Menu

అష్టా – చమ్మా : Its all about a name

సాధారణంగా షేక్స్పియర్ నాటకంలోని డైలాగు  “What is there in a name?” అంటూ వుంటాం. కానీ ఇకపై మనకు బహుశా ఆ అవకాశం రాదనుకుంటా. ఎందుకంటే అష్టా – చెమ్మా సినిమా is all about a name. యువనటుడు మహేష్ బాబు కున్న, మహేష్, మహి, ప్రిన్స్, పోకిరి, అతిధి ఇవే ఆ పేర్లు.

మహేష్ బాబుకి పేద్ద పంఖా/ఫ్యాన్ అయిన లావణ్య (‘కలర్స్’ స్వాతి) కొంత హద్దుదాటి తననే పెళ్ళిచేసుకుందామని డిసైడ్ అయిన సమయంలో నమ్రతతో మహేష్ బాబు పెళ్ళి జరిగిపోవడంతో నిరాశ చెంది, మహేష్ బాబుతో కాకున్నా కనీసం “మహేష్” అని పేరున్న వాడితోనే పెళ్ళి జరగాలని సెటిలౌతుంది. తన పిచ్చి ఇలా వుంటే లావణ్య పిన్ని (ఝాన్సీ) కి రిచ్ NRI తో లావణ్య పెళ్ళి జరగాలని కోరిక. వారి పక్కింట్లో, కేవలం ఫోన్లో మాత్రమే కలుసుకునే రిచ్ ఫ్యామిలీ వారసుడు ఆనంద్ (శ్రీనివాస్ అవసరాల) ఉంటాడు. లావణ్య హోరుగా మ్రోగించే పోకిరి పాటల పోరుని తట్టుకోలేక ఆనంద్, “అక్కా నీ కోసం మహేష్ ను నేను వెతుకుతా” అని బయల్దేరుతాడు.

ఆనంద్ మహేష్ (నాని) అనే కుర్రాడిని వెతికి పట్టుకుని ఇద్దరిమధ్యా ప్రేమకు బాటలు వేస్తాడు. అప్పుడొస్తుందొక ట్విస్ట్….మహేష్ పేరు నిజంగా మహేష్ కాదు రాంబాబు from లక్కవరం అని. ఈ రాంబాబుకి లక్కవరంలో లక్ష్మి (భార్గవి) అనే  ఒక చెల్లెలుంటుంది. రాంబాబు మహేష్ గా పేరు మార్చుకుని హైదరాబాద్ వెళ్ళి enjoy చేసే విషయం దాస్తూ, అక్కడ మహేష్ అనే ఒక గొప్ప స్నేహితుడితో వ్యాపారం చేస్తున్నానని చెబుతాడు. ఆ మహేష్ గుణగణాలు విని,  ఆ పల్లెటూరిపిల్ల కాస్తా ఆ పేరంటే తెగ ముచ్చటపడిపోతుంది. కలల్లోనే ప్రేమించేస్తుంది. రాంబాబు పర్సులో లక్ష్మి ఫోటో చూసి ఆనంద్ ఆ అమ్మాయంటే ఇష్టపడతాడు. ఇక్కడ ప్రారంభమౌతుంది, మహేష్ అనే పేరుకోసం పడిచచ్చే నాయికలూ, మహేష్ అనే పేరు లేని నాయకుల కామెడీ పాట్లు.

ఆఖరికి ఈ సమస్య ఎలా కొలిక్కొచ్చింది అనేదే ఈ చిత్ర కథాంశం. అంటే మొత్తానికి its all about the name MAHESH అన్నమాట.

నటీనటుల నటన పరంగా స్వాతి మినహా ముగ్గురు ప్రధాన పాత్రధారులూ కొత్తవాళ్ళే. లావణ్య పాత్రలో స్వాతి అట్టే ఒదిగిపోయింది. హీరోగా ‘నాని’కి ఇది మంచి బ్రేక్ అవుతుంది. ఈజ్ తోపాటూ మంచి రేంజ్ వున్న పాత్ర.  తను దాన్ని అందిపుచ్చుకుని రాణించాడని చెప్పుకోవచ్చు. పాత్ర పరమైనపోషణ, వైవిధ్యం మొదటి సినిమాలోనే చూపించడంతో మంచి భవిష్యత్తుందని అనుకోగలం. ఈ సినిమాలో బాగా గుర్తుండిపోయే పాత్ర ‘శ్రీనివాస అవసరాల’ పోషించిన ఆనంద్ పాత్ర. హాస్యనటుడు సునిల్ తరువాత చాలా రోజులకు, తెలుగు తెరపై మరో బ్రహ్మాండమైన హాస్యనటుడు ఆవిర్భవించాడనిపించక మానదు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్, టైమింగ్, రియాక్షన్స్ కొంత వింతగావున్నా, కుప్పలుతెప్పలుగా హాస్యాన్ని కురిపిస్తాయి.

లావణ్య పిన్ని పాత్రలో ఝాన్సీ తన వునికిని చాటుకుంది. ‘సర్వశర్మ’ పాత్రలో తనికెళ్ళ భరణి, ‘అససూయ’గా హేమ సినిమాకు తగు సహాయం అందించారు.

చాలా రోజుల తరువాత క్లీన్ ఫ్యామిలీ కామెడీ సినిమా తెలుగులో వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధమార్థంలో సిటీ జీవితం, ద్వితీయార్థంలో పల్లెటూరి వాతావరణం కలగలిపి, రెండువిధాలా అచ్చతెలుగు సంస్కృతిని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవిష్కరించగలిగాడు. మాటల రచయితగా ఇంద్రగంటికి ఇది ఖచ్చితంగా మరో మెట్టు అనిపించక మానది. చాలా సహజమైన సంభాషణలు, అచ్చమైన తెలుగు ఛెళుకులు, పదాల అల్లికలూ అడుగడుగునా ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. ఎక్కడా ఒక్క బూతుగానీ, డబుల్ మీనింగ్ డైలాగు గానీ లేకుండా, ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించగలిగిన దర్శకుడిగా ఇంద్రగంటి అభినందనీయుడు. పకడ్బందీ రచన, పట్టుతప్పని స్క్రీన్ ప్లే, ఆహ్లాదకరమైన ఛాయాగ్రహణ (పి.జి.విందా), హృద్యమైన సంగీతం (కల్యాణి మాలిక్) ఈ సినిమాకు చక్కగా అమరి విందులు చేస్తాయి.

“అష్టా -చమ్మా” జంధ్యాల మార్కు తరహా హాస్యపు శైలిని ఆనందించి, ఆస్వాదించగల ప్రతి తెలుగు ప్రేక్షకుడూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఇప్పటివరకూ ఈ తరహా హాస్యానికి ముఖంవాచివున్న తెలుగు ప్రేక్షకులకు ఒక పన్నీటి తెమ్మెరలా ఈ చిత్రం తగలడం ఖాయం. చూడండి. చూసి హాయిగా నవ్వుకోండి.

చివరిగా,  నేనుగాక ఈ సమీక్షను ఇంకెవ్వరూ రాసే ప్రసక్తే లేదు..ఎందుకంటే నాపేరూ మహేషే గా !

25 Comments
 1. aswin budaraju September 7, 2008 /
 2. sasank September 8, 2008 /
 3. NNMuralidhar September 8, 2008 /
 4. raghu richards September 8, 2008 /
 5. సుజాత September 8, 2008 /
 6. సుజాత September 8, 2008 /
 7. ceenu September 8, 2008 /
 8. శంకర్ September 8, 2008 /
 9. Sowmya September 9, 2008 /
 10. aswin budaraju September 9, 2008 /
 11. మరమరాలు September 10, 2008 /
 12. కొత్తపాళీ September 10, 2008 /
 13. chaitanya September 11, 2008 /
 14. శోభ September 11, 2008 /
 15. Cine Valley September 13, 2008 /
 16. teresa September 14, 2008 /
 17. telugodu September 14, 2008 /
 18. సిరి September 20, 2008 /
 19. సిరి September 20, 2008 /
 20. laki January 6, 2009 /