Menu

జానకి గారి తక్కిన గొంతుకలు

ఈ టపా ఉద్దేశ్యం జానకి గారి పాటల గురించి మాట్లాడడం కాదు. ఆమె ప్రతిభలో ఓ కోణాన్ని తలుచుకోవడం. జానకి గారికి మాయ మామూలుగానే తెలుసు. కానీ, ఇక్కడ చెప్పబోతున్నది ఆ మాయల్లో ఇంకో ప్రత్యేకమైన మాయ. గొంతుని మార్చి పాడగలగడం. అలా పాడిన పాటలు ఎన్నున్నాయో నాకు తెలీదు కానీ, నేను విని ఆనందించి, మాయలో పడి, మునిగి – ఇన్నాళ్ళకి కొంత తేలాక ఇప్పుడు వాటి గురించి మిగితా అందరికీ చెబుదామన్న కుతూహలం .. 🙂 నాకు పరిచయమైన వరుసలో రాస్తున్నా:

మొదట: “మల్లెపూల హారమెయ్యవే…” అన్న పాట.. “గోపాల కృష్ణుడు” అన్న ప్రైవేట్ ఆల్బం లోనిది. దీనికి వెబ్ వర్షన్ ఉందో లేదో నాకు తెలీదు. నేను విన్నది ఆడియో కేసెట్లో. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు విన్నాను మొదటిసారి. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటీ అంటే, ఇందులో కృష్ణుడి గొంతూ జానకిదే, యశోద గొంతూ జానకిదే. అయితే, అది అంత కొట్టొచినట్లు కనబడదు. కాస్త గమనిస్తే గానీ, కొన్ని సార్లు వింటే గానీ అర్థం కాదు. నాకు అయితే, అప్పుడు చిన్నవయసు కనుక, మా నాన్న చెప్పినట్లు గుర్తు. ఈ పాట విన్నప్పుడు మొదటిసారి మొదలైంది ఆ “అబ్బ! భలే పాడిందే ఈమె… రెండు గొంతుకల్లో!” అన్న ఫీలింగ్. మొన్నామధ్య అలాంటి పాట మరొకటి(ఈ జాబితాలో చివరిది) వినేనాటికి కూడా ఆ అబ్బురం కొనసాగుతూనే ఉంది…ఉంటుంది కూడా.

రెండవది: “సప్తపది” సినిమా లో “గోవుల్లు తెల్లన” పాట. చిన్నపిల్ల గొంతుకా, పెద్ద గొంతుకా – మళ్ళీ. ప్రశ్న-జవాబు. ఆ పరంగా చూస్తే, పై పాట మాదిరిదే ఈ పాట కూడానూ. ఇది వింటున్నప్పుడు మరోసారి అనుకున్నా – “ఈమెకి మాయ తెలుసు” అని.

మూడవది: చిన్న బిట్. “స్వాతి ముత్యం” లో “చిన్నారి పొన్నారి కిట్టయ్య” పాట లో, అంత సేపూ అమ్మ గొంతుక లో పాడిన జానకి చివరి బిట్ లో మాత్రం పిల్లవాడి గొంతుక లో పాడుతుంది. పాట మొత్తం పిల్లాడి గొంతుకు ఎస్పీబీ నే పాడారు, కానీ ఆ భాగానికి ఆమె ఎందుకు పాడింది అన్నది నాకు అర్థం కాలేదు.

నాలుగవది: “దండాలు సామీ దండాలు..” అని మొదటిసారి ఈటీవీ వారి “ఝుమ్మందినాదం” లో విన్నాను. చివరిసారీ అదే! ఇందులో నాలుగు గొంతుకల్లో పాడుతుంది ఆమె. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి దాకా- జీవితమజిలీల్లో నాలుగు వేర్వేరు మజీలీల్లో ఉన్న వారి గొంతుకలు. ఆ పాట ఎక్కడ దొరుకుతుందో తెలీడం లేదు. పోనీ, ఆ ప్రోగ్రాం దే వీడియో అయినా దొరుకుతుందేమోనని చూసా కానీ..ప్చ్! (ఎవరికన్నా ఈ పాట దొరికే మార్గం తెలిస్తే చెబుదురూ?)

ఐదవది: బంధం సినిమాలో ఆ చిన్నపాప సుప్రభాతం పాడటం. ఇది యూట్యూబ్ లో ఇక్కడ ఉంది. రెండు చోట్ల వస్తుంది. ఓ చోట పి.సుశీల, ఎస్.జానకి కలిసి పాడారు. అంటే, సినిమాలో తల్లీ కూతుళ్ళకి. రెండో చోట కూతురు మాత్రం పాడుతుంది. ప్రత్యేకంగా ఏమని చెప్పను ప్రతి పాటకీ? నేను విన్న ప్రతి పాటనీ ఎంజాయ్ చేసాను ఇక్కడ చెప్పన వాటిలో.

ఆరవది: “కొక్కా మండీ…” – అని ఒక పాట యాహూ వారి ఎస్.జానకి గుంపులో ఒకరు ఫైల్ షేర్ చేసారు… చిరియోచిరి అన్న సినిమా. చిన్న పిల్ల గొంతుక మళ్ళీ.

ఏడవది: “మామీపేరుమానె” అన్న తమిళ పాట – నెన్జతై కిల్లాథె అన్న సినిమా. ఇది నన్ను ఆశ్చర్యపరిచినంతగా బహుశా ఏపాటా చేయలేదేమో. విని ఇన్నాళ్ళైంది, నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది దాన్ని తలుచుకుంటే. కారణం ఈ పాట ఫుల్ సాంగ్ మేల్ టీనేజర్ గొంతులో సాగుతుంది. అసలు అది ఆమే పాడింది అని ఆ పాట గురించి తెలిపిన వ్యాసం తెలుపకపోతే అనుకునేదాన్నే కాదు. ఆ పాటలో మధ్యలో మళ్ళీ డైలాగులు కూడా వస్తాయి…అవి కూడా ఆమే చెప్పిందా? అన్న దాని గురించి నాకు ఎక్కడా సమాచారం దొరకలేదు. పాటే నేను అది జానకి పాడింది అని చదివితే గానీ నమ్మలేనంత పూర్తిస్థాయిలో గొంతు మార్పు చేసిన పాట. ఇక ఆ డైలాగులు, అసలా పాట పాడటంలో ఆమె తప్ప వేరెవరూ పాలు పంచుకోలేదు అంటే మటుకు ఇది మరో అద్భుతమే!

ఎనిమిదవది: “..పేరు మల్లీ…ఊరు కొత్త దిల్లీ..” అని మౌనగీతం అన్న మళయాళ సినిమాలో ఓ పాట ఉందని చదివాను…కానీ వినలేదు. ఇందులో తాగుబోతు గొంతుకలో పాడారు ఆమె అని విన్నాను. నాకు అదీ “మామీ పేరు..” పాట ఒకటే ఏమో…భాషలు మాత్రం వేరేమో అని అనుమానం. ఇంకా ఈ పాట వినలేదు కనుక, చెప్పలేను.

ఇంకా ఇలాంటివి ఉండొచ్చు. కానీ, ప్రస్తుతానికి నాకు గుర్తొచ్చినవి ఈ ఎనిమిదే. ఇవి విన్నాక నాకు అవిడ మీద ఉన్న అభిమానం కొన్నాళ్ళపాటు అబ్బురంగా మారి, మళ్ళీ కొంతకొంతగా అభిమానంలో చేరిపోయింది. ఈ టపా మొదలుపెట్టినప్పటి ఆవేశం (ఎప్పుడో ఫిబ్రవరీలో మొదలుపెట్టాను రాయడం) ఇప్పుడు లేదు కానీ, చెప్పదలుచుకున్నది ఇదే – జానకి గారి గొంతులోని వర్సటిలిటీ.

22 Comments
 1. Sai Brahmanandam Gorti September 2, 2008 /
 2. తెలుగు అభిమాని September 2, 2008 /
 3. శోభ September 2, 2008 /
 4. Aruna September 2, 2008 /
 5. Sowmya September 2, 2008 /
 6. srikanth September 3, 2008 /
 7. mvs September 7, 2008 /
 8. నిషిగంధ September 10, 2008 /
 9. Vamshi September 14, 2008 /
 10. Jayaram September 22, 2008 /
 11. KRISHNA RAO JALLIPALLI October 1, 2008 /
 12. కొత్తపాళీ October 1, 2008 /
 13. abs October 4, 2008 /
 14. abs October 4, 2008 /
 15. చంద్రం October 6, 2008 /
 16. chandru October 6, 2008 /
 17. Sri October 8, 2008 /
 18. pappu October 24, 2008 /
 19. జయరాం February 12, 2009 /
 20. రాఘవ March 19, 2009 /
 21. raviraj June 23, 2009 /