Menu

అష్టాచమ్మా

ఇమ్మహేశాభిధానుల కిటుల పెద్ద

పీటవేసి గుండియలలొ గూటినిచ్చి

పూజచేయ ప్రతీ పూట పొలతు లిలను

కీత రాంబాబులందరి కేది దిక్కు?

పై తేటగీతి ప్రశ్నకి రెండంకాలలో, మొదటిది హైదరాబాదులో ఉల్లాసంగా, రెండవది లక్కవరంలో కొంచెం ఊదరకొట్టి, చిత్రరూపంలో ప్రేక్షకుల ముందు సమాధానంగా ఉంచారు ఇంద్రగంటి మోహనకృష్ణ.

మహేశ్ బాబు దొరక్కపోతే కనీసం ఆ పేరున్న వాడైనా దొరికితీరాలన్న పట్టు బట్టిన ఓ వీరాభిమాని అయిన హైదరాబాదు అమ్మాయి, చిన్నప్పుడు ఆ అమ్మాయి చేసిన సహాయానికి ప్రతిగా చేస్తున్న సహాయం అని బనాయించి చెప్పినా అసలు ఆ అమ్మాయి మ్రోగించే మహేశ్ బాబు పాటలు వినలేక ఎలాగోలాగ మహేశ్ అనే వాణ్ణి అంటగడితే ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతందిలే అనే ధీమాతో ఆమె తరఫున వరుడివేటలో పడ్డ పక్కింటబ్బాయి, లక్కవరంలో పెదరాయుడి తరహా పూర్వరంగం ఉన్నా అలాంటి హుందాతనపు ప్రవర్తనా భారన్ని ప్రతిరోజు మోయలేక విముక్తి కోసం అడపాదడపా హైదరాబాదు కొచ్చి, పేరు పోకడలు మార్చుకొని, ఊళ్ళో అందుకోలేని సౌఖ్యాలనన్నీ చవి చూడడానికి ఉబలాట పడుతూన్న ఓ అబ్బాయ, ఇక అతని చెల్లలూ – వీరివే అష్టా చెమ్మా చిత్రంలోని ప్రధాన పాత్రలు.

సినిమాని ఏ నవలో, నాటికో ఆధారంగా తీయడమనేది మంచి విషయమే, ప్రేక్షకుడికి – దర్శకుడికి తా చెప్ప/చూప బోయే విషయం మీద మంచి అవగాహన ఉందని కొద్దోగొప్పో ధీమా వస్తుంది కనక. అది అలా ఉంచితే, ఆస్కార్ వైల్డు నాటిక ప్రేరణతో తీసిన సినిమా అంటే కొంచెం కుతూహలం కూడా పెరుగుతుంది, తెలుగులో అలాంటి ప్రేరణనలకి లోనయ్యే దర్శకు లెందరున్నారు, చెప్పండి? ఆ ధీమా, కుతూహలాల వల్ల కలిగిన సదభిప్రాయాన్ని ఎక్కడా పాడు చేయని రీతిలోనే సినిమాని లాగించేసారు ఇంద్రగంటి గారు.

ఈ సినిమా ఆ నాటికకి మక్కీకిమక్కి అనుసరణ కాకపోయినా, పాత్రల సంభాషణా చాతుర్యం, నిమిషానికో తూటాలా ప్రేక్షకులపై సంధింపబడిన ఛలోక్తుల వల్ల ఇది ఏ నాటిక నుంచో పుట్టింది అంటే సులభంగానే నమ్మేయచ్చు. పాతకాలం ఆంగ్ల హాస్య చిత్రాలు, ప్రముఖంగా నాకు గుర్తుకొచ్చేవి నీల్ సైమన్ చిత్రలు, సాధారణంగా బ్రాడ్వే లో ఢంగా మ్రోగించి అటు తరువాత తెరమీద స్వైరవీహారానికి వచ్చేవి – వాటిల్లో విరగబడి నవ్వులందించే, అద్దిరిపోయే మాటలుండేవి. అష్టాచెమ్మా అధికభాగం అలాంటి చిత్రాల కోవలోకే వస్తుందనిపించింది.

అష్టా చెమ్మాలో కూడ కథ కన్నా ముందు మాటల గురంచే చెప్పుకోవాలి, అందునా ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషుల మేళవింపు శ్లేషలు (puns) చాల బాగా వచ్చాయి. నవ్వులు చిందించాయి. ఎంత మంచి మాటలున్నా సరిగ్గా మాటాడి ప్రేక్షకులపై సంధించే వారు లేకు పోతే వచ్చేది చిరాకే కాని నవ్వు కాదు, అలాంటిది ఇక్కడ జరగడానికి ఆస్కారం లేకుండా అవసరాల శ్రీనివాస్, స్వాతి, నాని గొప్పగా పాత్రలను పోషించారు. కాని నాని చెల్లెలు గా నటించిన భార్గవి ఊరిపిల్ల అంటే నమ్మశక్యంగా అనిపించలేదు – జడా, పరికిణీ మిగతా ఊరిపిల్లల సరంజామా అంతా ఉన్నా ఆమె మాటలు కొంచెం పేలవంగా తోచాయి. తనికెళ్ళ భరణి గారి శాస్త్రి పాత్ర కూడ రక్తి కట్టలేదు.

స్వాతి పిన్నిగా ఝాన్సి, అమ్మాజీ అనబడే శాస్త్రి గారి వన్వే ప్రియిరాలిలా హేమ ప్రతి మాట గొంతుచించుకుని మరీ అరిచారు, ఫరవాలేదనిపించారు. అరుపులున్నా ఎక్కడా అతిగా అతి అనిపించే ఘట్టాలు లేవు. నటనా, మాటలు, హావభావాల విషయంలో చిత్రానికి నిఝ్ఝంగా స్టార్సు అంటే అవసరాల శ్రీనివాస్, స్వాతి, నానిలే. ముగ్గురూ కలిసి సినిమా మొదటి భాగాన్ని అవలీలగా ముందుకి లాగేసారు. కొంటె తనాన్ని పోతపోసుకున్న పాత్రలో శ్రీనివాసు, మనింట్లో అమ్మాయే అనిపించేలాగ నప్పిన స్వాతి, ఓ పక్క గాంభీర్యం మరో పక్క హాస్యం చూపగలిగిన నాని – ముగ్గరురికి ముగ్గురూ, నువ్వా నేనా అనే లాగ చాలా బాగా నటించారు.

సంగీతం ఫర్వాలేదు కాని సీతారామ శాస్త్రి గారి సాహిత్యం వల్ల పాటలు కొంచెం మెరుగ్గా వినిపించాయి, అందులో ముఖ్యంగా చెప్పకో దగ్గవి ‘తిడతారా కొడతారా’, ‘ఆడించా అష్టాచెమ్మా’ పాటలు. రెండవ భాగం, అంటే లక్కవరంలో జరిగే ద్వితీయాంకంలోనే సినిమా కొంచెం నట్టు పడింది. అనవసరమైన ఊదరకొట్టుడు, దాయెస్-ఎక్స్-మెషీన ల వల్ల (నిజాని కవి నమ్మశక్యంగా ఉండని యాదృఛ్ఛిక సంఘటనల పరంపరలు) కొంచెం పేలవంగా ఉన్నా, అద్దిరిపోయిన మొదటి అంకం వల్ల హాల్లోంచి హాయిగా సంతృప్తితో బయటపడచ్చు.

ఓ సారి తప్పక చూడండి.

–గిరి లంక

15 Comments
 1. నవీన్ గార్ల September 22, 2008 /
 2. సుజాత September 22, 2008 /
 3. నవీన్ గార్ల September 22, 2008 /
 4. గిరి September 23, 2008 /
 5. Jonathan September 23, 2008 /
 6. kranti gayam September 24, 2008 /
 7. BHASCAR September 25, 2008 /
 8. కొత్తపాళీ September 26, 2008 /
 9. o v n prasad September 29, 2008 /
 10. sekhar October 1, 2008 /
 11. sandesh October 4, 2008 /
 12. kranthi October 8, 2008 /
 13. j.surya prakash October 16, 2008 /