మేకింగ్ మూవీస్ – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (మొదటి భాగం)

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

జంతువులని పెట్టి సినిమాలు తీయడంలో హాలీవుడ్ కి సాటిలేదు. నా చిన్నప్పుడు సినిమాల్లో రిన్‍టిన్‍టిన్ అనే అల్సేషన్ ఉండేది. సుమారు సినిమాలు ఉన్నాయి ఇవి. ఆ కుక్క నటన మనిషి నటనకన్నా కూడా ఆకట్టుకునేది. తరువాత కోలీ జాతి కుక్క అయిన లాసీ నటించిన మూడు నాలుగు సినిమాలు చూసాము. ఆ దర్శకుడు లాసీ చేత ఏదైనా చేయించగలడు అనిపించింది. ఈ శిక్షణ పొందిన కుక్కలకి కూడా ఓ స్టార్ ఇమేజీ ఉండేది. అవి సంపాదించే డబ్బు నిజజీవితంలో ఫిల్మ్ స్టార్ సంపాదనకి ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒక సినిమానుంచే వాటి యజమానులు చాలా తేలిగ్గా కనీసం లక్షరూపాయలన్నా సంపాదించేవారేమో. ఈ జంతువులని ఎంత గౌరవంగా చూస్తారో హాలీవుడ్ లో నేను డిస్నీ స్టూడియో లో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఓ షూటింగ్ చూసినప్పుడు అర్థమైంది నాకు. ఆ సినిమాలో ముఖ్య పాత్ర ఓ పెద్ద కుక్క – అమెరికాలో షాగీ డాగ్ అంటారు. నేను స్టూడియో చేరేసరికి ఇంకా షూటింగ్ మొదలవలేదు. కెమరామెన్ లైట్లు సిద్ధం చేసుకుంటున్నాడు. సాధారణంగా ఈ సమయంలో నటవర్గం కూడా ఉంటారు – కెమరామెన్ కు తాము ఎలా నడుస్తారు, ఆ సీనులో ఎక్కడ నిలబడతారు వంటివి చూపడానికి. పెద్ద పెద్ద తారలకి ఈ పనిని వాళ్ళ బదులు వాళ్ళ stand-ins చేస్తారు. అంటే, భౌతికంగా ఆ తార వంటి స్వరూపం కల వారు. అసలు తారలు మాత్రం లైట్లు రెడీ అయ్యాక షాటుకి ముందు వస్తారు. ఈ డిస్నీ స్టూడియోలో కొందరు నటులు సెట్ల మీద కదులుతూ ఉంటే, ఒక వైపు మన హీరో-ఈ కుక్క..నిశ్శబ్దంగా నిలబడి ఉన్న విషయం నేను గమనించాను. కెమెరామెన్ అందర్నీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లోకి రమ్మని అరిచాడు. కానీ, ఈ కుక్క కదల్లేదు. నాకు అర్థం కాలేదు. ఒక వేళ తరువాతి షాటుకి అది అవసరంలేదేమో? నేను ఎవరినన్నా అడుగుదాం అనుకునేలోగానే అక్కడో వింత జరిగింది. ఎక్కడ్నుంచో ఓ చిన్న మరుగుజ్జు వచ్చాడు. అతని వెనుకే బాగా బొచ్చు ఉన్న కుక్క చర్మాన్ని పట్టుకుని మరో మనిషి. తరువాత, నా ఆశ్చర్యానికి అవధుల్లేవు – ఆ మరుగుజ్జు నాలుగు కాళ్ళమీద ఆ నేలపై గీసి ఉన్న గుర్తుల వెంట ఆ కుక్క చర్మం కప్పుకుని ఓ జంతువు నడిచినట్లే నడిచాడు. అలా ఒక చోటినుండి మరో చోటికి నడుస్తూ ఉంటే కెమెరామెన్ లైట్లతో బిజీ అయ్యాడు. అప్పుడు అర్థమైంది నాకు – ఆ మరుగుజ్జు ఆ కుక్కకి stand-in గా నియమితుడైన మనిషి అని!!

హాలీవుడ్ సినిమాలోని ప్రతి జంతువూ సుశిక్షితమైనది. ఓ గుర్రానికో, కుక్కకో అలా శిక్షణ ఇప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ, పక్షులకి శిక్షణ ఇవ్వడం గురించి విన్నారా? ఒకటీ రెండూ కాదు -వందలకొద్దీ. సినిమా చరిత్రలో అత్యుత్తమ సస్పెన్స్ సినిమాల సృష్టికర్త అయిన ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ “బర్డ్స్” అన్న సినిమా తీద్దాం అనుకున్నప్పుడు హాలీవుడ్ లో ఇది కూడా సాధ్యమైంది. ఈ కథలో ప్రపంచంలోని పక్షులన్నీ మనుష్యులమీద దాడి చేయడం మొదలుపెడతాయి. హిచ్‍కాక్ కి రకరకాల పక్షులు కావాల్సి వచ్చాయి. కానీ, అన్నిటికంటే పెద్ద సంఖ్య లో ravens కావాల్సి వచ్చాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అంతా ఎక్కడికక్కడ నోటీసులు పంపబడ్డాయి-సుశిక్షితులైన రావెన్లు సుమారు వందదాకా దొరికే మార్గం తెలిసిన వారు దర్శకుడిని సంప్రదించాలి అని. ఎవరో కొద్ది రోజుల్లో జవాబిచ్చారు. అతన్ని పక్షుల్ని పట్టుకు రమ్మంటే దాదాపు వంద పక్షులతో వచ్చాడు. అయితే, ఈ శిక్షణ ఎక్కువ దూరం వెళ్ళలేదు. అంటే, అక్కడ అద్భుతం అనదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. కానీ, సుమారు యాభై రావెన్లు ఒక వరుసలో నిశ్శబ్దంగా చెప్పినచోట నిలబడమని చెప్పగానే నిలబడగలిగితే – అది కూడా చెప్పుకోదగ్గ విషయమే కదా..

మన దేశంలో అయితే, శిక్షణ పొందిన జంతువులని దొరకబుచ్చుకోవడం కష్టం. అయినప్పటికీ బాంబే మద్రాస్ లలో ఏనుగులూ,గుర్రాలూ,పులులతో కొన్ని సినిమాలు తీసారు. వాటి నటన చూస్తే, అవి ఆజ్ఞ ఇస్తే పాటించడానికి అలవాటు పడినవే అని తెలుస్తుంది. బెంగాల్ లో కొన్ని సార్లు తెలివైన పోలీసు కుక్కలు దొరికేవి. ఓపికుంటే, వాటి నుంచి మంచి ప్రదర్శనను రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు – మేము పథేర్ పాంచాలి కోసం బూలో నుంచి రాబట్టినట్టు. ఒక కుక్కతో పని చేయడం – కష్టమేమో కానీ అసాధ్యం కాదు. మీ సినిమాలో పులి కావాల్సి వస్తే ఏమి చేస్తారు? మేము “goopy gyne, bagha byne” సినిమా తీస్తున్నప్పుడు అది కూడా అనుభవించాము. ఆ సినిమా కథ ఇలా ఉంటుంది – గూపీ ని రాజు ఊరు విడిచి వెళ్ళమని శాసిస్తాడు. గూపీ ఓ గాడిదమీద బయలుదేరి ఒక అడవిని చేరుకుంటాడు. రాత్రి అక్కడ గడపాలి. అక్కడ పులి కనబడ్డానికి చాలా అవకాశం ఉంది. కాస్త భయపడుతూ, కాస్త కంగారు పడుతూ, గూపీ తన గాడిదపై నుంచి దిగి గొణిగాడు – “ఇప్పుడు చీకటి పడ్డాక పులి కంటబడితే? గూపీ చనిపోతే?” అని. అతను అడవిలో ఓ దారి కనుగొని దాని వెంట నడుస్తూ ఉంటే అతనికి బాఘా ఎదురౌతాడు. అతను కూడా అడవి వైపుకి వెళ్ళగొట్టబడ్డవాడు. వీళ్ళిద్దరూ మాటామంతీ మొదలుపెట్టగానే ఓ పులిని చూసి ఇక అవాక్కవుతారు. కానీ, ఆ పులి ఊరికే అలా అడవిలో నడుస్తూ ఉంటుంది, వీళ్ళ ఉనికినే పట్టించుకోకుండా. మళ్ళీ వచ్చిన దారి వెంటే వెనక్కి వెళ్ళిపోతుంది.

ఈ సీను గురించి ఆలోచించాక దీన్ని షూట్ చేయాలంటే, పులి కావాలి కద! ఎక్కడ్నుంచి? సర్కస్ లో చూడ్డం అన్నది అన్నింటికన్నా మొదట వచ్చే ఆలోచన. ఆ సమయంలో భారత్ సర్కస్ కలకత్తాలోనే ఉంది. మార్కస్ స్క్వేర్ లో ప్రదర్శనలు ఇస్తూ ఉండింది. తమిళుడైన దాని మేనేజర్ తో మాట్లాడడానికని మేము మనిషిని పంపాము. తరువాత అతన్ని కలవడానికని వెళ్ళాము ఓ ఉదయం. ప్రదర్శనకారులంతా విశ్రమిస్తూ ఉండగా సర్కస్ కు వెళ్ళడం అదే మొదటిసారి నాకు. మేము సరాసరి మేనేజర్ గది…అదే టెంటుకి…వెళ్ళాము. నేను ముఖ్య టెంటుకి మూడు దిక్కులా చిన్న చిన్న టెంట్లు ఉన్నాయని గమనించాను. మేనేజర్ టెంట్ సుమారుగా పెద్దది. లోపల బట్టలూ, వస్తువులూ అవీ..కావాల్సినన్ని ఉన్నాయి. అతను మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మాకందరికి దక్షిణ భారతపు కాఫీ తెమ్మని పురమాయించాడు. అక్కడే గుర్రాలు స్వారీ చేసే అమ్మాయిలూ, ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే వారు – కాఫీ చేసేది వీరే. మేనేజర్ మా రాకకి కారణం విని థోరట్ అన్న ఆయన్ని పిలిపించాడు. అతనే రింగ్-మాస్టరట. అతను కూడా దక్షిణ భారతీయుడే. మంచి శరీరాకృతి, కొంతవరకూ నేపాలీలాగా అనిపించాడు. నలభైకి మించి ఉండకపోవచ్చు వయసు. అతను మాకు అతని మోచేతి మీద ఉన్న గాయాన్ని చూపించాడు – పులి చేసిన గాయం అది!

మేము అతనితో మాకు ఏమి కావాలో చెప్పాము. షూటింగ్ బీర్బూమ్ దగ్గర్లోనీ శియురి లో. మేము పులి ని ఓ వెదురు చెట్ల అడవిలో చూపాలి అని అనుకుంటున్నాము. అది చేయాల్సిందల్లా ఈ వెదురుపొదల మధ్య నుండి ఖాళీ మైదానంలోకి నడిచి వచ్చి, కాసేపు అటూ ఇటూ నడిచి, వీలైతే కెమెరా వైపు చూసి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. “భారత్ సర్కస్ పులి ఈ పని చేయగలదా?” థోరట్ తల ఊపాడు. “మీకు ఎంతకాలం కావాల్సి ఉంటుంది?” మేనేజర్ అడిగాడు. “కొన్ని గంటల షూటింగ్ సమయం. ఇక ఇక్కడ్నుంచి శియురి కి వెళ్ళడానికి,రావడానికి పట్టే సమయం అదనం” – నేను జవాబిచ్చాను. ప్రయాణం రెండ్రోజులకంటే పట్టదు అని తెలిసాక మేనేజర్ ఆ పులిని ఓ బోనులో పెట్టి లారీలో పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రెండ్రోజులూ వాళ్ళు తమ ప్రదర్శనలో ఈ పులి ఉండే అంకం చేయలేరు. ఇదంతా అయాక, థోరట్ లేచి నిలబడి – “రండి, ఓ సారి పులిని చూడండి” అన్నాడు. మేము ఆయన వెంట మేనేజర్ టెంటు వెనుకవైపుకి వెళ్ళాము. మార్కస్ స్క్వేర్ లో ఒక చిన్నసైజు జూ తయారైందని అర్థమైంది మాకు. మా దృష్టిని వెంటనే ఆకర్షించినది హిప్పోపొటమస్. దానికోసం భూమిలో ఓ ట్యాంక్ తవ్వి నీటితో నింపారు. దీన్ని ఆనుకుని ఓ బోను ఉంది, లారీలో. లారీ నుండి ట్యాంక్ వద్దకు ఓ చెక్క ఉంది. సర్కస్ కలకత్తాలో ముగియగానే హిప్పో ఆ చెక్క ఎక్కి బోనులోకి వెళ్ళిపోవాలి, వేరే చోటికి తీసుకువెళ్ళబడేందుకు…వేరే మార్గం లేదు.

అక్కడ ఇంకా వేరే జంతువులు కూడా ఉన్నాయి – ఒక సింహం, ఒక ఎలుగుబంటి ఇంకా కొన్ని జాతుల పులులు. థోరట్ అక్కడున్నా బెంగాల్ పులులని చూపి వాటిలో ఏదన్నా మాకు కావాల్సినప్పుడు శియురి కి తీసుకెళ్ళొచ్చని చెప్పాడు.
“ఈ జంతువుని షూటింగ్లో ఆ పొదల్లో స్వేచ్ఛగా వదిలేస్తే సమస్యలేమీ రావనుకుంటున్నారా?” – అడక్కుండా ఉండలేకపోయాను.
థోరట్ కనుబొమలు ముడిచి, “అంత ఖచ్చితంగా చెప్పలేను. దాన్ని తనకుతానుగా బోను నుంచి బయటపడేలాగ ఎప్పుడూ చేయలేదు నేను. కనుక, నేను చెప్పలేను.” అన్నాడు.
అదేమిటి!! మా ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? పులితో పాటు దాని ట్రైనర్ ని ఎలా చూపిస్తాము సినిమాలో? గూపీ,బాఘా – పులి పక్కనే ఈ మనిషి కూడా ఉంటే ఇక ఈ ఇద్దర్లో భయం ఎలా కనిపిస్తుంది? లేదు..అలా జరగడానికి వీల్లేదు.

Filed Under: ప్రముఖులువ్యాసాలు

Tags: , ,

Comments (3)

Trackback URL | Comments RSS Feed

  1. ఈ సారి సస్పెన్స్ బావుంది. మీరు డైలీ సీరియల్ లెవెల్లో కొనసాగిస్తున్నారు .. వాటితో పోల్చానని బాధపడొద్దు, మీ నెరేషన్ ఇంటెరెస్టింగ్‌గా ఉందిలెండి.

    మన పాత సినిమాల్లో డ్యూయల్ రోల్స్‌కి వాడే టెక్నిక్ ఉందిగా… అదేమన్నా వాడారనుకొంటున్నాను.

    మీరు రాసిన ముందుమాట చాలావరకు కాపీరైట్ కాంప్లికేషన్స్‌ని తొలిగించేట్లుగానే ఉంది.

  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    సౌమ్య గారు,సరళమైన అనువాదం కానీ కొన్ని చోట్ల మీరు మరీ మూలవిధేయంగా ఉంటున్నారనిపిస్తుంది.స్వేఛ్ఛానువాదంగా కొన్ని స్వతంత్రనిర్ణయాలు తీసుకోండి.అలాగే మరి కొన్ని చోట్ల కాస్తతడబాటు కనిపిస్తుంది.
    ఉదా:-రిన్‍టిన్‍టిన్,
    “సుమారు సినిమాలు ఉన్నాయి ఇవి”
    “వేరే చోటికి తీసుకువెళ్ళబడేందుకు…వేరే మార్గం లేదు”
    ఇవి అనువాదపరంగా పెద్ద దోషాలు కావుకానీ ఇంకా మెరుగ్గా ఉంటుంది ఇవి లెకుంటే

  3. Sowmya says:

    @Sankar garu: ఈ వ్యాస పరంపర చదువుతూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.
    @Rajendra garu: మీరు చెప్పిన విషయం…ఈసారి వ్యాసం అనువాదం సమయం లో దృష్టిలో ఉంచుకుంటాను :) కొత్త కదా…. ఇలాంటివి మీబోటివాళ్ళకి అప్పుడప్పుడూ తగలకుంటే నా లోపాలు నాకు తెలిసేదెలా చెప్పండి? :)

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.