Menu

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా ఓ ఉదాహరణగా పనికొస్తుందని నా అభిప్రాయం.

కథ విషయానికొస్తే, రాసు మరియు మొక్కై ఇద్దరూ నిరుద్యోగులు. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం చెందుతూ తమ దురదృష్టానికి దేవుణ్ణి నిందిస్తూ ఉండగా, ఓ రోజు వాళ్ళ ముందు దేవుడు ప్రత్యక్షమౌతాడు. తను వాళ్ళతో ఓ రోజు ఉంటాననీ, రోజులో వాళ్ళ సమస్యలేమిటో చూసి, సాయంత్రానికి ఏ ఒక్క సమస్యకైనా తాను కారణమని తెలిస్తే అవి తాను పరిష్కరిస్తానని, లేకుంటే దేనికీ దేవుణ్ణి నిందించకూడదనీ వాళ్ళ ముందు ఓ ప్రతిపాదన పెడతాడు. వాళ్ళు ఒప్పుకుంటారు. భూమిలోని శక్తి అంతా తనలో నింపుకున్నదిగా భావించే ‘గెలాక్సీ బాక్శ్ దేవుడి వద్ద చూశాక వారికి ఆశ కలిగి.. రోజు ముగిసేసరికి దాన్ని దొంగిలించేస్తారు. అక్కడ్నుండి, బాక్స్ లేని దేవుడు ఏమి చేసాడు? బాక్స్ ఉన్న వీళ్ళ పరిస్థితి ఏమైంది? చివరికి బాక్సు దేవుడి చేతుల్లోకి తిరిగి ఎలా వచ్చింది? – ఇదీ కథ.

ఫాంటసీ కథా అని చప్పరించేయకండి. ఇందులో ఆద్యంతం నవ్వుకునే హాస్యం ఉంది. నాకు బాగా గుర్తు ఉండిపోయిన సన్నివేశం ఒకడి చెబుతాను. రాసు కాఫీ డే లో బాయ్ గా చేరతాడు. అక్కడ ఎవరో ఇద్దరు కస్టమర్స్ వచ్చి కూర్చుంటారు. వాళ్ళతో రాసు సంభాషణ:
“ఆ…. ఏం కావాలీ? కాఫీయా? టీ యా?”
“2 custard.”
“స్ట్రాంగా మీడియమా?”

“.???”
“ఆ…ok ok, అంత శ్రమపడి ఆలోచించకండి. నేనే తెస్తాను.” అని, కిచెన్ వద్దకి వెళ్ళి “2 కప్స్ కస్టర్డ్” అంటాడు. “2 కప్సా?” అన్న అక్కడి బేరర్ ప్రశ్నకి “ఆ..మరి ఇద్దరున్నారు కద..” అని జవాబిస్తాడు రాసు. అప్పుడు అతను ఓ ప్లేట్ లో రెండు కస్టర్డ్ ముక్కలు వేసుకుని వచ్చి.. “దీన్ని కస్టర్డ్ అంటారు” అని చెప్తే, రాసు నాలిక్కరుచుని, కస్టమర్ వద్దకి వెళ్ళి –
“సారీ సార్. నాకు ఇదంతా కొత్త. నేను BBA. 55 పర్సెంటేజ్” ఇలా ఏదో అనేసి “ఇంకా ఏమన్నా కావాలా?” అని అడుగుతాడు.
అతను “లేటర్”(later) అంటాడు.
“ఎన్ని? ఒకటా? రెండా?” – ఇదీ రాసు జవాబు.
నాకు చాలా చాలా నవ్వొచ్చింది అక్కడ రాసు పాత్ర ధారి సంతానం హావభావాలకి.

సినిమా మొదలౌతున్నప్పుడు ప్రతి పాత్రనీ పరిచయం చేసే విధానం నా మటుకు నాకైతే కొత్తగా ఉంది. ప్రతి పాత్రా పరిచయమైన సీనులో పాజ్ చేసి, ఆ పాత్రధారివి రకరకాల ఫొటోలు చూపించి, తరువాత పాత్ర పేరు వేయడం… interesting. కొన్ని పుస్తకాలకి మొదట్లో ఫామిలీ ట్రీలు గీసినట్లు. మొక్కై పాత్ర కల, దానిలో సంతానం కనబడే దృశ్యాలు కూడా చాలా బాగున్నాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ ప్యాంట్ జేబుకి వేళ్ళాడే తాళం కప్పలు కూడా హైలైట్.

ఇక, “గెలాక్సీ బాక్స్” పోయిన దేవుణ్ణి మనిషిలాగే పని చేసి సంపాదించుకుంటున్నట్లు చూపించడం లో ఉన్న సందేశం కూడా చాలా నచ్చింది నాకు. There is no substitute for hard work అన్న సందేశం అంతర్లీనంగా ఈ సినిమాలో ఉన్నట్లు తోస్తుంది. ప్రతిదానికీ దేవుణ్ణి నిందించడం అన్న కాన్సెప్ట్ ని కూడా బాగా చర్చించారు. అర్హతలేని వారికి పవర్ వస్తే అనర్థాలు ఏమిటి? అన్న ప్రశ్నకి… పవర్ ని సొంత పనులకి వాడుకుంటే ఏమౌతుంది? అన్న ప్రశ్నకీ కూడా ఇక్కడ దృశ్య రూప జవాబులు దొరకొచ్చు. పాత్రధారుల విషయానికి వస్తే, ప్రధాన పాత్రధారులు – సంతానం, కంజ కరుప్పు ఇద్దరూ చాలా బాగా చేసారు. ముఖ్యంగా సంతానం కొన్ని చోట్ల చూపిన హావభావాలు చాలా బాగా కుదిరాయి. కంజ కరుప్పు కొన్ని చోట్ల ప్రదర్శించే అతి వినయం చూస్తే నవ్వాగదు. నాకు కథ చాలా నచ్చింది. ఫాంటసీ ని ఫాంటసీ లాగా చూస్తే, పిక్సార్ సినిమాల్లాగా – అనిమేషన్ లో ఆద్యంతం హాస్యం పండిస్తూనే సందేశం జొప్పించినట్లు… ఈ సినిమా కూడా అలాగే చూసి ఆనందించగలిగింది. డైలాగులు, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి ఈ సినిమాకి.

మొత్తానికి ఈ సినిమా whole some entertainer. అని చెప్పాలి. తెలుగులో ఇలాంటి సినిమా ఎవరు తీస్తారో! ఎప్పుడు తీస్తారో! 2007-2008 మధ్యలోనే తమిళం లో చాలా interesting సినిమాలు వచ్చాయి. మరోసారి చర్చిస్తాను వాటి గురించి.

7 Comments
  1. raghurichards September 30, 2008 /
  2. కొత్తపాళీ October 1, 2008 /
  3. Rajesh October 1, 2008 /
  4. Chilakapati Srinivas October 3, 2008 /
  5. raghurichards October 4, 2008 /
  6. sasank October 5, 2008 /