Menu

Making Movies:వ్యాసం 4 – ఒంటెలు-ట్రెయిన్లు

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

షోనార్ ఖిల్లా (The golden fortress) సినిమా చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది అందులోని ఆసక్తికరమైన ఒంటెల ఎపిసోడ్. క్రైమ్ థ్రిల్లర్ల రచయిత, లాల్ మోహన్ గంగూలీ అలియాస్ జటాయూ కి తరుచుగా ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేసినట్లు కలవచ్చేది. సినిమా చివరికి వచ్చేసరికి ఆ కల అనూహ్యమైన రీతిలో నిజమౌతుంది. ఈ సినిమాలో విలన్ మందార్ బోస్ ని డిటెక్టివ్ ఫెలూదా కారులో వెంటాడుతూ ఉంటాడు. కానీ, మందార్ బోస్ ఎలాగో ఫెలూదా కారుని ఒకసారి కాదు రెండు సార్లు పంచర్ చేయిస్తాడు. దాంతో వీళ్ళకి జైసల్మెర్ కి రోడ్డు మార్గంలో వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. ఎటూకాని చోట మధ్యలో ఆగిపోయినా ఫెలూదా, అతని మనుషులకి ఒక రాజస్థానీ గుంపు కనిపిస్తుంది-ఒంటెల స్వారీ చేస్తూ. ఫెలూదా వాళ్ళని లిఫ్ట్ అడిగి అక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న రైల్వేస్టేషన్ అయిన రాందేవ్రా కి చేరుకుందాం అని నిర్ణయిస్తాడు. అక్కడ్నుంచి జైసల్మెర్ కి ట్రైన్ పట్టుకోవాలి. ఆ ట్రెయిన్ రాందేవ్రా కి అర్థరాత్రికి గానీ రాదు.

ఫెలూదా, తోప్చే ఇద్దరికీ పెద్ద దిగులేమీ లేదు. ఇద్దరూ యువకులు, వ్యాయామాలు చేసేవారు. కానీ, జటాయూ? నిజజీవితంలో ఒంటెలని చూసేసరికి అతని కల కాస్తా పీడకలగా మారుతుంది. “ఎంత వింత జంతువులివి! మత్తు పదార్థాలకి బానిసలైన వాళ్ళలా సగం తెరిచి, సగం మూసి…వాలిపోతున్నట్లు ఉన్న కళ్ళూ, ఎగుడుదిగుడుగా ఉన్న పెద్ద పెద్ద పళ్ళూ, రోజంతా ఏదో నముల్తూనే ఉంటాయి. పైగా కదుల్తున్నప్పుడు ఎలా ఊగుతాయంటే, ఎక్కిన వాడి శరీరంలోని ఎముకలన్నీ కదిలి బైటకి వచ్చేస్తాయి. ఇక ఇలాంటి జీవాలపై స్వారీ చేయాలంటే, ఆ దురదృష్టకర అనుభవం ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి!” అన్నది జటాయూ అభిప్రాయం. కానీ, జటాయూ ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే అప్పటికే ఫెలూదా,తోప్చే ఇద్దరూ ఒంటెపైకి ఎక్కేస్తారు, ఎటువంటి సమస్యా లేకుండా. లాల్ మోహన్ బాబు ఎక్కడానికి ప్రయత్నించి, పట్టు తప్పి కింద పడబోయి ఎలాగో ఎక్కుతాడు చివరికి. ఫెలూదా ఆ రాజస్థానీ గుంపు నాయకుడితో “ఛలియే జీ రాందేవ్రా!” అనడంతో బయలుదేరతారు. వాళ్ళు బయలుదేరాక, లాల్‍మోహన్‍బాబు ఇంకా భయపడుతూ ఉండగానే, తోప్చే దూరంలో ట్రైన్ ని చూస్తాడు. ఇప్పుడా ట్రైన్ ని ఆపగలిగితే వీళ్ళు రాందేవ్రా లో పది గంటలు ఎదురుచూసే సమయం అంతా మిగులుతుంది. దాంతో ఒంటెలు ఆ ట్రైన్ వైపుకి పరుగెత్తి త్వరగానే రైల్వే లైను చేరతాయి. ఫెలూదా తన జేబులోంచి తెల్ల రుమాలు తీసి అదేపనిగా ఊపడం మొదలుపెడతాడు, డ్రైవర్ తనని చూసి ట్రైన్ ఆపుతాడు ఏమో అని. కానీ, అది జరగదు. డ్రైవర్ అతన్ని పట్టించుకోడు. ట్రైన్ పెద్దగా శబ్దం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఫెలూదా పళ్ళు కొరుక్కుంటూ “శభాష్!” అని అరుస్తాడు. అప్పటికే జటాయూ సగం చచ్చిపోయి ఉంటాడు. ఈ అనుభవం అతను జీవితాంతం మరిచిపోలేడు. ఇలా జరగడంతో ఈ గుంపు వెనక్కి తిరిగి రాందేవ్రా వైపు ప్రయాణం మళ్ళీ కొనసాగిస్తుంది.
– ఇదీ మేము తీయాల్సిన సన్నివేశం. ఇప్పుడు నేను ఇది తీయడంలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెబితే మీకు ఓ ఆంచనా వస్తుంది సినిమా తీయడం ఎంత పెద్ద పనో అన్నది.

