Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-1)

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

ముందు మాట: ఈ వ్యాసం “Goopy Gyne, bagha byne” అన్న సినిమా షూటింగ్ సమయంలోని విశేషాల గురించి. ఇక చదవండి.

గూపీ,బాఘా ఇద్దరికీ దయ్యాల రాజు మూడు వరాలను ఇచ్చాడు. మొదటిది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ తిండీ-బట్టా ఇచ్చేది. రెండవది వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనేది. వాళ్ళూ ఆ దయ్యాలరాజు ఇచ్చిన మంత్రించిన చెప్పులేసుకుని చేతులు కలిపి చప్పట్లు కొడితే చాలు. మూడోది చెవిటివాడైన గూపీని గాయకుడిగా మార్చింది, బాఘా ని మంచి డప్పుకొట్టేవాడిగా మార్చింది. గూపీ గైనె బాఘా బైనే చూసిన ఎవరికన్నా తరువాత ఏమైందో తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టగానే మాయ లాగా విందు భోజనం వచ్చేస్తుంది. వాళ్ళు తినడం ముగుస్తూ ఉండగా ఒక శాస్త్రీయ సంగీతకారుడు తన పటాలంతో పల్లకిలో వెళుతూ ఉండటం కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళలో ఒకరు గూపీకీ, బాఘాకీ వాళ్ళు శుండి వెళ్తున్నట్లూ, అక్కడ ఒక సంగీత పోటీ ఉందనీ చెబుతాడు. తమ ఉస్తాద్ అందులో పాల్గొనబోతున్నట్లు కూడా చెబుతాడు. ఆ గుంపు అటువెళ్ళగానే గూపీ బాఘాలకి అర్థమౌతుంది-తాము కూడా ఆ పోటీలో పాల్గొనడాన్ని ఎవరూ ఆపలేరు అని. రాజుగారికి తమ పాట నచ్చితే ఆస్థాన గాయకులుగా ఉండమనే అవకాశం కూడా ఉంది. దయ్యాలరాజు ఇచ్చిన చెప్పుల పుణ్యమా అని ఆ ప్రదేశానికి వెళ్ళడం పెద్ద సమస్య కాదు. కానీ…ఆ ఊరి పేరేమిటి? గూపీ బాఘాలు ఇద్దరికీ గుర్తులేదు. గూపీ ఏమో ఆ మనిషి ఝుండి అన్నాడంటాడు. బాఘా ఏమో ఆ మనిషి హుండి అన్నాడంటాడు. కాసేపు గొడవపడ్డాక బాఘా తన చేతిని గూపీతో కలిపి ఝుండీ అని అరుస్తూ చప్పట్లు కొడతాడు. మరుక్షణంలో వాళ్ళు మంచులో ఉంటారు, చలికి వణుకుతూ, పళ్ళు పటపటా కొరుకుతూనూ. వాళ్ళు చేసే మొదటి పని చప్పట్లు కొట్టి వెచ్చని బట్టలు తెప్పించుకోవడం. తరువాత గొడవ పడ్డం మొదలుపెడతారు. ఝుండి అన్నది తప్పు పేరన్నది అర్థమౌతుంది. “సరే, హుండి” అంటాడు గూపీ. మరుక్షణంలో వాళ్ళు ఓ ఎడారిలో ఉంటారు, వాళ్ళు వేసుకున్న దుస్తులు చంపేస్తూ ఉంటాయి. అవి విప్పేసి విసిరేస్తున్నప్పుడు ఇద్దరికి సరైన పేరు గుర్తు వస్తుంది – “శుండి”.

