Menu

Making movies(Essay-7): ప్లీజ్ ప్లీజ్ పులి మామా!

సత్యజిత్ రాయ్ రాసిన ఏడు వ్యాసాల సంకలనం – మేకింగ్ మూవీస్ లో ఇది ఏడవ, చివరి వ్యాసం. ఆరో వ్యాసం ఇక్కడ చదవొచ్చు. ఇక్కడితో ఈ వ్యాస పరంపర సమాప్తం. మొత్తం అన్ని వ్యాసాలనూ డిసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ చదవొచ్చు.
Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

Goopy Gyne Bagha Byne సినిమా వచ్చిన చాలారోజులకి నేను దానికి కొనసాగింపుగా “హిరాక్ రాజ్య దేశే” (వజ్రాల రాజ్యం) అన్న సినిమా తీద్దామనుకున్నాను. గూపూ,బాఘా ఇద్దరూ ఈ సినిమాలో కౄరుడు, నిరంకుశుడు అయిన వజ్రాలరాజు రాజ్యంలోకి అడుగుపెట్టాక వాళ్ళ వీరగాథల గురించిన సినిమా ఇది. వజ్రాలరాజు ఖజానాలో ఓ పెద్ద పెట్టె నిండా వజ్రాలు ఉన్నాయి. గూపీ, బాఘా రాజభటులకు లంచం ఇవ్వడానికి వాటిలోంచి కొన్ని దొంగిలించాలి. కౄరుడైన రాజుని పదవీచ్యుతుణ్ణి చేయడం ఈ భటుల్ని కొనగలిగితేనే సాధ్యం. స్థానిక గురువు ఉదయన్ పండిట్ ఆలోచన ఇది. వజ్రాల రాజు నిరంకుశత్వానికి చరమగీతం పాడడానికి గూపూ, బాఘాలు ఇతనితో చేయి కలిపారు. వీళ్ళిద్దరూ ఖజానా చేరుకుంటారు. తలుపు వద్ద అటూ ఇటూ తిరుగుతున్న కాపలా భటుడు ఒకడు ఉంటాడు. కానీ, దయ్యాలరాజు ద్వారా గూపీ కి ఒక వరం దక్కి ఉంటుంది. అతను పాడుతూ ఉంటే ఎవరూ ఓ అంగుళం కూడా కదలలేరు, ఒక్క మాట కూడా మాట్లాడలేరు. కనుక, అతను పాట పాడుతూ ఉంటే, బాఘా తేలిగ్గా కాపలావాడి చేతులు తాళ్ళతో కట్టేసి, నోరు మూసేసి అతని దగ్గర్నుండి తాళం తీసుకుంటాడు. తరువాత వాళ్ళు ఆనందంగా ఆ పెద్ద ద్వారాన్ని, దానికున్న పెద్ద తాళాన్నీ తీసి, ఇక ఏ అడ్డంకులూ లేవూ అనుకుంటూ లోపలికి అడుగుపెడతారు. అక్కడ ఆ పెట్టెకున్న తాళాలు విప్పే తాళం చెవిని ఓ పులు కాపలా కాస్తూ ఉందని వాళ్లెలా ఊహించగలరు? గూపీ పాడగలిగితే పులి కూడా స్థాణువౌతుంది కానీ, భయంతో గొంతెండిపోయిన గూపీ ఎలా పాడగలడు?

అతను ఎంతో కష్టపడి చివరికి –
“ప్లీజ్, ప్లీజ్ పులి మామా
కోపం తెచ్చుకోకు మామా
ఎలా తెలుస్తుంది మాకు నువ్విక్కడున్నావని?”
అన్న వాక్యాలు పాడగలుగుతాడు. అతని మంత్రం పనిచేసి పులి ఏమీ చేయకుండా కూర్చుంటుంది. బాఘా ముందుకెళ్ళి, ఆ పులి మీదుగా వంగి తాళాల గుత్తి తీసుకుంటాడు. తరువాత ఇక ఆ పెట్టె తెరిచి వజ్రాలు తీసుకోడమే. ఇదీ మేము తీయవలసిన దృశ్యం. హిరాక్ రాజ్య దేశే సినిమా చూసిన వాళ్ళకి ఈ దృశ్యం గుర్తు ఉండే ఉంటుంది. మేమది ఎలా తీసామో చెప్తాను ఈరోజు.

