Menu

బాపు-ఒక పరిచయం(లాంటిది)

తెలుగు వారికి బాపు ని పరిచయం చేసే అవసరం వుందా? ఏదో ఫార్మాలటీగా రాద్దామనుకున్నా ఆ ప్రయత్నం వ్యర్థమనిపించింది. అందుకే  తమ గురించి వారే చెప్పుకుంటే మేలని ’బొమ్మా-బొరుసా’ పుస్తకం నుంచి వారి పరిచయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.కానీ బొమ్మ అంటే బొరుసూ ఉండాలి కాబట్టి, బుడుగంటే సీ గాన పెసూనంబ కూడా ఉండాలి అలాగే బాపు అంటే రమణా కూడా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఇది బాపు గురించి పరిచయం అయినా రమణ లేని బాపు ని ఊహించగలమా? అందుకే ఇది బాపురమణీయం!

——*——

రమణ మొదటి రాత, బాపు మొదటి గీత 1945 లో అచ్చయ్యాయి. ఇద్దరికీ ఐదేసి రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ దెబ్బకి షాకుతిన్న జర్మనీ జపాని వాళ్ళు ఓడిపోయీ, ప్రపంచ యుద్ధం ఠపీమని ఆగిపోయీ, శాంతిదేవత చిందులేసి ఆనంద నృత్యం చేసీ, అమెరికాలో అధ్యక్షులు (ట్రూమన్) అమెరికాలోని భారతీయులు పౌరసత్వానికి అర్హులు సుమా అంటూ సంతకం చేసీ…..మహాప్రభో! ఇహ చెప్పలేను.

ఈ గోల్డెన్ జూబిలిలో బోల్డెంత హిస్టరీ, జాగర్ఫీ ఎట్సెటరా…..

ఇలా కొన్నాళ్ళయ్యాక బాపు కాలేజీకెళ్తున్న ఓ బాపు బొమ్మను చూపించి కథ రాయి అన్నాడు.

“ఏం కథ?”

“లవ్ స్టోరీ.నువు రాశాక చదివి చెప్తాను.”

“ఆ బొమ్మాయికింకా పెళ్ళయినట్టులేదు.”

“మరే…కానట్టుంది”

“కాని వాళ్ళ గురించి కథ రాస్తే…”

“రాసి చూడరాధా” అన్నాడు బాపు.

రాధా గోపాళం కథలు రాసినా – పెళ్ళయిన వాళ్ళుగా మొదలెట్టి పెళ్ళి ముందర భాగోతం కూడా రాశాడు రమణ. ఆంధ్రపత్రిక వారు అచ్చేశారు.

ఇంకోసారి. రమణ కథ రాసి బాపునడిగి బొమ్మేయించుకొని ఆంధ్ర ప్రభ ఆఫీసుకి వెళ్ళాడు. ఎడిటర్ విద్వాన్ విశ్వం గారు ఎగాదిగా చూసి ఇంతున్నావు ఇపుడే కథలు రాస్తావా అన్నారు. రమణ ధైర్యం చేసుకుని “అంటే నా కథలేస్తే ఈ బొమ్మ వూరికే ఫ్రీగా ఇస్తానండీ.” అన్నాడు.  ఆయన నవ్వేసి బొమ్మ చూశారు. “ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది. సర్లే” అన్నారు. వేశారు. చెరీ అయిదు రూపాయిలిచ్చారు.

ఇంతకుముందులా ప్రపంచంలో విప్లవాలు, యుద్ధాలు, శాంతులవడం జరగలేదు. కానీ….

రమణకి ఆకలేసింది. ఇంకా రాయాలనీ….. బాపుకి బొమ్మలేయాలనీనూ.

ఆంధ్రపత్రిక ’అయ్యవారు’ శ్రీ శంభుప్రసాద్ గారు వాత్సల్యంతో చేరదీశారు. స్నేహంతో ఆదరించారు.

ఎమస్కో ప్రచురణ అధిపతి ఎమ్.ఎస్.రామారావు గారి ద్వారా కలిసిన ఫోర్డ్ ఫౌండేషన్ మెడ్రాస్ ఆఫీసర్ ఆర్టూర్ ఐసెన్‍బెర్గ్ బాపు బొమ్మలు చూసి ముగ్ధులయ్యారు. తనతో ఇండియా అంతా టూర్ చేయించి ఫౌండేషన్ ప్రాజెక్టుకు పదివేల ఫోటోలు తీయించారు. వందలకొద్దీ బొమ్మలు వేయించారు.

కొన్నేళ్ళయ్యాక “సినిమా తీద్దామోయ్” అన్నాడు బాపు.

“నువ్వేం నేర్చుకోలేదు. షూటింగైనా చూడలేదు. ఆ క్వాలిఫికేషన్లు లేకుండా….”

