Menu

Making Movies(Essay-5): హల్లా రాజు సైన్యం (The army of Raja Halla)

Making Movies అన్న సత్యజిత్ రాయ్ వ్యాస సంకలనం అనువాదం నవతరంగం లో మేనెల లో మొదలుపెట్టినా కూడా, అనేక కారణాల వల్ల నత్తనడకన సాగుతూ వస్తున్నది. ఏడు వ్యాసాల ఈ సంకలనం లో నాలుగు వ్యాసాలు ఇదివరకే వచ్చాయి. వాటన్నింటినీ ఇక్కడ చదవొచ్చు. ఐదో వ్యాసం ఇక చదవండి. 🙂

“షోనార్ ఖిల్లా” తీసే సమయంలో ఒంటెలతో ఉన్న కొన్ని సీన్లను తీసేందుకే మేము ఎంత కష్టపడ్డామో ఇదివరకే “ఒంటెలు-ట్రైన్లు” వ్యాసంలో చెప్పాను. అప్పుడు మేము పని చేసిన ఒంటెల సంఖ్య అయిదు మాత్రమే. కానీ, దానికి కొన్నేళ్ళ ముందు Goopy Gyne, Bagha byne సినిమా తీసినప్పుడు మేము వెయ్యి ఒంటెలతో రాజా హల్లా సైన్యాన్ని తెరపై చూపవలసి వచ్చింది. అంతే కాదు. మాకు వెయ్యిమంది మనుష్యులు కూడా కావాలి కదా. వాళ్ళ బట్టలు, ఈటెలూ, జెండాలు, నగ్రాలూ వగైరా వగైరా. నిజం చెప్పాలంటే, అంత పెద్ద ఎత్తున పనిచేసిన అనుభవం లేదు మాకు. అందుకే ఆ సినిమా తాలూకా అనుభవాలన్నీ దానికోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ గుర్తుండిపోయాయి. అప్పటి కొన్ని అనుభవాల గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు.

ఈ సినిమా స్క్రీన్‍ప్లే ని “సందేశ్” లో వచ్చిన ఉపేంద్ర కిశోర్ రాయ్ కథ ఆధారంగా రాసాను. అప్పట్లో ఈ సినిమాలోని ప్రధానభాగాన్ని ఎక్కడ తీయాలి అన్న ఆలోచన లేదు నాకు ఇంకా. నాకు తెలిసిందల్లా హల్లా రాజు సైన్యమంతా గుర్రాలపై స్వారీ చేస్తారని. కానీ, రాజస్థాన్ లోని జైసల్మెర్ ని చూడగానే నాకు హల్లా రాజ్యాన్ని చూపడానికి ఇంతకంటే తగిన ప్రదేశం లేదేమో అనిపించింది. కానీ, అక్కడ గుర్రాల్లేవు. స్థానికులు ఒంటెలనైతే ఇస్తామన్నారు. దాంతో, గుర్రాలపై స్వారీ చేసే సైన్యం కాస్తా ఒంటెలపై నిలబడ్డది. అయితే, గుర్రాల్ని ఒంటెలని మారిస్తే నా పని పూర్తయినట్లు కాదు. అదే ఆరంభం. ఎంతో ఆలోచించి, ఎన్నో ఏర్పాట్లు చేయాలిక. మొట్టమొదట, సైనికులకి బట్టల దగ్గర్నుంచి, తలపాగాలు, కాళ్ళకి తొడుక్కునే నగ్రాలు అన్నీ డిజైన్ చేయాలి. సేనాధిపతికి మళ్ళీ వేరే వేషం ఉండాలి – కాస్త ఎక్కువ సరంజామా, వేరే రకం కిరీటం. ఈ డిజైన్ అంతా అయ్యాక బాంబే లోని ఓ కంపెనీ ని వెయ్యి జతలు తయారుచేయమని చెప్పాము. పెద్ద సైన్యం అంటే ఎక్కువ మంది సైనికులు ఉండాలి కదా మరి! ఇది పాత మరియు ప్రసిద్ధి చెందిన కంపెనీ. సినిమాలకి సంబంధించిన ఇలాంటి పనులకి పెట్టింది పేరు. వాళ్ళు చెప్పిన సమయానికి బట్టలన్నీ ట్రంకుపెట్టెల్లో పెట్టి చెప్పిన చోటికి నాలుగు లారీల్లో పంపుతామన్నారు. ఇవి బాంబే నుండి జైసల్మెర్ చేరుకున్నాకే మా షూటింగ్ మొదలుపెట్టుకుంటాము.

