Menu

రాక్ ’న్ రోలా

Spoilers ahead
పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు తీసి జనాలకు విసుగు తెప్పించిన (ఇప్పటికీ తీస్తున్నారనుకోండి. అది వేరే విషయం) తరుణంలో 1996 లో ’ట్రైన్ స్పాటింగ్’ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమాని ’పల్ప్ ఫిక్షన్’ తో పోల్చారు కూడా. ఆ సినిమాతో బ్రిటిష్ సినిమా పరిశ్రమలో కొంత చలనం వచ్చింది. పాత చింతకాయపచ్చడి సినిమా కథలు వదిలేసి (పూర్తిగా కాదనుకోండి) కొంచెం స్టైలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్ రావడం మొదలయ్యాయి. దాని ఫలితంగానే 1998 లో గయ్ రిచీ దర్శకత్వంలో ”లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ’ఫాలోయింగ్’, అలాగే 2000 లో ’స్నాచ్’,’మొమెంటో’, ’లేయర్ కేక్’ లాంటి చిత్రాలు వచ్చాయి. దాదాపుగా ఈ సినిమాలన్నీ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాయి. మొదటి రెండు సినిమాలతో మంచి పేరు సంపాదించిన గయ్ రిచీ ఆ తర్వాత తీసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తన భార్య మడోనా తో తీసిన స్వెప్ట్ అవే సినిమా అయితే ప్రపంచంలో అతి ఘోరమైన సినిమాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ తర్వాత వచ్చిన రివాల్వర్ సినిమా ఫర్వాలేదనిపించినా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇలా రెండు సక్సెస్ లు రెండు ఫెయిల్యూర్స్ తో కెరీర్ బ్యాలెన్స్ చేసుకొన్న గయ్ రిచీ దర్శకత్వంలో వచ్చిన ఐదో సినిమా ’రాక్ న్ రోలా’.

కథ:గయ్ రిచీ సినిమాల కథ చెప్పడం చాలా కష్టం. అతని మిగిలిన సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఒకరి కథ కాదు. ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లీడర్ లెన్నీ రష్యన్ మాఫియా లీడర్ యూరీ కి ఒక భవన నిర్మాణంలో సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అందుకు 7 మిలియన్ యూరోలు అడగుతాడు. వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా యూరీ తన ఫేవరేట్ లక్కీ పెయింటింగ్(బాగా ఖరీదైనది) ని కొన్నాళ్ళు లెన్నీ దగ్గర ఉంచుకోడానికిస్తాడు. దాన్ని ఎవరో దొంగలెత్తుకెళ్తారు.ఇదిలా వుండగా యూరీ ఇవ్వాల్సిన 7 మిలియన్ యూరోలు బ్యాంకు నుంచి తీసుకెళ్తుండగా ఆ సొమ్ము మొత్తం ఎవరో కాజేస్తారు. పోతే పోయిందని మరో సారి బ్యాంకు నుండి డబ్బులు తీసుకెళ్తుండగా మళ్ళీ దోపిడీ జరుగుతుంది. ఒక వైపు యూరీ నా పెయింటింగ్ నా కిచ్చెయ్యమని లెన్నీని అడుగుతాడు. తనకివ్వాల్సిన 7 మిలియన్ యూరోలు తనకివ్వాల్సిందిగా లెన్నీ యూరీని కోరుతాడు. అటు పెయింటింగ్ ఇటు డబ్బు రెండూ దొంగతనం చేయబడ్డాయన్న విషయం ఒకొరికొకరు చెప్పుకోలేరు. ఇంతకీ ఈ డబ్బులు దొంగతనం చేసేది ఎవరు? ఆ పెయింటింగ్ ఎవరు ఎందుకు కాజేశారు? అన్న విషయాలు సినిమా ముఖ్య కథను నడిపిస్తాయి.

విశ్లేషణ:అందరూ చెప్తున్నట్టు గయ్ రిచీ గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా తప్పకుండా చూడదగ్గ సినిమానే కానీ లాక్ స్టాక్ మరియు స్నాచ్ సినిమాలతో ఈ సినిమాని పోల్చలేము. కొన్ని సీన్లు/షాట్లు/సీక్వెన్స్లు బాగానే ఉన్నా సినిమా మొత్తానికి పెద్దగా అలరించదు. ముఖ్యంగా నాకు నచ్చని విషయాలు:

  • సినిమా మొదటి అరగంట వాయిస్ ఓవర్ తో ఏదో క్లాస్ రూమ్ లెక్చర్ లాగా వుంటుంది. స్క్రీన్ మీద జరిగే ప్రతీ దానికీ వెనకనుండి ఒక వాయిస్ ఓవర్ వివరించడం చాలా చిరాకు తెప్పించింది.
  • మొదటి రెండు సినిమాలతో పోలిస్తే సినిమా పేస్ చాలా నిదానంగా వుంది. కేవలం చివరి అరగంటలో మాత్రమే కాస్త ఊపందుకుంటుంది.
  • వీళ్ళ ఏక్సెంట్ అంత వీజీగా అర్థమయ్యి చావదు.
  • క్లైమాక్స్ తేలిపోయింది. సీక్వెల్ తీయాలనుకున్నారనుకుంటా అందుకే సడన్ గా అయిపోతుంది సినిమా.

ఇక నచ్చిన విషయాలు సినిమాటోగ్రఫీ, చాలామంది నటీనటుల నటన, కొన్ని సీన్స్ లో స్టైలైజేషన్, అక్కడక్కడా కామెడీ, ఒక చాలా చిన్న లవ్ మేకింగ్ సీన్ (దీన్ని అతి చిన్న లవ్ మేకింగ్ సీన్ గా రికార్డుల్లోకి ఎక్కించొచ్చేమో).

ఇక పోతే ఈ సినిమా పుల్ అండ్ ఫుల్ పల్ప్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయి వుంది.

ఉదాహరణకు:

  • పల్ప్ ఫిక్షన్ లో ట్విస్ట్ డాన్స్ లాంటిదే ఇందులోనూ అలాంటి ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంది. అంత బాగోలేదు కానీ వెరైటీగానే వుంది.
  • పల్ప్ ఫిక్షన్ లో సూట్ కేస్ లో ఏముందో మనకి సినిమా అయిపోయిన తర్వాత కూడా తెలియదో ఇందులో అసలా లక్కీ పెయింటింగ్ ఎలా వుంటుందో మనకి చూపించరు.
  • ప.ఫి లో మార్సెలెస్ ను కట్టేసి రేప్ చేసే సీన్ లాంటిదే ఇందులోనూ వుంది.
  • ఇక దాన్లో లాగే నాన్ లీనియర్ నెరేటివ్ మరియు మల్టిపుల్ ప్రొటాగనిస్ట్స్(అలా అనొచ్చా లేక ఆంటాగనిస్ట్స్ అనాలో?).

ముగింపు:మీకు గయ్ రిచీ గతంలో సినిమాలు విపరీతంగా నచ్చి వుంటే ఈ సినిమా చూడొచ్చు. ఫర్వాలేదనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు అంత అంచనాలు పెట్టుకోకుండా మొదటి అరగంట ఓపిక పట్టగలిగితే చివరాఖరుకి యావరేజ్ అనుకుని బయటకు రావొచ్చు.