Menu

మేకింగ్ మూవీస్ – సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా

సౌమ్యగారు గతంలో నవతరంగం కోసం అనువదించిన సత్యజిత్ రే మేకింగ్ మూవీస్ వ్యాసావళిని నవతరంగం క్రొత్త పాఠకుల కోసం 8 గంటల స్లాట్‍లో పున: ప్రచురిస్తున్నాం. చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

నవతరంగం
————————————————————————————————–
“Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని సరళత్వం నాకు చాలా నచ్చింది. అవి తెలుగులోకి అనువదించి మన భాషలో మనవాళ్ళు చదువుకునే సౌలభ్యం ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇదే విషయం వెంకట్ గారితో మాట్లాడుతూ(చాట్లాడుతూ) ఉండగా, నేనే అనువాదం చేస్తానన్నాను. ఆయన కూడా ప్రోత్సహించడంతో ఈ పని మొదలుపెడుతున్నాను. ఇవి సామాన్యుల కోసం రాయ్ రాసిన వ్యాసాలు. వీటిని చదివి ఆనందించడానికి ఎవరికీ సినీ సాంకేతిక పరిజ్ఞానం అవసరంలేదనే నా నమ్మకం. ఈ ప్రయత్నం మీకు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకానికి రాయ్ రాసిన ముందుమాట:
సినిమా తీయడం అన్న వ్యవహారాన్నంతా మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది-అంతా రాసి పెట్టుకోవడం, రెండవది-దాన్ని తీయడం, మూడవది-తీసిన దృశ్యాలను కలపడం. స్క్రీన్ పైన మీకు కనబడేది మొదట కథలాగ రాస్తారు. దాన్ని స్క్రీన్‍ప్లే అంటారు. సినిమా తీయడం మొదలయ్యాక, ప్రతీదీ స్క్రీన్‍ప్లే కి అనుగుణంగానే జరుగుతూ ఉంటే, దాన్ని ప్రధానంగా కెమెరానూ, శబ్దాన్ని రికార్డు చేయడానికి ఉపయోగించే పరికరాలను ఉపయోగించి బంధించడాన్ని షూటింగ్ అంటారు. షూటింగ్ అయిపోయాక, వరుసగా కాక ఎలా వీలుంటే అలా తీసిన సీన్లన్నీ స్క్రీన్‍ప్లే లో ఉన్న విధంగా అమరుస్తారు. ఇది చేసాక బయటకొచ్చే దాన్నే జనం స్క్రీను మీద చూస్తారు. సినిమా షూటింగ్ అన్నది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ మూడింటిలో అన్నింటికంటే కష్టమైన పని కూడా. కొన్ని సార్లు ఇది స్టూడియోలోనూ, కొన్ని సార్లు బయట సహజ వాతావరణంలోనూ జరుగుతుంది.

గత పాతికేళ్ళలో నేను నా సినిమాల షూటింగుల నిమిత్తం దేశంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగాను. కానీ, ప్రధానంగా మూడు సినిమాల కోసం చాలా ఎక్కువ తిరిగాను. అవి-గోపీ గైన్,బాగా బైన్, షోనార్ కిల్లా, జాయ్ బాబా ఫెలూనాథ్. ఈ పుస్తకంలో నేను మీకు కొన్ని గమ్మత్తైన, ఆసక్తికరమైన విషయాలను చెబుతాను. ఇవన్నీ బిర్బూమ్ లోని పల్లెలోనూ, వారణాసి వీథుల్లో మరియు ఘాట్లలోనూ, పశ్చిమ రాజస్థాన్ లోని ఎడారుల్లోనూ ఇంకా మంచు కప్పిన పర్వతాలున్న సిమ్లాలోనూ షూటింగ్ చేసినప్పటి అనుభవాలు. ఇలాంటి అనుభావాలే షూటింగ్ కోసం పడ్డ కష్టాలన్నింటినీ కూడా ఇష్టంగా భరించేలా చేస్తాయి, ముఖ్యంగా అన్నింటినీ అధిగమించి ఆ పనులు విజయవంతంగా పూర్తి చేసినప్పుడు.
————————-
నా ముందుమాట ముందే చెప్పేసాను అనుకోండి – ముందుమాటకి చివరి మాట: ఇది అనువదించడంలో ఉద్దేశ్యం రాయ్ సాహిత్యం గురించి తెలుగువాళ్ళకి కూడా తెలియజేయాలని. నవతరంగం లో మే నెల సత్యజిత్ రాయ్ నెల కనుక, వీలైనంత త్వరగా మొత్తం ఆరు వ్యాసాలనూ అనువదించి వెలువరించే ప్రయత్నం చేస్తాను. మీ సలహాలూ,సూచనలూ ఏమన్నా ఉంటే – నవతరంగానికి పంపగలరు. త్వరలో మొదటి వ్యాసం మీ ముందుకి వస్తుంది. మొత్తం రాయ్ రాసినవి ఆరు వ్యాసాలే అయినా-వాటి నిడివిని బట్టి నేను ఒక్కో వ్యాసాన్నీ రెండు మూడు భాగాలు చేసి పోస్టుతాను-మీ సౌలభ్యం కోసం, నా సౌలభ్యం కోసం కూడానూ – వెరసి మన సౌలభ్యం కోసం.

ఇట్లు,
సౌమ్య.

9 Comments
  1. bhanu May 2, 2008 /
  2. శంకర్ May 3, 2008 /
  3. Sowmya May 6, 2008 /
  4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 6, 2008 /
  5. శిద్దారెడ్డి వెంకట్ May 6, 2008 /
  6. శంకర్ May 6, 2008 /
  7. ravi May 29, 2008 /
  8. venkat Balusupati June 10, 2008 /