Menu

The Shawshank Redemption (1994)

పరిచయం:హాలివుడ్ లో “ఆల్  టైం గ్రేట్” లు గా నిలిచిన చిత్రాలలో ఒకటి “ది షాషంక్ రెడెంప్షన్” అనే ఈ చిత్రం. ఆశ (Hope),ఇదే  మనిషికి జీవనాధారం. రేపటి మీద ఆశ లేకుంటే జీవితమే పెద్ద ప్రశ్నార్ధకమవుతుంది. కష్టాల్లో కూడా మనిషిని నిలిపేది,నడిపించేది రేపటి మీది ఆశే అనేది ఈ సినిమా లోని అంత:సూత్రం. చక్కటి కధ,స్క్రీన్ ప్లే,మంచి  నటన ఈ సినిమా లో ఆకట్టుకొనే అంశాలు.

ముందు ఒక్కసారి ఈ సినిమా కధ :

తన భార్యని,ఆమె ప్రియుడిని హత్య చేసిన నేరం మీద ఏండీ అనబడే వ్యక్తి ని అరెస్ట్ చేసి షాషంక్ జైలుకి తీసుకొని వస్తారు. అక్కడ తనకి రెడ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. రెడ్ తనకున్న పలుకుబడితో జైల్లోని ఖైదీలకి బయటి నుంచి సిగరెట్లు లాంటివి(జైల్లో దొరకనివి)సమకూరుస్తూ ఉంటాడు. మొదటి సారి చూడగానే రెడ్ కి ఏండీ లో ఏదో ప్రత్యేకత కనపడుతుంది. ఏండీ నిజంగా నేరస్తుడు కాదేమో అని అనుకుంటూ ఉంటాడు. ఏండీ కి రెడ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. తనకు రాళ్ళను సేకరించడం,వాటిని చెక్కడం తన హాబీ అని,దానికి ఒక చిన్న సుత్తి అవసరం కాబట్టి దాన్ని సమకూర్చి పెట్టమని రెడ్ ని అడిగి దాన్ని సంపాదిస్తాడు ఏండీ. ఐతే ఒకరోజు ఖైదీలందరూ పని చేస్తుండగా,జైలు అధికారి ఒకడు తను కట్టాల్సిన ఆదాయపు పన్ను గురించి తన తోటి వాడికి చెప్తుంటే అది విని ఏండీ కలగ చేసుకొని పన్ను తగ్గించుకొనే మార్గం చెప్తాడు (తను వౄత్తిరీత్య  బ్యాంకర్ కాబట్టి). అలా వారికి ఏండీ మీద గురి కుదరడం,ఆ విషయం జైలు వార్డెన్ వరకు వెళ్ళటం జరుగుతుంది. జైలు వార్డెన్ నార్టన్ అవినీతి పరుడు. జైల్లో ఖైదీలచే జైలు బయట పబ్లిక్ కాంట్రాక్టులు చేయగా వచ్చిన డబ్బును,కాంట్రాక్టర్లకు లంచాలివ్వటం ద్వారా తన జేబులో వేసుకుంటూ ఉంటాడు. ఏండీ కి ఈ అవినీతి లావాదేవిలన్నిటికి  సహాయం చెయ్యాల్సి వస్తుంది. ఏండీ స్టీవ్ అనే ఒక మారు పేరు మీద బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేసి ఈ డబ్బును నార్టన్ తరపున ఆ ఎకౌంటు లో జమ చేస్తూ ఉంటాడు. ఇంతలో టామి విలియంస్ అనే ఒక కుర్రాడు జైలు కి వస్తాడు. మాటల సందర్భం లో విలియంస్ తనకు పరిచయమున్న ఇతర నేరస్తుల గురించి చెప్తూ,తన ఫ్రెండ్ ఒకతను ఒక జంటను చంపిన వివరాలు చెప్తాడు. విలియంస్ చెప్పిన వివరాలు తన భార్య ,భార్య ప్రియుని వివరాలు సరిపోవటం తో, తను నిర్దోషి నని,తన కేసును తిరగదోడమని వార్డెన్ సహాయం అడుగుతాడు ఏండీ. తనకు ఈ సహాయం చేస్తే వార్డెన్ చేస్తున్న అక్రమాల గురించి బయట ఎవరికీ చెప్పను అని చెప్పి తద్వారా వార్డెన్ ఆగ్రహానికి గురవుతాడు. విషయం బయటకు ఎక్కడ పోక్కుతుందో అని,ఏండీ కి సహాయం చెయ్యక పోగా,అతన్ని ఎవరితో మాట్లాడనీయకుండా ఒంటరిగా సెల్ లో పడేయడం తో పాటు విలియంస్ ని హత్య చేపిస్తాడు వార్డెన్. ఆ సెల్ నుంచి బయటికి వచ్చి మరల వార్డెన్ దగ్గర పనిచేయటం మొదలుపెడతాడు ఏండీ. ఈ సంఘటన తరువాత ఏండీ  ప్రవర్తన కొద్దిగా విచిత్రం గా ఉండటం తో రెడ్,ఏండీ ని అభిమానించే ఇతర ఖైదీలు కొంత కలవరపాటు కి గురవుతారు.ఆత్మ హత్య చెసుకోబోతున్నాడనిభయపడతారు.అంతకు ముందు రోజు ఏండీ  వీళ్ళని ఒక ఆరడుగుల తాడు అడగటం కూడా వీళ్ళ భయానికి ఒక కారణం.

