వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – మొదటి భాగం

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

పథేర్ పాంచాలీ సినిమా తీయడానికి దాదాపు రెండున్నరేళ్ళు పట్టింది. అంటే, ఆ సమయంలో ప్రతీరోజూ షూటింగ్ చేసామని కాదనుకోండి. అప్పట్లో నేనొక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లో పనిచేసేవాణ్ణి. నాకు సెలవుల్లోనే షూటింగ్ వీలుపడేది లేదంటే పని వేళల్లోనే కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చేది. పైగా, మా వద్ద అంత డబ్బుకూడా ఉండేది కాదు. ఉన్న కాస్తా అయిపోతే, మళ్ళీ డబ్బులు పోగయ్యేదాకా ఎదురుచూడ్డం తప్ప ఇంకేమీ చేయగలిగేవాళ్ళం కాము. అసలు షూటింగ్ మొదలయ్యేముందు అన్నింటికన్నా కష్టమైన పని సరి అయిన నటులని వెదకడం. అపూ పాత్ర వేయడానికి ఆరేళ్ళ పిల్లవాడు దొరకడం మాకు సాధ్యం కాకపోయేసరికి పేపర్లో ప్రకటన ఇచ్చాము.

కోల్‍కతాలోని రాసబిహారీ అవెన్యూలో ఓ గది అద్దెకి తీసుకున్నాము. ప్రతి సాయంత్రం ఆ వయసున్న పిల్లలు వచ్చేవారు మా దగ్గరికి. ఎంతో మందిని చూసాము కానీ, మాకు తగినవారెవ్వరూ దొరకలేదు. ఒకరోజు మెడమీద టాల్కం పౌడర్ చల్లుకున్న కుర్రవాడొకడు వచ్చాడు. నాకెందుకో అనుమానమొచ్చి వాడిని పేరడిగాను. “తియా” – ఆ పిల్లవాడు పీల గొంతుతో జవాబిచ్చాడు. “ఈ జుట్టు ఇప్పుడే కత్తిరించారు కదా?” అని అడిగాను ఆ పిల్లవాడితో వచ్చిన పెద్దాయనతో. అతనికి అర్థమయింది-దొరికిపోయాననీ, నిజం దాచలేననీ. అసలు విషయమేమిటంటే అబ్బాయిగా వచ్చిన మనిషి అసలుకి అమ్మాయి! ఆమె తాలూకా పెద్దాయన ఆమె జుట్టు కత్తిరించి తీసుకువచ్చాడు -ఆమె కి అపూ పాత్ర వేసే అవకాశం వస్తుంది ఏమో అని. మాకు ప్రకటన ఇచ్చాక కూడా ఎవరూ తగిన వాళ్ళు దొరక్కపోయేసరికి మేము దాదాపు ఆశలు వదిలేసుకున్నాము. అప్పుడు, ఒకరోజు కాసేపు ఇంటి మేడపైకని వెళ్ళిన నా భార్య కిందకు దిగి వచ్చి నాతో అన్నది – “పక్కింటి కప్పుపై ఓ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఓసారి అతన్ని పిలవొచ్చుకదా?” అని. చివరికి, ఆ పక్కింటి అబ్బాయే – సుబీర్ బెనర్జీ-అతనే నా సినిమాలో అపూ. మేము సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు అది ఇలా రెండేళ్ళు సాగుతుందని అనుకోలేదు. నెలలు గడిచేకొద్దీ మాలో చింత మొదలైంది – అపూ, దుర్గా ఇద్దరూ తొందరగా పెద్దవాళ్ళైపోతారేమో, అలా అయితే ఆ మార్పులు సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తారేమో అని. కానీ, ఇద్దర్లో ఎవరూ అంత ఎదగలేదు. ఇందిరా థాకురున్ పాత్ర వేసిన ఎనభయ్యేళ్ళ చున్నీబాలాదేవి ఈ షూటింగ్ శ్రమనంతా తట్టుకుని సినిమా తీయడం ముగిసేదాకా బ్రతికుండడం మాకు తెరిపినిచ్చింది.