ఇందులోని మొదటి కొన్ని సీనులు బిర్బూం జిల్లాలోని నోతున్ గ్రాం లో తీసాము. ఇందులో గూపీ బాఘా కలిసి భోంచేయడమూ, ఉస్తాద్,అతని పరివారం రావడం, “ఝుండి” అంటూ మొదటి సారి చప్పట్లు కొట్టడమూ – ఈ సీనులు ఉన్నాయి. ఈ చప్పట్లు కొట్టగానే ఇద్దరూ మెల్లిగా పైకి ఎగురుతూ గాల్లోకి మాయమవాలి. ఇది జరగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎనిమిదడుగుల ఎత్తున్న వెదురు మచాన్ తయారుచేసి దాని కింద కెమెరా పెట్టాము. గూపీ,బాఘాలని నిచ్చెన సాయంతో మచాన్ పైకి ఎక్కి దూకమని చెప్పాము – అప్పుడు కెమెరా ముందు పడతారని. ఈ షాటు తీస్తున్నప్పుడు కెమెరా ఫిల్మ్ వెనక్కి నడిచేలా చూసుకున్నాము. అప్పుడిది మళ్ళీ మామూలుగా చూసినప్పుడు స్క్రీన్ పై ఉన్న బొమ్మలు కెమెరా తీసిన వరుసతో పోలిస్తే ముందునుండి వెనక్కి వస్తాయని మాకు తెలుసు. అంటే, ఈ రెండు పాత్రలూ కిందకి పడుతున్నట్లు కాక, పైకి ఎగురుతున్నట్లు కనిపిస్తారు అనమాట.

తరువాతి దృశ్యంలో వాళ్ళు నదికి దూరంగా, వాళ్ళ ఊళ్ళోని చెట్లూ పొలాలకి దూరంగా మంచు చుట్టుముట్టిన ఓ ప్రదేశంలో ఉంటారు. ఇంత మంచు ఇచ్చే ప్రదేశమేది? తరువాత మాకు తెలిసింది ఫిబ్రవరి నెలలో సిమ్లా వెళితే కావాల్సినంత మంచు మిగిలే ఉంటుందని. సిమ్లాకి ఎనిమిది మైళ్ళ దూరంలో ఇంకో వెయ్యి అడుగుల ఎత్తులో ఖుఫ్రీ అన్న ప్రదేశం ఉంది. ఇక్కడ ఇళ్ళూ, మనుష్యులున్న ఛాయలూ లేవు. ఉన్నదల్లా ఉత్త మంచే. గూపీ-బాఘాలతో ఇక్కడ కొన్ని దృశ్యాలు తీద్దాం అనుకున్నాం. దానితో కలకత్తానుండి ఢిల్లీ గుండా సిమ్లా చేరుకున్నాం. మా జట్టులో కొంతమంది ఢిల్లీలోనే ఉండిపోయారు, ఎందుకంటే మేము వెనక్కిరాగానే మేము ఎడారి సన్నివేశాలకోసం రాజస్థాన్ వెళ్ళాలి- శుండీ,హల్లా రాజ్యాలకి సంబంధించిన దృశ్యాలు తీయడానికి. సిమ్లా-ఖుఫ్రీ వచ్చిన గుంపు చాలా చిన్నది -ఇద్దరు నటులూ కలిపి కూడా పదిమందికి మించరు.

నేను ఇదివరలో సిమ్లా వెళ్ళాను కానీ వేసవిలో. ఇప్పుడు ఆ ప్రదేశమంతా గుర్తు పట్టడం కష్టంగా ఉంది. నగరమంతా చర్మ వ్యాధి వచ్చినట్లు ఎటు చూసినా తెల్ల తెల్ల మచ్చలతో ఉన్నట్లు అనిపించింది. ఎక్కడ చూసినా తెల్లటి మంచు-ఇళ్ళపైనా, వీథుల్లో,కొండలపైనా, ఆఖరుకి చెట్ల కొమ్మలపైన కూడా! అక్కడక్కడా వీథుల్లోని మంచు కరగడం మొదలైంది. దానితో అక్కడంతా జారడం ఎక్కువగా ఉంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మాకు ఎక్కువ సమయం లేదు కనుక భోజనం చేయగానే టాక్సీ తీసుకుని ఖుఫ్రీలో సరైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ బయలుదేరాము. తరువాతి రోజు మా సరంజామా అంతా తీసుకుని ఇక్కడికి రావాలి. కెమెరాతో పాటు ఎనిమిదడుగుల మచాన్ ఒకటి. ఇది వెదురుది కాదు. స్టీల్ తో చేసినది. ఈ దృశ్యం చివర్లో కూడా గూపీ,బాఘా పైకి ఎగురుతున్నట్లు కనిపించాలి. కనుక, వాళ్ళిద్దరూ ఇంకోసారి పైన్నుంచి దూకడం తప్పనిసరి.