ఆ మరుసటి రోజు ఏండీ  జైలు నుంచి తప్పించుకుంటాడు,మొదట్లో రెడ్ సహాయంతో సంపాదించిన సుత్తి తో రోజూ రాత్రిపూట సొరంగం తవ్వటం ద్వారా.ఇరవై ఏళ్ళు పడుతుంది ఏండీ కి ఆ సొరంగం తవ్వటానికి.ఇలా తప్పించుకొని,స్టీవ్ ఎకౌంట్ (జైల్లో ఉండగా వార్డెన్ కోసం ఏండీ తెరిచిన దొంగ ఎకౌంటు)తాలూకు డబ్బుని డ్రా చేసుకోవటమే గాక, షశాంక్ జైలు లోని అక్రమాలు పత్రికలలో వచ్చేలా చేస్తాడు.దాంతో జైలు వార్డెన్ ఆత్మ హత్య చేసుకుంటాడు. రెడ్ జైలు నుంచి విడుదల కావటం ,ఏండీ ని కలవటం తో కధ సుఖాంతం అవుతుంది.

విశ్లేషణ:కధ చదివితే ఇంతేనా అనిపించొచ్చు.కాని దీన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు లొనే ఉందంతా .సినిమా చూస్తున్న్నంత సేపు మనల్ని ఒక రకమైన ఫీల్ కి గురి చేస్తుంది.ఏండీ,రెడ్ రెండు పాతల్లోకి ప్రేక్షకుడు మమేకమై పోతాడు.వాళ్ళంటే ఒకరక మైన సాను భూతి కలుగుతుంది.(తెలుగు సినిమాల్లో ఈ దర్శక మహానుభావులు భారీ సెంటిమెంట్ డైలాగులు చెప్పించో, హీరోని నలుగురి ముందు అవమానించో కొండకోచో తన్నించో క్రియేట్ చేసే సానుభూతి మాత్రం కానే కాదు).రెడ్ ద్వారా,బ్రూక్స్ అనే ఇంకొక వౄద్దుని పాత్ర ద్వారా దాదాపు జీవితం మొత్తం జైల్లో గడిపిన వారు బయటి ప్రపంచం లోకి వస్తే జీవితం ఎంత కఠినం గా ఉంటుందో తెలుస్తుంది . విడుదలయ్యాక వీళ్ళిద్దరూ ఎదో ఒక నేరం చెసి తిరిగి జైల్లోకి వెళితేనే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఒక దశలో.ముఖ్యం గా బ్రూక్స్.దాదాపు 50 ఏళ్ళు జైల్లో గడిపి దానికి అలవాటు పడి ,నా అన్నవాళ్లు లేకుండా బాహ్య ప్రపంచం లో బ్రతకడం ఎంత  కష్టం ? బయటి ప్రపంచం లో ఇమడలేక బ్రూక్స్ ఆత్మ హత్య చేసుకోవడం గుండెల్ని పిండి వేస్తుంది. ఒంటరితనం ఎంత భయం కరమో తెలియజెప్తుంది.

రెడ్ గా మోర్గాన్ ఫ్రీమన్,ఏండీ గా టిం రాబిన్స్ పోటీ పడి నటించారు.సినిమా లో అప్పుడప్పుడు నేపధ్యంలో ఫ్రీమన్ వ్యాఖ్యానం వస్తూ ఉంటుంది ,ఈ వ్యాఖ్యానం ,మరియు జైల్లో జరిగే కొన్ని సన్నివేశాలలోని డైలాగుల్ని వింటే  రచయిత కి జేజేలు కొట్టాలని పిస్తుంది.ముఖ్యంగా ఆశ(Hope)మీద రెడ్,ఏండీ ల మధ్య జరిగే సంభాషణ.ఆశ  సర్వ అనర్ధాలకు మూలం అంటాడు రెడ్.ఆశ అనేది లేకపోతే ,రేపటికోసం ఎదురుచూడడం  అనేది లేక పోతే మనిషి జీవితాని కి అర్ధం లేదు అంటాడు ఏండీ.

