Menu

రాక్ ఆన్

పరిచయం: హిందీ సినిమాకి ఒక కొత్త రూపు, ఊపు ఇచ్చిన ‘దిల్ చాహ్తా హై’ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, గతంలో ‘ఆర్యన్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్-ఆన్. 80 ల నాటి కథలతో ప్రజల సహనాన్ని పరీక్షించే సినిమాలను వారం వారం జనాలమీదకి వదుల్తున్న బాలీవుడ్ నుంచి వరుసగా రెండు వారాలు రెండు మంచి సినిమాలు రావడం ఆనందించదగ్గ విషయం. పోయిన వారం విడుదలయిన ’ముంబాయ్ మేరీ జాన్’, ప్రేక్షకులు మరియు విమర్శకుల మన్ననలందుకుంటుండగానే ’రాక్ ఆన్’ సినిమా పై కూడా దాదాపు అందరూ ఏకాభిప్రాయంతో వుండడం అటు ప్రేక్షకులు ఇటు పరిశ్రమ ఆనందించదగ్గ సమయం.

Warning: Spoilers ahead. సినిమా బావుంది వీలైతే చూసి ఈ సమీక్ష చదవమని విజ్ఞప్తి.

కథ: ఆదిత్య (ఫరాన్ అక్తర్), జో(అర్జున్ రామ్ పాల్), కెడి(పూరబ్) మరియు రాబ్(లూక్ కెన్నీ) అనే నలుగురు స్నేహితుల కథ.  వీళ్ళంతా మ్యాజిక్ అనే రాక్ బ్యాండ్ సభ్యులు. రాక్ మ్యూజిక్కే సర్వస్వంగా గడిపేస్తూ వుంటారు. ఛానెల్ V లో టాలెంట్ హంట్ లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసే కాంట్రాక్ట్ సాధిస్తారు. అప్పటివరకూ బాగానే ఉన్న వాళ్ళ స్నేహం మ్యూజిక్ వీడియో చేసే సమయంలోనూ, ఆడియో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలోనూ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ సమయంలో జరిగిన గొడవల కారణంగా నలుగురూ విడిపోతారు. సంగీత ప్రపంచంలో తమకంటు ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవాలనే కలలు చెదిరిపోతాయి. తలో దిక్కై పోతారు.

ఇలా పది సంవత్సరాలు గడుస్తాయి. ఆదిత్య ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం చేస్తుంటాడు. కానీ జీవితం పూర్తిగా మెకానికల్ గా గడుపుతుంటాడు. జో జీవితం మీద ఆసక్తి కోల్పోయి నిరాశ తో వుంటాడు. కెడి ఎప్పటిలానే సరదాగా వుంటూనే తన జీవితంలో సంగీతం లేని లోటుని మాత్రం ఒప్పుకోలేకపోతాడు. రాబ్ సినిమా పరిశ్రమలో చిన్ని చిన్న కంపోజిషన్ చేస్తూ కాలం గడుపుతుంటాడు.

ఇలాంటి సమయంలో వీరంతా మళ్ళీ కలుసుకునే అవకాశం దొరుకుతుంది. మరో సారి తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే అవకాశం వస్తుంది. అక్కడ్నుంచి వాళ్ళ పయనం తిరిగి ఆరంభం అవుతుంది. తిరిగి వీళ్ళంతా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేషణ:రాక్ ఆన్ కథ లో మరీ వైవిధ్యమైన అంశాలేమీ లేకపోయినప్పటికీ ఫాష్ బ్యాక్ లో నడిచే కథనం ద్వారా దర్శకుడు సినిమా ఆద్యంతమూ గ్రిప్పింగ్ గా చిత్రీకరించాడు. నటీనటులు అందరూ బాగా చేశారు. ఫరాన్ అక్తర్ ది చాలా మంచి రోల్. ఈ సినిమాని నిర్మించడమే కాకుండా, సినిమాలో పాటలు పాడి, డైలాగ్స్ రాసి ఇంకా పెద్ద పాత్రనే వహించారు. జో పాత్రలో అర్జున్ రామ్ పాల్ బాగా ఒదిగిపోయాడు. అతని భార్య గా సహన గోస్వామి చాలా బాగా నటించింది.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు:

 • కథ:ఇలాంటి కథను ఎన్నుకోవడం, అదీ ఎవరూ స్టార్స్ లేకుండా తీయడం.
 • కథనం:నాన్ లీనియర్ గా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో కథ (చాలా వరకూ) చెప్పినా హడావుడి, గందరగోళం లేకుండా వుంది. ఫ్లాట్ గా అప్పుడేం జరిగిందంటే అన్నట్టుగా ఒకే సారి మొత్తం కథంతా చెప్పకుండా చిన్న చిన్న ఎపిసోడ్స్ లో స్టోరీ రివీల్ చేయడం ఈ సినిమాలో బాగా చేశారు. అంటే గతంలో ఇలాంటి టెక్నిక్ తో  సినిమాలు రాలేదని కాదు. మన తెలుగులోనూ క్లాస్ మేట్స్ అనే సినిమాలో ఇలాంటి టెక్నిక్ ఉపయోగించినప్పటికీ గతంలోనుంచి వర్తమానంలోకి అలాగే వర్తమానం నుంచి గతం లోకి ట్రాన్సిషన్ ఈ సినిమాలో ఉన్నంత స్మూత్ గా ఆ సినిమాలో వుండదు.
 • పాటల చిత్రీకరణ: చాలా సినిమాల్లో స్టేజ్ షో లు చూపిస్తున్నప్పుడు అందులో పాల్గొనే ప్రేక్షకుల స్పందనను సరిగ్గా చూపించిన సినిమాలు చాలా తక్కువ. ఏదో మొక్కుబడిగా చేతులూపడమే తప్ప నిజంగా మనం ఒక స్టేజ్ షో చూస్తున్న ఫీలింగ్ రాదు. ఈ సినిమాలో అలా కాదు. మంచి మూడ్ క్రియేట్ చేయగలిగారు. నిజంగా స్టేజ్ షో చూస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది.మరీ చివరై పదిహేను నిమిషాలయితే చాలా బావుంది.
 • సినిమాటోగ్రఫీ/ఎడిటింగ్: ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ లలో చాలా పరిపక్వత కనిపిస్తుంది.

నచ్చని విషయాలు:

 • సినిమా రాక్ బ్యాండ్ కి సంబంధించిన సినిమా కాబట్టి సంగీతం మీద నేను చాలా అంచనాలు పెట్టుకుని వెళ్ళానేమో నాకు మ్యూజిక్ సరిగ్గా ఎక్కలేదు. కొన్ని పాటలు బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్ గా నిరాశ కలిగించింది.
 • మన వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా ఈ సినిమా తీసుంటే ఇన్ని పాటలు సినిమాలో పెట్టుండే వాళ్ళు కాదు. ఆడియో కాసెట్ లో ఉన్నంత మాత్రాన సినిమాలో పాటంతా చిత్రీకరించక్కర్లేదని నా అభిప్రాయం. చివర్లో వచ్చే పది నిమిషాల పాటల ప్రదర్శన అలాగే వుంచి మిగిలిన చోట్ల కేవలం పాటల బిట్లు మాత్రమే ఉపయోగించి ఆ స్క్రీన్ టైమ్ ని సినిమా కథ కోసం ఉపయోగించి ఉంటే బావుండేది.
 • ఇలా చెప్పుకోవాలంటే చాలానే నచ్చని అంశాలున్నాయి కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు మనకి తారసపడతాయి కాబట్టి తప్పులను మన్నించేయొచ్చు.

ముగింపు: ఈ సినిమా కథలో చాలా వరకూ దిల్ చాహ్తా హై పోలికలు బాగా కనిపిస్తాయి. ’దిల్ చాహ్తా హై’ వచ్చిన రోజులకీ ఇప్పటికీ మన వాళ్ళు చాలా మారిపోయారు కాబట్టి ఈ సినిమా దిల్ చాహ్తా హై కంటే పెద్ద హిట్టయినా ఆశ్చర్యం లేదు. ఈ సంవత్సరం బాలీవుడ్ లో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో రాక్-ఆన్ ఒకటి చెప్పడంలో ఎటువంటి సందేహం లేకున్నా ఈ సినిమాని ఇంకా బాగా తీసుండొచ్చని నా అభిప్రాయం.కాలేకీ రోజుల్లో అది చేయాలని ఇది చేయాలని ఎన్నో కలలు కని చివరికి ఉద్యోగం, సంసారం లాంటి బరువు బాధ్యతల చట్రంలో ఇరుక్కుపోయి మన కలలకు సమాధి కట్టడం మనకందరికీ అనుభవమే! అలాంటి సమాధి కట్టిన కలలకు తిరిగి ప్రాణం పోసి ’Live your dream’ అనుకునే వాళ్ళకు తప్పక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది ఈ సినిమా.తప్పక చూడండి.

8 Comments
 1. Sowmya September 1, 2008 /
 2. ravi September 1, 2008 /
 3. arvind September 2, 2008 /
 4. శంకర్ September 2, 2008 /
 5. శోభ September 3, 2008 /