Menu

తపన్ సిన్హా-ఒక పరిచయం

భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందినవాడు తపన్ సిన్హా.ఇప్పటికి నలభైకి పైగా చిత్రాలు తీసి అనేక అవార్డులు అందుకున్న తపన్ సిన్హా బెంగాలీవాడు. తపన్ దా గా అందరి అభిమానాన్ని చూరగొన్న తపన్ సిన్హా1924 లో జన్మించారు.ఆయన తన సినీరంగ జీవితాన్ని 1946 లో ’న్యూ థియేటర్స్’ లో సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించాడు. అలా కలకత్తాలో మొదలయిన తపన్ సిన్హా సినీ జీవితం 1950 లో లండన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడంతో ఓ మలుపు తిరిగింది. ఆయనకు ’పైన్ వుడ్’  స్టూడియోలో ఆడియో ఇంజనీర్ గా ఉద్యోగం రావడంతో అక్కడే వుండిపోయాడు. లండన్ నుంచి తిరిగి స్వదేశం చేరుకొన్న తపన్ సిన్హా తన దృష్టినంతా దర్శకత్వం వైపు కేంద్రీకరించాడు.

1953లో ’అంకుష్’ చిత్రంతో ఆయన చిత్రావళి ఆరంభమయ్యింది. ఆయన ఇప్పటివరకు నిర్మించిన 41 చిత్రాలకు గాను 19 జాతీయ ఫిలిం అవార్డులు అందుకొన్నారు. వాటిలో ’కాబూలీ వాలా’,’హతె బజారె’ లకు రాష్ట్రపతి బంగారు పతకాలు లభించాయి. తపన్ దా బాలలకోసం నిర్మించిన ’సఫేద్ హాథీ’ చిత్రానికి జాతీయ ఉత్తమ బాలల చిత్రం అవార్డు కూడా లభించింది. ఆయన నిర్మించిన ’ఏక్ డాక్టర్ కీ మౌత్’ చిత్రానికి 1990 లో ఉత్తమ దర్శకుని అవార్డు లభించింది. ఆయన ఇటీవలి చిత్రం ’వీల్ చైర్’ పెనోరమాలో ప్రదర్శించబడింది.

ఇంకా ఆయన చిత్రాలు అనేకానేక అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నాయి. 1956 లో నిర్మించిన ’కాబూలీ వాలా’ చిత్రానికి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సంగీతం అవార్డు, ’లావుహాపతే’, ’క్షుదితాపాశన్’, ’హాన్‍సులి బాంకర్ ఉపకథ’, ’అతిథి’ చిత్రాలకి వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో మెరిట్ సర్టిఫెకెట్; ;హతేబజారే’ కి ఆసియన్ ఫెస్టివల్ లో రాయల్ కప్; ’నగీనా మహటొ’ కి మాస్కొ లో ఆఫ్రో-ఆసియన్ అవార్డు; ’హార్మీనియం’ కి ఆసియన్ ఫెస్టివల్ లో సంగీతం, నటనలకు ఉత్తమ అవార్డులు లభించాయి.

1980 లో ఆయన నిర్మించిన ’బంచారామెర్ బాగన్’ చిత్రం జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. ఇక 1981 లో తపన్ సిన్హా నిర్మించిన ’అదాలత్ ఓ ఎక్తిమాయీ’ చిత్రంలో సమాజంలోని అవకాశవాదాన్ని గొప్పగా చిత్రించాడు. ఇందులో స్త్రీని ప్రధాన పాత్రగా తీసుకుని సమాజంలోని మనుషుల చిత్ర విచిత్ర ప్రవర్తనని మగవాడి దురహంకారాన్ని, అధికార వర్గాల మోసాన్ని చాలా హృద్యంగా చూపించాడు.

1986 లో హైదరాబాద్ ఫిల్మోత్సవంలోని పనోరమా విభాగంలో ప్రదర్శించబడ్డ ’అద్మీ ఔర్ ఔరత్’ చిత్రం మనుషుల నడుమ వుండే సంబంధ బాంధవ్యాలను, సున్నితమయిన భావాలని మానవత్వాన్ని చూపించింది.

మానవీయతను ఆవిష్కరిస్తూ 1994 లో తపన్ సిన్హా నిర్మించిన ’వీల్ చైర్’ లో సున్నితమయిన మానసిక అంశాల్ని అత్యంత ప్రతిభావంతంగా దృశ్యీకరించబడింది. అనుకోని సంఘటనతో వెన్నుపూస దెబ్బ తినగా తలనుంచి పాదాల వరకూ పక్షవాతం బారినపడ్డ సుస్మితను, తాను స్వయంగా పక్షవాత పేషెంట్ అయి వీల్ చేర్ లో తిరుగుతూ వున్న డాక్టర్ మిత్ర ట్రీట్ చేస్తాడు. అనేక ఒత్తిడుల మధ్య చికిత్స కొనసాగుతుంది. మానసికంగా డాక్టర్ మిత్ర ఇచ్చిన ధైర్యాన్ని ఆలంబనగా చేసుకుని సుస్మిత కుదుటపడి మామూలు జీవితం ఆరంభిస్తుంది. డాక్టర్ మిత్ర ఇతర సమస్యలూ తీరుతాయి. కాని సుమిత్ర స్థానంలో మరో చిన్న బాలిక పక్షవాతంతో డాక్టర్ దగ్గర చేరుతుంది. డాక్టర్ మిత్ర చికిత్స కొసాగుతూనే ఉంటుంది. మిత్ర పాత్రలో సౌమిత్ర ఛటర్జీ జీవించాడు. చిత్రం ఆద్యంతం సున్నితంగా భావస్ఫోరకంగా సాగుతుంది.

ఇలా తపన్ సిన్హా చిత్రాలన్నీ మనిషికి మనిషికి నడుమ సంబంధాల మీద , మనిషికి సమాజానికి నడుమ సంబంధం మీద నిర్మించబడ్డాయి.

ఆయన అన్ని చిత్రాల్లోనూ మానవీయ విలువలు ప్రతిభావంతంగా ఆవిష్కృతమవుతాయి.

భారతీయ చలనచిత్ర సీమకు చేసిన సేవలను గుర్తించి 2006 సంవత్సరానికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రభుత్వం తపన్ సిన్హాను ఎన్నుకున్న సందర్భంగా నవతరంగంలో ఆయన సినిమాలను సమీక్షించి, విశ్లేషించి వ్యాసాలు రాయాలని పాఠకులను కోరుతూ….శెలవు.