******************************************************

బట్టల సంగతి అయిపోయింది. ఇప్పుడిక సైనికులు, ఒంటెల సంగతి చూడాలి. రాజస్థాన్ లో ఒంటెలెక్కువన్న మాట నిజమే కానీ, అనుకున్న రోజు అనుకున్న సమయానికి వెయ్యి ఒంటెలు, వాటి యజమానులతో సహా ఎక్కడ్నుంచి దొరుకుతాయి? చివరికి మేము జైసల్మెర్ మహారాజాని సంప్రదించాలని నిర్ణయించుకున్నాము. మేముండే గెస్ట్ హౌజ్ జవహర్ నివాస్ నుండి ఆయన భవంతి కనిపిస్తూ ఉండేది. ఆయన్ని కలవడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని నేను, కొద్ది మంది యూనిట్ సభ్యులూ కలిసి ఆయన్ని చూడ్డానికి వెళ్ళాము. ఆయనసలు రాజులాగే లేడు. సాధారణంగా మనం చిత్రపటాల్లో చూసే సంప్రదాయ రాజుకీ ఆయనకీ పోలికే లేదు. ఆయన పొడుగ్గా దిట్టంగా లేడు. కనీసం పెద్ద మీసాలూ, గెడ్డం కూడా లేవు. కానీ, కాసేపట్లోనే ఆయనకి ఎంత పరపతి ఉందో అర్థమైంది మాకు. “వెయ్యి ఒంటెలా? సరే, కుమార్ బహదూర్ చూసుకుంటాడు మీ పని.” అన్నాడు. కుమార్ బహదూర్ మహారాజాకు దూరపు చుట్టం. ఇరవైలలో ఉన్న యువకుడు. పెద్దగా శబ్దం చేస్తూ, రోడ్డంతా దుమ్ము లేపుతూ వెళ్ళే ఓ మోటార్ సైకిల్ నడిపేవాడు. అతను అప్పటికే జైసల్మెర్ లో సినిమా షూటింగని మహా ఉత్సాహంగా ఉన్నాడు. మేము మా అవసరం గురించి చెప్పగానే వెంటనే మాకోసం వెయ్యి ఒంటెల్ని సిద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు.

హల్లా రాజు సైన్యం సినిమాలో ఒకే దృశ్యంలో కనిపిస్తుంది. కానీ, ఆ దృశ్యంలోనే బోలెడు విషయం ఉంది. హల్లా రాజు షుండి రాజ్యంపై యుద్ధం ప్రకటించిన విషయం తెలుపడానికి మొత్తం సైన్యాన్నీ పిలిపిస్తాడు. సీను మొదలయ్యేసరికి ప్రతి సైనికుడూ, అతని ఒంటెతో సహా నేలపై కూర్చుని ఉంటాడు. సేనాని “ఊంట్ ఉటావో” అన్నాకూడా ఎవరూ లేవరు. ఎందుకంటే రాజు యొక్క దుష్ట మంత్రి సైనికుల్ని మాడుస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఈ ఆజ్ఞని పట్టించుకోకుండా అలాగే కూర్చుని ఉంటారు. దిక్కుతోచని సేనాని హడావుడిగా మంత్రి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరిస్తాడు. మంత్రి బర్ఫీ అన్న ముసలి మాంత్రికుణ్ణి పిలిపిస్తాడు. తనలో ఇంకా మిగిలున్న శక్తితో బర్ఫీ మాయచేసి, సైన్యంలోని జడత్వాన్ని వదిలించి, వాళ్ళ కోపాన్ని మరిచిపోయేలా చేసి వాళ్ళని లేచి నిలబడేలా చేస్తాడు. కానీ, సైన్యం షుండి వైపు వెళ్ళే సమయానికి గూపీ, బాఘా ఉన్నట్లుండి సీనులోకి వచ్చి పాట పాడటం మొదలుపెడతారు. సైన్యం ఆగిపోతుంది. పాట ఆపగానే ఆకాశం నుండి మిఠాయిల కుండలు రాలిపడటం చూస్తారు సైనికులు. అవి మెల్లిగా నేలపై పడగానే, ఆకలి గుర్తొచ్చి, యుద్ధం సంగతి మరచి, సైనికులందరూ వాటిమీద పడతారు. మంత్రి కూడా కక్కుర్తి పడతాడు కానీ, ఈ గొడవలో ఎవరి కాళ్ళ మధ్యనో నలిగి అతని కుండ విరిగిపోతుంది. గూపీ, బాఘా ఇదే అవకాశం చూసుకుని, హల్లా రాజుతో కలిసి, షుండికి ఎగిరిపోతారు. – ఇదీ సీను.

జైసల్మెర్ కోటకి తూర్పు దిశగా ఓ అద్భుతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాం సైన్యం పోగయ్యే ఈ దృశ్యం తీయడానికి. కనుచూపుమేరవరకూ ఇసుకతో నిండి ఉంది. ఎక్కడా పచ్చదనమే లేదు. ఇక్కడి ఇసుక ఎడారిలోని మిగితా ప్రాంతాల్లోలా నడుస్తూ ఉంటే కూరుకుపోయేలా లేదు. నడకకి అనువుగా ఉంది. ఉత్తరదిశలో ఓ రాతి కొండ ఉంది. ఓ మైలు దూరం వరకు పొడిగింపబడి, సహజసిద్ధమైన గోడలా ఉంది. ఈ కొండపైన చదునుగా ఉంది. పదకొండో శతాబ్దంలో ఈ కొండపై భాటీ రాజ్‍పుట్ వీరులు వాళ్ళ కోట కట్టుకున్నారు. రాజస్థాన్ లో ఇలాంటి కొండలు చాలా ఉన్నాయి. వీటినే “టేబుల్ మౌంటైన్స్” అంటారు. జైసల్మెర్ కోటలాగానే చిత్తోఢ్ లో కూడా కోట, నగరం ఓ కొండపైని చదునైన ప్రదేశంలో కట్టినవే. షూటింగ్ కోసం ఎంచుకున్న ప్రదేశం దగ్గర్లో రాజ్‍పుట్ వీరుల స్మశాన వాటిక ఉంది. రెండొందల యార్డుల వరకు రకరకాల సైజుల్లోని స్మారక చిహ్నాలున్నాయి. అన్నీ yello sandstone తో చేసినవి. ఇది చూసాక నాకో ఆలోచన కలిగింది. గూపీ బాఘాలను యుద్ధం వల్ల నష్టాల గురించి చెప్పే ఓ వాక్యం వచ్చినప్పుడు ఇక్కడ నడుస్తూ పాడుతున్నట్లు చూపించాలని.

4 Comments
  1. Sowmya September 16, 2008 /