“Do you want to Rehabilitate(పునరావాసం)?” అన్న  దానికి రెడ్ ఇచ్చే సమాధానం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ ప్రశ్న అడిగిన అధికారి నుద్దేసిస్తూ రెడ్ ఇలా అంటాడు, “Rehabilitate? నాకు తెలిసి అది రాజకీయనాయకులు వాడే పదం.నీలాంటి సూటు బూటు వేసుకున్న అధికారులు,మీ ఉద్యోగం మీరు చెయ్యాలి కాబట్టి,యాంత్రికంగా,అర్ధం తెలుసుకోకుండా మీరు వాడే పదం. నేను పిల్లాడిగా ఉన్నప్పుడే ఒక పెద్ద తప్పు చేశాను,ఈ జైలు కి వచ్చాను,ఈ నలభై ఏళ్లలో నేను చేసిన తప్పుకి బాధపడని రోజు లేదు.నాకు మరల వెనక్కు వెళ్లాలని ఉంది, వెనక్కి వెళ్లి ఆ పిల్లాడిని కలిసి నువ్వు చేసిన తప్పు ఇది  అని చెప్పాలని ఉంది.కాని వాడు లేడు(That boy is long gone). ఈ అరవైయేళ్ళ ముసలాడు మిగిలాడు.ఇదంతా నీకేం తెలుసు?” అంటాడు. ఇలాంటివి ఈ సినిమాలో ఎన్నో .

ఇక స్వోత్కర్ష కొస్తే,నేను ఈ సినిమాని ఈ మూడేళ్ళ లో దాదాపు 15 సార్లు చూసాను.కాస్త వ్యవధి నిచ్చి చూసిన ప్రతిసారి నాకు బోరు అని మాత్రం అనిపించదు.విచిత్రం ఏమిటంటే,1995లో 7 విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయినా,Forrest Gump వెల్లువలో కొట్టుకు పోయింది.ఒక్క విభాగం లో కూడా ఆస్కార్ దక్కలేదు.ఆ సంవత్సరం వచ్చిన Pulp Fiction కి కూడా ఇదే పరిస్థితి.తరువాత నెమ్మదిగా ఈ సినిమా లోని ప్రత్యేకత ని గుర్తించారు ప్రేక్షకులు.ఆర్ధికం గా అంత విజయవంతం కాకున్నా , 1995 లో అత్యధికం గా అద్దెకు తీసుకోబడిన సినిమా గా  The Shawshank redemption రికార్డ్ సృష్టించింది.ప్రఖ్యాత కధకుడు స్టీఫెన్ కింగ్ రాసిన కధ ఆధారం గా తీయబడిన ఈ  సినిమాకి  స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఫ్రాంక్ డరాబొంట్. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఈ సినిమా మొదట్లో కొద్ది క్షణాలు కనపడే,ఏండీ భార్య ఒక్కటే స్త్రీ పాత్ర.ఒక రకం గా చెప్పాలంటే  స్త్రీ పాత్ర లేని సినిమా అని చెప్పొచ్చు.

వారాంతం లో,లేదా ఎవరూ మిమ్మల్ని ఆటంకపరచని సమయం లో ఈ సినిమాని చూడండి.చుట్టూ ఉన్న నిశబ్దం ,ఈ సినిమా,రెండూ మిమ్మల్ని నిస్సందేహం గా ఒక రకమైన ట్రాన్స్ లోకి నెట్టేస్తాయ్.

–ఉమాశంకర్ శివదానం

28 Comments
 1. Sowmya September 12, 2008 / Reply
 2. Umasankar Sivadanam September 12, 2008 / Reply
 3. శంకర్ September 12, 2008 / Reply
  • శ్రీకాంత్ November 7, 2009 / Reply
 4. నవీన్ గార్ల September 13, 2008 / Reply
 5. Umasankar Sivadanam September 13, 2008 / Reply
 6. ravi September 13, 2008 / Reply
 7. manjula September 13, 2008 / Reply
 8. శంకర్ September 14, 2008 / Reply
 9. అబ్రకదబ్ర September 17, 2008 / Reply
 10. ప్రపుల్ల September 18, 2008 / Reply
 11. రమణ September 18, 2008 / Reply
 12. అబ్రకదబ్ర September 22, 2008 / Reply
 13. Aravind September 26, 2008 / Reply
 14. Umasankar Sivadanam October 8, 2008 / Reply
 15. shree November 4, 2008 / Reply
 16. raamesabaabu December 13, 2008 / Reply
 17. pavan January 1, 2009 / Reply
 18. pavan January 1, 2009 / Reply
 19. prasad raju June 6, 2009 / Reply
 20. blog chichhu July 7, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *