Menu

Making Movies – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (రెండో భాగం)

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.

మొదటి భాగం ఇక్కడ. రెండో భాగం చదవండి..

థోరట్ దీనికో పరిష్కారం చెప్పాడు –
“పులి మెడచుట్టూ ఓ తాడు వేస్తాను. అది సన్నగా ఉన్నా కూడా బలమైనది.” అని.
“బానే ఉంది కానీ, దానికోసం చాలా పెద్ద తాడు కావాలి.”
“అదేం పెద్ద సమస్యకాదు. అవతలి కొస ను ఒక ఇనుపకడ్డీకి కట్టేస్తాం”.
ఆ తాడు అంత సన్నగా ఉంటే, కెమెరా కళ్ళకి కనబడదేమో. కానీ, ఈ తాడు వల్ల పులి చర్మం పై తేడా తెలిసిపోతుంది కదా. కాస్త ఆలోచించాక ఓ ఆలోచన వచ్చింది.
“పులి చర్మంతో చేసిన బెల్టు ఒకటి దాని మెడకి వేసి, ఆ బెల్టుకి ఈ తాడు చుడితే ఎలా ఉంటుంది?” అని అడిగాను. థోరట్ ఒప్పుకున్నాడు. అంతా పదినిముషాల్లో తేలిపోయింది. థోరట్ కి ఓ తేదీ చెప్పాము – శియురి కి రావడానికి. కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చాము.
“ఏం దిగులు పడకండి సార్. అంతా బానే జరుగుతుంది.” థోరట్ ధీమా వ్యక్తం చేసాడు. మేము మేనేజర్ కి ధన్యవాదాలు తెలుపుకుని బయలుదేరాము. అక్కడ్నుంచి వచ్చేసేముందు మేనేజర్ ఒక విషయం అడిగాడు – “సినిమా క్రెడిట్లలో భారత్ సర్కస్ పేరు వేస్తారా?” అని.

శియురి, రామ్పూర్‍ఘాట్ ల వద్ద దృశ్యాలు షూట్ చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపాము. గూపీ ఉన్న ఊరు కోసం నోతున్ గ్రాం అన్న ఊరు ఎంపిక చేసాము. అక్కడ్నుంచి సుమారు పదిహేను మైళ్ళ దూరంలో, మయూరాక్షి నది ఒడ్డులో ఒక వెదురుచెట్ల తోట కనిపించింది…గూపీ,బాఘా ల తొలి పరిచయం, ఇంకా పులి ఆగమనం సీన్లు తీయడానికి. ముందురోజు సాయంత్రం థోరట్ కలకత్తా నుండి బయలుదేరాడని, సరైన రోజున షూటింగ్ ప్రదేశం చేరుకున్నాడని మాకు కబురందింది. దాంతో వాళ్ళని కలవడానికి మేము కూడా త్వరగా వెళ్ళాము. మా యూనిట్ లో సుమారు పాతికమంది ఉన్నారు. కొంతమంది ఆ ఊరిజనాలు కూడా మా అనుమతి తీసుకుని మాతో వచ్చారు-పులితో మేమెలా పనిచేస్తామో చూడ్డానికి. లారీలో ఉన్న బోను కప్పేసి ఉంది. మమ్మల్ని చూసిన థోరట్ కవర్ని తీసాడు. అతను తన రెండు పులులనీ తెచ్చాడని అర్థమై ఆశ్చర్యపోయాము మేము. ఎందుకలా చేశాడు? ఒకటి సరిపోయి ఉండేది కదా.. “మన జాగ్రత్తలో మనం ఉందామని… ఒక వేళ ఒక పులి అనుకున్నట్లు చేయకపోతే ఇంకోటి ఉంటుంది కదా అని.” – థోరట్ వివరణిచ్చాడు. నాకు ఇది పెద్దగా నచ్చలేదు కానీ, “రెండోది కూడా సరిగా చేయకుంటే ఏమి చేస్తారు?” అని అడగడానికి ధైర్యం చాలలేదు. దాంతో, నేను ఆయనకి అంతా సిద్ధమయ్యేవరకు ఆగమని మాత్రం చెప్పగలిగాను. నేను ఇదివరలో చూసిన సర్కస్ పులులన్నీ బక్కచిక్కి ఉండేవి కానీ, ఈ రెండూ బాగా పుష్టిగా అనిపించాయి.