అవి లేకపోవడమే నా క్వాలిఫికేషన్ అన్నాడు బాపు.

ఆ పొగరు, నిజాయితీ చూసి నవయుగ శ్రీనివాస రావు గారు “సాక్షి” తీయించారు.

ఆ పొగరు కొద్దీ బాపు, రమణలు బంగారు పిచిక తీశారు. మునివేళ్ళు కొంచెం కాలాయి.

అక్కినేని నాగేశ్వరరావుగారు ఆ వేళ్లకు బులబులాగ్గా నవనీతం రాసి బుద్ధిమంతుడు తీయించారు.

యాభై అరవై సినిమాలు రీళ్లలో తిరిగాయి. 1985 లో సినిమా కాని సినిమా, సినిమాకు మించిన సినిమా. విద్యాదంగానికి సేవ చేసే సినిమా తీసే అవకాశం వచ్చింది. అదీ వీడియో పాఠాల ప్రాజెక్టు.

కోట్లాది ప్రజలపై సినిమాకి గల ప్రభావం చూసి – ఈ మార్గాన్ని విద్యాబోధనకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు గారు సంకల్పించారు. బాపు-రమణలకు ఆ బాధ్యత ఒప్పగించారు. అఆలు, అంకెలు పద్యాలు పాటలూ భూగోళం చరిత్ర విజ్ఞాన శాస్త్రం – ఇలా అన్ని పాఠ్యాంశాలను ప్రభుత్వ విద్యాశాఖ నిర్దేశించిన సిలబస్ ప్రకారం రూపకల్పన చేశారు బాపూ రమణలు.

ఒకటి నుండి మూడవ తరగతి వరకూ 30 గంటలు నడిచే వీడియో టేపులు రూపొందించారు. ప్రభుత్వం వారు పదివేల ప్రాధమిక పాఠశాలలకు టి.వి., వీడియో ప్లేయర్ సెట్లను ఇచ్చి ఈ టేపులు అందచేసి పాఠాలు బోధించసాగారు. పిల్లలూ పెద్దలూ ఎంతో మెచ్చుకున్నారు. ఆనాడు కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్న శ్రీ పి.వి.నరసింహారావు గారు ఈ ప్ర్రొజెక్టును మెచ్చుకుని మిగతా రాష్ట్రాలకు సిఫార్సు చేశారు.

తమ జీవితంలో ఇదొక మహోజ్వల ఘట్టమనీ జన్మ తరించిందనీ చెప్పుకున్నారు బాపు రమణ.

ఆడుతూ, పాడుతూ చేసే పనులు దొరకడం వాళ్ళ అదృష్టం….అలాగే వేడుతూ(దేవుడిని) పాడుతూ తీసిన సంపూర్ణ రామాయణం, అందాల రాముడు,సీతా కళ్యాణం, భక్త కన్నప్ప, శ్రీ నాధుడు వాళ్ళకెంతో ఆనందాన్ని కలిగించాయి.

రిలయన్స్-ముద్రా కమ్యూనికేషన్స్ వారు శ్రీ తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా సమర్పించిన ’శ్రీ వారి బ్రహ్మోత్సవాలు’ వీడియోకు బాపు రమణలు రూపకల్పన చేయడం మరో మధుర ఘట్టం. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో తీర్చిదిద్దిన యీ వీడియో కాసెట్టు లక్షలాది భక్తుల ఆదరణ పొందింది.

సిమెంటు చెయ్యడం, చేయించడం వృత్తి అయినా నవ్వడం నవ్వించడం ప్రవృత్తి అయిన నాగార్జున సిమెంట్స్ రామచంద్రరాజుగారు నవ్వుతూ చేయి కలిపి, “నవ్వించండర్రా” అన్నారు. ’నవ్వితే నవ్వండి’ జోకుల కాసెట్ రూపొందింది.

అదీ కథ.

అతడు తూర్పు. ఇతడు పడమర.

అతను రోజుకి 18 గంటలు నిద్రబోతాడు. అదేమిటంటే ఆలోచిస్తున్నానంటాడు.

ఇతను రోజుకి నాలుగైదు గంటలు నిద్రబోతాడు. అదేంటంటే చిన్న రెస్టు అంటాడు చిరునవ్వుతో.

ఇలా హాయిగా నవ్వుతూ, నవ్వుటుంకూ, నవ్వితోపూ, నస్విస్తూ….

ఇట్లు

బొమ్మా-బొరుసూ

6 Comments
  1. Sowmya September 1, 2008 /
  2. Falling Angel September 1, 2008 /
  3. Falling Angel September 3, 2008 /
  4. Shanker Ramabhotla November 30, 2008 /