Menu

తమిళవాసనల “స-రో-జ”

చెన్నై నుంచీ హైదరాబాదుకు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఒక వ్యాన్లో బయల్దేరిన రామస్వామి(వైభవ్),రంగస్వామి (ఎస్.పి.చరణ్), గణేష్ (ప్రేమ్ జీ),అజయ్ (శివ) అనే ఇద్దరన్నదమ్ములు మరో ఇద్దరు స్నేహితులు.

ఒరిస్సానుంచీ వస్తున్నా ఒక ఫ్యూయల్ ట్రక్కు.
ఒక కిడ్నాప్ చెయ్యబడిన ప్రముఖ్య పారిశ్రామిక వేత్త (ప్రకాశ్ రాజ్) కూతురు సరోజ (వెగ). ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన మనుషులు (సంపత్ & నిఖిత).
పారిశ్రామికవేత్త స్నేహితుడైన ఒక పోలీస్ అధికారి, కిడ్నాప్ చెయ్యబడిన అమ్మాయిని విడిపించడానికి చేసే ప్రయత్నం .

ఈ నాలుగు లంకెలూ ఒక కాళరాత్రి అనుకోకుండా కలిస్తేనే “స-రో-జ” సినిమా అవుతుంది.

దర్శకుడు ‘వెంకట్ ప్రభుకు’ ఈ చిత్రం రెండోదే అయినా, మొదటి సినిమా “చెన్నై 600028” లో తను చూపించిన పట్టు దృష్ట్యా ఈ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా వున్నాయి. అంతేకాక, ఈ సినిమాని ఒక ద్విభాషా చిత్రంగా నిర్మాతలు ప్రమోట్ చెయ్యడంతో తెలుగులోకూడా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ఒక సస్పెన్స్ ధ్రిల్లర్ కాబట్టి కథకన్నా కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో మొదటి 20 నిమిషాలూ చిత్రం సాగదీతలా అనిపిస్తాయి. సరోజ తో ఒక డిస్కో తెక్ పాట. శ్రీహరి ఇంట్రడక్షన్ సీను. రామస్వామి (వైభవ్) ప్రేమ, అజయ్(శివ) నిశ్చితార్ధం పాట వంటి సీన్లు కేవలం సినిమా నిడివి పెంచడానికేతప్ప, పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసేపరంగా పెద్ద సహాయపడినట్లుగా అనిపించవు. ఒక్క రామస్వామి (ఎస్.పి.చరణ్) భార్య సీను, గణేష్ పాత్రధారి అతివేషాలూ తప్ప మిగతావన్నీ అనవసరం అనిపిస్తాయి. ఇక  ఒక్కసారి ఈ మిత్రుల “ప్రయాణం”, సరోజ కిడ్నాప్ ప్రారంభం కాగానే చిత్రం ఊపందుకుంటుంది.

ఆ క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళే మిత్రులు ఎలా ఈ కిడ్నాప్ కథలో involve అవుతారు? సరోజను ఎవరు, ఎలా రక్షిస్తారు? అనేవి ఒక్క రాత్రిలో జరిగే ఘటనలు. అదే ఈ సినిమా కథనం.

నటీనటులలో అందరూ తమతమ మోతాదులో బాగా నటించారనే చెప్పాలి. చెన్నై లో వున్న తెలుగు అన్నదమ్ములుగా వైభవ్, ఎస్.పి. చరణ్ పాత్రలకు న్యాయం చేసారు. TV నటుడిగా శివ నటన, కామెడీని పండిస్తూ ప్రేమ్ జీ నటన అక్కడక్కడా అతిగా అనిపించినా అవసరమే అనిపిస్తుంది. కిడ్నాపర్ గా సంపత్ నటన చాలా డిగ్నిపైడ్ గా ఉంది. సంపత్ కి సహచరిణిగా నిఖిత ఒక ఐటం పాటలో తన అందాల్ని ఆరబోసింది.

ప్రకాశ్ రాజ్ పాత్రకు ఈ చిత్రంలో ప్రాధాన్యత లేకున్నా, కూతురి కిడ్నాప్ తో తల్లడిల్లే తండ్రిగా, భార్యతో సరైన సంబంధం లేకపోయినా ఈ పరిస్థితుల్లో మారుతున్న భర్తగా తన సాధారణ నటనను కనబరిచాడు. పోలీసు అధికారిగా శ్రీహరి నటన కొంత అసహజంగా అనిపిస్తుంది. మిత్రుల ప్రయాణంలో భార్యా, కూతురితో కలిసి ప్రయాణిస్తున్న ఒక హైవే ప్రయాణికుడిగా బ్రహ్మానందం కొంత హాస్యాన్ని అందించడానికి ప్రయత్నించాడు. సరోజగా ‘వెగ’ ఎంపిక పాత్రోచితంగా వుంది. నటన ఫరవాలేదు.

ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని ప్రమోట్ చేసినా ప్రారంభంకాగానే తమిళవాసనలు గుభాళించి కొంత నిరాశ పరిస్తే, వెన్నెలకంటి అనువాదం చిరాకు తెప్పిస్తాయి. పాటల్లో మాటల్లో ఎక్కడా తెలుగు నేటివిటీ కనబడదు. కథనం, సినిమా తీసిన విధానం సాంకేతికపరంగా చాలా బాగున్నా, కొంత అసంతృప్తి మిగలటం మాత్రం ఖాయం.

అంతేకాక, తెలుగులో శ్రీహరి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన పాత్ర రూపకల్పన చెయ్యడం మూలంగా సినిమా చివర్లోని పట్టు పూర్తిగా సడలిపోయి కొంత మేరకు సినిమా హాస్యాస్పదంగా తయారౌతుంది. ఫ్యాక్టరీ సీన్లూ, పోరాట దృశ్యాలు తియ్యడంలో దర్శకుడు తన పరిణితిని కనబరిస్తే, తెలుగులో అవసరమైన, కమర్షియల్ హంగుల్ని అద్దడానికి ప్రయత్నించి అసలుకే మోసం తెచ్చాడనిపిస్తుంది.

నేపధ్య సంగీతం (యువన్ శంకర్ రాజా) , ఛాయాగ్రహణ, ఎడిటింగ్ ఈ సినిమాను సాంకేతికంగా ఉత్తమ చిత్రాల స్థాయిలోకి చేరుస్తాయి. చాలా మంచి ప్రయత్నమే అయినా, తెలుగులో కంటే, తమిళంలో ఈ సినిమా చూడటం ఉత్తమమని నా అభిప్రాయం. ఇలాంటి విభిన్నమైన సినిమాలు రావాలని కోరుకున్నా, తీసేప్పుడు నేటివిటీని, డబ్బింగ్ చేసేప్పుడు కొంత విచక్షణనీ ఉపయోగించకపోతే నిరాశను కలిగిస్తాయనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ.

వైవిధ్యాన్ని ఆదరించే అందరూ కనీసం ఒకసారి చూడవలసిన చిత్రం. కానీ, ఇది ఒక డబ్బింగ్ చిత్రం మాత్రమే అని తెలుసుకుని ధియేటర్ లోకి అడుగుపెడితే నిరాశ పడకుండా బయటపడతాము. లేకుంటే తమిళవాసనల సరోజని ఆస్వాదించలేము.

8 Comments
  1. Sowmya September 9, 2008 /
  2. ceenu September 9, 2008 /
  3. aswin budaraju September 10, 2008 /
  4. నిషిగంధ September 10, 2008 /
  5. sasank September 11, 2008 /