ఎనిమిది మైళ్ళే అయినా ఖుఫ్రీ చేరుకోడానికి దాదాపు గంటపట్టింది మాకు. మేము వెళ్ళిన రోడ్డులో ఎనిమిది అంగుళాల మేర మంచు పేరుకుని ఉంది. పర్వతం పక్కన ఉండటంతో ఎన్నో మలుపులు రోడ్డుపై. మా టాక్సీ చక్రాలు ఈ మంచుని కోస్తూ వెళ్ళాలి. అప్పుడప్పుడూ చక్రాలు ఎంత లోతుకి వెళ్ళాయంటే ఎంత వేగంగా తిరిగినా కూడా మంచు అన్ని వైపులా పడ్డదే కానీ టాక్సీ మాత్రం ముందుకు కదల్లేదు. ఆకాశం ఓ పక్క మేఘావృతమై ఉంది కానీ, మేము ఖుఫ్రీ చేరే సరికి సూర్యుడు బయటకొచ్చాడు. ఖుఫ్రీ నిజంగా ఓ పల్లెటూరే. చలికాలంలో ఇక్కడికి స్కీయింగ్ కి వచ్చేవారి కోసం సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఒక క్లబ్బు, బంగళా, ఒక రెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. మాకిదంతా వద్దు కనుక జనావాసానికి దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశం కోసం వెదకడం మొదలుపెట్టాము. అది మెయిన్ రోడ్డుకి కాస్త దగ్గరగా ఉండాలి – లేకుంటే మా సామానంతా తీసుకుని అక్కడికి వెళ్ళడం అసాధ్యం. మేమొక రెండొందల అడుగులు పైకి ఎక్కి ఓ ప్రదేశాన్ని చేరుకున్నాము. అది మూడు వైపులా బహిరంగ ప్రదేశం. మేము చుట్టుపక్కల చూడగానే దట్టమైన మంచుతో నిండిన పర్వత శ్రేణులు కనిపించాయి. మా కుడివైపుకి ఓ తెల్లటి కొండ. మేము కారు ఆపి బయటకు వచ్చాము. అంత మంచు ఉన్నాకూడా మరీ చలిగా లేదు. నిజానికి సూర్యుడు వచ్చాక చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ.

ఇంతలో మళ్ళీ మంచు కురవడం మొదలైంది, సూర్యుడు ఉండగానే. ఆకాశం నుండి పొడిపొడిగా మంచు రాలడం మొదలైంది. ఎవరన్నా చేయి చాస్తే, కొది నిముషాల్లో చేయి తెల్లగా మారి ఉండేది. మంచు ఎంత నిశబ్దంగా కురిసిందంటే అంతా ఓ విధమైన మిస్టరీలా అనిపించింది. పైగా, మేఘాలైనా లేని ఆకాశం నుండి ఏదో రాలి పడటం చూడటం కాస్త వింతగా ఉండింది. మాకు ఎక్కువ సమయం లేదు. ఆ ప్రాంతాన్ని అన్వేషించడం ప్రారంభించాం. మంచు ఉన్నాకూడా మాకు కావాల్సింది దొరికింది. మాకు సుమారు పదడుగుల ఎత్తులో కొండమీద ఓ సహజ సిద్ధమైన ప్రదేశం ఉంది – గూపీ,బాఘా ఇద్దరూ నిలబడేందుకు. అది చూడగానే నేను నిర్ణయించేసుకున్నాను వాళ్ళిద్దరూ బెంగాల్ లోని పల్లె నుండి సరాసరి ఇక్కడే దిగాలి సినిమాలో అని. చుట్టుపక్కల ఏమీ కనబడ్డం లేదు – మంచూ, దాని మధ్యలోంచి తొంగిచూస్తున్న నల్లటి రాళ్ళూ తప్ప. మాకు సరైన స్థలమైతే దొరికింది కానీ ఇప్పుడు వేరే సమస్య వచ్చి పడింది.

గూపీ,బాఘా ఇంకా వాళ్ళ పల్లెటూరిలోనే ధోతీ కుర్తా వేసుకుని ఓ చిన్న, సన్నటి కాటన్ శాలువా మాత్రం వేసుకుని ఉన్నారు. మంచులో దిగినప్పుడు అవే దుస్తులు వేసుకుని ఉన్నట్లు చూపాలి. కానీ, ఇక్కడ చూస్తే మరీ చల్లగా ఉంది. ఏం చేయాలి? గూపీ, బాఘా పాత్రధారులు ఉత్సాహంగా మాకేం పర్వాలేదు, ఆ బట్టలతోనే మంచులోకి దూకేస్తాం అన్నారు కానీ, మాకది కష్టంగా తోచింది. చివరికి కుర్తా కింద చేతుల్లోని స్వెటర్లు వేసుకోవాలని నిర్ణయం జరిగింది. వాళ్ళ కాళ్ళు కప్పడానికి నైలాన్ దుస్తులని ఉపయోగించాము. ఆ దుస్తుల రంగు వాళ్ళ కాళ్ళ రంగులో కలిసిపోయి కాస్త దూరం నుండి చూస్తే వాళ్ళు అవి తొడుక్కున్నట్లు తెలిసే వీలు లేకపోయింది. ఇవి కాక, కాళ్ళకి ఆ మాయా చెప్పులు ఉన్నాయి. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా చేయించాము వాటిని. ఈ దృశ్యం మరింత బాగా రావాలని మేము ఈ రెండు పాత్రలూ మంచులోకి పడగానే కిందకి దొర్లుతూ పడుతున్నట్లు చూపుదాం అనుకున్నాం. ముందునుండే ఉత్సాహంగా ఉన్న నటులిద్దరూ దీనికి ఒప్పుకున్నారు కూడా. కానీ, నాకు ఈ ఐడియా నచ్చినా కూడా, ఆలోచించేకొద్దీ బెంగ మొదలైంది. ఇదివరలో ఎప్పుడూ వాళ్ళు ఇలా మంచు చేత కప్పబడిన కొండల పైన దొర్లలేదు. ఏమైనా దెబ్బలు తగిలితే? లోపల పైకి కనబడని రాళ్ళూ-రప్పలూ ఉండొచ్చేమో..ఎవరికి తెలుసు? మేము ఇది మాట్లాడుకుంటూ ఉండగా అది విన్న స్థానికుడొకరు వచ్చి అలాంటివేమీ లేవని భరోసా ఇచ్చారు. మేము ఎన్నుకున్న ప్రదేశం అలాంటి రాళ్ళూ-రప్పలకి దూరంగా ఉందని చెప్పాడు. ఆ మనిషి నమ్మకంగా చెబుతూ ఉండటంతో మేము మా ఐడియా అలాగే కొనసాగిద్దామని నిర్ణయించుకున్నాము. కెమెరా సిద్ధమయ్యాక గూపీ,బాఘా కొండ పైకి అక్కడక్కడా కనిపిస్తున్న రాళ్ళ సాయంతో ఎక్కి, వాళ్ళు చేరవలసిన ప్రదేశానికి చేరారు. నేను కెమెరా ఆన్ చేసాను. అక్కడ రిహార్సల్ కి తగిన సమయం కూడా లేదు. మా అదృష్టం బాగుండి ఐదు నిముషాల్లో మాకు కావాల్సిన దృశ్యాలన్నీ తీసేసుకున్నాము. బహుశా సినిమాలో మీరు ఆ ఇద్దరూ మంచుపై దొర్లే దృశ్యం చూసే ఉంటారు. కానీ, తరువాత ఏమైందో మీరు ఊహించలేరు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

5 Comments to “Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-1)”

  • ఎప్పటిలాగే బాగుంది. బహుశా పేర్ల తికమక వల్ల చదవడంలో కాస్త ఆలస్యమవుతోంది తప్ప మీ అనువాదం అద్భుతం.

  • Very good…..waiting for the next part. These are very entertaining and informative….keep up the good work

  • @Mahesh and Kiran:
    Thanks for the comments :)

  • ఇంటరెస్టింగ్… వెరీ ఇంటరెస్టింగ్.
    అనువాదం చక్కగా కుదురుతుంది. ఒరిజినల్స్ ఎక్కడయినా ఉంటే వాటికి కూడా ఒక లంకె తగిలించగలరు.

  • @Praveen:
    Originals are published n the form of a book. I dont think e-book version is available.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories