Menu

Making movies(Essay-6): ఫెలూదాతో, వారణాసిలో

“With Feluda in Varanasi” అన్నది “Making movies” అన్న ఈ వ్యాస పరంపర లో ఆరవ వ్యాసం. వీటిల్లో అన్నింటి కంటే పెద్ద వ్యాసం కూడానూ. వీలైనంత వరకు దీన్ని readable గా page break చేయడానికి ప్రయత్నించాను. ఇందులోని అన్ని వ్యాసాల్లోకీ సినిమా తీయడంలోని చాలా విషయాలని ఇది చెప్పినంతగా వేరే ఏ వ్యాసమూ చెప్పదు. ఈ సిరీస్ లోని ఐదవ వ్యాసం గత నెల్లో నవతరంగం లో వచ్చింది. దాన్ని ఇక్కడ చూడవచ్చు.ఇక చదవండి.

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

ఇక్కడికి చివరిసారి వచ్చింది అపూతో. ఇప్పుడు ఫెలూదాతో కలిసి వారణాసికి వచ్చాను. అపరాజితో షూటింగ్ సందర్భంగా ఇరవైరెండేళ్ళ క్రితం వారణాసికి వచ్చాను. నగరంలోని చిన్న చిన్న సందులూ గొందులూ, ఇక్కడి గుళ్ళూ-ఘాట్లు, పూజారులూ-సాధువులూ, ఇక్కడి ఆవులూ-కోతులతో సహా అప్పుడు సమస్తం అపూ కళ్ళనుండి సినిమాలో చూపించాము. ఈసారి అదే ప్రదేశమైనా కూడా, సంఘటనలు చాలావరకు వేరు వేరు. ఇప్పుడు వారణాసి నగరం ఒక అపరాధ పరిశోధన కథకు వేదిక. డిటెక్టివ్ ఫెలూదా ఇక్కడికి సెలవుపై వచ్చినా కూడా, మొదట ఓ దొంగతనం కేసు పరిష్కరించడం మొదలుపెట్టి తరువాత హత్యకేసు వైపుకి వస్తాడు. వారణాసిని పూర్తిగా కొత్త కళ్ళతో చూడొచ్చు ఈ సినిమాలో. ఈ నగరంలోని ప్రత్యేకతలని ఇక్కడికి రానివారికి వర్ణించడం చాలా కష్టం. కలకత్తాలో కూడా ఘాట్ ఉంది. చిన్న చిన్న వీథులు కూడా ఉన్నాయి శ్యాంబజార్, బాగ్ బజార్, బోరో బజార్ వంటి చోట్ల. కానీ, వారణాసిలో ఉన్నవాటికి తమదైన వ్యక్తిత్వం ఉంది. అవి ఈ నగరానికే ప్రత్యేకం.

ఉదాహరణకి ఇక్కడి ఘాట్లతోనే మొదలుపెడదాం. వాటికి అంతమనేదే ఉండదు. దక్షిణాన ఆసి ఘాట్ మొదలుకుని ఉత్తరాన ఉన్న రాజ్ ఘాట్ దాకా వాటి పేర్లూ, వాటి పక్కనున్న భవనాలూ ఈ నగరానికున్న గతంలోని విభిన్నమైన ఛాయలను చూపిస్తాయి. ఉదాహరణకి దక్షిణాన ఓ చివర్న ఉన్న హరిశ్చంద్ర ఘాట్ వారణాసిలోని రెండు పెద్ద శ్మశానవాటికల్లో ఒకటి. పాతకాలంలో హరిశ్చంద్రుడు తన భార్యనీ, కొడుకు రోహితుడినీ ఓ బ్రాహ్మణుడికి అమ్మి ఓ సంవత్సరమంతా ఓ చంఢాలుడి వద్ద ఊడిగం చేసాడు. అక్కడికి దగ్గర్లోనే తులసి ఘాట్ ఉంది. తులసిదాసు రామచరితమానస్ ఈ ఘాట్ కి దగ్గర్లోనే ఉన్న ఓ ఇంట్లో రాశాడు. తులసి ఘాట్ కి ఉత్తరంగా రాజా చైత్ సింగ్ భవనం ఉంది. అది షిబల ఘాట్ పక్కనే. వారెన్ హేస్టింగ్స్ అతన్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు చైత్ సింగ్ తన భవనం కిటికీలోంచి సరాసరి గంగానదిలోకి దూకేసి ప్రాణం కాపాడుకున్నాడని అంటారు. ఎందరో రాజులు ఇలా ఘాట్ల పక్కగా తమ భవనాలు కట్టించుకున్నారు. అందుకే వాటికి ఆ రాజుల పేర్లే పెట్టుకున్నారు. మానసరోవర్ ఘాట్ ని అంబర్ మాహారాజా మాన్‍సింగ్ కట్టించాడు. రాణా ఘాట్ ని ఉదయపూర్ రాణా కట్టించాడు. ఇండోర్ మహారాణి అహల్యాబాయి అహల్యా ఘాట్ ని కట్టించారు. మన్ మందిర్ ఘాట్ పై గల ప్రసిద్ధి చెందిన మన్ మందిర్ ని రెండువందల యాభై ఏళ్ళ క్రితం జైపూర్ కి చెందిన మహారాజా జైసింగ్ కట్టించాడు. కానీ, వీటిలో బాగా పేరు పొందిన ఘాట్లు – వారణాసిలోని అతి పురాతనమైన శ్మశానవాటిక అయిన మణికర్ణిక మరియు బ్రహ్మ పది ఆశ్వమేధ యాగాలు చేసినట్లుగా చెప్పుకునే దశాశ్వమేధం. వాటికున్న ప్రఖ్యాతిగాంచిన వాటి పెద్దపెద్ద గొడుగుల్ని బట్టి వాటిని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ గొడుగులను పట్టుకుని ఉండే కర్రలు పండాలనబడే అక్కడి పూజారుల చెక్క కుర్చీల పై పెట్టబడ్డ రాళ్ళకి తగిలించి ఉంటాయి. ఇవి సూర్యుడి స్థానాన్ని బట్టి మార్చేవిధంగా రాళ్ళ మధ్య అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా రోజంతా వారికి నీడగానే ఉంటుంది. ఇలాంటి గొడుగుల్ని నేనెక్కడా చూడలేదు.

ఇక్కడి సందులు అన్నింటిలోకీ సన్నగా ఉండేది విశ్వనాథ గల్లీ. నాలుగు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ సందు దశాశ్వమేధ ఘాట్ నుండి బైటకి దారి చూపుతూ విశ్వనాథాలయానికి లోపలవైపుకి తీసుకెళ్తుంది. ఈ సందుకి ఇరువైపులా ఎన్నీ దుకాణాలు-ఏది వీలైతే అది అమ్ముతూ. కానీ, వారణాసి ఏ రెండు వస్తువులకైతే ప్రసిద్ధి గాంచిందో, ఆ రెండు వస్తువులు – రుబ్రి మలై, కంచు గిన్నెలు దొరికే చోటు వేరు. మొదటిది కచౌరి గలీ లోనూ, రెండవది తతేరి బజారు లోనూ. విశ్వనాథాలయంనుండి తక్కిన వీథులకి నిజానికి ప్రధాన మార్గాన్ని చేరకుండానే వెళ్ళవచ్చు. ఈ గల్లీల్లో చాలావాటికి ఏడాదిలోని ఏ కాలంలోనూ సూర్యరశ్మి అన్నదే తగలకపోవచ్చు. పెద్ద పెద్దగా, ఎన్నో అంతస్థులున్న హవేలీలు తరుచుగా కనిపిస్తూ ఉంటాయి ఈ సన్నని దారుల్లో. చాలామటుకు ఇళ్ళల్లో మధ్యభాగంలో ఒక బహిరంగ ప్రదేశం ఉంటుంది. అక్కడ నిలబడి తల ఎత్తి చూస్తే, ఆకాశం కనిపిస్తుంది. చతురస్రంగా ఉన్న ఓ నీలి గాజుముక్కలాగా. అది గనుక లేకుంటే మొత్తం భవనమంతా లాంతర్లో లేక వేరే ఏదో మార్గమో ఉపయోగించి వెలిగించాల్సిందే. ఇలాంటి ఓ వీథిలోనే మన సినిమాలోని విలన్ – మగన్‍లాల్ మేఘరాజ్ నివాసం. కనుక, ఇతనికోసం ఇల్లు వెదికే పని పడింది మాకు.

ఇక్కడ దాదాపు లక్షాయాభైవేలమంది బెంగాలీలు ఉన్నారు వారణాసిలో. చాలామటుకు అందరూ బంగాలీతోలా అన్న ప్రాంతంలోనే ఉన్నారు. ఇక్కడ బెంగాలీ ఎంత ఎక్కువగా వినబడుతుందంటే, షాపులపై బెంగాలీ రాతలు ఎంత తరుచుగా కనబడతాయంటే – మేము చూస్తున్నది బెంగాల్ లోని ఓ టౌనా? అనే సందేహం కలిగేంత! ఇక్కడి చాలా కుటుంబాలు దాదాపు పది తరాలుగా ఇక్కడే స్థిరపడ్డవి. అయినా కూడ, కొంచెం కూడా ఉత్తర భారతదేశపు యాస లేకుండా బెంగాలీ మాట్లాడతారు. చౌకంబాకి చెందిన మిట్టర్ కుటుంబాన్నే తీసుకుంటే వాళ్ళు ఎప్పుడో మొఘలుల కాలం నుండీ దాదాపు నాలుగువందల సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళింట్లో దుర్గాపూజ కూడా జరుగుతుంది. ఇక్కడి అతి ప్రాచీనమైన పూజ అది. వాళ్ళ ఇల్లు కూడా ఓ చిన్న గల్లీలోనే. బైట నుండి చూస్తే అది ఎంత పెద్దదో చెప్పడం కష్టం.
*******************************************
బంగారంతో చేయబడి, వజ్రం పొదిగిన ఓ వినాయకుడి విగ్రహం చోరీ కేసులో మరియు ఓ హత్య కేసులో ఫెలూదా వారణాసిలోని ఘాట్లలోనూ, వీథుల్లోనూ తిరగాలి కథ ప్రకారం – రహస్యాన్ని ఛేధించడానికి. మేము మూడురోజులకి వారణాసి వెళ్ళాము. ఎక్కడ షూట్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో వెలుతురు ఎలా ఉంటుంది? ఎక్కడ మాకు స్థానికులనుండి సహకారం లభిస్తుంది? వంటి విషయాలు తెలుకుకోవడానికి. చివరిది మాకు అత్యంత ముఖ్యం. అందువల్ల కొందరు స్థానికులతో మాట్లాడాము. “జయ్ బాబా ఫెలూనాథ్” (The mystery of the elephant God) అన్న కథలో చెప్పిన సంఘటనలన్నీ దుర్గాపూజ జరిగే ఐదు రోజులపాటు జరుగుతాయి. దుర్గామాత విగ్రహానికి ఈ కథలో పెద్ద స్థానమే ఉంది. కనుక, మట్టితో చేసిన ఓ దుర్గాదేవి విగ్రహం కావాలని అర్థమైంది మాకు. అందుకే, మేము మొదట చేసిన పని బంగాలిటోలా లో గణేశ్ మొహల్లా ప్రాంతంలో ఉన్న కమ్మరివాళ్ళని గురించి ఆరా తీయడం.

ఇక్కడ ఓ సెకను ఆగి మీకు గోధూలియా గురించి చెప్పాలి. ఎందుకంటే, గోధూలియాని వదిలే నాలుగు దారుల్లో ఒకదారి గణేశ్ మొహల్లాని చేరుకుంటుంది. కలకత్తాలోని శ్యాంబజార్ వద్ద కలిసే ఐదురోడ్లు ప్రసిద్ధి చెందినట్లే, లేదా ధరంటోలా, ఛౌరింఘీ వంటి పెద్ద పెద్ద కూడళ్ళ లాగే ఇక్కడ గోధూలియా ఉంది. జనాలు ఇళ్ళలోంచి వ్యాపారాలకి వెళ్ళే సమయంలో అక్కడికి వెళ్ళి చూస్తే ఈ కూడలి వద్ద ఓ గోడ కనిపిస్తుంది. అందులో కదలిక ఉంది, అక్కడ శబ్దం కూడా వస్తుంది. ఒక్కోసారి వారణాసిలో ఉన్న పద్దెనిమిది వేల రిక్షాలూ అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. మామూలు పాదచారులకి ఈ గోడ దాటే అదృష్టం తక్కువ. ఈ గోడ కేవలం రిక్షాలే కాదు-లెక్కలేని టాంగాలూ, కార్లూ, సైకిళ్ళూ, లెక్కలేనంత మంది మనుష్యులతో కట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ వాహన,మానుష సంద్రంలో ఎర్ర తలపాగాల పోలీసువాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ అటూ ఇటూ చేతులు ఊపుతూ ఉంటారు కానీ, ఎవరూ వారిని పట్టించుకోరు. పోలీసులే తమ పనిని అంత శ్రద్ధగా పట్టించుకోరు. ఎందుకంటే వారి కళ్ళ ముందే చాలా జరుగుతూ ఉంటాయి – కార్లు రిక్షాలని ఢీకొనడం, అవి వెళ్ళి సైకిళ్ళనో, పాదచారులనో ఢీకొట్టడం ఇలాంటివి. ఇలాంటి చిన్న చిన తగాదాలను గురించి ఎవరూ ఆలోచిస్తున్నట్లు అనిపించదు. పోలీసులు సరేసరి!