల్లలున్నట్టూ, వారంతా 15 పార్క్ ఎవెన్యూ లో నివాశం ఉంటున్నట్టూ ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే బ్రతుకుతూ ఉంటుంది మీఠీ.

ఇన్ని కాంప్లెక్సిటీ ల తరవాత.. కొన్నాళ్ళకి జొయొదీప్ నిజంగానే వీరి జీవితాల్లోకి వస్తాడు. ఈ రావడం యాధ్రుచ్చికంగానె జరిగినా, మీఠీ ప్రస్తుత పరిస్థితి చూసి, ఆమె ఈ పరిస్థితికి కాస్త తనూ కారణమేనేమో అన్న గిల్టీ ఫీలింగ్ తో తను ఆమెకు ఏదోలా సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే వస్తాడు. మీఠీ కి 15 పార్క్ ఎవెన్యూ వెతకడానికి సహాయం చేస్తానని చెప్తాడు. కానీ ఆఖరికి, ఈ ఇల్లు వెతకడం లోనే మీఠీ కనిపించకుండా పోతుంది. ఆమె కు తన ఇల్లూ, పిల్లలూ, భర్తా దొరికారా, లేదా అనేది మన ఊహ కే వొదిలేసిన దర్శకురాలు, మీఠీ ని ఇన్నాళ్ళూ పసిపాప లాగా సాకిన తల్లీ, మీఠీ కోసం, ప్రేమనూ, జీవితాన్ని త్యాగం చేసిన అక్కయ్యా, అప్పటికి ఇద్దరు పిల్లల తండ్రి అయినా, మీఠీ కోసం ప్రేమ (!!!) తో, ఆమె మీద జాలితో, ఆమె తప్పిపోయేంత వరకూ ఆమె తో స్నేహించిన జొయొదీప్.. ఇలా అందరూ మీఠీ తప్పిపోయాక పడిన ఆందోళన మన మనసుల్లోనూ కలిగిస్తుంది అపర్ణా సేన్.

మీఠీ కధ ని చెప్తున్నపుడు వాళ్ళింటి దగ్గర రోడ్ మీద చెత్త, గాజు పెంకులూ ఏరుకుంటూ.. అవే అత్బుతమైన వస్తువుల్లా దాచుకునే ఒక పిచ్చిదాన్ని చూపిస్తారు. ఆమె ని చూసి, మీఠీ భయపడుతూ ఉంటుంది. ఆమె ను ఒక రెండు సార్లు మాత్రమే చూపించినా ఆ సీన్ చూస్తే, సాధారణంగా మనకు తారసపడే మానసిక రోగుల పాస్ట్ గురించి ఎందుకో ఆలోచించాలనిపిస్తుంది. వారి పట్ల సమాజపు వివక్ష ని అసహ్యించుకోవాలనిపిస్తుంది.

సినిమా కధ ఇంత సింపుల్ గా చెప్పగలిగినా.. చూడడానికి చాలా బావుంది. సహజంగా విషాదాంతాలు ప్రేక్షకుల మీద చూపించే ప్రబావం ఎక్కువ. 15 పార్క్ ఎవెన్యూ లో తెర ముందు నటించిన ప్రతి ఒక్కరి నటనా – తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరి ప్రతిభ అబ్బురపరుస్తుంది. విదేశాల్లో షూటింగులూ, పాటలూ చిత్రీకరించడం.. ఒక్కోసారి విదేశాల్లోని సబ్జక్టుల తో నే సినిమాలు తీయడం ఎక్కువైన రోజుల్లో, భూటాన్ లో తీసిన, (ఎక్కువ భాగం ఇండియాలోనే) ఈ సినిమా చాలా మంచి ప్రమాణాలతో తీసినది. నేను మొదలు పెట్టడమే ఈ సినిమా భూటాన్ లో తీసారు – అని ఎందుకు చెప్పానంటే, భూటాన్ లో చిత్రీకరించిన భాగం.. చాలా గాఢమైనది; స్వచ్చమైన ప్రతిభ, మనుషుల మనసుల్లోని అందాలను బయటికి తీసుకొచ్చే ఏదో మిస్టిక్ భావజాలం ఆ సీన్ ల లో అల్లుకుపోయి కనిపిస్తుంది. అప్పటికే తడిచిపోయిన ప్రేక్షకుల మనసుల్ని కాస్త ఆహ్లాదపరిచే గాంభీర్యం భూటాన్ ది. అందుకే అది చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అన్నాను.

ఇంట్లో స్పెషల్ పిల్లలు ఉంటే ఆ కుంటుంబం చేసే త్యాగాలు.. వారి లో ప్రతి ఒక్కరి జీవితం.. ఒక కధ లాగా – వారి మనసుల్లోకి మనం తొంగిచూడగలిగితే కనిపించే లోతులు.. ఇదంతా, ఈ సినిమా చూస్తే కొంచెం అన్నా అర్ధం అవుతుంది. ముఖ్యంగా షబానా.. సైకియాట్రిస్ట్ గా నటించిన చటర్జీ.. ఈ లోతుల్ని స్పృసించడానికి కాస్త సహాయపడతారు.

ముఖ్యంగా వహీదా రెహ్మాన్ – తల్లి గా ఎంత అత్భుతంగా నటించినంటే, కూతురి గురించి బాధపడే నిస్సహాయురాలైన వృద్ధ, అమాయకురాలైన తల్లి గా ఆవిడ జీవించింది. ఒక సీన్ లో మూఢ నమ్మకాల ఆధారంగా పనిమనిషి చెప్పిన మాట నమ్మి.. అలా చేస్తే పిల్ల బాగుపడుతుందేమో అన్న ఆశ తో మీఠీ కి మంత్రాల ట్రీట్మెంట్ కూడా ఇప్పించబోతుంది. షబానా నటన చెప్పనే అక్కర్లేదు. షెఫాలీ షెట్టి (జొయొదీప్ భార్య) చాలా తక్కువ సేపు కనిపించినా..చాలా బాగా నటించింది. ఇంత మంది విదూషీమణులు, కన్వల్ జీత్, రాహుల్ బోస్, ధ్రితిమాన్ చెటర్జీలు (సైకియాట్రిస్ట్) నటించిన సినిమా ఎలా వుంటుందనుకుంటున్నారు ?

సీరియస్ నటన, ప్రతిభలు నచ్చే వారూ.. సినిమా ఒక కళ అయితే.. ఆ కళ ని ఆరాధించే వారూ, పిపాసులూ.. తప్పకుండా చూడదగిన చిత్రం ఈ ’15 పార్క్ ఎవెన్యూ’ !

–సుజాత పాత్రో

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

3 Comments to “15 పార్క్ ఎవెన్యూ”

  • Yes… ఇదొక అద్భుతమైన సినిమా. నా దురదృష్టం కొద్దీ చూసిన రెండుసార్లు పూర్తిగా చూడలేకపోయాను :( వీడియో సమస్యల వల్ల. కానీ, గుండె పిండేస్తారు. ఇలాంటి సమస్యలు ఉండే మనుష్యుల కుటుంబాల ప్రవర్తనను కూడా చాలా బాగా తెరకెక్కించారు. మంచి సమీక్ష. Sujatha Patro గారికి నా అభినందనలు.

  • సుజాత పాట్రో గారు,
    చాలా మంచి సినిమాని విశ్లేషించారు. నేను ఈ సినిమాని మూడేళ్ళ క్రితం చూసాను. క్లైమాక్స్ లో సైక్రియాటిస్ట్ మీఠీ illusion కి అనువుగా ఒక ఇంటినే 15 park avenue లా చూపించి ఆమెని అక్కడ వదిలేయడమే పరిష్కారమని చెప్పినట్టు గుర్తు. మీరేమో మీఠీ కనిపించకుండా పోవడంతో సినిమా ముగుస్తుందంటున్నారు. ఒకవేళ రెండు వెర్షన్లేమన్నా ఉన్నాయా?..
    మన తెలుగులో నా ఊపిరి అనే ఒక సినిమా వచ్చింది. ఇదే సిజోపీరియాని బేస్ చేసుకొని. అందులో కూడా క్లైమాక్స్ లో హీరో నవీన్ తన ప్రపంచంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళీపోతాడు.

  • చాలా బాగుంది మీ సమీక్ష.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories