Menu

ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే.

తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. 35 సంవత్సరాల్లో ఏరోజూ ఒక బాధ్యతాయుతమైన పోలిసులా ప్రవర్తించే అవకాసం రాక తన మీద తనే జోకులేసుకొంటూ అందర్నీ నవ్విస్తూ తన అసమర్ధతను కప్పిపుచ్చుతుంటాడు. కొత్త పెళ్ళాంతో హనీమూన్ ప్లాన్ చేసుకున్న కదమ్ బ్లాస్టింగుల వల్ల లీవ్ కాన్సిల్ అవడంతో చాలా అసహనానికి గురవుతాడు. దానికి తోడు అలాంటి పరిస్దితుల్లో కూడా ఒక నైట్ క్లబ్బును మూయించలేని అసహాయతని, కష్టపడి పట్టుకొన్న ఒక డ్రగ్గిస్ట్ ని ఏమీ చేయకుండా వదిలేసిన పై అధికారి మీద కలిగిన అసహ్యాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక మదనపడుతూంటాడు. ఒకానొక సమయంలో తుకారం అసమర్ధతని ఎత్తి చూపి తను అలా బతకాలనుకోవడం లేదని తేల్చి చెప్పేస్తాడు. ఎంతో గొప్పగా ఊహించుకున్న పోలీస్ వ్యవస్ధలోని వాస్తవికతను తర్వాత జరిగే సంఘటనలవల్ల అర్ధం చేసుకొని చివరికి తుకారాంకి క్షమాపనలు చెప్పుకుంటాడు.

సురేష్(కేకే మీనన్) ఒక హిందూత్వవాది. తీవ్రవాదానికి మూలం ముస్లీములే అని బలంగా నమ్మి తన చుట్టూ ఉండే ప్రతీ ముస్లీముని అనుమానిస్తూ ఉంటాడు. సాధారణ విషయాలకు కూడా వింత అర్ధాలు చెప్పి స్నేహితులకి కూడా ముస్లిం వ్యతిరేకతని నూరుపోస్తుంటాడు. పేలుళ్ళ తర్వాత తానే సొంతగా కనిపించిన ముస్లిముల్నందర్నీ నిలదీయడానికి పూనుకుంటాడు. ఈ క్రమంలో అంది వచ్చిన అవకాసాల్ని కూడా కాదని అప్పుల్లో కూరుకుపోవడానికే మొగ్గు చూపిస్తాడు. చివరికి తుకారాం చెప్పిన మాటలతో మారడమే కాకుండా తాను రోజూ అనుమానిస్తున్నా ముస్లిములు కూడా అమాయకులే అని తెలుసుకొని తన తప్పుకు పశ్చాత్తాప పడతాడు.

రూపాళీ(సోహా ఆలీఖాన్) ఒక న్యూస్ చానల్లో రిపోర్టర్‍గా పనిచేస్తుంటుంది. అయినవాళ్లను పోగొట్టుకొని విషాదంలో మునిగిపోయిన వాళ్ళను ప్రశ్నలతో వేదిస్తూ తనను తానో గొప్ప ధైర్యశాలిగా ఊహించుకుంటుంది. కానీ బ్లాస్టింగ్‍లో కాబోయే భర్త చనిపోయాడని తెలియగానే కుప్పకూలిపోతుంది. తన పరిస్ధితిని క్యాష్ చేసుకోవడానికి తను అంతకాలం పనిచేసిన చానల్‍వాళ్ళే ఎగబడడం చూసి తట్టుకోలేకపోతుంది. ఇంతకాలం freedom of expression అనే మాయలో తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో గ్రహిస్తుంది.

నిఖిల్(మాధవన్) ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ అమెరికా వెళ్ళే అవకాశాన్ని కూడా వదులుకొని దేశం మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు. చేసే ప్రతిపనిలోనూ దేశానికి ఏరకంగానూ అపకారం చేయకూడదనుకునే రకం. స్ధోమత ఉన్నా పొల్యూషన్‍ని నివారించడానికి తనవంతు భాధ్యతగా కారు కాదని పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ మీద ఆధారపడి రోజూ ట్రైన్‍లోనే ఆఫీస్‍కి వెళ్తుంటాడు. కళ్ళెదురుగా రక్తపుమడుగుల్లో వేరుపడ్డ శరీరల్ని ప్రత్యక్షంగా చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి భయపడడం మొదలౌతుంది. ఒకానొక సమయంలో దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతాడు. కానీ స్నేహితుని ద్వారా అమెరికా కలల వెనుక ఉన్న మరో కోణాన్ని తెలుసుకొని స్వదేశంలోనే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటాడు.

