Menu

Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-2)

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ:
Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

వాళ్ళిద్దరూ కాళ్ళు విదుల్చుకుంటూ ప్రకటించారు – “మా చెప్పులు ఆ మంచులో గల్లంతయ్యాయి” అని.
“ఎప్పుడు? ఎక్కడ? ఎలా?”
“మీరు షాటు తీయడం మొదలుపెట్టగానే..” వాళ్ళు ఎగరగానే చెప్పులు జారిపోయాయట. ఇప్పుడవి మంచులో పాతిపెట్టబడ్డాయి. తరువాత ఓ అరగంట మంచుని తవ్వుతూ కూర్చున్నాము కానీ, అవి దొరకలేదు. బహుశా వేసవిలో ఈ మంచు కరిగాక కనిపిస్తాయేమో. అప్పుడు పెద్ద పెద్ద దయ్యాల కళ్ళతో ఉన్న ఈ రెండు జతల నల్లటి చెప్పుల్ని చూసి ఆ గ్రామస్థులు ఎలా స్పందిస్తారో తలుచుకుంటే నవ్వొచ్చింది. పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండేవేమో గానీ, మాకు కాస్త తెలివి పనిచేసి రెండేసి జతల చెప్పులు చేయించాము. కనుక, ఈ జత పోయినా పర్వాలేదు. రెండో జత చెప్పులున్నాయి ఇద్దరికీ. తరువాతి దృశ్యాలన్నీ బాగా వచ్చాయి. గూపూ,బాఘా ఇద్దరూ చలికి వణుకుతూ కాస్త వెచ్చగా ఉండే దుస్తుల కోసం అడిగారు. వెంటనే వారికి టిబెట్ ఉన్ని దుస్తులని ఇచ్చాము. కలకత్తాలో ఓ యూరోపియన్ వద్ద కొన్నాము వాటిని. బాఘా కి ఒళ్ళు కాస్త వెచ్చబడగానే అసహనం మొదలైంది. గుప్పిళ్ళలో మంచుముద్దల్ని తీసుకుని గూపీ పై చల్లుతూ – “ఇదేనా నీ ఝుండీ? ఇక్కడా ఆ పోటీ జరుగుతున్నది?” అని అరిచాడు. గూపీ కాస్త సిగ్గుపడుతూ – “సరే, హుండీ కి వెళదాం ఐతే” అన్నాడు. ఇక్కడ మచాన్ ని మంచులో నిలిపాము. మళ్ళీ వీళ్ళిద్దరూ ఇదివరకటి పనులన్నీ చేసారు – మచాన్ ఎక్కి దూకడం, వాళ్ళు పైకి ఎగురుతున్న భ్రాంతి కలిగించడం – ఇదంతా మళ్ళీ జరిగింది. అంతే, ఖుఫ్రీలో షూటింగ్ ఐపోయింది. ఇక రాజస్థాన్ ఏడారుల్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది.

ఈ దేశంలో ఎడారి అంటూ ఉన్నది థార్ ఒక్కటే. అది పశ్చిమ రాజస్థాన్ లో ఉంది. కానీ, మేము చూడాల్సిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. గూపీ గైనే కథలో ఇద్దరు రాజులుంటారు. ఒకరు-షుండీ ని పాలించే రాజు, మంచివాడు. ఇంకొకరు-హల్లా రాజ్యాన్ని పాలించే వాడు, చెడ్డవాడు. షుండీ కోసం మేము బుండీ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. చెట్లూ,చేమలూ, పొలాలు, చెరువులు, కొండలూ – ఈ విషయంలో రాజస్థాన్ లో బుండీ ని మించిన అందమున్న ప్రాంతాలు చాలా తక్కువ. చెడ్డరాజు రాజ్యమైన హల్లాకోసం జైసల్మెర్ ని ఎంచుకున్నాం. బుండీ కి సరిగ్గా వ్యతిరేకం ఇది. ఇది కూడా అందంగానే ఉంటుంది కానీ, దీని అందంలో ఓ కౄరత్వం ఉంది. దాదాపు ఆ ప్రాంతం మొత్తంలో పచ్చదనమనేదే లేదు. అయినప్పటికీ, నిజమైన ఎడారి జైసల్మెర్ లో లేదు. అక్కడికి చేరాలంటే పశ్చిమంగా మరో పాతిక కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పారు మాకు. ఒకరోజు గూపీ బాఘా లతో కలిసి వెళ్ళాము మేము, వాళ్ళు మంచు ప్రాంతం నుండి వెంటనే దిగడానికి అనువైన ప్రదేశాన్ని వెదకడానికి. జైసల్మెర్ ని వదిలి వెళ్ళడానికి ఎంతో సేపు పట్టలేదు. ఓ మైలు దూరం వెళ్ళాక, ఒక రాళ్ళతో నిండిన ప్రాంతం దాటాక, జీపు తప్ప మరే వాహనమూ వెళ్ళలేని దారి చేరుకున్నాము. మాకిది పెద్ద సమస్య కాలేదు, ఎందుకంటే ఇది ముందే ఊహించి మేము జీపులోనే వచ్చాము కనుక. కానీ, జీపు సాఫీగా ఉన్న రోడ్డు మీద నడవలేదు కొన్నిసార్లు. మా డ్రైవర్ వాలకమెలా ఉండిందంటే, అయితే ఇతనికి దారి క్షుణ్ణంగా తెలిసుండాలి, లేకుంటే అసలేమీ తెలీదు అన్నట్లు. అందుకే ఏమో, అతను తన చిత్తానికి తోచినట్లు తీసుకెళ్తున్నాడు బండిని. బహుశా అతనికి అల్లా మీద బాగా నమ్మకమేమో, ఆయనే తనని తీరం చేరుస్తాడని!

మెల్లగా నేలపై ఇసుక తగ్గుతూ ఉండటం గమనించాను. ప్రతి పదినిముషాలకు మాలో ఎవరో ఒకరు “ఎక్కడుంది ఎడారి?” అనడమూ, అతను “వచ్చేస్తుంది” అనడమూ జరిగింది. మాకు తెలిసిందల్లా మేము మోహన్‍గఢ్ అన్న ప్రాంతానికి వెళ్ళాలని. “గఢ్” అనగానే నాకు అక్కడేదో కోట ఉందేమో అనిపించి, ఆసక్తికరంగా ఉండింది. పైగా, నేను రాజస్థాన్ గురించి చదివిన ఏ పుస్తకంలోనూ మోహన్‍గఢ్ ప్రస్తావన లేదు. మేము ఇంకో పది పన్నెండు మైళ్ళు ప్రయాణించాక ఇక చెప్పుకోదగ్గ రోడ్డంటూ లేని ప్రాంతానికి చేరుకున్నాము. రోడ్డొక్కటే కాదు మాయమైంది.. చెట్లూ, ఇళ్ళూ, కొండలూ…అక్కడక్కడా కనబడ్డ చిన్న చిన్న మట్టిదిబ్బలు కూడా మాయమయ్యాయి. ఇంకా..ఇసుక? అసలు ఇసుక కూడా పూర్తిగా మాయమైపోయింది. నేను ఈ దేశంలో సుమారుగా ప్రయాణాలు చేసాకానీ, ఎప్పుడూ ఇలాంటి ప్రదేశానికి రాలేదు.

తొందరగానే ప్రకృతి మారింది. ఒక నిముషం మేము పూర్తి రాళ్ళబాటలో ఉన్నాము – రాళ్ళు రప్పలూ తప్ప ఏమీ లేవు. మరు నిముషంలో మేము విరిగిన మట్టి కుండల ముక్కల గుట్టలు. వెంటనే మేము సన్నటి చిల్లులున్న రాళ్ళ మధ్య ఉన్నాము. ఒక్క ప్రాంతం కూడా చదరంగా లేదు. మా జీపు చాలా వంపులు, గతుకులూ మధ్య నడిచింది. ఎటు చూసినా కూడా ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద కదలిక లేని అలలు నిండినట్లు అనిపించింది. మాకు సరైన ఎడారి కావాలి. లేకుంటే, మంచుకీ, ఇసుకకీ మధ్య ఉన్న తేడాని ఎలా చూపిస్తాం? గూపీ బాఘా అతి చల్లని ప్రాంతం నుండి అతి వేడి ప్రాంతానికి వెళ్ళారని చూపొద్దూ! అల్లాహ్ పుణ్యమా అని చివరికి మోహన్‍గఢ్ చేరాము. నిజంగానే అక్కడో “గఢ్” ఉంది కానీ, అది చాలా చిన్న, ఆధునిక భవంతి..రాజస్థాన్ లోని తక్కిన కోటలతో దానికి పోలికే లేదు. అది గౌరవానికంటే కూడా కాస్త నవ్వుని కలిగించింది. కానీ, లోపల చూడకుండా వెనక్కి రాలేము కనుక లోపలికి వెళ్ళి చూస్తే తెలిసింది – అక్కడ బహిరంగ ప్రదేశంలో పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి అని. ఇక్కడే యుద్ధమూ జరగలేదని మాకు ఎవరూ చెప్పకుండానే అర్థమైంది.

ఇరవై మైళ్ళు ప్రయాణం చేసాము..కానీ, ఇప్పటిదాకా ఎడారి ఛాయలే లేవు. అంటే, ఈ ప్రయాణమంతా దండగేనా? పెట్రోలు పై పెట్టిన డబ్బూ, సమయమూ, జీపులో కూర్చుని అనుభవించిన ఎగుడుదిగుళ్ళూ-అన్నీ దండగేనా? చివరికి ఆ ఊరు మనిషి ఒకతను కనబడి చెప్పాడు ఏమైందో. అసలు మేము మొదట్నుంచే తప్పుదారిలో వచ్చాము. ఎడారి పూర్తి అవతలి దిక్కులో ఉందట! నేనక్కడ నిలబడి ఈ విషయాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ ఉండగా మా జీపు డ్రైవర్ ఒక సలహా ఇచ్చాడు – ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు వెనక్కి తిరిగే బదులు, ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, అప్పుడూ దొరక్కపోతే జైసల్మెర్ వెళ్ళిపోదాం అని. సరే, మళ్ళీ ముందుకు కదిలాము మేము. ఈసారి, ఒక మైలు దూరం వెళ్ళాక మాకు ఓ ప్రదేశం కనిపించింది. ఇది పూర్తిగా ఎడారి అనలేము కానీ, ఆ దృశ్యం తీయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం లేదనిపించింది. ఈ ప్రదేశానికి ఓ పేరుంటే, అది మాకిప్పటికీ తెలీదు. ఇక్కద బోలెడు ఇసుక ఉంది, కానీ ఏడారుల్లో ఉండే ఇసుక అలలు లేవు. కనుచూపుమేర ఇసుక నేలపై చదరంగా పరిచి ఉంది. దీని పై నడుస్తూ ఉంటే కింద నీళ్ళు ఉన్నాయి అని కూడా ఎవరికీ అర్థం కాదు. అక్కడక్కడా పొడి ఇసుక ఉంది- రంగు కాస్త తక్కువగా ఉంది మిగితా ఇసుకతో పోలిస్తే. మధ్యాహ్న సూర్యుడు ఇక్కడ పడ్డప్పుడల్లా ఆ వెలుగు ఇసుకనుండి మా కళ్ళలో వెలిగేది. ఫిబ్రవరి నెలాఖరు-అక్కడ మరీ వెచ్చగా లేదు కానీ, ఈ ప్రాంతం సహారా కి ఏమాత్రం తీసిపోదు అనడం లో నాకే అనుమానమూ లేదు.

ఈ ప్రదేశం చూడగానే డ్రైవర్ ని ఆపమన్నాను. వెదుకుతున్నది ఉన్నట్లుండి దొరికేసరికి కలిగే ఆనందంలో కాసేపు నాకు మాటలు రాలేదు. అప్పుడోసారి పడమటిదిక్కుకు చూసిన నాకు గుండె ఆగినట్లైంది. “ఎక్కడున్నాం మనం?” రాజస్థాన్ లో ఇంతపెద్ద చెరువుందని నాకెవరూ చెప్పలేదు. అసలు దాన్ని మహాసముద్రమనొచ్చు. కానీ, అందులో నీరు చాలా స్థిరంగా ఉంది. ఓ చిన్న చలనం కూడా లేదు. మాకు నీరు స్పష్టంగా కనిపించింది, ఆ ఇసుక ప్రాంతం చివరిదాకా. వాటిలో ఆకాశంలోని మేఘాల నీడలు కూడా కనబడ్డాయి. కుడిపక్కనున్న చెట్ల వరుసల నీడలు కూడా కనిపించాయి. కొన్ని సెకన్ల పాట నాకు నోట మాట రాలేదు. తరువాత అర్థమైంది మాకు, అది నిజం చెరువు కాదు, ఎండ మావి అని. ఇలాంటి అచ్చమైన ఎండమావులు ఎడారుల్లో అంత తేలిగ్గా కనబడవు.

తరువాత మాకు గూపూ, బాఘా ఎడారి చేరడం, విడువడం చూపే ఒకటిన్నర నిముషాల దృశ్యం తీయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మేము సాయంత్రం జైసల్మెర్ చేరుకున్నాక అక్కడి ప్రజలలో కొందరన్నారు – ఈ ఎండమావి గురించి తెలుసని. ఒక్కోసారి మనుషులే కాదు, జంతువులు కూడా మోసపోయాయట. ప్రతి ఏడూ జింకల గుంపులు నీటిని వెదుకుతూ, ఆశగా అటువైపు నడుస్తూ ఉంటాయట-కానీ, చివరికి ప్రతి ఒక్కటీ చచ్చిపోతుంది-ఒక్క చుక్కైనా నీరు తాగకుండానే!

2 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 21, 2008 /
  2. Sowmya June 24, 2008 /