రాజస్థాన్ లో ఒంటెలకి కొరతలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. గూపీ గైనే, బాఘా బైనే తీస్తున్నప్పుడు మేము రెండు మూడ్రోజుల్లోనే వెయ్యి ఒంటెల్ని తెచ్చుకోగలిగాము. షోనార్ ఖిల్లాకి అయితే అంత అవసరం లేదు. కానీ, సమస్యేమిటంటే మేము ఎంచుకున్న ప్రదేశం జనావాసాలకి చాలా దూరంలో ఉంది. కనుచూపు మేరలో ఇసుక, ముళ్ళపొదలూ, ఎండిపోయిన గడ్డీ తప్ప మరేం లేదు. ఎడారిమీదుగా ఓ మీటర్ గేజ్ రైల్వేలైను ఉంది – మొదలూ,తుదీ రెండూ లేనట్లుందది చూట్టానికి. ఈ రైల్వేట్రాక్ కి సమాంతరంగా జైసల్మెర్ కి రోడ్డు దారి ఉంది. అది ఇంకాస్త దూరంలో ఉండి ఉంటే, ఇక్కడ ఒక్క దృశ్యం కూడా తీయలేకపోయేవారం. మేము జైసల్మెర్ లో మకాం వేశాం. కనుక అక్కడ్నుంచి సరంజామా అంతా ఇక్కడికి పట్టుకురావాలి. కెమెరామెన్ ఒక ఓపెన్-టాప్ జీప్‍లో నిలబడి కెమెరా పట్టుకోవాలి – ఒంటెలు ట్రైన్ వైపు వెళ్ళడాన్ని తీయడానికి. కనుక, దగ్గర్లో ఓ రోడ్డు ఉండటం అవసరం. జోధ్‍పూర్ నుండి జైసాల్మెర్ దాకా వందమైళ్ళలోని ప్రతి అంగుళాన్నీ వెదికాము ఇలా అన్నింటీకీ అనువైన ప్రదేశాన్ని కనిపెట్టడానికి. ఇది జైసల్మెర్ కి తూర్పుగా,సుమారు 70 మైళ్ళదూరంలో ఉంది, జోధ్‍పూర్ వెళ్ళే మార్గంలో. ఒంటెలు ఇంకో ఏడు కిలోమీటర్లు తూర్పు దిక్కుగా వెళితే వచ్చే ఖాచీ అన్న ఊరు నుండి తెప్పించాము. వాటి యజమానులకి వాటిని బాగా తయారుచేయమని చెప్పాము. మనకి ఒంటెలకి అలంకారాలు, వాటి శరీరాకృతి చూస్తే నవ్వొస్తుందేమో కానీ, ఒక రాజస్థానీకి ఒంటెలు మంచి స్నేహితులు. కొన్నిసార్లు ఎడారుల్లో ఒంటెలొక్కటే వీళ్ళలో ప్రాణాలు నిలుపగలిగేవి. అందుకే పాతకాలం నుండీ ఒంటెల్ని రంగురంగుల దుస్తుల్లో అలంకరించడం జరుగుతోంది. ఇక్కడి ఎండిపోయిన భూమిపై ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎడారిలోని భూస్వరూపానికి ఒంటెలు సరిపోయినంతగా ఇంకే జంతువూ సరిపోలదు. ఈ ఒంటెల యజమానులు మధ్యాహ్నానికల్లా ఆ ప్రదేశాన్ని చేరుకుంటామని చెప్పారు. మా వాళ్ళు కొందరు వారి కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉండాలని నిశ్చయించబడింది. లేకుంటే వాళ్ళు ఈ ప్రదేశం కనుక్కోలేరు. ఒంటెలు దొరికాయి..ఇప్పుడు ట్రైన్ కావాలి. మేము అనుకున్న ట్రైను జోధ్‍పూర్ నుండి పోఖ్రాన్ దాకా ఉదయంపూట వెళుతుంది. పోఖ్రాన్ జోధ్‍పూర్ జైసల్మెర్ ల మధ్యలో ఉంది. మేము షూటింగ్ తీస్తున్న ప్రదేశం పోఖ్రాన్ కి పడమరగా ఇరవై మైళ్ళ దూరంలో ఉంది. కానీ, అధికారులు మమ్మల్ని ఆ ట్రైన్ ని కావాల్సినప్పుడూ వాడుకోనిస్తారని మాకు నమ్మకంగా ఉండింది.

మేము అసలు రోజుకోసం సిద్ధమౌతూ ఉండగా జరిగిన ఓ సంఘటన దాదాపు మా ప్లానంతా పాడుచేసింది. బొగ్గు ధరలు పెరగడంతో ఒకరోజు నోటీసుతో మేము ఉపయోగిద్దాం అనుకున్న ట్రైను కాస్తా కాన్సిలయింది. ఎంత పనైంది! నేనెంతో జాగ్రత్తగా రాసాను ఈ సన్నివేశాన్ని. ఇక ఇపుడు ఫెలూదా, అతని జట్టూ ఎడారిలో ఒంటెల స్వారీ చేస్తూ ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించే దృశ్యం తీసేయాలేమో స్క్రిప్టు నుండి? లేదు…అలా జరగనివ్వకూడదు. నేను ఆరోజే రైల్వే అధికారుల వద్దకు వెళ్ళి పరిస్థితులని వివరించాను. ఈ సీన్ తీయకుంటే మేము రాజస్థాన్ వచ్చిన పని అవనే అవదని చెప్పాను. అదృష్టం కొద్దీ అక్కడి అధికారుల్లో కొందరు అర్థం చేసుకున్నారు. ఒక మార్గం చూపించారు. వాళ్ళు మాకు ఓ పూర్తి ట్రైన్ – ఆరు భోగీలు, గార్డ్ కేబిన్, బొగ్గు వేసే మనిషి, ఇంజిన్ – అన్నింటితో ఇస్తామన్నారు. అందులో ఉపయోగించిన బొగ్గుకి మాత్రం మేము డబ్బులివ్వాలి, అంతే. ఈ సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమవడంతో చాలా హాయిగా అనిపించింది. ఇది శాపం రూపంలోని వరంలా అనిపించింది. ఎందుకంటే, ఇప్పుడు ట్రైన్ మా చేతుల్లోనే ఉంటుంది కద, ఆ కొద్ది గంటలూ. దాన్ని ఆపడం, పంపడం, ముందుకీ, వెనక్కీ పంపడం – అంతా మా చేతుల్లోనే ఉంది ఇప్పుడు!