ధామస్(ఇర్ఫాన్ ఖాన్) మద్రాసునుండి వచ్చి ముంబైలో స్ధిరపడ్డ ఒక టీ బండివాడు. ప్రత్యక్షంగా బాంబ్ బ్లాస్టింగ్‍తో ఎలాంటి సంబంధం లేకపోయినా వాటివల్ల ప్రజల్లో కలిగిన భయాన్ని ఉపయోగించుకొని fake బాంబు బెదిరింపు కాల్స్ చేస్తూ తనకు ఉన్నతవర్గపువాళ్ళనుండి ఎదురైన అవమానాల నుండి సాంత్వన పొందుతుంటాడు. ఐతే తన బెదిరుంపు కాల్ వల్ల ప్రాణాపాయ పరిస్ధితుల్ని ఎదుర్కొన్న ఒక పెద్దాయన్ని చూసి తాను ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తున్నదీ తెలుసుకొని కుమిలిపోతాడు.

2004వ సంవత్సరం ఉత్తమ చిత్రంతో కలిపి మూడు ఆస్కార్లు గెలుచుకున్న crash సినిమా ఇన్స్పిరేషన్ అడుగడుగునా కనిపించినప్పటికి ముంబై నేటివిటీకి చక్కగా సరిపోయేలా కధను రాసుకోవడం బాగా కలిసొచ్చింది. చూడడానికి ప్రతీ సన్నివేశం వాస్తవికంగా అనిపించినప్పటికీ వాటి చాటున మన ప్రేక్షకులకి అవసరమైన డ్రామాను చాలా తెలివిగా చొప్పించగలిగాడు దర్శకుడు. ప్రతి క్యారెక్టరూ సినిమా చివరికి ఎంతో కొంత నేర్చుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే వాళ్ళ మనస్తత్వాలను చాలా తక్కువ సీన్లతోనే ఎలివేట్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. తీవ్రవాదం, రాజకీయం లాంటి విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం సామాన్యుల దృక్కోణాన్నే చూపించడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. కానీ అలా చూపించాలనే ఉద్దేశ్యంతో సమస్యను చాలా సింపుల్‍గా తీసుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే ఎవ్వరూ తీసిపోకుండా నటించారు. ప్రియుడు చనిపోయాడని తెలిసినప్పుడు సోహా ఆలీఖాన్ చాలా పరిణితి చూపించింది, ఇలాంటి సన్నివేశంలోనే ఇంతకుముందు నటించినా (రంగ్ దే బసంతిలో మాధవన్ చనిపోయినప్పుడు) ఇక్కడ క్యరెక్టర్‍లో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండడంవల్ల చాలా బాగా వచ్చింది ఆ సన్నివేశం. అందరి కంటే ఎక్కువ మార్కులు మాత్రం ఇర్ఫాన్ ఖాన్‍కే.. హిందీ సరిగ్గా మాట్లాడలేని తమిళునిగా అదరగొట్టాడు. ఎక్కడా నటన అని అనిపించనంత నేచురల్‍గా ఉంది. మన సైనికుడులో నిరాశపరచినా హిందీలో మాత్రం ఎప్పుడూ తన ఐడెంటీటీని చాటుకుంటూనే ఉన్నాడు. పరేష్ రావల్,మాధవన్,కేకే లు సరైన సెలక్షన్. సామజిక చిత్రం అనగానే సమస్యకు సొల్యూషన్ ఉండాలి అనుకునేవాళ్ళకి కొంత నిరాశ కలిగించినా, ఈ తరహా సినిమాలలో ఇదో డిఫరెంట్ మెసేజ్‍ని పాస్ చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు..

5 Comments
  1. Pradeep September 11, 2008 /
  2. Jonathan September 23, 2008 /
  3. srinivas February 12, 2009 /