కెమరా ని ట్రిపోడ్ మీద పెట్టి దాన్ని వెదురుచెట్ల వైపుకి నిలిపాము. ఇప్పుడు థోరట్ కి సిద్ధమని చెప్పాము. చూస్తున్న జనాలని కెమెరా వెనక్కి వెళ్ళి వీలైనంత దూరంగా నిలబడమని చెప్పాము. మేము అక్కడే దగ్గర్లోనే ఉన్నాము. గూపీ, బాఘా కెమెరాకి సమీపంలోనే ఉన్నారు-ఎందుకంటే, కనీసం ఒక దృశ్యం అన్నా ఉండాలి కదా వారికి, పులితో. ఇలా మా ఏర్పాట్లలో మేముంటే థోరట్ మనుష్యులు పులి నడవబోయే ప్రాంతానికి సుమారు ముప్ఫై అడుగుల దూరంలో ఒక ఐదడుగుల ఇనుప కడ్డిని నేలలో పాతారు. అరవైశాతం కడ్డీ నేలలో ఉండిపోయింది. తర్వాత ఓ పొడుగ్గా,సన్నగా ఉన్న తాడు తీసుకుని, ఒక చివరని పులి చర్మంతో చేసిన ఓ బెల్టు కీ, మరో చివర ఈ ఇనుపకడ్డీకీ కట్టారు. ఆ బెల్టుని పులి ధరించింది. మేము సిద్ధమయ్యాము. ఆ రెండుబోన్లలో ఒకదాని తలుపు తెరిచారు. థోరట్ పులిని పిలిచాడు. అది వెంటనే స్పందించి ఖాళీ స్థలంలోకి దూకింది. తర్వాత జరిగింది మేమెవరం ఊహించనిది. థోరట్ మొహంలోని ఆ ఆశ్చర్యాన్ని, నిస్సహాయతనీ చూస్తేనే అర్థమైంది అతను కూడా మాలాగే ఆశ్చర్యంలో ఉన్నాడు అని. ఏదో నెమ్మదిగా,రాజసంగా నడవడం కాకుండా, అది అత్యుత్సాహంతో గంతులేయడం మొదలుపెట్టింది. ఎగిరింది..దూకింది…అటూ ఇటూ పొర్లాడింది – అంతా తన గురువు గారిని లాక్కుంటూ. థోరట్ దానికి కట్టిన తాడుని వదల్లేదు…ఎప్పటికైనా దాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తేవాలని. మేము పిచ్చివాళ్ళలాగా చూస్తూ నిలబడ్డాం – ఇదొక కొత్త తరహా ఉచిత సర్కస్ అన్నట్లు! కెమెరా ఇంకా ఆన్ చేసే ఉంది, చెట్ల వైపుకి చూస్తూ. కానీ, ఈ పులి వాలకం చూస్తే అక్కడికి వచ్చే సూచనలేం లేవు.

సుమారు ఐదునిముషాల “పిచ్చి” తరువాత పులి చివరికి కాస్త మెత్తబడింది. థోరట్, అతని సహాయకులను చూస్తే జాలేసింది. రింగ్-మాస్టర్ ఎండిపోయిన పెదాల మధ్య నుండి ఈ పులి ఎప్పుడూ ఇలాంటి చోటుకి రాలేదనీ, అది సర్కస్ లోనే పుట్టి పెరిగిందనీ, బోను నుంచి బయటకు వెళ్ళిందే చాలా తక్కువనీ, ఉన్నట్లుండి ఈ సహజ వాతావరణంలోకి వచ్చేసరికి కాస్త ఉద్రేకపడిందనీ -ఓ వివరణ వచ్చింది. పులి కాస్త మెత్తబడ్డాక మాకు కావాల్సిన సీనులు తీసుకున్నాము. కానీ, ఇప్పుడో కొత్త సమస్య. బోను తలుపులు తెరిచి ఉన్నాయి. లారీ దగ్గర ఒక స్టూల్ వేసి ఉంది. ట్రైనర్ వెళ్ళమనగానే పులి ఆ స్టూల్ మీదకి ఎక్కి బోనులోకి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ తలుపు మూసేస్తారు. కానీ, థోరట్ “వెళ్ళు” అని అరిచాక కూడా ఆ పులి అతన్ని పట్టించుకోలేదు. దానికి అక్కడ కూర్చుని ఆకులు నమలడం బాగా నచ్చినట్లుంది బోనులో కూర్చోడం కంటే. థోరట్ కి ఇది పూర్తి కొత్తగా ఉంది. కానీ, పులి ప్రవర్తన మా ఆందోళనను దూరం చేసింది. వెదురు చెట్ల ఆకులు తినే పులి అయితే మనుష్యుల్ని తినదు కదా. నేను కెమెరాని పులికి కాస్త దగ్గరగా తీసుకెళ్ళి ఈ వింత ప్రవర్తనని షూట్ చేసాను. కానీ, ఇంతలోనే ఉన్నట్లుండి, కెమెరా ఇంకా తిరుగుతూ ఉండగానే పులి గబుక్కున లేచి ఒక్క దూకులో వెళ్ళి బోనులో కూర్చుంది. లారీకీ వెదురుచెట్లకీ మధ్య ఉన్న సుమారు అరవై అడుగుల దూరాన్ని సుమారు ఒక సెకనులోనే దూకేసింది.

ఇక్కడితో కథ ముగిసి ఉండాలి కానీ, మేము కలకత్తా వెళ్ళిపోయి ఈ సీన్లను వేసి చూసుకుంటే కెమెరా సరిగా పనిచేయలేదు అని అర్థమైంది. దృశ్యాలన్నీ ఎంత చీకటిగా ఉన్నాయంటే పులి కూడా ఆకులూ,చెట్లలో కలిసిపోయినట్లు అనిపించింది కొన్ని చోట్ల. ఇప్పుడేం చేయాలి? మేము ఓడిపోయామని ఒప్పుకుని ఈ సీన్లు తీసేయాలా సినిమా నుండి? వీల్లేదు. భారత్ సర్కస్ ఇంకా కలకత్తా లోనే ఉంది. మేము మళ్ళీ వెళ్ళి థోరట్ తో మాట్లాడాము. ధైర్యం గల మనిషి – మళ్ళి ప్రయత్నించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మంచి విషయమేమిటంటే వీళ్ళు శియురీ దాకా రానక్కరలేదు. కలకత్తా దగ్గర్లోని బోరాల్ అనే పల్లెటూరిలోనే మాకు కావాల్సిన వెదురు పొదల్ని కనిపెట్టాము. పథేర్ పాంచాలీ చాలా భాగం బోరాల్ లో తీసినందున అది మాకు బాగా పరిచయమైన ప్రదేశమే. అపూ, దుర్గా, ఇందిర థాకురన్ – వీళ్ళతో చాలా దృశ్యాలు తీసాము అక్కడ. ఇప్పుడు మాతో గూపీ, బాఘా, పులిగారు ఉంటారు. మరోసారి లారీ వచ్చింది – థోరట్, పులి, తాడు, ఇనుప కడ్డీ, ఆ తోలు బెల్టులతో సహా. మళ్ళీ ఈ లారీతో ఆ పల్లె పల్లెంతా కదిలొచ్చింది. ప్రతి ఒక్కరూ – చిన్నా పెద్దా తేడా లేకుండా షూటింగ్ చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. గతంలో పులితో కలిగిన అనుభవం ఇంకా మా అందరి జ్ఞాపకాల్లో కొత్తగానే ఉండటంతో మేము ఆ పల్లెజనాలకి కెమెరా దగ్గరికి రావద్దని చెప్పాము. కనీసం డెబ్భై అడుగుల దూరంలో నిలబడమని చెప్పాము-ఏం జరుగుతోందో సరిగా కనబడకపోయినా కూడా. సినిమా రిలీజైతే ఎలాగో తెలుస్తుంది ఏ సీనులు తీస్తున్నామో. కానీ, ఎవరూ చెప్పింది వినలేదు. జనమంతా కెమెరాకి వీలైనంత దగ్గరగా నిలబడ్డారు. మేము ఇక వీళ్ళకి వివరంగా చెప్పడంలో సమయం వృధా చేసుకోదల్చుకోలేదు. అందుకని కెమెరా సిద్ధం చేసుకుని థోరట్ కి సంకేతం అందించాము. గూపీ,బాఘా వాళ్ళ స్థానాల్లోకి వచ్చారు. థోరట్ బోను తలుపులు తెరిచాడు.

తర్వాత జరిగింది ఇంతకు ముందు కనీవినీ ఎరుగనిది. ఆ తలుపు తెరిచిన క్షణంలో పులి పెద్దగా అరుస్తూ బయటకు వచ్చి సరాసరి కెమెరా వెనుక నిలబడ్డ పల్లెప్రజల వైపుకి వెళ్ళింది. మొదటిసారి మేము పులి అరసెకను కాలంలో అడవిలోంచి బోనులోకి వెళ్ళిపోవడం చూసాము. ఇపుడు మా కళ్ళముందే దాదాపు నూటయాభై మంది ఏదో మంత్రం వేసినట్లు మాయమైపోయారు. నిజంగా, ఓ క్షణంలో అంతా ఉన్నారు. మరు క్షణంలో ఎవరూ లేరు. పులి మరీ దూరం వెళ్ళలేదు. దాని శిక్షకుడు తాడు పట్టి లాగి దాన్ని వెనక్కి తెచ్చేసాడు. కానీ, ఇది ఎవరూ ఊహించలేదు. మెరుపు వేగంతో అంత మంది మనుష్యులు మాయమవడం గానీ, వాళ్ళ కళ్ళలోని భయం కానీ – నేను బహుశా మర్చిపోనేమో. వింత ఏమిటంటే, ఈ శక్తి ప్రదర్శన తరువాత పులి త్వరగానే మెత్తబడింది. చెప్పింది వినే పిల్లవాడిలాగా చెప్పిన ప్రదేశంలో నడిచి, మళ్ళీ శిక్షకుడివైపు నడిచి వెళ్ళిపోయింది. ఈసారి కెమెరా కూడా సరిగానే ఉంది అన్న విషయం మాకు రెండ్రోజుల తర్వాత కలకత్తా తిరిగి వచ్చి ఈ సీన్లు వేసుకుని చూస్తూ ఉంటే తెలిసింది.

3 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 20, 2008 /
  2. Srinivas May 21, 2008 /
  3. ravi May 29, 2008 /