చాలా హిందీ సినిమాల్లో ఇప్పుడు పులులు, సింహాలూ కనిపిస్తూ ఉంటాయి. చాలావరకు వీటిని చెన్నై నుండి తెప్పిస్తారు. ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన సర్కస్‍లు అన్నీ దక్షిణ భారతదేశానికి చెందినవే. అందుకే మేము ఈ పులి దృశ్యాన్ని చెన్నైలోని ఓ స్టూడియోలో తీద్దామనుకున్నాము. పదేళ్ళ క్రితం గూపీగైనే, బాఘా బైనే తీస్తున్నప్పుడు మేము పులిని ఒక గ్రామంలోకి తీసుకువెళ్ళాల్సి వచ్చింది, షూటింగ్ కోసం. ఇదొక మధురానుభూతి. ఇప్పుడు కూడా ఇక్కడ గుర్తుంచుకోదగ్గ అనుభవమే ఎదురైంది కానీ, వేరే తరహాది. చెన్నైలో కొన్నాళ్ళున్న ఓ బెంగాలీ ఆయన్ని పులిని అద్దెకి తీసుకుని విషయం గురించి ఆరా తీయమని అడిగాము. అతనికి చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి. పైగా, బెంగాల్ నుండి చెన్నైకి షూటింగ్ కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడని పేరు కూడా ఉంది. నేను అసలు పేరు చెబితే ఏమన్నా సమస్యలొస్తాయేమో కానీ, మిస్టర్ బి అనుకుందాం అతన్ని. మిస్టర్ బి పులి ఉండే సన్నివేశాల గురించి వివరాలు అడిగాడు. మేము చెప్పాము. తరువాత అతను గూపీ పాడే పాట ఉండే టేప్ పంపమని అడిగాడు. పులి వద్ద ఆ పాటని ముందు నుంచే వినిపిస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది ఏమో అని. సాధారణంగా షూటింగ్ మొదలయ్యేముందే పాటలన్నీ రికార్డు చేసి పెడతాము. కనుక అతనడిగిన – “ప్లీజ్, ప్లీజ్ పులి మామా” పాట పంపడానికి మాకేమీ అభ్యంతరం కనిపించలేదు.

షూటింగ్ ప్రారంభం కావడానికి పదిరోజుల ముందు మా యూనిట్ కి చెందిన అశోక్ బోస్ మద్రాస్ వెళ్ళి అక్కడ ప్రసాద్ స్టూడియోలో పని చేయడం ప్రారంభించాడు. అక్కడ ఖజానా సెట్ తయారు చేయడం అతని బాధ్యత. సాధారణంగా స్టూడియోల్లో సెట్లు వేయడానికి చెక్క ఫ్రేములు ఉపయోగిస్తారు. వాటికి రంగేశాక అవి వాస్తవికంగానే అనిపిస్తాయి – ఇటుకలతో, సిమెంటుతో చేసిన భవనాలలాగానే. ఓసారి దాన్ని చేత్తో కొడితేనే శబ్దం ద్వారా విషయం తెలుస్తుంది. పులి ని ఖజానా పక్క గదిలో ఉంచాలన్నది మా ఆలోచన. రెండు గదుల మధ్యా, ఒక ఆర్చ్ ఉంది. పులి పైన, గోడపై ఉన్న మేకుకి తాళం చెవి వేళాడుతూ ఉంటుంది. మేము షూటింగ్ ప్రారంభం కావడానికి రెండ్రోజుల ముందు మద్రాసు చేరుకున్నాము. అందరికీ పులిని చూడాలన్న కుతూహలం ఎక్కువైంది. ఇప్పుడు ఆ పులి భయంకరంగా కనిపించలేదంటే మా సీను అనుకున్నంత బాగా రాదు. మిస్టర్ బి మాకు ఎంత చెప్పినా కూడా, పులిని చూసేదాకా మాకు మనశ్శాంతి లేదు. అందుకే, దాన్ని చూడ్డానికి మరుసటి రోజు ఉదయం మిస్టర్ బి తో కలిసి వెళ్ళాము. అక్కడ వేరే జంతువులు కూడా ఉన్నాయి. ఒకచోట నీడలో అటూ ఇటూ ఊగుతూ ఉన్న పిల్ల ఏనుగు కనిపించింది. మిస్టర్ బి కొన్ని అరటిపళ్ళు తీసుకుని దానికి పెట్టడం మొదలుపెట్టాడు. అతనెందుకు ఇది చేస్తున్నాడు? మేము చూడాల్సింది పులిని కానీ, ఏనుగును కాదు కదా! తరువాత పులి శిక్షకుడు బైటకెళ్ళాడనీ, త్వరలోనే వస్తాడనీ తెలిసింది.

శిక్షకుడు వచాక మమ్మల్ని పులి బోను ఉన్న గదికి తీసుకెళ్ళారు. ఇది మా పాటని టేపులో మళ్ళీ మళ్ళీ విన్న పులేనని తెలిసింది. సీన్ తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉండింది. ఆ గదంతా చీకటిగా ఉంది. పులిని సరిగ్గా చూడ్డానికి సాధ్యపడలేదు. నాకు అసంతృప్తిగా అనిపించి ఆ శిక్షకుడిని – “కాస్త దాన్ని బయటకు తేగలరా?” అని అడిగితే, అతను “తప్పకుండా” అన్నాడు.
“అయితే, దయచేసి ఆ పని చేయండి, ప్లీజ్! పులిని మేము ఆ గదిలోపల కాదు, బయట చూద్దామనుకుంటున్నాము” అని జవాబిచ్చాను. కానీ, ఎందుకో కానీ, అతను ఆ పని చేయడానికి అంత సిద్ధంగా లేడు. మిస్టర్ బి కూడా నా మాటలు విని కాస్త బిగుసుకుపోయాడు. ఏం జరుగుతోందిక్కడ? మాకు విషయం కనుక్కోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పులి ఆ బోను నుండి బయటకొచ్చి కనబడగానే మాకు అది ఎంత ముసలిదో అర్థమైంది. అది భయంకరంగా కనిపించే రోజులు పోయాయి.

2 Comments
  1. కొత్తపాళీ November 14, 2008 /