Menu

లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు

ఈ సంవత్సరం అక్టోబరు 15 నుండి 30 వరకూ జరగనున్న 52 వ లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడునున్నాయి. ఆ సినిమాల వివరాలు:

Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ సినిమాల వైపు దృష్టి మరల్చిన కేతన్ మెహతా ఈ సినిమాతో తిరిగి తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడనిపిస్తుంది.
నటీనటులు:Paresh Rawal,  Nandana Sen,  Deepti Naval,  Randeep Hooda

Firaaq:ప్రస్తుతం మనకున్న మంచి నటీనటుల్లో నందితా దాస్ ఒకరు. ఇన్నాళ్ళూ నటిగా తన ప్రతిభను ప్రదర్శించిన నందితా దాస్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా ఫిరాక్. ఈ సినిమా 2002 లో గుజరాత్ లో జరిగిన మత కలహాల నేపథ్యంలో రూపొందించబడింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది. తన తొలి సినిమాతోనే నందితా దాస్ తన ప్రతిభ నిరూపించుకోవడం ఆనందంగా వుంది.

ఈ సినిమా అంతర్జాతీయ సినీ క్రిటిక్స్(FIPRESCI) అవార్డుకి నామినేట్ చేయబడింది కూడా.

Quick Gun Murugan:వైసా భీ హోతా హై సినిమా దర్శకుడు, గతంలో ఛానెల్ వీ నిర్వాహకుడు అయిన శశాంక్ ఘోష్ దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా వస్తున్న సినిమా క్విక్ గన్ మురుగన్. ఈ మురుగన్ పాత్ర ఇది వరకే ఛానెల్ వి ద్వారా బాగా పాపులర్ అయింది. ఆ పాత్రను పూర్తి నిడివి సినిమాకి ఉపయోగించడం ఇదే మొదటి సారి. ట్రైలర్స్ బావున్నాయి. కామెడీ లవర్స్ కి ఈ సినిమా బాగానే అలరించొచ్చేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా మన రాజేంద్రుడు ఉన్నాడు కాబట్టి తప్పక చూడాల్సిన సినిమా.

Welcome to Sajjanpur(మహదేవ్ కి సజ్జన్ పూర్): ఎన్నో కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ఇది. ఆమృతా రావు, శ్రేయస్ తల్పాడే ఈ సినిమాలో ముఖ్య నటీనటులు. అశోక్ మిశ్రా స్క్రీన్ప్లే రచించిన ఈ సినిమా పూర్తి నిడివి కామెడీ సినిమా. ఊరి వాళ్ళకు ఉత్తరాలు రాసిపెడ్తూ రచయిత కావాలని కలలు కనే మహదేవ్ అనే ఒక యువకుని కథ ఇది. నేనూ కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తాను అని గతంలో ఒక సారి ప్రకటించిన బెనెగల్ ఈ సినిమాతో ఆ పని చేసినట్టే అనిపిస్తుంది. కమర్శియల్ సినిమా అనే బెనెగల్ మార్క్ వుంటుందని ఆశిద్దాం.

Tahaan:సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన మరో మంచి సినిమా ఇది. ఇరానియన్ సినిమాలైన చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమాలతో ఈ సినిమానీ పోలుస్తున్నారు. కాశ్మీర్ లోని ఒక ఎనిమిదేళ్ళ బాలుడి కథ ఈ సినిమా. ఈ సినిమా ఇప్పటికే చాలా చోట్ల చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. ఈ సినిమా లో సంతోష్ అన్ని సినిమాలలాగే సినిమాటోగ్రఫీ ఒక హైలైట్.

ఈ ఐదు సినిమాలే కాకుండా మన భారతీయ నటులు అనీల్ కపూర్ మొదలగువారు నటించిన స్లమ్ బాయ్ మిలియనీర్, అలాగే అతుల్ శబరవాల్ రూపొందించిన లఘు చిత్రం మిడ్ నైట్ లాస్ట్ అండ్ ఫౌండ్ చిత్రాలు కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్నాయి.

చివరిగా, ఈ చిత్రోత్సవంలో గిరీశ్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన గులాబి టాకీస్ సినిమా ప్రదర్శిస్తారేమోనని ఆశగా ఎదురుచూసాను కానీ ఆ సినిమా లిస్టులో లేకపోవడం నిరాశ కలిగించింది. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో చలనచిత్రోత్సవాల్లో పాల్గొని అవార్డులు గెలుచుకుంది. వీలయితే చూడండి.

3 Comments
  1. bhanu prakash September 16, 2008 /
  2. chandramouli September 29, 2008 /