షూటింగ్ మొదలుపెట్టిన తొలిరోజుల్లోనే మాకొక కష్టమొచ్చి పడింది. చిన్నారి అపూ, దుర్గలను కలకత్తాకి 70 మైళ్ళ దూరంలో ఉన్న బుర్ద్వాన్ దగ్గరి పల్సిత్ అన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాము. అక్కడ రైలు పట్టాల పక్కగా కష్ అన్న రకం పొడవైన గడ్డితో నిండి, బెంగాల్ లో బాగా దొరికే ఒక విధమైన తెల్లటి పూల తోనూ నిండి ఉన్న పెద్ద మైదానాలు ఉన్నాయి. పిల్లలిద్దరు మొదటిసారి ట్రెయిన్ ని చూసే దృశ్యాన్ని ఇక్కడ తీయాలి అనుకున్నాము. అది పెద్ద సీను కనుక కనీసం రెండు రోజులన్నా పడుతుంది అన్ని షాట్లూ తీయాలంటే అని అనుకున్నాము. మొదటి రోజు జగద్ధాత్రి పూజ-సెలవు రోజు. మేం రోజంతా పని చేసి సగం షాట్లు తీసేసుకున్నాము. ఈ సీనులో అపూ-దుర్గా మధ్య చిన్న గొడవ జరుగుతుంది. దుర్గా పారిపోతే అపూ ఆమెని వెంబడిస్తూ ఆ కష్ నిండిన మైదానంలోకి పరుగుతీస్తాడు. యూనిట్ లో అందరూ-డైరెక్టర్, కెమరామాన్, ఈ ఇద్దరు పిల్లలు -అంతా కొత్తవాళ్ళే. జనానికి కాస్త ఇబ్బందిగా ఉండింది అప్పుడప్పుడూ. కానీ, వాళ్ళలో ఉత్సాహానికేం కొదవలేదు. ఆరోజు పని ముగించుకుని మేం కలకత్తా తిరిగి వచ్చాము. ఓ వారం తరువాత మళ్ళీ వెళ్ళాము పల్సిత్ కి. కానీ, నిజానికి అది-ఆ ప్రదేశమేనా? కష్ అంతా ఏమైంది? అసలా ప్రదేశం గుర్తుపట్టలేనట్లు గా ఉంది ఇప్పుడు. అక్కడి జనాల్ని అడిగితే తెలిసింది – అక్కడి ఆవులకి కష్ అంటే చాలా ఇష్టం లాగుంది. ఈ వారంలో అవి మొత్తం గడ్డిని తినేసాయి! ఇప్పుడిక్కడ షాట్లు తీసుకున్నా కూడా పోయినవారం తీసిన వాటికి సరిపోలవు. ఇక, ఆ సీనులోని మిగితా భాగం ఓ సంవత్సరం తరువాత తీయాల్సి వచ్చింది-మళ్ళీ ఆ ప్రాంతమంతా కొత్త కష్ గడ్డితో నిండాక. ఈసారి కొన్ని ట్రెయిన్ షాట్లు కూడా తీసుకున్నాము. కానీ, చాలా షాట్లు ఉన్నాయి-ఒక ట్రెయిన్ సరిపోదు. మూడన్నా కావాలి. రైల్వే టైంటేబుల్ చూస్తే తెలిసింది అక్కడి ట్రెయిన్లు నడిచే వేళలు. మళ్ళీ ఇవన్నీ ఒకే వైపు నుండి రావాలి-ఎదురెదురు దిక్కుల్లో వచ్చే ట్రెయిన్లు మాకు పనికిరావు. మా యూనిట్ లో ఒకరైన అనిల్ బాబు ని స్టేషన్ లో ఉండమన్నాము. అతను డ్రైవర్ తో ఇంజన్ వద్ద కూర్చున్నాడు-ట్రెయిన్ మా వైపు వచ్చేసరికి బాయిలర్ లో బాగా బొగ్గు వేయమనీ. ఇది అవసరం ఎందుకంటే, లేకుంటే పొగ ఎక్కువ రాదు. తెల్లటి కష్ వెనుక నల్లటి పొగని చూపిస్తే కదా ఆ సన్నివేశం హత్తుకునేలా వచ్చేది? సినిమా చూస్తున్నప్పుడు ఆ సన్నివేశంలో – మూడు వేర్వేరు సమయాల్లో వచ్చిన మూడు వేర్వేరు ట్రెయిన్లను ఉపయోగించాము అని కనుక్కోవడం సాధ్యం కాదు ఎవరికీ. అదే సీను ఈ కాలంలో తీయాల్సి వస్తే, ఇప్పుడు అంతా డీజిలో, విద్యుత్తో ఉపయోగిస్తున్నాయి కదా… ఆ షాట్లు అలా తీయగలిగే వాళ్ళమే కాము అసలు.

డబ్బులు ఐపోతూ ఉండడమూ, ఎప్పుడూ మారుతూ ఉండే ఈ షెడ్యూలూ – వీటి వల్ల రకరకాల ఇతర ఇబ్బందులు కలిగాయి. అలాంటి కొన్నింటి గురించి చెబుతాను ఇపుడు. పథేర్ పాంచాలీ నవలలో అపూ-దుర్గల పెంపుడు కుక్క బూలో గురించిన ప్రస్తావన ఉంది. మేమెలాగో ఒక కుక్కను సంపాదించాము. అది మా అందరికీ బాగా మాలిమి అయింది. సినిమాలో ఒక దృశ్యంలో అపూ తల్లి సర్బొజయ అతనికి అన్నం తినిపిస్తూ ఉంటే, బూలో ఇంటి ఆవరణలో కూర్చుని అతన్ని చూస్తూ ఉంటుంది. అపూ చేతిలో విల్లంబులు…అతను వెనక్కి తిరిగి కూర్చుని ఉంటాడు. నిజానికి అతనికి తినాలన్న ఆసక్తి ఉండదు. ఎప్పుడు తనని అమ్మ వదిలేస్తుందా, ఎప్పుడు వెళ్ళి బాణాలతో ఆడుకుందామా..అన్నట్లు ఉంటుంది అతని వైఖరి. తినడం అయ్యేలోపే ఓ బాణం వేసేస్తాడు..దాన్ని తెచ్చుకోడానికి లేచి వెళతాడు. వాళ్ళమ్మ ఓ చేతిలో పళ్ళెం, ఓ చేతిలో గుప్పెడు అన్నం తో అతని వెంట పరుగెడుతుంది. అక్కడ అపూ ఇక తినడు అన్నది ఖచ్చితం. బులో కూడా రెడీ ఔతుంది లేవడానికి. దాని చూపులన్నీ ఆ అన్నం ప్లేటు పైనే. తరువాతి సీను ఏమిటీ అంటే, సర్బొజయ ఆ అనాన్ని చెత్తకుప్పలో పడేస్తుంది, బూలో దానితో పండగ చేసుకుంటుంది. కానీ, ఆ సీను ఆరోజు తీయలేకపోయాము. ఎందుకంటే, వెలుతురు లేకపోవడం ఓ కారణమైతే, జేబులు ఖాళీ అవడం మరోటి. మళ్ళీ డబ్బులు పోగయ్యేసరికి ఆరు నెలలు పట్టింది. అప్పుడు మేము తిరిగి బోరాల్ వెళ్ళాము (ఈ షూటింగ్ జరిగింది అక్కడే) మిగితా దృశ్యాలను తీయడానికి. కానీ, వెళ్ళాక తెలిసింది-బూలో ఇక లేదు అని. ఈ ఆర్నెల్లలో అదెప్పుడో చనిపోయిందట! ఇప్పుడేమిటి చేయడం? అలాంటిదే ఇంకో కుక్క ఉందని అక్కడెవరో అన్నారు. సరే చూద్దామని, మేము ఆ కుక్కని తీసుకు రమ్మని చెప్పాము. మాకు ఈ విషయం చెప్పినతను సరిగానే చెప్పాడు. ఆ రెండో కుక్కకీ బూలో కీ చాలా పోలికలు ఉన్నాయి. దీనికీ దానికి ఒకే రకం చర్మం ఉండటమే కాదు, తోక అంచులో తెల్లరంగు కూడా అలానే ఉంది. చివరికి ఈ “డూప్లికేట్” బూలో నే సినిమాలో సర్బొజయ వెంటవెళ్ళి ఆమె పడేసిన అన్నాన్నంతా గుటకాయస్వాహా చేసే సన్నివేశం లో నటించింది. ఇవి రెండు కుక్కల్ని ఆ సినిమాలో వాడామని చెప్తే కానీ గుర్తించడం కష్టం.

కానీ, ఈ కుక్క కాదు మాకు సమస్య…ఇలాంటి సమస్యే ఒక నటుడితో కూడా వచ్చింది. సినిమాలో ఓ సీనులో చూనీబాల్ అనే మిఠాయి కొట్టు అతని పాత్ర ఉంది. అపూ-దుర్గాలకి అతన్నుంచి ఏమీ కొనే స్తోమత లేదు. కనుక, ఈ సన్నివేశంలో వీళ్ళిద్దరూ అతని వెంటాడి ముఖర్జీల ఇంటికి వెళతారు.. వాళ్ళు మిఠాయిలు కొంటారు అని వీళ్ళకి తెలుసు. దూరం నుంచి ఆ దృశ్యం చూడటంలోనే ఆనందం ఈ పిల్లలిద్దరికీ. అప్పటిలాగే ఇప్పుడుకూడా మా వద్ద సగం సీను తీసేసరికి డబ్బులైపోయాయి. మళ్ళీ షూటింగ్ ప్రారంభించేసరికి చాలా నెలలు గడిచాయి. మేము చివరికి సిద్ధమయ్యేసరికి చూనీబాల్ పాత్ర వేసినతను చనిపోయాడన్న వార్త అందింది. కుక్కల మధ్య తేడాలు పసిగట్టలేరేమో కానీ, ఇప్పుడు చూనీబాల్ లాగే ఉన్న ఇంకో మనిషిని ఎక్కడ్నుంచి తేవడం?

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

7 Comments to “వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – మొదటి భాగం”

  • సస్పెన్స్ లో పెట్టి చంపేశారండి బాబు ! ఇక రెండవ భాగం కోసం వెయిటింగ్ తప్పదు.మీ శైలి చాలా బాగుంది. “మాలిమి” అన్నపదం చాలా రోజుల తరువాత ఉపయోగించగా విన్నాను. “కష్” ను అక్కడ (బెంగాల్ లో) “ఖస్” గా పలుకుతారు.

  • మీ తెలుగీకరణ అద్భుతం. ఈ వ్యాసం చదివాక ఇంకోసారి ఆ సీన్లు వేసుకొని చూసా. ముఖర్జీల ఇంట్లో తీసిన సన్నివేసాలలో మిఠాయి అమ్మేవాడిని వెనుక నుండి మాత్రమే చూపించారు.

  • @శంకర్:
    :) యూ గాట్ ఇట్ రైట్.
    @మహేష్:
    ధన్యవాదాలు.

  • Nice information about Ray.

  • Good Article.

  • మొత్తం అనువాదం నీకు అలవాటే కనక చక్కగా సాగింది. నాకు చాలా ఇష్టమయిన బహుకొద్దిసినిమాల్లో ఇదొకటి. :) .
    మొదటి వ్యాసంలో చెప్పినట్టు కాపీరైటు విషయం ముందు తేల్చుకుంటేనే మంచిది సౌమ్యా. కనీసం ఆఫౌండేషన్ వాళ్లకి ఫోను చేస్తే అసలు వాళ్ల Attitude తెలుస్తుంది.

  • నేను ఇక్కడ రే ఫౌండేషన్ వారితో మాట్లాడాను. వారికీ ఈ విషయం గురించి అంతగా తెలియదు. నాకు తెలిసి ఈ కాపీరైట్స్ పెంగ్విన్ వద్ద వుంటాయి. వాళ్ళు ఏమంటారో కూడా అడిగి ప్రయత్నిస్తాను.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories